కాలేజీలను తిట్టడం సరే, తల్లిదండ్రులుగా మనమేం చేస్తున్నాం?

ఫొటో సోర్స్, yandamoori.com
- రచయిత, యండమూరి వీరేంద్రనాథ్
- హోదా, బీబీసీ తెలుగు కోసం
"ఇవ్వాళ స్కూల్లో ఏం చెప్పార్రా?" అని అడిగింది తల్లి.
"వ్రాయటం నేర్పారమ్మా. బోర్డు మీద వ్రాసింది చూసి వ్రాయమన్నారు?"
"మరి వ్రాసావా?"
"లేదమ్మా"
"ఏం?"
"చదవటం నేర్పలేదు. అది వాళ్ళ సిలబస్‌లో లేదట".
...
ఇదీ ప్రస్తుతం కార్పొరేట్ కాలేజీల పరిస్థితి. వారు చదువు నేర్పరు. పరీక్షల్లో రాబోయే ప్రశ్నలకు సమాధానాలు నేర్పుతారు. అందులో తప్పులేదు కూడా. పిల్లలు అక్కడ చేరేది మార్కుల కోసమే కదా..!
కానీ తల్లిదండ్రులకో ప్రశ్న. పదో క్లాసు వరకూ పునాది సరిగ్గా లేకుండా ఒక సగటు విద్యార్థి నుంచి ఎక్కువ మార్కులు ఆశించడం అత్యాశ కాదంటారా? తమ సంతానానికి ఐఐటీకి సరిపడా జ్ఞానo, తెలివీ లేదని తెలిసి కూడా, బలవంతంగా కోచింగ్ సెంటర్లో చేర్పించటం కరెక్టేనా?
ఉన్నత చదువులు ఆశించటంలో తప్పులేదు. కానీ పిల్లల్ని వారి శక్తికి మించి పిండటమే తప్పు. "ఏమో. అదృష్టం బావుంటే ఆ లాటరీ నా పిల్లాడికే తగలొచ్చు" అని టిక్కెట్టు కొనే మనస్తత్వానికీ, ఈ చర్యకీ తేడాలేదు.
ఎనిమిదో తరగతిలో ఫౌండేషన్ కోర్సులో చేర్పించి, 'మా వాళ్ళు ఐఐటి చదువుతున్నారు' అన్న సంతృప్తితో ఆరు సంవత్సరాలు బ్రతకటానికీ, ఇతరులకి చెప్పుకోవటానికీ మాత్రమే ఇది పనికి వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
'ఒక రాయి విసిరిచూద్దాం' అన్న పెద్దల మనస్తత్వం పిల్లల్ని ఎలా డిప్రెషన్‌కి గురిచేస్తుందో ఇప్పుడు చర్చిద్దాం. ఈ రంగుల వల వ్యామోహం నుంచి బైటపడటానికి కొన్ని సత్యాల్ని పరిశీలిద్దాం.
ఐఐటి/ మెడిసిన్ చిన్న చెరువు. ఇంటర్ చదివే పిల్లలు మహాసముద్రంలోని అసంఖ్యాకమైన చేపలు. ప్రస్తుతం భారతదేశంలో ఐఐటి సీట్లు దాదాపు 2500 ఉన్నాయి అనుకుంటే, వాటి కోసం ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు పోటీ పడతారు. మరోలా చెప్పాలంటే, సముద్రం నుంచి చెరువుకి పైపు వేయబడుతుంది. నీట్ లేదా ఎంసెట్ అనబడే చాలా ఇరుకైన పైపు అది. కొద్ది నీళ్ళు మాత్రమే అందులో ప్రవహిస్తాయి. ఆ పైపులోకి ప్రవేశించటానికి ఎన్నో చాపలు గిలగిలా కొట్టుకుంటూ ఉంటాయి. కొన్ని చచ్చిపోతాయి. చాలా డిప్రెస్ అవుతాయి.
