రష్యా చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు భారత్‌పై ప్రభావం చూపనున్నాయా?

డోనల్డ్ ట్రంప్, అమెరికా ఆంక్షలు, రష్యా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

రష్యాలోని రెండు పెద్ద చమురు కంపెనీలపై అమెరికా కొత్త ఆంక్షలు విధించింది. యుక్రెయిన్‌తో శాంతి చర్చలకు ఒత్తిడి పెంచే ప్రయత్నంగా వారు దీనిని భావిస్తున్నారు.

అమెరికా ఆంక్షలు విధించిన రెండు చమురు కంపెనీలు రోస్‌నెఫ్ట్, లుకోయిల్.

ముఖ్యంగా, భారత్ ఈ రెండు కంపెనీల నుంచి చమురును కొనుగోలు చేస్తుంది. అందువల్ల, ఈ ఆంక్షలు భారతదేశంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు.

"నేను వ్లాదిమిర్‌తో మాట్లాడిన ప్రతిసారీ సంభాషణ బాగానే ఉంటుంది, కానీ అది ముందుకు సాగదు" అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

నేటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటేతో శాంతి చర్చలపై మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే, ఈ ఆంక్షలు అభివృద్ధి చెందుతున్న దేశాల ఇంధన (చమురు, గ్యాస్) భద్రతను ప్రభావితం చేస్తాయని రష్యా హెచ్చరించింది.

బుడాపెస్ట్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరగాల్సిన తన సమావేశం వాయిదా పడిందని ఒక రోజు ముందు ట్రంప్ ప్రకటించారు.

ఇదేసమయంలో, బుధవారం ఉదయం యుక్రెయిన్‌పై రష్యా భారీ బాంబు దాడులు చేసింది. ఘటనలో పిల్లలు సహా దాదాపు ఏడుగురు మరణించారు.

"ఈ యుద్ధాన్ని ముగించడానికి పుతిన్ నిరాకరించడం"తో కొత్త ఆంక్షలు అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా ఆంక్షలు ఎదుర్కొన్న కంపెనీల గురించి స్కాట్ మాట్లాడుతూ, ఈ చమురు కంపెనీలు యుద్ధానికి అవసరమయ్యే నిధులను రష్యాకు అందిస్తున్నాయని అన్నారు.

"హత్యలను ఆపడానికి, తక్షణ కాల్పుల విరమణకు సమయం ఆసన్నమైంది" అని అన్నారు.

కొత్త ఆంక్షలు పరిష్కారానికి మార్గం సుగమం చేస్తాయని డోనల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. చాలాకాలం వేచి ఉన్నామని, ఇక చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థమైందని ఆయన అన్నారు. కొత్త ఆంక్షలను ఒక ముఖ్యమైన అడుగుగా ట్రంప్ అభివర్ణించారు. యుద్ధాన్ని ఆపడానికి రష్యా అంగీకరిస్తే, వాటిని త్వరగానే ఎత్తివేయొచ్చని తెలిపారు.

చమురు, రష్యా, ఆంక్షలు

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా ఆంక్షలను మార్క్ రుటే స్వాగతించారు. 'ఇది పుతిన్‌పై ఒత్తిడి పెంచడానికి ఒక అడుగు' అన్నారు.

అమెరికా చర్యను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ స్వాగతిస్తూ "యుద్ధాన్ని పొడిగించాలంటే దానికి తగిన ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుందని కొత్త ఆంక్షలు చెప్తున్నాయి. చాలా మంచి, న్యాయమైన అడుగు. ఇది రష్యాపై ఒత్తిడిని పెంచుతుంది. శాంతి దిశగా ప్రభావవంతంగా పనిచేస్తుంది" అని ఎక్స్‌లో తెలిపారు.

గత వారం, రోస్‌నెఫ్ట్, లుకోయిల్‌పై బ్రిటన్ ఇలాంటి ఆంక్షలే విధించింది.

"ప్రపంచ మార్కెట్లో రష్యా చమురుకు స్థానం లేదు" అని బ్రిటన్ ఆర్థిక మంత్రి రాచెల్ రీవ్స్ అన్నారు.

అమెరికా ఆంక్షలు, భారత్

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంపై ప్రభావం

యుక్రెయిన్‌పై యుద్ధంతో, పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. అప్పటి నుంచి భారత్, చైనాలు రష్యా చమురును ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి.

