అభిప్రాయం: 'మంచి ముస్లిం' అనేది ఎవరు నిర్ణయిస్తారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శేష్ నారాయణ్ సింగ్
- హోదా, సీనియర్ పాత్రికేయులు, బీబీసీ కోసం
నేడు దేశంలో ఉదారవాద రాజకీయాలు, భావజాలాల పరిధి కుంచించుకుపోయింది కానీ అవి పూర్తిగా అంతరించి పోలేదు. అయితే ఉదారవాద మేధావులు కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్న మాట నిజం.
ప్రజా జీవితంలో తరిగిపోతున్న ఉదార భావాలపై చర్చ చేయడం కూడా కష్టంగా మారిపోయింది.
దాదాపు 17 కోట్ల జనాభా గల ముస్లింల గురించీ, వారి సమస్యల గురించి రాజకీయంగా చర్చించే పనిని ఒక్క అసదుద్దీన్ ఓవైసీకే వదిలేశారు.
కాంగ్రెస్ వాళ్లయినా లేదా సోషలిస్టులైనా ముస్లింల పేరెత్తడానికి కూడా భయపడిపోతున్నారు. మరోవైపు పాకిస్తాన్, తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్, ఉగ్రవాదం వంటి అంశాలను లేవనెత్తుతూ, ముస్లింలపై దాడిని ఎక్కుపెడుతున్న వారు చాలా దూకుడు మీదున్నారు.
దేశంలో ముస్లింలు ఎలా ఉండాలన్న విషయంపై ఈ మధ్య జరుగుతున్న చర్చలో చాలా మంది సీరియస్ మేధావులు కూడా భాగమయ్యారు. ముస్లింలు ఎలా కనిపించాలి, ఏం ధరించాలి, ఏం తినాలి వగైరా, వగైరా... బీఫ్‌పై నిషేధం తర్వాత ఇప్పుడు చర్చ తరచుగా వాళ్ల గడ్డం, బురఖాల వైపు మళ్లుతోంది.
విద్వేషాన్ని రాజకీయ పెట్టుబడిగా మార్చుకునే ప్రయత్నం చాలా ఏళ్ల నుంచే కొనసాగుతోంది కానీ, ఇప్పుడది విజయవంతమవుతున్నట్టుగా కనిపిస్తోంది.
ముస్లిం అంటేనే దేశం పట్ల అంకితభావం లేదా నిష్ఠ లేని వ్యక్తి అన్నట్టుగా చూసే వాతావరణం ఇప్పుడు వ్యాపించింది. 1857 నుంచి 1947 వరకు దేశం కోసం వేల సంఖ్యలో బలిదానాలు చేసిన ముస్లింల విషయంలో ఈ వాతావరణం సృష్టిస్తున్న వారు నిజానికి నాడు దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనగూడదని నిర్ణయించుకున్న వారు.
మరోవైపు, 1947లో దేశవిభజన సందర్భంగా పాకిస్తాన్ వెళ్లడానికి అవకాశం ఉన్నప్పటికీ, మాతృభూమి పట్ల ప్రేమ, హిందువులపై విశ్వాసాల కారణంగానే లక్షలాది ముస్లింలు పాకిస్తాన్ వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశభక్తి సర్టిఫికెట్
ఇప్పుడు తమను తాము హిందువులకు నేతృత్వం వహిస్తున్నట్టు చెప్పుకుంటున్న సంస్థలు దేశభక్తి సర్టిఫికెట్లు జారీ చేసే బాధ్యతను తమ భుజాలపైకి ఎత్తుకున్నాయి. గడ్డం కలిగి ఉండి, నమాజ్ చేసే, టోపీ ధరించే ముస్లిం ఆటోమెటిక్‌గానే అనర్హుడవుతాడు. వారికి ఏపీజే అబ్దుల్ కలామ్ మూసలో సరిగ్గా ఒదిగి పోగల ముస్లిం కావాలి - అంటే భగవద్గీతను పఠిస్తూ, వీణ వాయిస్తూ.. అదే సమయంలో తన మతానికి సంబంధించిన ఏ లక్షణాన్నీ బయటకు కనిపించనివ్వకుండా ఉండే ముస్లిం.