ఉన్నత ఉద్యోగాలు సాధించాలంటే తప్పకుండా ఆ పైపులోనే ప్రయాణం చేయాలి అనే దృక్పథం తల్లిదండ్రులకి మారాలి. ప్రయత్నంలో తప్పులేదు కానీ, విద్యార్థి స్టాండర్డ్, సంసిద్ధత కూడా చూడాలి. ప్రతిభను మెరుగు పర్చడం వేరు, బలవంతంగా దానిని ఇంజెక్ట్ చెయ్యడం వేరు. ఇతర వ్యాపకాలు అమితంగా ఉన్నప్పుడు, పునాది సరిగ్గా లేనప్పుడు, కోట్లకొద్దీ డొనేషన్లు కట్టే తాహతు లేనప్పుడూ, కేవలం కోచింగ్ సెంటర్లలో చేరటం వల్ల మెడిసిన్, ఐఐటి లాంటి కోర్సుల్లో (లేదా పెద్ద కాలేజీల్లో) సీట్లు రావు. తుని ప్రాంతానికి చెందిన ఒక యథార్థ సంఘటన చెపుతాను.
"sinθ ÷ cosθ ఎంత?" అన్న ప్రశ్నకి, సందేహంగా 'ఒకటి' అని సమాధానమిచ్చాడు ఒక ఇంటర్ విద్యార్థి. ఆ స్టాండర్డ్ ఉన్నవాడిని, ఇంటిని తనఖా పెట్టి IIT ప్రిపరేషన్ కోసం కార్పొరేట్ కాలేజీలో చేర్పించారు తల్లిదండ్రులు. క్లాస్‌లో లెక్చరర్లు 'స్టుపిడిటీ'కి పర్యాయపదంగా అతడిని నిరంతరం ఎగతాళి చెయ్యడం వల్ల డిప్రెషన్‌కి గురయ్యాడు. మతిభ్రమించిన స్థితిలో విజయవాడలో డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి దగ్గరకు తీసుకురాగా, బాగుచెయ్యటానికి ఆర్నెల్లు పట్టింది.
అసలు తప్పు ఎక్కడుందో తెలుసుకోకుండా తమలోకి అస్సలు చూసుకోకుండా తల్లిదండ్రులు కేవలం స్కూలు యాజమాన్యాలను నిందిస్తే, యాజమాన్యాలు తిరిగి తల్లిదండ్రులను నిందించి, ఇద్దరూ కలిసి ఉమ్మడిగా క్రికెట్, వీడియోగేమ్స్, ఇంటర్నెట్లు, సెల్‌ఫోన్లను తిడుతుంటారు.

ఫొటో సోర్స్, Yandamoori Virendranath
కార్పొరేట్ స్కూళ్ళవారు ఆకర్షణీయమైన గాలాలకి E-స్కూల్, టెక్నో ఎరలు కట్టి రెడీగా ఉంటారు. ఆరు/ ఎనిమిది/ పదోక్లాసు పిల్లల కోసం ఈ సంస్థలు వల విసురుతాయి. సాధారణంగా నదిలో గానీ, సముద్రంలో గానీ నుదుట "దురదృష్టo" వ్రాసి ఉన్న చేపలు జాలరి వలలో పడతాయి. ఇక్కడ అలా కాదు. పెద్దలు తామే పిల్లల్ని స్వయంగా ఈ వలలోకి విసురుతారు.
ఈ విధంగా కుప్పలు తెప్పలుగా వచ్చి చేరిన వారిని రెండు వర్గాలుగా విడగొడతారు. క్రింది తరగతుల్లో ర్యాంకు వచ్చిన వారిని (మా అబ్బాయిని కూడా అడిగారు) లక్షా, పదిలక్షలూ, కోటీ ఇచ్చి (గత సంవత్సరం రెండు కార్పొరేట్ టెక్నాలజీల వారు పోటీపడి, నాలుగు కోట్లు ఇచ్చి కొన్నారట) మొదటి విభాగంలో చేరుస్తారు. కాలేజీలో చేరే వందమందిలో పదిమందిని ఈ విధంగా డిసైడ్ చేస్తారు. మిగతా తొంభైమంది కట్టే ఫీజులతో ఈ పదిమందికీ ఉచితంగా + ప్రత్యేకంగా చదువు చెప్తారు. లక్షల్లో జీతాలు తీసుకునే లెక్చరర్లతో వీరికి స్పెషల్‌గా చదువు చెప్పిస్తారు.
