'నేను వీరప్పన్‌ను చాలాసార్లు కలిశాను'.. ఏనుగు దంతాల నుంచి గంధపు చెక్కల స్మగ్లింగ్, కిడ్నాప్‌లకు ఎందుకు మారాడంటే

- రచయిత, పి.శివసుబ్రమణియన్
- హోదా, బీబీసీ కోసం
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పోలీసుల కాల్పుల్లో చనిపోయి 21 ఏళ్లైంది. వీరప్పన్ తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి తప్పించుకుని శ్రీలంక పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, తమిళనాడు అదనపు డీజీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ 2004 అక్టోబర్ 18న కాల్చి చంపినట్లు ప్రకటించారు.
1978 నుంచి వీరప్పన్ చనిపోయేంత వరకు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసుల సంఖ్య 186.
ప్రభుత్వ లెక్కల ప్రకారం, వీరప్పన్ 123 మందిని చంపేశారు. వారిలో కర్ణాటకకు చెందిన ఒక ఐపీఎస్ అధికారి, మరో ఐఎఫ్ఎస్ అధికారి సహా రెండు రాష్ట్రాలకు చెందిన 10 మంది ఫారెస్ట్ ఆఫీసర్లు, 31 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వీరప్పన్‌పై 12 కిడ్నాప్ కేసులు నమోదుకాగా, 29 మంది అపహరణకు గురయ్యారు. వారిలో కన్నడ నటుడు రాజ్‌కుమార్ కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, NAKKHEERAN
వీరప్పన్ జీవితంపై చాలా సినిమాలు, నవలలు, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు వచ్చాయి. అయితే, ఆయన బతికున్నప్పుడు, చాలా తక్కువ మంది మాత్రమే ఆయన్ను కలవగలిగారు.
అలా, 1993 నుంచి 2000 వరకు ఏడేళ్లలో, నేను వీరప్పన్‌ను చాలాసార్లు కలిశాను. ఇంటర్వ్యూ చేశాను.
గంటల తరబడి ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన జీవితం గురించిన కొన్ని విషయాలు నాకు తెలిశాయి.


వీరప్పన్ మూలాల నుంచి స్మగ్లింగ్ వరకు..
వీరప్పన్ సొంతూరు తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని గోపినాథం అనే గ్రామం. చెంగప్పడి అని కూడా పిలుస్తారు. 1950 జనవరి 18న వీరప్పన్ ఈ గ్రామంలోనే పుట్టారు. కావేరి నది ఒడ్డున, చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అటవీప్రాంతంలో ఈ గ్రామం ఉంటుంది. వర్షాధారిత వ్యవసాయం, పశువుల పెంపకం, వేట, చేపలు పట్టడం గ్రామస్తుల జీవనోపాధిగా ఉండేది. ఎలాంటి కనీస సౌకర్యాలు లేని ఈ గ్రామంలో పుట్టిన వీరప్పన్ తలపై కోటి రూపాయల నజరానా ప్రకటించడం వరకూ చాలా పెద్దకథే ఉంది. దానిని తేలిగ్గా చెప్పడం అసాధ్యం.
"వీరప్పన్‌ది, నాది ఒకే వయసు. మేం బడికి వెళ్లింది లేదు. గుడిసెలు వేయడం, పశువులను మేపడం వంటివి చేసేవాళ్లం. వీరప్పన్ వాళ్ల నాన్న కూసన్ అలియాస్ మునుసామి వేటకు వెళ్లేవారు. ఆవులు మేపేందుకు వీరప్పన్ తుపాకీ తీసుకొచ్చేవాడు. తుపాకీ కంటే చిన్నగా ఉండేవాడు. 13 ఏళ్ల వయసులో జింకలు, మేకలు, కొండ గొర్రెలను వేటాడేవాడు. 17 ఏళ్ల వయసులో, ఒక ఏనుగు చంపి దాని దంతాలను నరికేశాడు" అని నల్లూర్ మధయన్ చెప్పారు.
వీరప్పన్‌కు సన్నిహితుడైన నల్లూర్ మధయన్ మాట్లాడుతూ, చాలామంది తుపాకులు పట్టుకుని వీరప్పన్‌ను అనుసరించారని, వేటకు వెళ్లేవారని చెప్పారు.
