అసలు హజ్ సబ్సిడీ ఏమిటి? దీని రద్దుపై ముస్లింలేమంటున్నారు?

ఫొటో సోర్స్, AFP/Getty Images
హజ్ యాత్ర కోసం ముస్లింలకు అందించే సబ్సిడీని రద్దు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.
ముస్లింలను బుజ్జగించడానికి బదులు, వారికి సాధికారత కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.
మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం నాడు హజ్ సబ్సిడీని రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ధృవీకరించారు.
"స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటి సారి 1.75 లక్షల మంది ముస్లింలు సబ్సిడీ లేకుండా హజ్ యాత్ర చేయబోతున్నారు. గత సంవత్సరం మొత్తం 1.25 లక్షల మంది హజ్‌కు వెళ్లారు" అని మంత్రి చెప్పారు.

ఫొటో సోర్స్, IRSHAD KHAN/AFP/Getty Images
ప్రత్యామ్నాయంగా ఓడ ప్రయాణం
2022 నాటికి సబ్సిడీని దశలవారీగా పూర్తిగా రద్దు చేయాలని 2012లో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
హజ్ యాత్రకు ఖర్చు పెరిగే అవకాశం రీత్యా ముస్లింలు ఓడ ద్వారా మక్కా వెళ్లే ప్రత్యామ్నాయం ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
హజ్ సబ్సిడీ వల్ల అనవసర ప్రచారం తప్పితే, వాస్తవానికి ముస్లింలకు ఒరిగిదేమీ లేదని కొందరు ముస్లింలు అభిప్రాయపడ్డారు.
హజ్ అనేది ఒక పెద్ద ప్రక్రియ అనీ, అందులో సబ్సిడీ కేవలం విమాన చార్జీలకు మాత్రమే వర్తిస్తుందని వారి అభిప్రాయం.
వాస్తవానికి దీంతో భారత పబ్లిక్ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాకు వ్యాపారం లభిస్తుందని కొంత మంది అభిప్రాయం.
దీనిపై తెలంగాణ హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్ ఎ షుకూర్ బీబీసీతో మాట్లాడుతూ, "హజ్ సబ్సిడీ అంటే హజ్ యాత్ర మొత్తానికి సబ్సిడీ ఇవ్వరు. కేవలం విమాన టికెట్లపై మాత్రమే సబ్సిడీ ఇస్తారు. మమ్మల్ని ఇప్పటి వరకూ కేంద్రం నుంచి ఎవరూ సంప్రదించలేదు. ఎవరూ మా అభిప్రాయం అడగలేదు" అన్నారు.

ఫొటో సోర్స్, ROUF BHAT/AFP/Getty Images
ముస్లింల డిమాండ్
ప్రభుత్వం నుంచి లభించే సబ్సిడీతో లబ్ధి పొందుతున్నది విమానయాన కంపెనీ ఎయిర్ ఇండియానేనని ముస్లింలు అంటున్నారు.
తరచుగా నష్టాలెదుర్కొంటున్న ఎయిర్ ఇండియాకు దీని ద్వారా ఒకేసారి లక్షకు పైగా ప్రయాణికులు లభిస్తారు.
ముస్లింలలో ఒక పెద్ద సెక్షన్, మత సంస్థలు, అసదుద్దీన్ ఓవైసీ వంటి పార్లమెంటు సభ్యులు ఈ సబ్సిడీని రద్దు చేయాలని చాలా కాలంగా కోరుతూ వస్తున్నారు.
హజ్‌కు వెళ్లాలనుకునే వారికి తమ సౌలభ్యం ప్రకారం వెళ్లే వీలు ఉండాలనేది వారి డిమాండ్.
సబ్సిడీని రద్దు చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు ప్రభుత్వం 45 ఏళ్లు నిండిన మహిళలు పురుషుల తోడు లేకున్నా నలుగురేసి బృందాలుగా హజ్‌కు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.
గత సంవత్సరం నూతన హజ్ విధానంపై సలహాలివ్వడం కోసం మైనారిటీల వ్యవహారాల శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ ఏర్పాటు తర్వాత మజ్లిస్ నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, "సబ్సిడీని తీసెయ్యండి. ఆ డబ్బు ముస్లిం బాలికల చదువు కోసం ఖర్చు చేయండి" అని అన్నారు.

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP/Getty Images
అసలు హజ్ సబ్సిడీ ఏమిటి? ఒక్క హజ్‌కు మాత్రమే ఇస్తారా?
ఏటా వేల మంది భారతీయ ముస్లింలు హజ్ కోసం సౌదీ అరేబియా వెళ్తారు. హజ్ యాత్రికులకయ్యే ఖర్చులో కొంత భాగం ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తోంది.
ప్రభుత్వం చెబుతున్న దాన్ని బట్టి ప్రస్తుతం హజ్ యాత్రికులెవరైనా తమ యాత్ర కోసం నిర్ధారిత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. విమాన ప్రయాణానికయ్యే మిగతా ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది.
హజ్ యాత్రికులను తీసుకెళ్లే బాధ్యతను భారత విదేశాంగ శాఖ చూసుకుంటుంది.
జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాటైన హజ్ కమిటీలు యాత్రికుల దరఖాస్తులను తీసుకోవడం దగ్గర నుంచి యాత్రకు సంబంధించిన వివరాలందించడం వంటి పనులు నిర్వర్తిస్తాయి.
హజ్ యాత్ర కోసం సబ్సిడీ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. దీనిని రద్దు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
పదేళ్ల వ్యవధిలో దీనిని దశల వారీగా రద్దు చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
2006లోనే విదేశాంగ శాఖ, రవాణా, పర్యాటకంలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో హజ్ సబ్సిడీని ఒక నిర్ధారిత వ్యవధిలో రద్దు చేయాలని సిఫార్సు చేసింది.
హజ్‌తో పాటు ప్రభుత్వం కైలాస్ మానసరోవర్, ననకానా సాహిబ్ గురుద్వారా వంటి ఇతర మతపర యాత్రలకు కూడా సబ్సిడీ ఇస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
నిర్ణయంపై స్పందనలు
సబ్సిడీ రద్దు చేయాలనే నిర్ణయంపై సీనియర్ జర్నలిస్టు రషీద్ కిద్వయ్ మాట్లాడుతూ, ఏదో మేలు చేస్తున్నామనే పేరుతో బృందాలను పంపించే ఈ పద్ధతిని ఆపేస్తేనే మంచిదన్నారు.
షుజాత్ బుఖారీ అనే పాత్రికేయుడు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకొని ఉండాల్సిందని ఆయన అన్నారు. హజ్ అనేది కేవలం వ్యక్తిగత కర్తవ్యం. దీన్ని పూర్తి చేయడం కోసం సబ్సిడీ అవసరం లేదని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రచయిత చేతన్ భగత్ దీనిపై ట్వీట్ చేస్తూ, "హజ్ సబ్సిడీ రద్దు. ఇది చాలా ఎక్కువేం కాదు. అయినా ఇది మత ప్రాతిపదికన బుజ్జగింపే. ఈ సాహసిక, చరిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే" అని రాశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








