సోమనాథ్ టెంపుల్: గజనీ మహమూద్ ఈ ఆలయం నుంచి '6 టన్నుల బంగారాన్ని' ఎలా దోచుకున్నాడంటే....

సోమనాథ్ ఆలయం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ కోసం

అఫ్గానిస్తాన్‌లోని గజనీ నగరాన్ని క్రీస్తుశకం 9వ శతాబ్దంలో పాలించిన రాజు సుబుక్ తిగీన్ 997లో మరణించాడు. ఆ తరువాత ఆయన కొడుకు మహమూద్ సింహాసనాన్ని అధిష్టించాడు.

నిజానికి, సుబుక్ తిగీన్ తన వారసుడిగా మహమూద్‌ను ఎంచుకోలేదు. తన చిన్న కొడుకు ఇస్మాయిల్ వారసుడవ్వాలని ఆయన కోరుకున్నాడు.

సుబుక్ తిగీన్ మరణం తర్వాత, వారసత్వ నిర్ణయం ఖడ్గంతో జరిగింది. అంటే సింహాసనంపై ఎవరు కూర్చోవాలో యుద్ధంతో నిర్ణయించారు.

తండ్రి మరణించినప్పుడు మహమూద్‌ ఖొరాసాన్‌లో ఉన్నాడు. అక్కడినుంచి తన తమ్ముడికి ఒక లేఖ రాశాడు. తన తమ్ముడు సింహాసనాన్ని వదిలిపెడితే, బల్ఖ్, ఖొరాసాన్ ప్రాంతాల గవర్నర్‌గా నియమిస్తానని మహమూద్ వాగ్దానం చేశాడు.

అయితే, ఇస్మాయిల్ ఈ ప్రతిపాదనను తిరస్కరించాడు. తరువాత మహమూద్ తన సైన్యంతో గజనీపై దండెత్తి ఇస్మాయిల్‌ను ఓడించి, జైల్లో పెట్టాడు. 27 ఏళ్ల వయస్సులో మహమూద్ గజనీ సింహాసనాన్ని అధిష్టించాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మహమూద్ గజనీ, భారతదేశం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహమూద్ గజనీ భారతదేశంపై 17 సార్లు దాడి చేశాడు.

సంపదను దోచుకోవడానికే భారత్‌పై దాడి

తన 32 ఏళ్ల పాలనలో, మహమూద్ భారతదేశంపై 17 సార్లు దండెత్తాడు.

‘‘భారతదేశంలోని హిందూ దేవాలయాలు సంపదతో నిండి ఉన్నాయి. వాటిని ధ్వంసం చేయడం మహమూద్ మతపరమైన ఆసక్తిని తృప్తిపరచడంతోపాటు, అతనికి అపారమైన సంపదను తెచ్చిపెట్టింది. మహమూద్ దాడుల ప్రధాన ఉద్దేశ్యం ఇస్లాంను వ్యాప్తి చేయడం కాదు" అని అబ్రహం ఎరాలీ తన 'ది ఏజ్ ఆఫ్ రాత్ ' పుస్తకంలో రాశారు.

"మహమూద్ దండయాత్రల సమయంలో తమ ప్రాణాలను, ఆస్తులను కాపాడుకోవడానికి ఇస్లాం మతంలోకి మారినవారు, ఆయన గద్దె దిగాక, తిరిగి సొంత మతానికి మారారు. భారతదేశంపై ఆయన దండయాత్రలు మతపరంగా చాలా తక్కువ ప్రభావాన్ని చూపాయి" అని ప్రసిద్ధ యాత్రికుడు అల్-బరూనీ రాశారు.

అల్-బిరూనీ

ఫొటో సోర్స్, AFGHAN POST

ఫొటో క్యాప్షన్, అల్-బరూనీ అనే రచయిత భారత్‌పై మహమూద్ గజనీ చేసిన దాడుల గురించి విస్తృత వివరాలను అందించారు.

