#గమ్యం: ‘గేట్’ స్కోరుతో మీకు తెలియని ఉపయోగాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనిల్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసినవారు చాలామంది ఉంటారు. కానీ బీటెక్ తర్వాత ఇంకా పైచదువులు చదవాలనుకునేవారు మాత్రం తక్కువే అని చెప్పవచ్చు. ఎందుకంటే బీటెక్ చివరి సంవత్సరం నుంచే ఉద్యోగ వేట మొదలు పెట్టేస్తారు.
ఇది ఒక రకంగా సరైనదే అయినప్పటికీ మరో మంచి అవకాశాన్ని కూడా వదులుకోవద్దంటున్నారు Careers360.com ఛైర్మన్ మహేశ్వర్ పేరి.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)... ఇంజనీరింగ్ పూర్తి చేశాక పైచదువులను అభ్యసించాలనుకునేవారికి గేట్ మంచి అవకాశం. కానీ గేట్‌లో మంచి స్కోరు సాధించడం అంత సులభమేమీ కాదు.
ఈ ఫిబ్రవరిలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) విధివిధానాలు, ఆ స్కోరుతో ఉపయోగాలు, ఉద్యోగావకాశాలు వంటి అంశాలపై ఈ వారం 'గమ్యం'లో Careers360.com ఛైర్మన్ మహేశ్వర్ పేరిఅందిస్తున్న సలహాలు.
గేట్ - విధివిధానాలు
గేట్ ఒక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎన్ఐటీలు, ఇంకా ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించాలంటే గేట్ స్కోరే కీలకం.
ప్రతి సంవత్సరం ఒకసారి నిర్వహించే గేట్ దేశవ్యాప్తంగా సుమారు 200 కేంద్రాల్లో జరుగుతుంది. దుబాయ్, సింగపూర్‌లలో కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం సుమారు 9 లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతారు.
గేట్‌కు ఎందుకు ఇంత ప్రాముఖ్యం?
గేట్‌కు ఎందుకు ఇంత ప్రాముఖ్యం అంటే... మొదటిది ఈ స్కోరు మూడేళ్లపాటు చెల్లుబాటవుతుంది. అంటే మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నా, ఒకవేళ అది నచ్చకపోతే ఈ గేట్ స్కోరుతో మూడేళ్లలో ఎప్పుడైనా ఉన్నత చదువులకు వెళ్లిపోవచ్చు.
ఈ సంవత్సరం గేట్‌ను ఐఐటీ-గువాహటి నిర్వహిస్తోంది. గతంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సంస్థ ఇతర ఐఐటీలతో కలసి నిర్వహించేది. ఇంతటి ప్రతిష్ఠాత్మక సంస్థలు నిర్వహించే పరీక్ష కాబట్టి ఈ స్కోరుకు చాలా ప్రాధాన్యం ఉంటుంది.
గేట్‌లో అర్హత సాధించడం అంత సులభమేమీ కాదు. ఇంక ఉత్తమ స్కోరు అంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే 23 సబ్జెక్ట్‌లలో 180 నిమిషాల పాటు జరిగే పరీక్ష, పైగా దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలన్నీ కలసి నిర్వహించే పరీక్ష. అందుకే ఈ స్కోరుకు అంత విలువ.

ఫొటో సోర్స్, Getty Images
పరీక్ష తేదీలు
పరీక్ష సుమారు 180 నిమిషాలు (3గంటలు) ఉంటుంది.
ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో జరగనుంది.
దరఖాస్తు చేసినవారికి ఇప్పటికే అడ్మిట్ కార్డులు వచ్చి ఉంటాయి. కాబట్టి తుది దశ ప్రిపరేషన్‌ను నిర్లక్ష్యం చేయకండి.
ఎంత మంది అర్హత సాధించవచ్చు?
సుమారు 9 లక్షల మంది రాస్తున్న ఈ పరీక్షలో అర్హత సాధించేవారి శాతం ప్రతి సంవత్సరం కేవలం 15-16 మాత్రమే. దరఖాస్తు చేసినవాళ్లలోనే చాలా మంది పరీక్షకు హాజరుకారు. ఏదో ఒక ఉద్యోగం రావడం దీనికి ప్రధాన కారణం కావచ్చు.
గత సంవత్సరం గణాంకాలు చూస్తే... 9.7 లక్షలమంది రిజిస్టర్ చేసుకున్నా 8.18 లక్షల మంది మాత్రమే పరీక్ష రాశారు. వీరిలో అర్హత మార్కులు సాధించింది 1.35 లక్షల మంది. అంటే సుమారు 16.5 శాతం మంది మాత్రమే. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు... ఈ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో.

ఫొటో సోర్స్, Getty Images
గేట్ స్కోరు - ఉపయోగాలు
అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో గేట్ స్కోరు ఆధారంగా నేరుగా నియమాకాలు చేస్తున్నారు.
2017లో ఓఎన్జీసీ - 750 మందిని, బీఎస్ఎన్ఎల్ - 2510 మందిని గేట్ స్కోరు ఆధారంగానే జూనియర్ ఇంజనీర్లుగా నియమించుకున్నాయి.
ఇవే కాదు... ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఎన్టీపీసీ, డీఆర్డీఓ వంటి ఎన్నో పీఎస్‌యూలు ఈ బాటలోనే నడుస్తున్నాయి. అంటే ప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ గేట్ స్కోరునే పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్న కొన్ని విద్యాసంస్థల్లో గేట్ స్కోరు ఆధారంగా పీహెచ్‌డీ కూడా చెయ్యవచ్చు.
జర్మనీ, సింగపూర్‌లలో మాస్టర్స్ డిగ్రీ చదవడానికి కూడా మన గేట్ స్కోరు ఉపయోగపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
రాన్రాను మన తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్శిటీల్లో కూడా గేట్ స్కోరు ఆధారంగా ప్రవేశాలు చేపట్టే పరిస్థితి రావచ్చు. లేదా గేట్‌లో మంచి స్కోరు ఉన్నవారికి ప్రవేశాల్లో ప్రాముఖ్యం ఇవ్వవచ్చు.
గేట్ స్కోరుతో మరొక అద్భుత అవకాశం ఏంటంటే... స్పెషలైజేషన్ మార్చుకోవడం. ఒకవేళ మీరు బీటెక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా ఎంటెక్‌లో కంప్యూటర్ సైన్సెస్ చెయ్యవచ్చు. కొన్ని స్పెషలైజేషన్‌లకు ఈ అవకాశం ఉంది.
ఈ అంశాలన్నీ చూస్తుంటే గేట్ స్కోరు విలువ ఏంటనేది మళ్లీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
మార్కుల లెక్కింపు
మీ మార్కుల మొత్తాన్ని 1000కి సమానం చేసి లెక్కించి స్కోరు కార్డు వస్తుంది. మొదటి 15 శాతం మంది అభ్యర్థుల్లో మీరు చోటు దక్కించుకోగలిగితే మంచి ర్యాంకు కూడా వస్తుంది. దీని ఆధారంగా మంచి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు సిద్ధం కావడంతోపాటు గేట్‌ను కూడా సీరియస్‌గా తీసుకుని సిద్ధం కండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