వీరప్పన్ ఏనుగుల వేటగాడి నుంచి నరహంతకుడిగా మారడంలో ఆయన సోదరుడు మధయన్‌ది కీలకపాత్ర అని చాలామంది చెబుతారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం, 1978 ఫిబ్రవరి 12న వీరప్పన్‌పై తొలి హత్య కేసు నమోదైంది. ఏనుగుల వేటకు సంబంధించి కొట్టాయంకు చెందిన తంగవేలు వర్గానికి, మధయన్ వర్గానికి మధ్య జరిగిన ఘర్షణలో కర్ణాటక సరిహద్దులోని తమిళనాడు గ్రామానికి చెందిన పరమశివంను కాల్చిచంపారు.

"నేను చామరాజనగర డీఎస్పీగా ఉన్నప్పుడు, ఒకేచోట నాలుగు ఏనుగులను చంపి, వాటి దంతాలను నరికేశారు. నేను, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) శ్రీనివాస్ అప్రమత్తమై ఏనుగుల వేటగాళ్ల ముఠాలను అదుపులోకి తీసుకుని చాలారోజులపాటు విచారించాం. వేర్వేరు ముఠాలను పట్టుకుని విచారణ జరిపినప్పుడు, అది చేసింది వీరప్పన్ అలియాస్ మోలుక్కన్ అని మాకు తెలిసింది" అని కర్ణాటక రిటైర్డ్ ఐజీ ఎంఆర్ పుజార్ బీబీసీతో చెప్పారు.
రెండేళ్ల పాటు గాలించినా వీరప్పన్ దొరకలేదని పుజార్ అన్నారు. వీరప్పన్‌కి సంబంధించిన అన్నిపనులు మధయన్ చూసుకునేవారని ఆయన చెప్పారు. తన తమ్ముడు వీరప్పన్ అడవిలో వేటాడుతుంటే, వచ్చిన డబ్బుతో అన్న విలాసవంతమైన జీవితం సాగించేవాడని కర్ణాటక ఫారెస్ట్ డిపార్టమెంట్‌కు చెందిన రిటైర్డ్ ఆఫీసర్ వాసుదేవమూర్తి అన్నారు.
"ఆ సమయంలో, ఎంతోమంది స్థానిక ప్రముఖులు, కొల్లెగల్ పోలీసులు, అటవీ శాఖ అధికారులు, రాజకీయ నాయకులు వీరప్పన్‌కు మద్దతుగా ఉండేవారు. మేం వీరప్పన్ కోసం గాలిస్తున్న సమయంలో, మధయన్ నా వద్దకు వచ్చి రూ.40 వేల రూపాయలు ఇవ్వజూపారు. నేను తీసుకోలేదు, వీరప్పన్‌ను లొంగిపోవాలని అడిగా. అందుకు ఒప్పుకోని వీరప్పన్ మాకు సాయం చేస్తున్న వారిలో చాలామందిని కాల్చిచంపడం మొదలుపెట్టారు" అని వాసుదేవమూర్తి చెప్పారు.

గంధపు చెట్ల స్మగ్లింగ్ ఎందుకు మొదలుపెట్టారు?
ఏనుగు దంతాల అమ్మకాలపై అంతర్జాతీయ నిషేధం తర్వాత, కేరళలోని ఆయిల్ మిల్లుల్లో గంధపు చెక్కలకు డిమాండ్ ఉందని తెలిసిందని, అప్పటి నుంచి గంధపు చెక్కల స్మగ్లింగ్ ప్రారంభించినట్లు వీరప్పన్ నాతో చెప్పారు. ఆ తర్వాత వీరప్పన్ వేటాడిన వారి జాబితా కూడా పెద్దదైంది.
తమిళనాడు, కర్ణాటక పోలీసులు, అటవీ శాఖల నుంచి నేను సేకరించిన సమాచారం ప్రకారం.. తన అన్న మధయన్‌పై తప్పుడు కేసు పెట్టారని భావించి సత్యమంగళం ఫారెస్ట్ రేంజర్ చిదంబరంను కుందేరిపాళ్యం అటవీ ప్రాంతంలో వీరప్పన్ హతమార్చారు.
1989 ఏప్రిల్ 1న, ఫారెస్ట్ అధికారులకు సాయం చేస్తున్నారని కొట్టయూర్ అయ్యనన్ కుటుంబంలోని ఐదుగురిని కాల్చి చంపారు.