మరోవైపు, భజన, కీర్తన, తీర్థయాత్ర, మతపరమైన జయధ్వానాలు చేసేవారినీ, నుదుట తిలకం పెట్టుకునే వారినీ దేశభక్తి లక్షణాలు కలిగి ఉన్నవారిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ లక్షణాలు లేనివారికి దేశభక్తి ఉండదన్న మాట. ఈ దృష్టితో చూసినప్పుడు ముస్లింలు ఎట్లాగూ పక్కకు ఉండిపోతారన్నది స్పష్టం.
సాధారణంగా, ప్రభుత్వం ఏదైనా వైఫల్యాన్ని కప్పిపెట్టాలని అనుకున్నప్పుడు, ముందుగా ఎవరైనా శత్రువును కనిపెడుతుంది. ఇక ప్రభుత్వ ప్రాయోజిత జాతీయవాదం దానికి వంతపాడటం ప్రారంభిస్తుంది. అలా శత్రువుకు వ్యతిరేకంగా జనాలను సమీకరించడం చాలా సులువవుతుంది.
అధికార పీఠాన్ని ఏ రూపంలోనైనా సవాలు చేయగలరనే అనుమానం ఉన్న ఏ వ్యక్తినైనా, ఏ సంస్థనైనా ఈ తరహా జాతీయవాదం శత్రువుగానే చూపిస్తుంది. అది ఏదైనా ట్రేడ్ యూనియన్ కావొచ్చు, విద్యార్థి సంఘం కావొచ్చు, ఏదైనా ఎన్‌జీవో కావొచ్చు, ప్రజా ఉద్యమం లేదా ప్రజా సంఘం కూడా కావొచ్చు.
ముస్లింలను కూడా సర్కారీ జాతీయవాద సంస్థలు ఇదే చట్రంలో బిగించాయి. టీవీ చానెళ్లలో జరిగే చర్చల్లో దీనిని దాదాపు ప్రతి రోజూ ఎత్తి చూపుతున్నారు.
నిశ్చితమైన లక్ష్యాలను ఎంచుకొని మరీ వేటాడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కారణంగా ముస్లిం అయినప్పటికీ నిశ్చింతగా జీవించగలగడం అన్నది రాన్రాను మరింత కష్టమైపోతోంది.
హర్ష్ మందెర్ రాసిన ఓ వ్యాసాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయడం సమంజసమని భావిస్తాను. ఒక దళిత రాజకీయ నాయకుడు ముస్లింలను ఉద్దేశించి - మీరు నా సభకు తప్పక రండి కానీ ఒక ప్రత్యేక తరహా టోపీ లేదా బురఖా ధరించి మాత్రం రావొద్దు - అని అన్నట్టుగా ఆయన రాశారు.
ఈ రకమైన వాదన సరైంది కాదని రామచంద్ర గుహ అభిప్రాయం. ఇది ముస్లింలను ఓ మూలకు నెట్టేసే ప్రయత్నమనీ, వారికి అందుబాటులో ఉన్న అవకాశాల్ని కూడా లాక్కొనే కుట్ర అని ఆయన అంటారు.
మరోవైపు, ముస్లిం మహిళలు బురఖా వదిలించుకోవాలని చెప్పడం ద్వారా ఆ నాయకుడు వారికి ప్రగతిశీల అజెండాలో భాగం కావడానికి పిలుపునిస్తున్నారని ముకుల్ కేశవన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ముస్లింలపై ఒత్తిడి
ముస్లింలలో సామాజిక సంస్కరణలు తేవడంపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడుతున్న కాలం ఇది. ఓవైపు ట్రిపుల్ తలాక్, హజ్ సబ్సిడీ, హలాలా వంటి వాటిపై జోరుగా చర్చలు జరుగుతుండగా, మరోవైపు ఈ దేశంలో తామెలా ఉండాలన్న విషయాన్ని మెజారిటీ హిందువులు నిర్ణయిస్తుండడంతో ముస్లింలు ఒత్తిడికి లోనవుతున్నారు.