మహమూద్ తన లక్ష్యాలను సాధించడానికి మతాన్ని కూడా ఉపయోగించుకున్నాడు. సైన్యంలోకి పెద్ద సంఖ్యలో హిందూ సైనికులను నియమించుకోవడానికి ఆయన సంకోచించలేదు.

ఆశ్చర్యంగా అనిపించినా, వాయువ్య భారతదేశంలోని ఘజ్నావిడ్ సుల్తానేట్ నాణేలపై అరబిక్‌తో పాటు శారదా లిపిని కూడా ఉపయోగించారు.

"సుల్తాన్ తన ఇస్లామిక్ హోదాతోపాటు, నంది, శ్రీ సామంత్ దేవ్ పేర్లు కూడా ఈ నాణేలపై ఉన్నాయి" అని పి.ఎల్.గుప్తా తన 'కాయిన్స్' అనే పుస్తకంలో రాశారు.

"మహమూద్ మధ్యఆసియాకు పంపిన సైన్యంలో తుర్కియే దేశీయుల, ఖిల్జీలు, అఫ్గాన్లు, భారతీయులు కూడా ఉన్నారు. శతాబ్దాల నాటి ముస్లిం రాజ్యమైన ముల్తాన్‌ను నాశనం చేయడంలో, అక్కడ నివసిస్తున్న ఇస్మాయిలీలను పెద్ద సంఖ్యలో ఊచకోత కోయడానికి ఆయన కొంచెం కూడా సంకోచించలేదు. వారి మసీదులను అపవిత్రం చేయడమే కాకుండా వారిపై 2 కోట్ల దిర్హామ్‌ల జరిమానా కూడా విధించాడు" అని అల్-ఉత్‌బీ తన 'తారిఖ్-ఎ-యామిని' పుస్తకంలో రాశారు.

మహ్మద్ గజనీ, స్టాంపు, అఫ్ఘాన్ పోస్ట్

ఫొటో సోర్స్, AFGHAN POST

ఫొటో క్యాప్షన్, మహ్మద్ గజనీపై స్టాంపును విడుదల చేసిన అఫ్ఘాన్ పోస్ట్

దోపిడీతోపాటు, బానిసలుగా మార్చిన వైనం

మహమూద్ సైనికులు విజయం కంటే దోపిడీపైనే ఎక్కువ ఆసక్తి చూపేవారు. చాలాసార్లు, భారత్‌పై జరిపిన దాడుల సమయంలో, వారు కలలో కూడా ఊహించని సంపదను కనిపెట్టి, కొల్లగొట్టేవారు.

నిధిని దోచుకోవడమే కాకుండా, పెద్ద సంఖ్యలో భారతీయ పురుషులు, స్త్రీలు, పిల్లలను బానిసలుగా తీసుకెళ్లేవారు.

బానిసలను వ్యాపారులకు అమ్మేవారు. ఆ రోజుల్లో ఆలయాలున్న పట్టణాలను లక్ష్యంగా చేసుకునేవారు. ఎందుకంటే వాటి దగ్గర అపారమైన సంపద ఉండేది. ఈ దోపిడీని గజనీ ప్రభుత్వాన్ని నడపడానికి, సైనికులకు జీతాలకు ఉపయోగించేవారు.

ఊచకోత ఎంతవరకు నిజం?

మహమూద్‌ను కీర్తించడానికి భారతదేశంలో అతని వల్ల జరిగిన విధ్వంసాన్ని అతిశయోక్తి చేసి చెప్పే ధోరణి కూడా అతనికాలం నాటి చరిత్రకారులలో ఉంది.

మహమూద్ శక్తివంతుడిగా చూపించడానికి ఆయన కాలపు చరిత్రకారులు భారతదేశంలో ఆయన సృష్టించిన విధ్వంసాన్ని ఎక్కువగా చూపించేవారు. ఆయన శక్తివంతుడని చెప్పడం వారి లక్ష్యం.

