వీకెండ్స్‌లో పబ్ కెళ్లడానికి బదులు ఇక్కడికొచ్చి ఇలా నగ్నంగా కూర్చుంటారు....ఎక్కడంటే....

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లెన్నాక్స్ మారిసన్
- హోదా, జర్నలిస్ట్, స్కాట్లాండ్
ఆవిరి స్నానం చేసే గదిలో.. చెక్కబల్ల మీద.. తొడలు తగిలేలా.. ఒంటిమీద చిన్న గుడ్డ ముక్క కూడా లేకుండా.. నగ్నంగా మా బాస్‌తో తొలిసారి నేను కూర్చున్న రోజును ఎప్పటికీ మర్చిపోలేను.
జర్మనీలోని హీడెల్‌బర్గ్‌లో ఒక కంప్యూటర్ కంపెనీని ప్రారంభిస్తున్న తొలిరోజులవి.
మాది స్కాట్లాండ్. మా దేశంలో వారాంతాల్లో పబ్‌లకెళ్లటం, మందుకొట్టడం మామూలే. కానీ, వీకెండ్స్‌లో బట్టలు విప్పేసి, ఆరు బయట కూర్చుంటానని కలలో కూడా అనుకోలేదు.
ఈ సంస్కృతితో నేను షాక్ తిన్నాను. కానీ, జర్మనీ, హోలాండ్, ఫిన్లాండ్ దేశాల్లో మాత్రం కొలీగ్స్‌తో కలిసి ఆవిరి స్నానాలు చేయటం చాలా సామాన్యమైన విషయం. ఫిన్లాండ్‌లో అయితే, మన బాస్‌ను కూడా బట్టల్లేకుండా చూడటం మామూలే.
ఆఫీసుల్లో సానాలు.. స్నానాలూ
''ఫిన్లాండ్‌లో అందరూ సమానమే. సామాజిక కట్టుబాట్లు కఠినంగా ఉండవు. బాస్‌తో కలిసి నగ్నంగా.. కబుర్లాడుకోవటం అనేది సాధారణ విషయం. ఆవిరి స్నానాల గదిలో హోదాలూ, జీతాల అడ్డుగోడలు ఉండవు'' అని హెల్సింకిలోని ఫిన్నిష్ సానా సొసైటీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ కటారినా స్టిర్మన్ చెప్పారు.
55 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో ప్రతి ఇద్దరికీ ఒక ఆవిరి స్నానాల గది ఉంటుంది. దీన్ని సానా అని పిలుస్తారు. చాలా కంపెనీలు తమ ఆఫీసుల్లోనే వీటిని ఏర్పాటు చేసుకున్నాయి.
అయితే, వీటిలోకి వెళ్లాలంటే కచ్చితంగా బట్టలు విప్పాల్సిందే. ఒంటిమీద టవల్, స్విమ్‌సూట్‌లు కూడా ఉండకూడదు.

