ప్రసవం: సిజేరియన్ కన్నా సహజకాన్పుతోనే శిశువుకు మేలు

ఫొటో సోర్స్, Katie Horwich / BBC
- రచయిత, జేమ్స్ గళఘర్
- హోదా, ప్రెజెంటర్, ద సెకండ్ జీనోమ్, బీబీసీ రేడియో 4
ప్రసవం తర్వాత తల్లి యోని నుంచి వచ్చే ద్రవాలను శిశువుకు రాసే వైద్య విధానం పెద్దగా అమల్లో లేదు. కానీ ఇటీవల ఇది ప్రజాదరణ పొందుతోంది.
ప్రసవం తర్వాత తల్లి యోనిలోని ద్రవాల్లో కొన్ని మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి.
సహజ ప్రసవం జరిగితే అవి బిడ్డ శరీరానికి అంటుకుంటాయి.
కానీ సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ప్రసవం జరిగినప్పుడు ఆ మంచి బ్యాక్టీరియాలు శిశువుకు చేరవు.
అలా కోల్పోయిన మంచి బ్యాక్టీరియాలను శిశువుకు అందిస్తే మంచిదన్న భావన క్రమంగా పెరుగుతోంది.
అందుకే యోని ద్రవాలను బిడ్డ శరీరం, నోటిపై పూస్తారు.
మంచి సూక్ష్మజీవుల వల్ల శిశువు ఆరోగ్యం బాగుంటుందని, ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సహజ ప్రసవం, సిజేరియన్ ద్వారా పుట్టే పిల్లల్లో వ్యత్యాసాలు!
తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ చుట్టూ సహజ రక్షణ కవచం ఉంటుంది.
భూమి మీదికొచ్చిన తర్వాత సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలతో శిశువుకు కనిపించని ఒక బంధం ఏర్పడుతుంది.
ఆ బంధం జీవితాంతం ఉంటుంది. అందుకే సూక్ష్మజీవులతో శిశువు తొలి కలయిక చాలా ముఖ్యమైనది.
'ప్రసవం తర్వాత శిశువు రోగ నిరోధక శక్తికి భూమి మీద ఉన్న బ్యాక్టీరియాకు అనుగుణంగా స్పందించాల్సిన అవసరం ఏర్పడుతుంది' అని బర్మింగ్‌హామ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ పీటర్ బ్రోక్లీహాస్ట్ అన్నారు.
బిడ్డ రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇది ముఖ్యమని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
సహజ ప్రసవం ద్వారా పుట్టిన బిడ్డలకు, సిజేరియన్ ద్వారా జన్మించిన శిశువుల మధ్య సూక్ష్మజీవుల విషయంలో చెప్పుకోదగిన కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి.
శిశువుల శరీరంపై ఉండే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌ల విషయంలో తేడా ఉంది.
ఈ సూక్ష్మజీవులు శిశువు శరీరంపై ఏడాది వరకు జీవించి ఉంటాయి.
సహజ ప్రసవం ద్వారా పుట్టే శిశువులు తల్లి యోనిలోనే సూక్ష్మజీవులకు తారసపడతారు.
అదే సమయంలో సూక్ష్మజీవులు బిడ్డ శరీరంపై కాలనీలు ఏర్పాటు చేసుకుంటాయి.
కానీ ఆపరేషన్ ద్వారా పుట్టే బిడ్డలకు ఈ అవకాశం ఉండదు.
తల్లి శరీరంపై ఉన్న సూక్ష్మజీవులు బిడ్డపై ప్రభావం చూపిస్తాయని ఆయన తెలిపారు.
పిల్లల్లో దీర్ఘకాలంలో అస్తమా, అలర్జీలు వంటి వ్యాధులు ఎందుకు వస్తున్నాయన్న అంశంపై బ్రోక్లీహాస్ట్ అధ్యయనం చేస్తున్నారు.
సహజ ప్రసవం, సిజేరియన్ ద్వారా పుట్టే పిల్లల శరీరంపై ఉండే సూక్ష్మజీవుల వ్యత్యాసాలే ఇందుకు కారణమా అన్న అంశంపై ఆయన విశ్లేషణ చేస్తున్నారు.