"ఒక దాడిలో 15,000 మంది, మరొక దాడిలో 20,000 మంది, సోమనాథ్ దాడిలో 50,000 మంది మరణించారని రాశారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే చాలామందిని కత్తులు, విల్లులు, బాణాలతోనే చంపేశారంటే నమ్మబుద్ధి కాదు. ఇది అతిశయోక్తి అని కొట్టిపారేసినా, భయంకరమైన మహమూద్ దాడులను విస్మరించలేం" అని అబ్రహం ఇరాలి రాశారు.

ఆయన తన శత్రుసైనికులను మాత్రమే చంపలేదు. పెద్ద సంఖ్యలో పౌరులు కూడా బలయ్యారు. స్త్రీలు, పిల్లలను మాత్రమే విడిచిపెట్టారు. అది కూడా అన్ని సందర్భాల్లో కాదు. వారిని కూడా బానిసలుగా చేసి పురుషుల మాదిరిగానే గజనీకి తీసుకెళ్లారు.

అబ్రహం ఎరాలీ రాసిన ది ఏజ్ ఆఫ్ రాత్

ఫొటో సోర్స్, PENGUIN

ఫొటో క్యాప్షన్, అబ్రహం ఎరాలీ రాసిన ది ఏజ్ ఆఫ్ రాత్

"నాకు భారత్‌లో స్థిరపడాలని లేదు"

ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇతర ఆక్రమణదారుల్లా మహమూద్‌కు ఈ భూభాగంపై కోరిక లేదు. ఆయన కోరుకుంటే, ఉత్తర భారతదేశంలోని పెద్ద ప్రాంతాలను జయించగలిగేవాడు. కానీ సామ్రాజ్యాన్ని నిర్మించే ఓపిక ఆయనకు లేదు.

భారతదేశానికి ప్రవేశ ద్వారం అని పిలిచే పంజాబ్, సింధ్ తప్ప, భారతదేశంలోని మరే ఇతర ప్రాంతాన్నీ మహమూద్ స్వాధీనం చేసుకోలేదు.

"భారతదేశంలో మహమూద్ చేసిన పోరాటాలన్నీ సముద్రపు దొంగల దాడుల లాంటివి. అతను తుపానులా ముందుకు సాగాడు. భీకర యుద్ధాలు చేశాడు, దేవాలయాలను ధ్వంసం చేశాడు, విగ్రహాలను పగలగొట్టాడు, వేలమందిని బానిసలుగా చేసుకున్నాడు, అపారమైన సంపదను దోచుకుని గజనీకి తిరిగి వచ్చాడు. అతనికి భారతదేశంలో స్థిరపడాలనే కోరిక లేదు. బహుశా దీనికి ఒక కారణం ఇక్కడి వేడి వాతావరణం కావచ్చు" అని బ్రిటిష్ చరిత్రకారుడు వోల్సేలీ హేగ్ తన 'కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా' పుస్తకంలో రాశారు.

మహమూద్ గజనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహమూద్ భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని స్థాపించాలని కోరుకోలేదు.

30 వేలమంది ఉన్న అశ్విక దళంతో దాడి

భారతదేశంలో మహమూద్ చేసిన అతిపెద్ద, చివరి పోరాటం సోమనాథ్ దేవాలయంపై జరిగింది.

"సోమనాథ్ ఆలయాన్ని రాతితో నిర్మించారు. దీన్ని మహమూద్ దాడికి దాదాపు 100 సంవత్సరాల పూర్వం కట్టారు. ఇది మూడువైపులా సముద్రంతో నిండి ఉన్న కోటలాంటి భవనం లోపల ఉంది" అని సోమనాథ్ ఆలయం గురించి అల్-బరూనీ వర్ణించారు.

"సోమనాథ్ ఆలయ పైకప్పు పిరమిడ్ ఆకారంలో ఉంది. ఇది 13 అంతస్తుల ఎత్తులో ఉంది. దాని గోపురాలు బంగారంతో తయారు చేశారు, దూరం నుంచి చూసినా మెరుస్తూ కనిపిస్తాయి. దాని ఫ్లోరింగ్ టేకు కలపతో తయారు చేశారు" అని రాయల్ ఆసియాటిక్ సొసైటీలో ప్రచురితమైన 'సోమనాథ్ అండ్ ది కాంక్వెస్ట్ బై సుల్తాన్ మహమూద్' అనే వ్యాసంలో మొహమ్మద్ నజీమ్ రాశారు.