ఈ పిల్లల పేర్లే పేపర్లలో పడతాయి. పందెంకోడిని పెంచినట్టు మిగతా కోళ్ళని పెంచరు కదా.
మిగతా 90 మందినీ 'బి', 'సి' క్లాసు పిల్లలంటారు. ఈ 'బి, సి' క్లాసు పిల్లల మీద లెక్చరర్లు హీనమైన జోకులు వేస్తూ ఉంటారు. బాగా చదివే విద్యార్థులు వీళ్ళని చాలా తక్కువగా చూస్తారు. రెండేళ్ళు గడిచేసరికి 'తామెందుకూ పనికిరాము' అన్న అభిప్రాయం వీరికి ఏర్పడిపోయి ఉంటుంది. 'బీ' సెక్షన్, 'సీ' సెక్షన్ అంటే బాధపడతారని వీరిని 'పద్మ', 'కమలం' సెక్షన్లుగా పిలుస్తారు. ఈ మధ్య పిల్లల్ని ఉత్సాహపర్చటం కోసం 'అబ్దుల్ కలాం', 'విశ్వేశ్వరయ్య సెక్షన్' అని పిలుస్తున్నారు.
ఈ సెక్షను పిల్లలకి ఒకరిద్దరి కన్నా ఎక్కువమందికి ఐఐటి/ మెడిసిన్ సీట్లు రావు. ఏ ప్రసిద్ధ సంస్థనైనా తీసుకుని పరిశీలించండి.
ఈ సెక్షన్ల వారికి "సాధారణ" లెక్చరర్లు పాఠాలు చెపుతారు. పాఠాలంటే పెద్దగా చెప్పేదేమీ ఉండదు. హెడ్-ఆఫీస్ నుంచి వచ్చిన సిలబస్సు ప్రకారం, పరీక్షల్లో రాబోయే ప్రశ్నలకి సమాధానాలు వ్రాయించటమే వీరి పని. చదువు చెప్పటం కన్నా... వచ్చే ఏడాది కోసం కొత్త పిల్లల్ని వెతకటం వీరికి అప్పచెప్పబడే పెద్ద బాధ్యత..! మంచి లెక్చరర్లకిచ్చే జీతంలో పదో వంతు మాత్రమే వీరికి ఇస్తారు. వీరి దృష్టి ఎప్పుడూ, ఇంకో వంద ఎక్కువ జీతం కోసం ఏ కాలేజీకి వెళ్దామా అనే ఉంటుంది. వీరిలో పాఠం బాగా చెప్పే టీచర్లు మంచి సెక్షన్లకి ప్రమోట్ చేయబడతారు. దాంతో మిగతా వారికి మరింత ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. దాన్ని విద్యార్థుల మీద చూపిస్తారు. చేరిన మొదటి అయిదారు నెలల్లోనే ఒక విద్యార్థి సీ సెక్షన్ నుంచి ఏ సెక్షన్‌కి వెళ్ళ లేకపోతే, ఆ బలవంతపు చదువు వేస్టని తెలుసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
అలా కాని పక్షంలో, ఎంసెట్ రిజల్ట్స్ రాగానే అయిదు సంవత్సరాల కల ఒక్కసారి కరిగిపోతుంది. ఆ డిప్రెషన్ నుంచి తేరుకోవటం అంత సులభం కాదు.
పోటీ పరీక్షలో విద్యార్థి ఫెయిల్ అయితే, గాయానికి మందు వ్రాసినట్టు, "ఎక్కడో చిన్న తప్పు జరిగి ఉంటుంది. మరోసారి ప్రయత్నిస్తే తప్పు లేదు కదా..! ఈసారి లాంగ్-టర్మ్ కడితే సీటు ఖాయం" అని నమ్మేటట్టూ ఈ కలల వ్యాపారులు భ్రాంతి కలిగిస్తారు. లాంగ్ టర్మ్ ట్రైనింగ్‌లో కూడా నూటికి ఒకరో ఇద్దరో మాత్రమే పాసవుతారు.