ఐదుగురి హత్యానంతరం, తమిళనాడు - కర్ణాటక అటవీ శాఖలు సంయుక్తంగా ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేశాయి. అందులో కీలకపాత్ర పోషించిన కర్ణాటకకు చెందిన ఫారెస్టు గార్డు మోహనయ్యను 1989 ఆగస్ట్ 4న వీరప్పన్ చంపేశారు.
అదే నెల 17న, గంధపు చెట్ల నరికివేతను అడ్డుకునే క్రమంలో తమిళనాడు అటవీ శాఖకు చెందిన పళనిస్వామి, సుబ్రమణియన్ సహా ముగ్గురిని వీరప్పన్ హతమార్చారు.
వీరప్పన్‌ను అరెస్టు చేసేందుకు కర్ణాటక పోలీసులు సబ్ ఇన్‌స్పెక్టర్ దినేష్ నేతృత్వంలో 10 మందితో స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. 1990 ఏప్రిల్ 9న వీరప్పన్ బృందం ఒగెనక్కల్ సమీపంలోని మెట్టుక్కల్ అటవీ ప్రాంతంలో ఈ స్పెషల్ టీంపై దాడి చేసి, సబ్ ఇన్‌స్పెక్టర్లు దినేష్, రామలింగం, జగన్నాథన్ సహా నలుగురిని చంపేసింది.
అనంతరం, వీరప్పన్‌ను పట్టుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్(టీఎస్ఎఫ్)ను ఏర్పాటు చేసింది. ఆ టాస్క్‌ఫోర్స్‌కు ఎస్పీ తిమ్మప్ప మడియాల్‌ను చీఫ్‌గా నియమించింది. డీసీఎఫ్ శ్రీనివాస్ కమాండింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో, తమిళనాడు ప్రభుత్వం ఫారెస్ట్ పెట్రోలింగ్‌ను ఏర్పాటు చేసి, ఎస్పీ గోపాలకృష్ణన్‌ను హెడ్‌గా నియమించింది.
రెండు రాష్ట్రాల పోలీసు బలగాలు సంయుక్తంగా చిలువైక్కల్ అటవీప్రాంతంలో గాలింపు చేపట్టి, వీరప్పన్ బృందాన్ని చుట్టుముట్టి దాడి చేశాయి. వీరప్పన్ బృందం చెదరగొట్టి, 80 టన్నుల గంధపు చెక్కలను స్వాధీనం చేసుకున్నాయి. వీరప్పన్ బృందంలోని 24 మంది శ్రీనివాస్ ఎదుట లొంగిపోయారు. వారి ద్వారా వీరప్పన్‌ను లొంగిపోయేలా చేసేందుకు శ్రీనివాస్ ప్రయత్నించారు.
"వీరప్పన్ అనుచరుల మద్దతు కూడగట్టేందుకు ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. ఊరొదిలి వెళ్లిపోయిన వారిని తిరిగొచ్చేలా చేశారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టించారు. గ్రామంలోని మరియమ్మన్ ఆలయాన్ని పునర్నిర్మించారు. వీరప్పన్ సోదరి మరియమ్మాళ్‌కు సాయం చేస్తూనే, ఓ కన్నేసి ఉంచారు" అని కర్ణాటక రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ అంగురాజ్ బీబీసీకి వివరించారు.
"శ్రీనివాస్ సార్ ఆధీనంలో ఉన్నప్పటికీ, వీరప్పన్ సోదరి మరియమ్మాళ్ అప్పుడప్పుడూ వీరప్పన్‌ను కలిసేందుకు వెళ్లొస్తుండేవారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ ఎస్సై షకీల్ అహ్మద్ మరియమ్మాళ్‌ను విచారణకు పిలిపించారు. భయపడిపోయిన మరియమ్మాళ్ విషం తాగేశారు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది నేనే. కానీ, ఆమెను కాపాడలేకపోయాం. ఇదంతా చూస్తూ ఉన్న వీరప్పన్ తమ్ముడు అర్జునన్, దీని గురించి వీరప్పన్‌కు చెప్పలేదు" అని అంగురాజ్ తెలిపారు.