అక్టోబర్‌ 1024లో, మహమూద్ 30,000 మంది ఉన్న అశ్విక దళంతో సోమనాథ్‌పై దాడి చేయడానికి బయలుదేరాడు. దోపిడీ కోసం ఆశపడిన మరికొంతమంది, దారిలో ఆయనతో కలిశారు. ఆయన నవంబర్‌లో ముల్తాన్‌కు చేరుకున్నాడు. రాజస్థాన్ ఎడారిని దాటి గుజరాత్‌లోకి ప్రవేశించాడు.

ఈ యాత్రలో వందలాది ఒంటెలు ప్రయాణానికి నీరు, ఆహారాన్ని మోసుకెళ్లాయి. ప్రతి సైనికుడు కొన్ని రోజులకు సరిపడా ఆహారాన్ని, ఆయుధాలను తీసుకెళ్లాడు.

పాత సోమనాథ్ ఆలయం

ఫొటో సోర్స్, GUJARAT TOURISM

ఫొటో క్యాప్షన్, సోమనాథ్ ఆలయం ఇలా ఉండేది.

లక్షలమంది యాత్రికులు

మహమూద్ జనవరి 1025లో సోమనాథ్ చేరుకున్నాడు.

"సోమనాథ్ విగ్రహం దేవాలయ మధ్యభాగంలో ఉండేది. ఈ ఆలయం హిందూ మతంలో చాలా ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. చంద్రగ్రహణాల సమయంలో, లక్షలమంది హిందువులు తీర్థయాత్ర కోసం ఇక్కడికి వచ్చేవారు. ఇది చాలా సంపన్నమైన ఆలయం. ఇక్కడ శతాబ్దాలుగా నిధులు పోగుపడుతూ వచ్చాయి" అని ఆ కాలపు ప్రసిద్ధ చరిత్రకారుడు జకారియా అల్-కజ్విని పేర్కొన్నారు.

"ఇక్కడి నుండి 1200 కిలోమీటర్ల దూరం నుండి పవిత్ర గంగా నది నీటిని తీసుకువచ్చి, ప్రతిరోజు సోమనాథ్ విగ్రహానికి అభిషేకం చేసేవారు. పూజలు, యాత్రికులకు సేవ చేయడానికి అక్కడ వెయ్యి మంది బ్రాహ్మణులను నియమించారు. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర 500 మంది యువతులు పాటలు పాడుతూ నృత్యం చేసేవారు" అని రాశారు.

సోమనాథ్, దాడి

ఫొటో సోర్స్, Getty Images

సోమనాథ్ పై దాడి

మహమూద్ దళాలు మొదట నగరంపై బాణాలతో దాడి చేశాయి. తరువాత తాళ్ల నిచ్చెనలను ఉపయోగించి నగర ప్రాకారాలపైకి ఎక్కి వీధులలో విరుచుకుపడ్డారు. ఈ హింస సాయంత్రం వరకు కొనసాగింది. తర్వాత, మహమూద్ దళాలు కావాలని అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయాయి.

మరుసటి రోజు ఉదయం వారు నగరంపై తిరిగి దాడిచేయడం మొదలుపెట్టారు.

"ఈ యుద్ధంలో 50,000 మందికి పైగా స్థానిక ప్రజలు మరణించారు. ఆ తర్వాత, మహమూద్ ఆలయంలోకి ప్రవేశించాడు. మొత్తం ఆలయం 56 చెక్క స్తంభాలపై ఉంది. కానీ అక్కడి శిల్పకళలో అతిపెద్ద అద్భుతం...ఆలయ ప్రధాన విగ్రహం ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో వేలాడుతూ ఉండటం. మహమూద్ ఆశ్చర్యంగా విగ్రహాన్ని చూశాడు" అని కజ్విని రాశారు.