ఇక విద్యార్థుల సంగతి తీసుకుంటే, రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీ ఖైదీల్లాగా కంచాలు పట్టుకుని, మొహాలు వేలాడేసుకుని క్యూలో నడుచుకుంటూ భోజనానికి వెళ్తారు. ఆ తరువాత బాత్రూంల పక్కన కూర్చుని ఒక వైపు చదువుతూ మరో వైపు నిద్రకి జోగుతారు. పదింటికి పక్కమీదకు వెళ్ళి, ఇల్లు గుర్తొచ్చి తలదిండు తడిచిపోయేలా కొంచెంసేపు ఏడ్చి నిద్రలోకి జారుకుంటారు. కల పూర్తిగా తీరక ముందే మళ్ళీ లేపేస్తారు.
దీనికి పెద్దలు చేసుకునే ఆత్మ వంచన 'కష్టపడకపోతే ఎలా?' అని. మరి వాళ్ళెందుకు (పెద్దలు) ఆ వయసులో కష్టపడలేదో ఆత్మవిమర్శ చేసుకోరు.
మరో చెడు పరిణామం చూద్దాం.
నాలుగైదు సంవత్సరాలు అంత ఒత్తిడిలో చదివిన పిల్లలు ఐఐటీలో గానీ, మెడిసిన్లో గానీ సీటు రాకపోయేసరికి మామూలు కాలేజీలో చేరవలసి వస్తుంది. ఒక వైపు కల్లలైపోయిన ఆశలు, మరోవైపు కొత్తగా లభించిన స్వేఛ్చ. దీనితో వారు చదువు మానేసి, స్వేఛ్చకి కొత్త అర్థాలు వెతుక్కుంటారు. అత్యంత కఠిన శిక్ష అనుభవించి అండమాను దీవుల జైళ్ళలోంచి బయటపడిన ఖైదీల్లా ఉంటుంది వారి పరిస్థితి. తాము చేస్తున్న తప్పు తెలుసుకునే సరికి చదువు పూర్తయిపోతుంది. ఐఐటి సీటు వస్తుందనే భ్రమలో దాదాపు రెండు సంవత్సరాల పాటు బ్రతికి, ఆ తర్వాత మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో చేరవలసి వచ్చినప్పుడు విపరీతమైన మానసిక ఘర్షణకి లోనవుతారు.
సాధారణ స్టాండర్డ్ ఉన్న విద్యార్థులు, గ్రాడ్యుయేషన్ పుర్తి చేశాక ఉద్యోగస్తులవుతారు. చదివిన చదువుకీ, చేసే ఉద్యోగానికీ ఏ సంబంధమూ ఉండదు. ఈ మాత్రం దానికి జీవితంలో ఒకే ఒకసారి వచ్చే అపురూపమైన బాల్యాన్ని లాగేసుకోవాలా అన్నది సందిగ్ధం. 'అయితే ఏం చెయ్యమంటావ్? మా పిల్లల్ని చదివించ వద్దంటావా?' అని విరుచుకు పడకండి. నారి ఎంత లాగితే బాణం అంత ముందుకు వెళ్తుంది. మానసిక అర్హతను బట్టి వాళ్ళ కోర్స్‌ని ఎంపిక చేయాలే తప్ప మరీ బలంగా లాగితే తాడు తెగిపోతుంది. అది చెప్పటమే ఇక్కడ ఉద్దేశ్యం.

ఫొటో సోర్స్, yandamoori.com
మీ కలల్ని పిల్లల మీద రుద్దకండి!
అందరూ ఫలానా కోర్స్ చదివిస్తున్నారు కాబట్టి తమ పిల్లవాడిని కూడా అదే చదివించాలని కొందరు తల్లిదండ్రులు అనుకుంటారు.
'మన ఇంట్లో ఒక డాక్టర్ లేరు కాబట్టి నువ్వు తప్పకుండా అదే చదవాలి' అని కొందరు అంటారు.
