అమెరికా: దేశంలో బోలెడన్ని చమురు నిల్వలున్నా, ఇంకా ఎందుకు తహతహ?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోని ఏ ఇతర దేశంతో పోల్చినా ఎక్కువ చమురు ఉత్పత్తి చేసేది అమెరికాయే.
యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం 2025 సంవత్సరంలో, అమెరికా ప్రతిరోజూ 13.4 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును అమ్మింది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తరచుగా చమురు గురించి మాట్లాడుతుంటారు.
కానీ, ఆయన మాట్లాడేది కేవలం అమెరికన్ చమురు గురించే కాదు.
స్వయంగా ఇంత పెద్ద ఎత్తున ముడి చమురు ఉత్పత్తి చేస్తున్నా, ఇంకా చమురు గురించి, దాన్ని సేకరించడం గురించి ఎందుకు అమెరికా ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది అన్నది అసలు ప్రశ్న.


ఫొటో సోర్స్, Getty Images
అమెరికా తన దేశంలో ఉత్పత్తి అయ్యే చమురుతో మనుగడ సాగించలేకపోతోందా? చమురు వ్యాపారానికీ, వెనెజ్వెలాకు ఏంటి సంబంధం?
దీనికి ముడి చమురు రకంతో సంబంధం ఉంది.
భూమి నుంచి వెలికితీసే ముడి చమురు(క్రూడ్ ఆయిల్)ను దాని సాంద్రత (డెన్సిటీ), సల్ఫర్ పరిమాణం, ప్రవాహ సామర్థ్యం ఆధారంగా వేర్వేరు గ్రేడ్లుగా వర్గీకరిస్తారు.
స్థూలంగా చెప్పాలంటే, ముడి చమురు రెండు రకాలు.
1. తేలికపాటి ముడి చమురు (లైట్ క్రూడ్ ఆయిల్)
2. భారీ ముడి చమురు (హెవీ క్రూడ్ ఆయిల్)
‘‘ముడి చమురులో దాదాపు 160కి పైగా రకాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రిఫైనరీలు ముడి చమురులోని వేర్వేరు గ్రేడ్లను శుద్ధి చేస్తాయి’’ అని ఇంధన విశ్లేషకుడు గౌరవ్ శర్మ వివరించారు.
భారీగా గాఢంగా ఉండే ముడి చమురుతో పోలిస్తే తేలికపాటి ముడి చమురును శుద్ధి చేయడం సులభం.
తేలికపాటి చమురును శుద్ధి చేసిన తర్వాత ఎక్కువగా పెట్రోల్, జెట్ ఫ్యూయల్ (విమానాల్లో ఉపయోగించే ఇంధనం) వంటి ఉత్పత్తుల కోసం వినియోగిస్తారు.
అలాగే ఓడలకు ఇంధనం, రోడ్డు నిర్మాణ సామగ్రి, లిప్ బామ్ వంటి అనేక ఇతర వస్తువులకు హెవీ క్రూడ్ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు.
భారీ ముడి చమురుతో పోలిస్తే, తేలికపాటి ముడి చమురు ఎక్కువ విలువైనది. దానిని కొనడం ఖరీదైన వ్యవహారం.
అమెరికా విషయంలో ఈ అంశమే చాలా ముఖ్యమైంది.
2025లో అమెరికా ప్రతిరోజూ 1 కోటి 34 లక్షల బ్యారెళ్ల చమురును విక్రయించింది. అదే సమయంలో, ప్రతిరోజూ దాదాపు 20 లక్షల బ్యారెళ్ల చమురును ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసింది.
ఈ పరిస్థితిలో, అమెరికా తాను ఉత్పత్తి చేస్తున్న చమురును తనవద్దే ఎందుకు ఉంచుకోదు అనేది ప్రశ్న.
దీనికి అసలు కారణం తేలికపాటి (లైట్) చమురు, భారీ (హెవీ) చమురు మధ్య ఉన్న తేడాయే.
అమెరికాలో 80 శాతం లైట్ క్రూడ్ ఆయిల్ ఉందని అమెరికన్ పెట్రోలియం ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. కానీ అమెరికాలోని ఎక్కువశాతం క్రూడ్ ఆయిల్ రిఫైనరీలను హెవీ క్రూడ్ ఆయిల్ శుద్ధి చేసే విధంగా నిర్మించారు.