"ఆలయంలోని ప్రధాన దేవుడు శివుడు. భూమి నుంచి రెండు మీటర్ల ఎత్తులో ఒక రాతి శివలింగాన్ని ఉంచారు. దాని పక్కన బంగారం, వెండితో చేసిన మరికొన్ని విగ్రహాలున్నాయి" అని ఆలయాన్నివర్ణిస్తూ అల్-బరూనీ రాశారు.

భారతదేశం, అల్-బిరుని, పుస్తకం

ఫొటో సోర్స్, National Book Trust

ఫొటో క్యాప్షన్, భారతదేశంపై అల్-బిరుని పుస్తకం

‘గర్భగుడిని తవ్వేశారు’

మహమూద్ విగ్రహాన్ని పగలగొట్టినప్పుడు, లోపల ఉన్న ఖాళీ స్థలం విలువైన రత్నాలతో నిండి ఉంది. ఆ ఖజానా సంపదను చూసి మహమూద్ ఆశ్చర్యపోయాడట.

అక్కడ నలభైమంది బరువుండే బంగారు గొలుసుతో వేలాడుతున్న ఒక మహాగంట ఉంది. దాన్ని విరిచేయించాడు. తలుపులు, తలుపు ఫ్రేములు, పైకప్పు నుంచి వెండి రేకులను తొలగించాడు. ఇంకా సంతృప్తి చెందని మహమూద్, నిధులేమైనా దాచారేమోనని గర్భగుడినంతా తవ్వించాడని బరూనీ రాశారు.

‘విగ్రహాన్ని ముక్కలు చేసి...’

"మహమూద్ తనతో పాటు సోమనాథ్ విగ్రహాలను గజనీకి తీసుకెళ్లాడు. అక్కడ వాటిని విరగొట్టించి నాలుగు భాగాలు చేయించాడు. ఒక భాగాన్ని శుక్రవారం ప్రార్థనల స్థలంలో ఉంచారు. రెండో భాగాన్ని రాజభవనం ప్రవేశద్వారం వద్ద ఉంచారు. మూడో భాగాన్ని మక్కాకు, నాలుగో భాగాన్ని మదీనాకు పంపాడు" అని చరిత్రకారుడు సిరాజ్ 'తబకత్-ఎ-నస్రీ' పుస్తకంలో రాశారు.

సోమనాథ్ నుంచి మహమూద్ దోచుకున్న బంగారం 6 టన్నులు. అక్కడ 15 రోజులు గడిపిన తర్వాత, దోచుకున్న సంపదతో గజనీకి బయలుదేరాడు. కచ్, సింధ్ మీదుగా మొదలైన తిరుగు ప్రయాణం ఇబ్బందులతో నిండిపోయింది.

1026 వసంతకాలంలో గజనీకి తిరిగి వచ్చాడు.

‘‘మహమ్మద్ దండయాత్రలు భారతదేశంలో ఆర్థిక విధ్వంసానికి కారణమయ్యాయి. ప్రారంభ దాడులు ప్రధానంగా పశువులను దోచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. తరువాత, ఈ దాడుల ఉద్దేశ్యం నగర సంపదను దోచుకోవడం, యుద్ధ ఖైదీలను బానిసలుగా అమ్మడం, లేదా సైన్యంలోకి తీసుకోవడంవైపు మళ్లింది" అని అల్-బరూనీ రాశారు.

స్వాతంత్యం, ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, కె.ఎం. మున్షీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్వాతంత్యం తరువాత, ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, కె.ఎం. మున్షీ పర్యవేక్షణలో ఆలయ పునరుద్ధరణకు ప్రయత్నాలు జరిగాయి.

మహమూద్ తర్వాత కూడా సోమనాథ్ ఆలయం ధ్వంసమైంది

మహమూద్ తన జీవితంలోని చివరి రెండు సంవత్సరాలు తీవ్ర అనారోగ్యంతో గడిపాడు. 33 సంవత్సరాలు పరిపాలించిన తరువాత, ఏప్రిల్ 1030లో 59 ఏళ్ల వయసులో మరణించాడు.