'మా అక్కయ్య కొడుకు సీఏ చదివి విదేశాల్లో కోట్లు సంపాదిస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా అదే కోర్స్ చదవాలి' అంటాడు ఒక తండ్రి.
'చిన్నప్పటి నుంచి నాట్యం నాకు ఎంతో ఇష్టం కాని నేను సాధించలేకపోయాను. పదమూడేళ్ళ వయసులోనే నా బరువు అరవై మూడు కేజీలు ఉండేది. నా ఆశ నువ్వే నెరవేర్చాలి' అని తన కూతురిని నాట్యం వైపు ప్రోత్సహిస్తుంది ఒక తల్లి.
ఈ విధంగా కొందరు ఇతరులని చూసి, మరికొందరు తమ నెరవేరని కోరికలు తీర్చుకోవాలనీ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు.
కొందరు పేరెంట్స్ మరో రకం. తల్లికి టీవీ చూడటం ఇష్టమైతే పక్కన కూర్చోపెట్టుకొని గంటల తరబడి చూపిస్తూ ఉంటుంది. చదువుకీ, టీవీకీ ఏమాత్రం సంబంధంలేదని మనస్ఫూర్తిగా నమ్ముతుంది. చిరుతిళ్ళు ఇష్టమైతే, పిల్లలకి అదే అలవాటు చేస్తుంది. పైగా, పెరిగే వయసులో తింటే తప్పేమిటని వాదిస్తుంది. భక్తి ఎక్కువైతే భజనలు చేయిస్తుంది. తండ్రికి నీళ్ళంటే భయమైతే పిల్లవాడిని అసలు అటువైపు వెళ్ళనివ్వడు. నిప్పంటే భయమైతే దీపావళి పండగ చెయ్యనివ్వడు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో..!
ఈ పెంపకంలో పెరిగిన పిల్లలు ఛాలెంజెస్ స్వీకరించటానికి అస్సలు ఇష్టపడరు. సొంతంగా నడక నేర్చుకోరు. తల్లిదండ్రుల వేళ్ళు పట్టుకొని గమ్యం తెలియకుండా మెట్లు ఎక్కేస్తూ ఉంటారు. ఆ మాటకొస్తే పైమెట్టు ఏదో కూడా తెలీదు. పెద్దలు చెప్పిన కాలేజి, పెద్దలు చెప్పిన కోర్సు,..! అందులో తప్పేమీ లేదు కానీ, పెద్దల ఓవర్-ఇన్‌వాల్వ్‌మెంట్ పిల్లల ఓవర్-డిపెన్‌డెన్సీకి దారి తీస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
పిరమిడ్ డెవలప్‌మెంట్:
నిలువుగా, వెడల్పుగా అని 'ఎదుగుదల' రెండు రకాలు. (దరిద్రమైన తెలుగు వాక్యానికి క్షమాపణలు). ఒక కళ లేదా సబ్జెక్ట్‌లో మాస్టరై, మిగతా ఏ విషయాలూ తెలియకపోతే, ఆ ఎదుగుదల నిలువు. కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చిన వ్యక్తికి ఆర్థిక శాస్త్రంలో 'అ-ఆ'లు తెలియక పోవటం, దేశం తరఫున ఒలంపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన అమ్మాయికి రెండో ఎక్కం రాకపోవటం పొడుగు ఎదుగుదలకి నిదర్శనాలు.
కొంత వయసు వరకూ పిల్లలు వెడల్పుగా ఎదగాలి. అంటే పిల్లల పరిజ్ఞానం పిరమిడ్ ఆకారంలో వెడల్పుగా మొదలై, ఆ తరువాత ఎత్తుగా పెరగాలి.
చిన్నవయసులో పిల్లల మెదడు బోల్డంత ఖాళీగా ఉంటుంది. చదువుతో పాటు రెండు మూడు రంగాల్లో ప్రవేశం కల్పించినా వారికి ఇబ్బంది ఉండదు. గేమ్స్, కళలు... ఏవైనా సరే, రెండు మూడు అభిరుచులతో ప్రారంభమై, చివరికి ఒక గమ్యoతో పూర్తవ్వాలి. వివిధ కళల్లో కాస్త జ్ఞానాన్ని సంపాదించి, ఆపై తనకు నచ్చిన దానిలో ఉన్నత శిఖరాన్ని అందుకోవటం అన్నమాట.