'నమ్మివచ్చిన అధికారిని చంపేసిన వీరప్పన్'
ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ ఉదంతం తర్వాత వీరప్పన్ మద్దతుదారుల్లో ఎంతోమంది తమ మనసు మార్చుకున్నారని చెప్పారు కర్ణాటక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ టైగర్ అశోక్‌కుమార్. వీరప్పన్ గురించి సమాచారం తెలిసినా ఎన్నోసార్లు కాల్పులు జరపకుండా శ్రీనివాస్ తమను ఆపారని ఆయన అన్నారు.
"వీరప్పన్‌ను లొంగిపోయేలా చేసేందుకు ఆయన తమ్ముడు అర్జునన్‌ను దూతగా పంపించారు శ్రీనివాస్. తాను లొంగిపోవాలని అనుకుంటున్నానని వీరప్పన్ తన తమ్ముడి ద్వారా సందేశం పంపారు. తుపాకీ లేకుండా అడవిలోకి రావాలని చెప్పారు. వీరప్పన్‌ను నమ్మిన శ్రీనివాస్ మాకు కూడా చెప్పకుండా, తుపాకీ లేకుండానే అక్కడికి వెళ్లారు. నమ్మివచ్చిన వ్యక్తిని కాల్చి చంపి, తల నరికేసి వెళ్లిపోయారు. దీంతో రెండు రాష్ట్రాల పోలీసు అధికారులకు బాగా కోపమొచ్చింది" అని ఆయన చెప్పారు.
శ్రీనివాస్ హత్యానంతరం, 1991 నవంబర్ 10న కర్ణాటక పోలీసులు వీరప్పన్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఎంతోమందిని విచారణ కోసం తీసుకెళ్లారు.
1992 మే 20న అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే రామాపురం పోలీస్ స్టేషన్‌పై వీరప్పన్ ముఠా దాడి చేసి ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు చనిపోయారు.
ఏనుగు దంతాలు విక్రయిస్తున్నట్లుగా నమ్మించి టాస్క్‌ఫోర్స్ చీఫ్‌గా ఉన్న కర్ణాటకకు చెందిన ఎస్పీ హరికృష్ణను వీరప్పన్ అడవిలోకి రప్పించారు. 1992 ఆగస్ట్ 14న హరికృష్ణ, సబ్ ఇన్‌స్పెక్టర్లు షకీల్ అహ్మద్, బెనకొండ సహా ఆరుగురిని కాల్చి చంపారు.
అనంతరం, తమిళనాడు ఫారెస్ట్ గార్డులు కూడా తమిళనాడు అడవుల్లోకి వచ్చిన వీరప్పన్ కోసం ముమ్మరంగా గాలించారు. ఈ నేపథ్యంలో, 1993 ఏప్రిల్ 9న సురైకై మదువు ప్రాంతంలో జరిగిన మందుపాతర పేలుడులో తమిళనాడు పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, సాధారణ ప్రజలు మొత్తం 22 మంది చనిపోయారు. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం కూడా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
1993 మే 24న, మాధేశ్వరన్ హిల్స్‌లోని రంగస్వామి ఒట్టు వద్ద పెట్రోలింగ్‌లో ఉన్న కర్ణాటక టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ గోపాల్ హోసూర్‌పై వీరప్పన్ ముఠా దాడి చేసింది. ఎస్సై ఊతప్పతో సహా ఆరుగురిని చంపేసి, 5 రైఫిళ్లను(ఎస్ఎల్ఆర్) ఎత్తుకెళ్లింది.
అనంతరం, కర్ణాటక ప్రభుత్వం సాయం కోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ను రంగంలోకి దింపింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మోహరించిన మరో 1500 మందితో కలిసి బీఎస్‌ఎఫ్ జవాన్లు గాలింపు ముమ్మరం చేశారు. అయితే, ఆ దట్టమైన అటవీ ప్రాంతంలో వీరప్పన్ ముఠాను పట్టుకోవడం అంత తేలిక కాదు.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నుంచి కిడ్నాప్‌లు
సమస్య ముదురుతుండడంతో వీరప్పన్.. మనుషులను కిడ్నాప్ చేయడం మొదలుపెట్టారు.
1994 డిసెంబర్ 3న, కోయంబత్తూర్ జిల్లాలోని శిరిముగై అటవీ ప్రాంతం నుంచి తమిళనాడుకు చెందిన డీఎస్పీ చిదంబరనాథన్ సహా ముగ్గురిని వీరప్పన్ కిడ్నాప్ చేశారు. పోలీస్ ఆపరేషన్, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో చర్చల అనంతరం, 26 రోజుల తర్వాత వారిని వదిలిపెట్టారు.