మన శరీరంలో సగం సూక్ష్మజీవులే!
మన శరీరంలో సగానికి పైగా మనిషి కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
మానవ శరీరంలోని మొత్తం మానవ కణాల సంఖ్య కేవలం 43శాతం మాత్రమే.
మిగతాదంతా మన శరీరాన్ని ఆక్రమించుకుని జీవిస్తున్న సూక్ష్మజీవులే. వీటిలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఏక కణ జీవులు ఉంటాయి.
మనిషి జీనోమ్ 20వేల జన్యువులతో తయారవుతుంది. ఇందులో జన్యు సంబంధమైనవి ఉంటాయి.
అయితే, మనిషిలో ఉన్న సూక్ష్మజీవులను కూడా కలిపి లెక్కిస్తే ఈ సంఖ్య 2 మిలియన్ల నుంచి 20 మిలియన్ల జన్యువుల వరకు ఉంటుంది.
దీన్ని రెండో జీనోమ్ అంటారు. అలర్జీ, ఉబకాయం, దురద, మతిమరపు వంటి వ్యాధులకు ఈ జీనోమ్‌కు సంబంధం ఉంటుంది.
శిశువు వ్యాధి నిరోధక శక్తి, సూక్ష్మజీవుల తొలి కలయిక అంశాలు చాలా ముఖ్యమైనవి.
ప్రమాదకరమైన సూక్ష్మజీవులపై మన శరీరం దాడి చేస్తుంది. ఇది శరీర ధర్మం.
కానీ సూక్ష్మజీవులు- వ్యాధి నిరోధక కణాల మధ్య సంబంధం విరోధం కంటే భిన్నమైనది. ఇది లోతైన బంధం. క్రియాశీలంగా ఉంటుంది.
'సూక్ష్మజీవులు వ్యాధి నిరోధక వ్యవస్థకు ఒక గురువు' అని లండన్ యూనివర్శిటీ కాలేజీలో మెడికల్ మైక్రోబయోలజీ ప్రొఫెసర్ గ్రాహం రూక్ అభివర్ణించారు.
ఇదొక నేర్చుకునే విధానం. ఇది మెదడు వంటిది. మెదడు పనిచేసేందుకు సమాచారం ఎలా అవసరమో, వ్యాధి నిరోధక శక్తికి కూడా సమాచారం అలాగే అవసరం.
ఈ సమాచారం సూక్ష్మజీవుల నుంచి వస్తుంది. అవి ఉత్పత్తి చేసే రసాయనాల వల్ల వస్తుంది. వ్యాధి నిరోధక వ్యవస్థలో అవి ఒక ప్రతిస్పందనను కలిగిస్తాయి. ఆ ప్రతిస్పందన జీవితాంతం ఉంటుంది.
'వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది శిశువు పుట్టిన వారం, నెల రోజుల లోపలే రూపుదిద్దుకుంటుంది' అని ప్రొఫెసర్ రూక్ చెప్పారు.

ఫొటో సోర్స్, BBC / Katie Horwich
శునకాలు శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయా?
బిడ్డ పుట్టే విధానమే కాదు.. ఆ శిశువు అడుగు పెట్టబోయే ఇల్లు కూడా దీర్ఘకాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
ఇంట్లో కుక్కలు ఉంటే అస్తమా వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధనలో తేలింది.
శునకాలతో పాటు కొన్ని మంచి సూక్ష్మజీవులు కూడా ఇంట్లోకి వస్తాయి. అవి శిశువు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయని ఊహిస్తున్నట్లు ఆల్బెర్టా యూనివర్శిటీ ప్రొఫెసర్ అనితా చెప్పారు.
కెనడాలో శిశువుల ఎదుగుదలపై చేస్తున్న అధ్యయనంలో ఆమె పాల్గొంటున్నారు. సుమారు 3500 కుటుంబాలకు సంబంధించిన వివరాలను అనిత అధ్యయనం చేస్తున్నారు.
ఇంట్లో ఏదైనా ఒక పెంపుడు జంతువు ఉంటే మూడు నెలల వయసున్న పిల్లల్లో మంచి సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది. అందులోనూ విభిన్న సూక్ష్మజీవులు ఉంటాయని, ఇది మంచి సూచిక అని ప్రొఫెసర్ అనిత చెప్పారు.
బ్రెస్ట్ ఫీడింగ్, యాంటీ బయోటిక్స్, ప్రసవం జరిగిన తీరు వంటి అంశాలు సూక్ష్మజీవులపై ప్రభావం చూపిస్తాయి.
అయితే, దీర్ఘకాల ఆరోగ్యం-సూక్ష్మజీవుల ప్రభావం విషయంలో పెద్దగా అధ్యయనాలు జరగలేదు. కొన్ని పరిశోధనలు జరిగినా.. అవి అరకొరగానే ఉన్నాయి.
80వేల మంది పిల్లలకు సంబంధించిన ప్రసవం సందర్భంగా వచ్చే ద్రవాలను సేకరించాలని బేబీ బయోమీ అధ్యయనం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవే కాదు.. ఇంకా ఎన్నో అంశాలు అధ్యయనం చేయాల్సి ఉంది.
కానీ వాటిలో చాలా వరకు తల్లిదండ్రుల చేతుల్లో ఉండవు.
డాక్టర్లు గానీ, తల్లిదండ్రులు గానీ ప్రాణాలు కాపాడే యాంటీ బయోటిక్స్ సిద్ధం చేసుకుని ఉండరు. ఎందుకంటే భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం.
ఇవి కూడా చదవండి:
- కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- ఇవి తింటే.. మీ జుట్టు భద్రం!
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- వృద్ధుల్లోనూ బలంగానే సెక్స్ కోరికలు
- ఫేస్‌బుక్ సెక్స్ వీడియో వివాదం.. వెయ్యి మందిపై కేసు
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
- చర్చనీయాంశమైన 'పాలిచ్చే తల్లి' ఫొటో!
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