అభిరుచులు రెండు రకాలు. డబ్బుకోసం అమ్మానాన్నలను వేధించి, అభిమాన నటుడి నిలువెత్తు పోస్టరు సొంత ఖర్చులతో ప్రింటు చేయించి, నాలుగురోడ్ల మధ్యలో అతికించి, అందులో ఓ మూలగా ఉన్న తన చిన్న ఫొటో చూసుకుని మురిసిపోవటం అనారోగ్య అభిరుచి. పుట్టినరోజునాడు అమ్మానాన్నా ఇచ్చిన డబ్బు హెల్పేజ్-ఇండియాకి పంపటం ఆరోగ్యకరమైన అభిరుచి.
గోళీలు ఆడేవాడు పెద్దయ్యాక తాగుబోతు అవ్వచ్చు. పోకర్ గేమ్స్ ఆడే పిల్లవాడు పేకాట ఆడవచ్చు, కానీ ఒక చదరంగం ఆటగాడినీ, టెన్నిస్ ఆటగాడినీ తీసుకుంటే, అతడి చిన్నతనపు అభిరుచి పెద్దయేవరకూ (చాలా సందర్భాల్లో) కొనసాగుతుంది. శాశ్వతమైన మంచి అభిరుచులు పెంచుకున్నవాళ్ళు జీవితంలో ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉంటారు.
ఏ పిల్లవాడైనా రెండు రంగాల్లో ఏకాగ్రత నిలుపగలరు. మ్యూజిక్ ఉత్సాహం ఉన్న పిల్లలు ఒకవైపు చదువు, మరొక వైపు సంగీతం- రెండింట్లోనూ ప్రావీణ్యం సంపాదించవచ్చు. బర్డ్-వాచింగ్ హాబీ ఉన్నవారు ల్యాండ్-స్కేపింగ్‌లో డిగ్రీ సంపాదించవచ్చు. నిజానికి ఇది మంచి పద్ధతి కూడా.
చదువే కాకుండా మరే ఆర్ట్ (కళ) ఉందో గ్రహించి, పిల్లలకి దానిలో ప్రవేశం కల్పిస్తే చదువు బోర్ కొట్టినప్పుడల్లా ఆ కళ ద్వారా సంతృప్తి చెందుతారు. ఒకమ్మాయికి కర్ణాటక సంగీతమంటే ఇష్టం అనుకుందాం. చదువు బోరుకొట్టినప్పుడు సాధన చేయవచ్చు. ఆ పై తిరిగి చదువుకోవచ్చు. అటువంటి రెండో అవుట్-లెట్ లేని పిల్లలు నిరర్థక వ్యాపకాలైన చాటింగ్ మొదలైనవాటిని రెండో అభిరుచిగా చేసుకుంటారు. క్రమంగా అవి బాక్టీరియాలా మనసంతా ఆక్రమించుకుని రెండో అభిరుచిని (చదువు మీద ఇంటరెస్టుని) తగ్గిస్తాయి.
చదువులో ముందంజ, క్రీడల్లో ఉత్సాహం, గార్డెనింగ్, కుకింగ్, పెయింటింగ్, మ్యూజిక్ వంటి హాబీలు… పిల్లలు వెడల్పుగా ఎదగటానికి ఉదాహరణలు. మరోలా చెప్పాలంటే, అన్నిరంగాల్లోనూ కొద్ది కొద్దిగా ప్రవేశం అన్నమాట.

