ఓటమితో స్నేహం చేస్తూ గెలుపును ఇలా చేరుకోవచ్చు

పరాజయం ఓటమి గెలుపు విజయం Failure loss win winner friendship

ఫొటో సోర్స్, Getty Images

ఓటమి లేకపోతే విజయం కూడా లేదు. ప‌రాజ‌యాలు మన జీవితంలో భాగం. వాటిని చూసి మనం భయపడాలా? అవి పలకరిస్తే కుంగిపోవాలా? ఈ ప్రశ్నలకు సమాధానం మీకు కూడా తెలుసు. ప‌సి ప్రాయంలో ఒక్క అడుగు వేయ‌లేక కిందపడ్డ వాళ్లే.. నేడు ఎవ‌రెస్టు శిఖ‌రాన్ని తమ కాళ్లకింద చూసుకుని ఆనందిస్తున్నారు. ప‌రాజ‌యాలు ఉన్నదే మ‌న‌కు పాఠం నేర్పటానికి. ప్రపంచాన్ని ప్రభావితం చేయ‌గ‌ల వ్యక్తులు చాలామంది అలాంటి పాఠాలు నేర్చుకున్నవారే.

జే.కే. రౌలింగ్ రాసిన హ్యారీ పోట‌ర్ న‌వ‌ల ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపుల‌రో ప్రత్యేకంగా చెప్పాలా! కానీ.. మొద‌టి హ్యారీ పోట‌ర్ న‌వ‌ల‌ 12 సార్లు తిరస్కరణకు గురైంది. అయినా.. ఆ తిరస్కరణలే రౌలింగ్‌కు పాఠం నేర్పాయి.

అమెరిక‌న్ ర‌చ‌యిత స్టీఫెన్ కింగ్స్ ర‌చించిన మోస్ట్ పాపుల‌ర్ న‌వ‌ల క్యారీ 30 సార్లు తిరస్కరణకు గురైంది.

పరాజయం ఓటమి గెలుపు విజయం Failure loss win winner friendship

వైఫల్యమే సోనీకి పునాది

సోనీ.. ఈ పేరు విన‌ని వారెవరైనా ఉన్నారంటారా!?. జ‌పాన్‌ దిగ్గజ సంస్థల్లో సోనీ ఒక‌టి. మొద‌ట్లో అది కూడా వైఫ‌ల్యాల‌ను చ‌విచూసిందే.

రెండో ప్రపంచ యుద్ధం నుంచి తేరుకున్న జ‌పాన్‌లో మ‌సారు ఇబుకా, అకియో మోరిటా క‌లిసి ఓ ఎల‌క్ట్రానిక్ రైస్ కుక్కర్‌ను త‌యారు చేశారు.

ఆ కుక్కర్ ప‌నితీరు ఏమాత్రం బాగుండేది కాదు. అందులో అన్నం వండితే ఒక్కోసారి స‌రిగ్గా ఉడికేది కాదు. తిన‌డానికి వీల్లేకుండా త‌యార‌య్యేది. అయినా వాళ్లిద్దరూ వెన‌క‌డుగు వేయ‌లేదు. ఎంతో కష్టపడి ఆ లోపాల‌ను స‌రిదిద్దారు.

అంత కష్టపడ్డా వారు అమ్మగలిగింది వంద కుక్కర్లు మాత్రమే!

ఈ ఎదురుదెబ్బల నుంచి నేర్చుకున్న పాఠాలతోనే వారు ఎల‌క్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ టోక్యో త్సుషిన్ కోగ్యోను మొదలు పెట్టారు. అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సోనీ.

పరాజయం ఓటమి గెలుపు విజయం Failure loss win winner friendship

గొప్ప ఆవిష్కర్తలు.. వైఫ‌ల్యానికి అభిమానులు

వైఫ‌ల్యాలు విజ‌యానికి మార్గం చూపుతాయి. శాస్త్రవేత్తలు.. ఆవిష్కర్తలు అనుభవపూర్వకంగా చెప్పే మాట ఇదే. ఏడు ప్రయత్నాలు ఫ‌లించ‌క‌పోవ‌చ్చు. కానీ.. ఎనిమిదోసారి విజ‌యం మ‌న‌దేన‌న్న క‌సితో ముందుకెళ్లాలి.

అందుకు విద్యుత్ బ‌ల్బు త‌యారీ కోసం థామ‌స్ అల్వా ఎడిస‌న్ ప‌డిన త‌పన ఓ చక్కని ఉదాహ‌ర‌ణ‌.

విద్యుత్‌ బ‌ల్బు నుంచి వెలుతురు చూసేందుకు థామ‌స్‌ ఎడిస‌న్ దాదాపు 3,000 ప్రయత్నాల్లో విఫ‌లమ‌య్యారు. అయినా ఆయ‌న త‌న ప్రయత్నాలను ఆప‌లేదు. ఆఖ‌రికి అనుకున్నది సాధించారు.

పరాజయం ఓటమి గెలుపు విజయం Failure loss win winner friendship

ఫొటో సోర్స్, Getty Images

డ‌బ్బుల్లేక కుక్క మాంసం తినేవాడు

వాల్ట్ డిస్నీ స్థాపించిన తొలి యానిమేష‌న్ సంస్థ న్యూమాన్ లాఫ్-ఓ-గ్రామ్. 1920లో ఆ సంస్థ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదురైంది. ఎంత‌గా అంటే.. క‌నీసం అద్దెలు కూడా చెల్లించలేని ప‌రిస్థితి.

క‌డుపు నింపుకునేందుకు బ‌ల‌వంతంగా కుక్క మాంసాన్ని తినేవాడట వాల్ట్ డిస్నీ. అలాంటి గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్న ఆయ‌న 1966లో చనిపోయే నాటికి.. ప్రస్తుతం మన లెక్కల్లో చెప్పుకోవాలంటే.. దాదాపు 32 వేల కోట్ల రూపాయ‌లు సంపాదించారు.

పరాజయం ఓటమి గెలుపు విజయం Failure loss win winner friendship

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు మాత్రమే. వైఫ‌ల్యం త‌ర్వాత వ‌చ్చే గెలుపు ఇచ్చే కిక్కే వేరు. ఆ కిక్కు కోసం.. మధ్య మధ్యలో ప‌ల‌క‌రించే ప‌రాజ‌యాల నుంచి వీలైనన్ని కొత్త విషయాలు, పాఠాలూ నేర్చుకుంటూ సాగిపోవాల్సిందే.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)