1995 నవంబర్ 1న, ఈరోడ్ జిల్లాలోని సెలంపూర్ అమ్మన్ అటవీ ప్రాంతం నుంచి ముగ్గురు తమిళనాడు ఫారెస్ట్ ఆఫీసర్లను వీరప్పన్ కిడ్నాప్ చేశారు. 18 రోజుల తర్వాత వారిని వీరప్పన్ నుంచి విడిపించారు.
1997 జులై 12న, కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 9 మందిని వీరప్పన్ ముఠా కిడ్నాప్ చేసింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చల అనంతరం, 47 రోజుల తర్వాత వారిని విడుదల చేశారు.
అదే ఏడాది అక్టోబర్ 9న, బందీపూర్ ఫారెస్ట్‌లో బెంగళూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రీసర్చర్ సత్యవిరాట్ మైథీ, ఫారెస్ట్ బయాలజిస్టులు సేనాని, కృపాకర్ సహా ఏడుగురిని కిడ్నాప్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం చర్చలకు నిరాకరించింది. ఆ తర్వాత, 12 రోజుల అనంతరం వారిని విడుదల చేశారు.
1998 డిసెంబర్ 20న, ఈరోడ్ జిల్లా వెల్లితిరుప్పూర్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి, ఆరుగురు పోలీసులను నిర్బంధించి, 8 తుపాకులను దోచుకెళ్లారు.

2000 సంవత్సరం జులై 30న కిడ్నాప్‌ల పరంపర తారస్థాయికి చేరింది. కన్నడ సినీ నటుడు రాజ్‌కుమార్ సహా నలుగురిని వీరప్పన్ ముఠా కిడ్నాప్ చేసింది.
అప్పటి వరకు తమిళనాడు, కర్ణాటక వాసులకు మాత్రమే తెలిసిన వీరప్పన్ ఈ కిడ్నాప్‌తో ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించారు. వీరప్పన్ 12 డిమాండ్లను నెరవేర్చేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చలు జరిపాయి.
108 రోజుల తర్వాత రాజ్‌కుమార్‌ను వీరప్పన్ విడుదల చేశారు.
అనంతరం 2002 ఆగస్ట్ 25వ తేదీ రాత్రి, కొల్లెగల్ సమీపంలోని కామకారే వద్ద ఫామ్‌హౌస్‌లో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.నాగప్పను వీరప్పన్ కిడ్నాప్ చేశారు. ఇదే ఆయన చేసిన చివరి కిడ్నాప్.
కర్ణాటక ప్రభుత్వంతో 106 రోజులపాటు చర్చలు కొనసాగాయి. అయితే, చెంగిడి అటవీ ప్రాంతంలో నాగప్ప మృతదేహం లభ్యమైంది. ఛాతీలో బుల్లెట్ గాయంతో నాగప్ప మరణించినట్లు పోస్ట్‌మార్టంలో తేలింది. అక్కడ పెద్ద సంఖ్యలో ఏకే 47 క్యాట్రిడ్జ్‌లు కూడా దొరికాయి. అయితే, నాగప్పను ఎవరు హతమార్చారనే దానిపై ఎవరికీ స్పష్టమైన సమాధానం దొరకలేదు.
జీవితంలో ఎక్కువ భాగం అడవిలోనే ఉన్న వీరప్పన్.. ఏనుగు దంతాల స్మగ్లింగ్, గంధపు చెక్కల స్మగ్లింగ్, కిడ్నాప్‌లు చేసి, చివరకు పోలీసుల చేతిలో హతమై అక్టోబర్ 18 నాటికి 21 ఏళ్లు పూర్తయ్యాయి. అయినా, ఇప్పటికీ రెండు రాష్ట్రాల ప్రజలు వీరప్పన్ గురించి చర్చించుకుంటూనే ఉన్నారు.
(ఈ కథనం వీరప్పన్‌తో నా(శివసుబ్రమణియన్) సొంత అనుభవాలు, తమిళనాడు కర్ణాటక పోలీసు పత్రాలు, అందులో పేర్కొన్న సమాచారం ఆధారంగా రాసినది.)