ఫొటో సోర్స్, Yandamoori Virendranath
ప్రపంచంలోని కొంతమంది ప్రముఖులు పిరమిడ్‌లా ఎలా ఎదిగారో కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. భారతరత్న సచిన్ టెండూల్కర్ పెద్దగా చదువుకోలేదు. కానీ ఈ మాస్టర్ క్రికెటర్‌కి కవిత్వంలో ప్రవేశం ఉంది. టెండూల్కర్ తండ్రి మరాఠీలో పెద్ద నవలా రచయిత. సచిన్ దేవ్ బర్మన్ పట్ల ఇష్టంతో తన కొడుక్కి 'సచిన్' అని పేరు పెట్టారు. విశ్వనాథన్ ఆనంద్‌కు కూడా కవిత్వం అంటే చాలా ఇష్టం. చదువు, చదరంగం సమాంతరంగా ప్రారంభించి తర్వాత చదరంగంలో ప్రపంచ నెం.1 అయ్యారు. అమితాబ్ బచ్చన్‌కు సినిమాల్లోకి రావాలన్న ఆలోచనే లేదు. ఆయన ఫాదర్ గొప్ప కవి. శృతి హాసన్ సైకాలజీ చదివింది. రాక్ బాండ్లో పాటలు పాడుతూ ఉండేది. విద్యాబాలన్‌కు సోషియాలజిలో మాస్టర్ డిగ్రీ ఉంది.
మళ్లీ తల్లిదండ్రుల దగ్గరికే వద్దాం. లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ సెంటర్లలో పిల్లల్ని చేర్పించే దిగువ తరగతి పెద్దలకి ఒక సూచన. ఉన్నతి, ఎదుగుదల అన్నది ఐఐటీ, ఐఏఎస్ చదివితేనే కాదు. చాలా రకాలుగా సాధించవచ్చు. ఈ అవగాహన పిల్లలకూ పెద్దలకూ ఇద్దరికీ అవసరం. పోనీ ఆ రెంటినే తీసుకున్నా ఐఐటీతో పోలిస్తే ఐఏఎస్ కోచింగ్ మంచిదని నా అభిప్రాయం. కలెక్టర్ అవకపోయినా లోకజ్ఞానం వస్తుంది.
చివరగా ఒక మాట.
శక్తికి మించి కాసింత ఎక్కువ ఆశిస్తే అది ఆశ...! అంతకన్నా ఎక్కువ ఆశిస్తే అది అత్యాశ..! ఆశ ఉండాలి. అత్యాశ ఉండకూడదు. ఆశకీ, అత్యాశకీ మధ్య గీత గీయటం కష్టమే గానీ అసాధ్యం కాదు.
విద్యార్థుల బలవన్మరణాల నేపథ్యంలో తెలంగాణ జూనియర్ కాలేజీల లెక్చరర్ల ప్రతినిధి మధుసూదన్‌రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులతో 'బీబీసీ తెలుగు' ఫేస్‌బుక్ లైవ్ నిర్వహించింది. ఆ వీడియోను ఇక్కడ చూడవచ్చు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
మా ఇతర కథనాలు:
- 2050 నాటికి అతి పెద్ద పది సవాళ్లివే!
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
- ప్రపంచ అందగత్తెలు వీళ్లు!!
- ఆరెస్సెస్‌కు, అమ్మాయిలకు మధ్య ఈ ఘర్షణ ఎందుకొచ్చింది?
- మత్తు మందుల్ని మించిన వ్యసనం
- లైంగిక వేధింపులు: చట్ట ప్రకారం ఫిర్యాదు చేస్తారా? సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా?
- 'చనిపోయాకా చాటింగ్ చేయొచ్చు'
- వేధించారంటే ఉద్యోగాల్లోంచి ఊస్టే!
- 'నా దేశభక్తిని బలవంతంగా పరీక్షించకండి'
- ధోని: ‘నా దారి... గాంధీ దారి’
- అతన్ని రేప్ చేశారు
- ఇవాంకా వస్తున్నారు సరే... అసలేంటి ఈ జీఈఎస్?
- జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే రాజీనామా
- అంటార్కిటికాలో పెంగ్విన్ల ఆకలి చావులు!
- అబ్బాయిలు ‘ఆ’ చిత్రాలను నెట్లో పెట్టలేరు!
- ఐన్‌స్టీన్ ‘థియరీ ఆఫ్ హ్యాపీనెస్’
- అంటార్కిటికాలో పెంగ్విన్ల ఆకలి చావులు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