భారత్ తన 140 కోట్ల జనాభా కోసం సరసమైన ధరలకు ముడి చమురును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు పదేపదే చెప్తోంది.

భారత్ తన మొత్తం చమురు అవసరాలలో దాదాపు 85 శాతం దిగుమతి చేసుకుంటుంది.

వార్తాసంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం జనవరి, జులై మధ్య భారత్ సగటున రోజుకు 17.3 లక్షల బ్యారెళ్ల రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో మూడో వంతు.

ఈ కాలంలో, భారతదేశం మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ దేశాల నుంచి చమురు దిగుమతులను తగ్గించింది.

రష్యన్ చమురును రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ ఎక్కువగా కొనుగోలు చేసేవి. కాగా, రోస్‌నెఫ్ట్‌తో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. నయారాలో రోస్‌నెఫ్ట్‌కు కూడా వాటా ఉంది.

గతవారం, భారత్‌కు చెందిన నయారా ఎనర్జీతో సహా అనేక ప్రధాన రష్యన్ చమురు కంపెనీలపై బ్రిటన్ ఆంక్షలు విధించింది.

బ్రిటిష్ ప్రభుత్వ ప్రకటన ప్రకారం, నయారా 2024లో రోస్‌నెఫ్ట్‌తో సహా అనేక రష్యన్ కంపెనీల నుంచి వందల కోట్ల డాలర్ల విలువైన చమురును కొనుగోలు చేసింది. గతంలో, యూరోపియన్ యూనియన్ కూడా నయారా ఎనర్జీపై ఆంక్షలు విధించింది.

అనంతరం, నయారా ఒక ప్రకటన విడుదల చేస్తూ, "నయారా పూర్తిగా భారత నియమాలు, నిబంధనల పరిధిలో పనిచేస్తుంది. భారత ఇంధన అవసరాలను తీర్చడంలో దోహదపడటానికి కట్టుబడి ఉన్నాం" అని పేర్కొంది.

అంతర్జాతీయ చట్టాన్ని, భారత సార్వభౌమత్వాన్ని విస్మరిస్తూ యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించిందని కంపెనీ ఆ ప్రకటనలో తెలిపింది.

పుతిన్; రష్యా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (ఫైల్)

రష్యా హెచ్చరిక

కొత్త ఆంక్షలపై లండన్‌లోని రష్యా రాయబార కార్యాలయం స్పందిస్తూ, తమ ఇంధన కంపెనీలను లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచ ఇంధన సరఫరాలపై ప్రభావం చూపుతుందని, ధరలు పెరగడానికి దారితీస్తుందని పేర్కొంది.

"ఆంక్షలు అభివృద్ధి చెందుతున్న దేశాల ఇంధన భద్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పెరుగుతున్న ఒత్తిడి శాంతియుత చర్చలను మరింత కష్టతరం చేస్తుంది" అని రాయబార కార్యాలయం తెలిపింది.

రష్యన్ కంపెనీలైన రోస్‌నెఫ్ట్, లుకోయిల్ రోజుకు సుమారు 31 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తాయి. రష్యా మొత్తం చమురు ఉత్పత్తిలో రోస్‌నెఫ్ట్‌ది దాదాపు సగం వాటా, ఇది ప్రపంచ ఉత్పత్తిలో 6 శాతం.

రష్యా చమురు, గ్యాస్‌కు ప్రధాన కొనుగోలుదారులు చైనా, భారత్, తుర్కియేలు. రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచడానికి ఆ దేశం నుంచి చమురు కొనుగోలు మానేయాలని ట్రంప్ ఈ దేశాలకు సూచించారు.

కాగా, రష్యా నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేయబోమని భారత ప్రధాని మోదీ తనకు చెప్పారని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇటీవల అన్నారు.

"నాలాగే ఆయన (ప్రధాని మోదీ)కూడా రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం ముగియాలని కోరుకుంటున్నారు. వారు పెద్దగా చమురు కొనబోరు, తగ్గిస్తున్నారు" అన్నారు ట్రంప్.

బ్రిటిష్ విదేశాంగ మంత్రి య్వెట్ కూపర్ అమెరికా చర్యను స్వాగతించారు. కొత్త ఆంక్షలను యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ కూడా ప్రశంసించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)