ఫొటో సోర్స్, Getty Images
మొదట్లో ఈ సంస్కృతి తనకు వింతగా అనిపించిందని, బట్టలు విప్పి మాట్లాడటానికి ఇబ్బంది పడేవాడినని బెల్జియంకు చెందిన క్రిస్టాఫ్ మిన్నెర్ట్ చెప్పారు.
అయితే, మూడేళ్లు దీనికి అలవాటు పడిన తర్వాత తన టీమ్‌తో కలిసి ప్రతివారం రెండు, మూడు గంటలు ఆవిరి స్నానాల గదిలో గడుపుతున్నానని చెప్పారు.
అలా నగ్నంగా కూర్చునే ఆఫీసులో పని గురించి మాట్లాడుకుంటామని, ఏమైనా మంచి ఐడియాలు చర్చకు వస్తే వాటిని వాడుకుంటామని మిన్నెర్ట్ తెలిపారు.
సానాల్లోనే సెలబ్రేషన్స్
ఫిన్లాండ్‌లో చలి ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలామంది ఆవిరి స్నానాలను ఇష్టపడతారు.
ఐదు రోజుల కష్టాన్ని మర్చిపోయేలా సానాలో వెచ్చటి ఆవిరి స్నానంతో కొత్త ఉత్సాహం వస్తుందని చాలామంది ఉద్యోగులు అంటుంటారు.
ప్రముఖ మొబైల్‌ఫోన్ల కంపెనీ నోకియాకు ఫిన్లాండ్‌లో మూడు ఆఫీసులు ఉన్నాయి. ఆ మూడింటిలోనూ సానాలున్నాయి.
కంపెనీ విజయాలను, ముఖ్యమైన రోజులను కూడా రెస్టారెంట్లకు, పబ్‌లకు వెళ్లకుండా సానాల్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు.
’’సానాలో బట్టలు ఉండవు. హోదాలు ఉండవు. ఇగోలు కూడా ఉండవు. మీ ఆలోచనలు, మీ మాటలు మాత్రమే ఉంటాయి. ఎదుటివాళ్లకు కూడా ఇదే వర్తిస్తుంది. ఇలా బట్టల్లేకుండా స్నానం చేయటం అంటే అనవసరమైన డెకరేషన్లు లేకుండా మనిషిని మనిషికి దగ్గర చేయటమే‘‘ అని నోకియా కంపెనీ గ్లోబల్ ప్రొడక్ట్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టామీ ఉట్టొ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'టీమ్‌ను విడగొడ్డటం బాగోలేదు'
అయితే, కొన్ని సంవత్సరాలుగా బట్టల్లేకుండా ఆవిరి స్నానాల గదుల్లో కబుర్లాడుకునే సంస్కృతి తగ్గుతోంది.
ఫిన్లాండ్‌లోని కంపెనీలన్నీ గ్లోబల్ కంపెనీలుగా మారుతుండటం, భిన్న సంస్కృతులకు చెందినవాళ్లు వీటిలో పనిచేస్తుండటం, పని ఒత్తిడి పెరుగుతుండటమే దీనికి కారణం.
మగవాళ్లు, ఆడవాళ్లు వేర్వేరుగా సానాలకు వెళ్లాల్సి రావటం కూడా సానాలకు ఆదరణ తగ్గటానికి ఒక కారణం. పైగా అక్కడ బిజినెస్ డిస్కషన్లు చేయటానికి కంపెనీలు వెనుకాడుతున్నాయి.
ఆవిరి స్నానాలకు వచ్చేసరికి టీమ్‌ను రెండుగా విడగొట్టడం బాగోలేదని చాలామంది అంటున్నారు.
నిబంధనలు తెలుసుకోవాలి
జర్మనీ, హోలాండ్, ఫిన్లాండ్‌లతో పాటు స్వీడన్, రష్యా, నెదర్లాండ్స్‌ల్లో కూడా సానాలు పాపులర్ అయ్యాయి. అయితే, ఆవిరి స్నానాల గదుల్లో నిబంధనలు మాత్రం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి.
ఫిన్లాండ్‌లో సరదాగా సానాకు వెళితే, జర్మనీలో ఆరోగ్యం కోసం వెళుతుంటారు. ఫిన్లాండ్ సానాల్లో ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. కానీ, జర్మనీలో మాత్రం కావల్సినవి అందించేందుకు సానా మాస్టర్లు కూడా ఉంటారు.
జర్మనీ, నెదర్లాండ్స్‌ల్లో ఆఫీసయ్యాక కొలీగ్స్‌తో గేమ్స్ ఆడి, ఆ తర్వాత సానాలకు వెళుతుంటారు. స్పోర్ట్స్‌క్లబ్‌లు, జిమ్‌ల్లో కూడా సానాలు ఉంటాయక్కడ.

ఫొటో సోర్స్, Getty Images
'అక్కడ చేతులు పెట్టుకుని కవర్ చేయాల్సొచ్చింది'
బ్రిటన్ నుంచి ఆమ్‌స్టర్‌డామ్ వెళ్లిన రిటైల్ మార్కెటింగ్ యాప్ కంపెనీ స్పాజా ఫౌండర్ సామ్ క్రిచ్లే తొలిసారి బట్టల్లేకుండా ఆవిరి స్నానం చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డారంట.
''ఉన్నట్టుండి ఆవిరిలోంచి ఒక లేడీ కొలీగ్ నడుచుకుంటూ నావైపు వచ్చింది. 'దీని తర్వాత భోజనానికి వస్తున్నారా?' అని ఆమె అడిగింది. అంతటితో ఆగకుండా డోరు తెరిచింది. అక్కడేమో మా టీమ్‌లోని నలుగురు ఫీమేల్ కొలీగ్స్ వరుసగా.. బట్టల్లేకుండా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నేను వెంటనే ’అక్కడ‘ చేతులు పెట్టి కవర్ చేయాల్సొచ్చింది'' అని సామ్ కిచ్లే గుర్తు చేసుకున్నారు.
మా ఇతర కథనాలు:
- ఇంతకూ మనం పది శాతం మెదడునే వాడుతున్నామా?
- ‘గ్యాస్’ ప్రాబ్లమ్? ఎందుకిలా వదులుతారు? దీన్ని ఆపొచ్చా?
- పరాజయం చేసే మేలేంటో మీకు తెలుసా!
- ఆ స్మార్ట్‌ఫోన్ అంత స్మార్ట్ ఎలా అయ్యింది?
- సోషల్ మీడియా... నిద్ర రాదయా!
- 'చనిపోయాకా చాటింగ్ చేయొచ్చు'
- పండ్ల రసాలు తాగుతున్నారా! పళ్లు జాగ్రత్త!!
- సైకోలే సరైన నాయకులా?
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- జంతువులతో సెక్స్: తప్పు ఎక్కడుంది?
- షికాగో సెక్స్ రాకెట్: 'వ్యభిచారం ఈనాటిది కాదు.. సినీరంగాన్ని నిందించటం సరికాదు'
- సెక్స్‌లో ఎంతసేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి? ఇది వ్యాధి లక్షణమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)








