#గమ్యం : 2020 తర్వాత వైద్యరంగంలో ఈ నాలుగు కోర్సులదే హవా
- రచయిత, అనిల్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వచ్చే పదేళ్లలో ఏ కోర్సులకు మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయో గతవారం బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'లో చర్చించాం. ఈవారం వైద్యరంగానికి సంబంధించిన కోర్సుల గురించి చూద్దాం.
మెడిసిన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎంబీబీఎస్, బీడీఎస్. కానీ వైద్యరంగంలో ఉపాధి దొరకబుచ్చుకోవాలనుకునేవారికి ఈ రెండింటితో పాటు ఇంకా ఎన్నో అవకాశాలున్నాయనేది చాలామందికి తెలియని విషయం.
వచ్చే దశాబ్ద కాలంలో అంటే 2020 తర్వాత వైద్య రంగంలో కొన్ని సంప్రదాయేతర కోర్సులకు విపరీతమైన డిమాండ్ పెరగబోతోందని Careers360.com, మాన్‌స్టర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
అందువల్ల ఈ రంగంలో స్థిరపడాలనుకునేవారి కోసం ఈ వారం బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'లో వైద్య విద్యకు సంబంధించిన ఏ కోర్సులు చేస్తే ఉద్యోగం, ఉపాధికి ఎక్కువ అవకాశాలుంటాయనే విషయాల్ని వివరిస్తున్నారు Careers360.com ఛైర్మన్ మహేశ్వర్ పేరి.
మీకు ఇంకా ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీ లో కామెంట్ పోస్ట్ చేయండి. వాటికి మహేశ్వర్ పేరి సమాధానాలు ఇస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
జెనెటిక్స్
ప్రపంచంలో దాదాపు 5 వేల రకాల రోగాలు, జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయనేది నిపుణుల మాట. ప్రస్తుత కాలంలో దంత సమస్యలు కూడా ఈ అనువంశిక రోగాల జాబితాలో చేరిపోయాయి. వీటికి సంబంధించి చికిత్సలను అందించాలన్నా, రాకుండా నిరోధించాలన్నా జన్యుశాస్త్ర నిపుణుల పాత్ర చాలా కీలకం కానుంది.
కాబట్టి 2020-30 మధ్య కాలంలో ఈ రంగంలో ఉద్యోగాలకు విపరీతమైన గిరాకీ ఉండబోతోంది. జెనెటిక్ ఇంజనీరింగ్, బయోకెమికల్ ఇంజనీరింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ వంటి కోర్సులు చేసిన వారికి అవకాశాలు వెల్లువెత్తుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
జెరియాట్రిక్స్
మన దేశంలో దాదాపు 10 నుంచి 14 కోట్ల మంది 60 ఏళ్ల పైబడినవారున్నారు. సగటు జీవిత కాలం పెరుగుతున్నందున ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కాబోతోంది.
ఇప్పుడన్నీ చిన్న చిన్న కుటుంబాలే. అందువల్ల వృద్ధులను చూసుకునేవారు, వారిని పట్టించుకునేవారు రోజురోజుకూ తగ్గిపోతున్నారు. చాలామంది తమ ఇళ్లలో ఉన్న వృద్ధులు, పెద్దవాళ్లను చూసుకునేందుకు అసిస్టెంట్లు, నర్సులను పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.
ఇది ముందు ముందు ఓ పెద్ద సేవల రంగంగా మారనుంది. ఇంజెక్షన్లు చేయాలన్నా, ఏవైనా మందులివ్వాలన్నా కూడా శిక్షణ పొందినవారికి డిమాండ్ పెరగనుంది. ఇప్పటికే చాలా వృద్ధాశ్రమాలు వెలిశాయి. ఇంకా వస్తున్నాయి. అపార్ట్‌మెంట్ల మధ్య కూడా ఈ ఆశ్రమాలు వెలుస్తున్నాయి.