పైన పేర్కొన్న ముగ్గురు మేధావులూ ప్రముఖులే. వీరి మేధను ప్రశ్నించలేం గానీ, వీరు చెప్పినవన్నీ పూర్తిగా నిజాలు కావని కూడా చెప్పక తప్పదు. ముస్లింలతో సోషల్‌గా కలిసిపోయినంత మాత్రాన లేదా వారి బస్తీల్లో కొంత సమయం గడిపినంత మాత్రాన ముస్లింల మానసిక స్థితినీ, వారి సామాజిక కట్టుబాట్ల పొరల్ని సరిగా అర్థం చేసుకోవడం కష్టమనే మాట కూడా వాస్తవం.
'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికలో జరుగుతున్న ఈ చర్చలో తాజాగా బ్రౌన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆశుతోష్ వార్‌ష్ణేయ్ ప్రవేశించారు. జాతీయవాదాన్ని అర్థం చేసుకోవడం కోసం ఆయన భౌగోళిక, మత, కుల హద్దులను ఉల్లేఖించారు. విషయాన్నంతా ఆయన ఈ సందర్భంతోనే జోడించారు.

ఫొటో సోర్స్, Getty Images
నిజానికి ఈ విషయం చాలా సంక్లిష్టమైంది. ముస్లింల అస్తిత్వం, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాల్ని కూడా చాలా సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
జాతి, మానవత్వాలకు సంబంధించిన ఏ అంశాన్నైనా సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనకు మహాత్మా గాంధీ బోధనలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
కాబట్టి జాతీయవాదం, దేశభక్తి, మానవత్వాల గురించి మహాత్మా గాంధీ ఏమన్నారో తెలుసుకోవడం చాలా అవసరం.
'నా కలల భారతం'లో మహాత్మా గాంధీ ఇలా రాశారు: "నా దృష్టిలో దేశాన్ని ప్రేమించడానికీ, సాటి మనుషుల్ని ప్రేమించడానికి మధ్య ఏమీ తేడా లేదు. ఇవి రెండూ ఒకటే. నేను మానవజాతిని ప్రేమిస్తాను కాబట్టే దేశాన్ని కూడా ప్రేమిస్తాను. ఒక దేశభక్తుడి జీవనానికీ, ఒక గణం లేదా తెగ పాలకుడి జీవనానికి మధ్య తేడా ఏమీ లేదు. ఒక గొప్ప దేశభక్తుడికి తోటి మనుషుల పట్ల అంతే గొప్ప ప్రేమ లేనట్టయితే, అతడి దేశభక్తి లోపభూయిష్టమైందని చెప్పక తప్పదు."

జాతీయవాదపు వాస్తవ చిత్రం
"మా జాతీయవాదం ఇతర దేశాలకు సంక్షోభం సృష్టించే తరహా జాతీయవాదం కాదు. ఎందుకంటే, మేం ఇతరులు మమ్మల్ని దోచుకోవడాన్ని అనుమతించనట్టే, మేం కూడా ఇతరులెవ్వరినీ దోచుకోం. స్వరాజ్యంతో మేం సంపూర్ణ మానవజాతికి సేవ చేస్తాం" అని గాంధీజీ చాలా స్పష్టమైన మాటల్లో రాశారు.
గాంధీ చెప్పిన జాతీయవాదం సంకుచితత్వానికి పూర్తిగా భిన్నమైంది. ఇదే జాతీయవాదపు అసలైన చిత్రం.
మతం దేశభక్తికి ప్రాతిపదిక కాబోదని మహాత్మా గాంధీ చాలా స్పష్టంగా అభిప్రాయపడ్డారు. అట్లాగే ఏ మతంలోనైనా మార్పు కోసం గొంతులు విచ్చుకోవాల్సింది ఆ మతం లోపలి నుంచేనని కూడా ఆయనన్నారు.
బయటి నుంచి ఎలుగెత్తే గొంతులకు సానుకూల స్పందన వచ్చే అవకాశం చాలా తక్కువ. ఉదాహరణకు, తమ మత-సామాజిక-సాంస్కృతిక జీవితం గురించి ముస్లింలు లేదా క్రైస్తవులు వ్యాఖ్య చేయడాన్ని ఎందరు హిందువులు ఆహ్వానించగలరు?
గాంధీకి నైతిక బలంపై విశ్వాసం మెండు. కానీ దేశంలో ప్రస్తుత రాజకీయాలు సంఖ్యాబలంపై ఆధారపడి నడుస్తున్నాయి.
(ఇవి రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