ఎందుకంటే 20వ శతాబ్దంలో అమెరికాకు సరఫరా అయిన చమురులో ఎక్కువ భాగం లాటిన్ అమెరికా, కెనడా నుంచి దిగుమతి అయిన భారీ ముడి చమురే.
ఆ తర్వాత 2000ల ప్రారంభంలో, అమెరికన్ చమురు ఉత్పత్తిలో పెద్ద మార్పు వచ్చింది.
సాంకేతికత అభివృద్ధి చెందడంతో, షేల్ రాళ్ల నుంచి పెద్ద మొత్తంలో తేలికపాటి ముడి చమురును వెలికితీయడం సాధ్యమైంది.
ఇప్పుడు అమెరికా వెలికితీస్తున్న ముడి చమురు రకం, అక్కడి రిఫైనరీలు శుద్ధి చేయగల ముడి చమురు రకం..రెండూ ఒకదానికొకటి సరిపోవడం లేదు.
అంటే, అమెరికా ఎక్కువగా తేలికపాటి చమురును ఉత్పత్తి చేస్తోంది, కానీ అక్కడి రిఫైనరీలు ఎక్కువగా భారీ చమురును మాత్రమే శుద్ధి చేయగలవు.
"ఒకసారి రిఫైనరీ నిర్మించాక, దాన్ని మార్చడం చాలా కష్టం. దీనికి లక్షల నుంచి కోట్ల డాలర్ల పెట్టుబడి అవసరం" అని గౌరవ్ శర్మ అన్నారు. ఇలా చేయడం ఆర్థికంగా లాభదాయకం కాదు.
మరోవైపు, భారీ ముడి చమురుతో పోలిస్తే తేలికపాటి ముడి చమురు ధర ఎక్కువగా ఉండటంతో, అమెరికా తన తేలికపాటి చమురును ఎక్కువ ధరకు అమ్మి, భారీ ముడి చమురును తక్కువ ధరకు కొనుగోలు చేయగలుగుతోంది.
ఆర్థికంగా ఇది సరైన నిర్ణయం.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోనే అతి భారీ చమురు రిజర్వులు వెనెజ్వెలా, సౌదీ అరేబియా, ఇరాన్, కెనడా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, రష్యా, అమెరికా, లిబియాలలో ఉన్నాయి.
ఈ దేశాలు చాలా వరకు భారీ ముడి చమురును వెలికితీయడంలో ఫేమస్. ఈ దేశాలలో మూడు అంటే వెనెజ్వెలా, ఇరాన్, రష్యాలు ప్రస్తుతం అమెరికా ఆంక్షల కింద ఉన్నాయి.
అయినప్పటికీ, వెనెజ్వెలా నుంచి కొంత చమురు అమెరికాకు చేరుతూనే ఉంది. ఎందుకంటే వెనెజ్వెలాలో చమురు క్షేత్రాలు బయటపడ్డ తర్వాత అమెరికన్ కంపెనీలు అక్కడ చమురు పరిశ్రమ నిర్మాణానికి ఎక్కువగా సహాయపడ్డాయి.
20వ శతాబ్దంలో ఎక్కువ భాగం, యునైటెడ్ స్టేట్స్ అక్కడి నుంచే భారీ ఎత్తున ముడి చమురును వెలికితీసింది.
"ఇతర లాటిన్ అమెరికన్ దేశాల మాదిరిగా కాకుండా, వెనెజ్వెలా 1976లో చమురు జాతీయీకరణ సమయంలో కూడా అమెరికాతో ఈ మంచి సంబంధాలను కొనసాగించింది. కొన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ అవి చాలాకాలం బాగానే కొనసాగాయి" అని నవర్రా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ కార్మెన్ బీట్రిజ్ ఫెర్నాండెజ్ చెప్పారు.
కానీ 1999లో సోషలిస్ట్ నాయకుడు హ్యూగో చావెజ్ అధికారంలోకి వచ్చాక ఈ సంబంధాలు మారిపోయాయి. చమురు పరిశ్రమపై ప్రభుత్వ నియంత్రణను చావెజ్ బలోపేతం చేశారు.
"విదేశీ చమురు కంపెనీలపై హ్యూగో చావెజ్ కఠినమైన షరతులు విధించారు. అది అమెరికా ప్రభుత్వానికి, అమెరికా చమురు కంపెనీలకు అస్సలు నచ్చలేదు" అని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ లాటిన్ అమెరికన్ స్టడీస్‌కు చెందిన డాక్టర్ గ్రేస్ లివింగ్‌స్టోన్ చెప్పారు.