జెరియాట్రిక్ కేర్‌పై శిక్షణనివ్వడానికి ఎన్నో కళాశాలలు, యూనివర్శిటీలు కోర్సులను రూపొందిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
హెల్త్ కేర్ టెక్నాలజీ
బీడీఎస్, ఎంబీబీఎస్, ఆప్టిమెట్రిక్స్... ఏది తీసుకున్నా ప్రతి డాక్టర్‌కూ ఓ అసిస్టెంట్ అవసరం ఉంది. ఓ బ్లడ్ శాంపిల్ తీసుకోవాలన్నా, మీ కంటి చూపు పరీక్షించాలన్నా, ఇలా ఏం చేయాలన్నా ప్రతి ప్రధాన వైద్యుడికీ ఓ అసిస్టెంట్ అవసరం ఉంటుంది. అందువల్ల హెల్త్ కేర్ టెక్నాలజీపై శిక్షణ పొందినవారికి గ్రామాల్లో ఉన్న క్లినిక్‌ల దగ్గర నుంచి పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల వంటి వాటి వరకూ అన్నింట్లోనూ అవకాశాలకు కొదవ ఉండదు.
భవిష్యత్తులో వైద్య రంగానికి సంబంధించిన నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. రక్త నమూనాలు తీసుకోవాలన్నా, కంటి చూపు పరీక్షించాలన్నా, ఇంకా ఏ చిన్న పనికైనా అర్హత పొందినవారే ఉండాలనే నిబంధనలు రానున్నాయి. అంటే శిక్షణ సరిపోదు. తప్పనిసరిగా అర్హత ఉండాలి.
మణిపాల్ యూనివర్శిటీ, మైసూర్ యూనివర్శిటీ, దిల్లీ యూనివర్శిటీ వంటి ఎన్నో సంస్థలు దీనిపై కోర్సులను అందిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
వెల్‌నెస్ మేనేజ్‌మెంట్
మన దేశంలో వెల్‌నెస్ టూరిజం, వెల్‌నెస్ మేనేజ్‌మెంట్ వంటివాటికి ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. చాలా కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్యానికి, వారి మానసిక ఉల్లాసానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే యోగా, వ్యక్తిత్వ వికాసం, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాయి.
అందువల్ల ఈ రంగంలో ఉపాధికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. వెల్‌నెస్ టూరిజం 2020 నాటికి దాదాపు రూ.15 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించనుందని ఓ అంచనా.
సింబయాసిస్, ఇగ్నో వంటి సంస్థలే కాకుండా వీఎల్‌సీసీ వంటి ప్రైవేటు సంస్థలు కూడా వెల్‌నెస్ మేనేజ్‌మెంట్‌పై శిక్షణనిస్తున్నాయి.
వైద్యరంగంలో ఉపాధిని అందిపుచ్చుకోవాలనుకునేవారు ఈ నాలుగు కోర్సులపై దృష్టి పెట్టండి. వీటిపై కొంత అధ్యయనం చేయండి. కొత్తగా వస్తున్న మార్పులను అర్థం చేసుకోండి. ఇలా చేస్తే రాబోయే పదేళ్లలో కెరీర్లో మంచి స్థాయిలో స్థిరపడేందుకు అవకాశముంటుంది.
వచ్చేవారం మరో అంశంపై చర్చిద్దాం.
మా ఇతర కథనాలు
- అక్కడ పొలం పనులు చేసేవారే బడిలో పాఠాలు చెబుతారు!
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
- కాలేజీలను తిట్టడం సరే, తల్లిదండ్రులుగా మనమేం చేస్తున్నాం?
- ఇక్కడ ఆడపిల్లలు చదువుకోలేరు!
- ఇది అంబేడ్కర్ చదువుకున్న పాఠశాల
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- పలక, బలపం పడుతున్న చిన్నారి పెళ్లికూతుళ్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