హ్యూగో చావెజ్ మరణించిన తర్వాత, నికోలస్ మదురో వెనెజ్వెలా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, చావెజ్ విధానాలను కొనసాగించారు.
అమెరికన్ చమురు కంపెనీలకు పరిహారం చెల్లించాలని 2019లో వరల్డ్ బ్యాంక్ ట్రిబ్యునల్ వెనెజ్వెలా ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ అది చెల్లించలేదు.
దీని గురించి చెబుతూనే అమెరికా చమురును వెనెజ్వెలా దొంగిలించిందని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపించారు.
అయితే, వెనెజ్వెలా ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
2025 చివరిలో అమెరికా సైన్యం చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకుని వెనెజ్వెలా ఓడరేవులను దిగ్బంధించినప్పుడు రెండు దేశాల మధ్య పరిస్థితి మరింత దిగజారింది.
నార్కోటెర్రరిజాన్ని ఎదుర్కోవడానికి ఇది జరిగిందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా ఆరోపణలపై విచారించడానికి మదురోను అమెరికా తరలించారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ఇప్పుడు వెనెజ్వెలా చమురు విషయంలో జోక్యం చేసుకుంటుందా?
మదురో అరెస్టు తర్వాత ట్రంప్ మాట్లాడుతూ, "ప్రపంచంలోని అతిపెద్ద చమురు కంపెనీలను బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి అక్కడికి పంపుతాం. అక్కడ సంపాదించిన డబ్బు అక్కడే ఉపయోగిస్తారు. వెనెజ్వెలా ప్రజలు దాని నుంచి గరిష్ఠ ప్రయోజనాన్ని పొందుతారు" అని అన్నారు.
గత కొన్ని దశాబ్దాలుగా, అమెరికా, ఇంకా పశ్చిమ దేశాల నిషేధాల కారణంగా రష్యా, ఇరాన్, ముఖ్యంగా చైనా వెనెజ్వెలాలో స్థానం సంపాదించాయి.
"చైనా కేవలం వెనెజ్వెలాకే కాకుండా చాలా దక్షిణ అమెరికా దేశాలకు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా మారింది. చమురు, రాగి, ఇతర సహజ వనరులను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది" అని గ్రేస్ లివింగ్‌స్టోన్ అన్నారు.
వెనెజ్వెలా చమురులో దాదాపు 90 శాతాన్ని చైనా కొనుగోలు చేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం దీన్ని ఆపాలనుకుంటోంది.
"మేం అక్కడ భద్రతను కోరుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా మా శత్రువులకు శరణు ఇచ్చే దేశాలు కాకుండా, శాంతియుత మిత్రదేశాలు కావాలి" అని ట్రంప్ అన్నారు.
వెనెజ్వెలాలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయి. ఇక్కడ గుర్తించిన చమురు సుమారు 303 బిలియన్ బ్యారెళ్లని అంచనా వేశారు. అయినప్పటికీ, వెనెజ్వెలా రోజుకు ఒక మిలియన్ బ్యారెళ్ల కంటే తక్కువే ఎగుమతి చేస్తోంది.
దీకి కారణం ఆంక్షలు. దశాబ్దాల తరబడి నిధులు లేకపోవడం. పేలవమైన మేనేజ్‌మెంట్.
"చాలాచోట్ల మౌలిక సదుపాయాలను పునర్నిర్మించాల్సి ఉంటుంది. వెనెజ్వెలా ముడి చమురును సరైన మొత్తంలో సరఫరా చేయడం కోసం మూడు-నాలుగు సంవత్సరాలు పట్టవచ్చు" అని గౌరవ్ శర్మ అన్నారు.
వాతావరణ మార్పుల గురించి ఆందోళనల మధ్య మరింత పునరుత్పాదక శక్తిని ఉపయోగించాలనే ఒత్తిడి ఉన్నప్పటికీ, వరల్డ్ ఆర్డర్‌లో చమురు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తోంది.
"గత శతాబ్దంలో, చమురు పరిశ్రమ అనేక దేశాలకు అపారమైన సంపదకు మూలంగా ఉంది. ఇది మల్టీ ట్రిలియన్ డాలర్ల పరిశ్రమ. రాత్రికి రాత్రే అనేక దేశాల అదృష్టాన్ని మార్చగలిగింది" అని గౌరవ్ శర్మ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