మహమూద్ కాలేయ వ్యాధితో మరణించాడని 15వ శతాబ్దపు ఇరానియన్ చరిత్రకారుడు ఖొండమీర్ పేర్కొన్నారు. ఆయన మరణం తరువాత, సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించడానికి మొదటి ప్రయత్నం చాళుక్య రాజవంశానికి చెందిన రాజు ఒకటో భీముడి నాయకత్వంలో ప్రారంభమైంది.

స్వాతి బిష్ట్ తన 'సోమనాథ్ టెంపుల్ విట్నెస్ టు టైమ్ అండ్ ట్రయంఫ్' పుస్తకంలో ఇలా రాశారు.

"బూడిద నుంచి ఫీనిక్స్ పక్షి పుట్టినట్టుగా కొత్త ఆలయాన్ని పునర్మించారు. అందులో జ్యోతిర్లింగాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. కానీ 12వ శతాబ్దంలో, ఘోర్ రాజవంశానికి చెందిన మొహమ్మద్ ఘోరీ మరోసారి ఆలయాన్ని శిథిలావస్థకు చేర్చాడు"

"కొన్ని శతాబ్దాలుగా సోమనాథ్ ఆలయాన్ని అనేకసార్లు పునర్నిర్మించినప్పటికీ కొంతమంది రాజులు మళ్లీ శిథిలావస్థకు చేర్చేవారు. సోలంకి రాజవంశానికి చెందిన రాజు కుమార్‌పాల్ 12వ శతాబ్దంలో మరోసారి సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టాడు. 18వ శతాబ్దంలో, ఇండోర్ మహారాణి అహల్యాబాయి పర్యవేక్షణలో సోమనాథ్ ఆలయాన్ని తిరిగి కట్టారు"

రాణి అహల్యాబాయి హోల్కర్‌, తపాలా స్టాంపు

ఫొటో సోర్స్, INDIA POST

ఫొటో క్యాప్షన్, రాణి అహల్యాబాయి హోల్కర్‌పై తపాలా స్టాంపు విడుదల చేశారు.

స్వాతంత్ర్యం తర్వాత సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, సోమనాథ్ ఆలయాన్ని నిర్మించాలనే ప్రయత్నం ప్రారంభమైంది.

భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, కె.ఎం. మున్షీ పర్యవేక్షణలో, ఆలయ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరిగాయి.

స్వాతంత్య్రం వచ్చిన మూడు నెలల తర్వాత సర్దార్ పటేల్ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు.

"ఈ స్థలంపై దాడి చేసిన వారు చేసిన అవమానం గతానికి సంబంధించిన విషయం. ఇప్పుడు సోమనాథ్ పాత వైభవాన్ని పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు అది కేవలం ప్రార్థనా మందిరంగా మాత్రమే కాకుండా సంస్కృతికి, మన ఐక్యతకు చిహ్నంగా ఉద్భవిస్తుంది" అంటూ అక్కడ ఆయన ప్రసంగించారు.

కానీ ఈ ఆలయం పూర్తయ్యేలోపే అంటే 1950 డిసెంబర్ 15న ఆయన మరణించారు.

భారతదేశం, తొలి ఉప ప్రధానమంత్రి, సర్దార్ పటేల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ పటేల్

నెహ్రూ పట్ల వ్యతిరేకత

పటేల్ తర్వాత, ఆలయ నిర్మాణ బాధ్యతను కె.ఎం. మున్షీ తీసుకున్నారు.

1951 మే 11న భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అయితే, అప్పటి ప్రధానమంత్రి సూచనను పట్టించుకోకుండా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారతదేశ మొదటి రాష్ట్రపతి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జవహర్‌లాల్ నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ (కుడి చివర)

రాజేంద్ర ప్రసాద్ ఈ వేడుకలో పాల్గొనడాన్ని అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వ్యతిరేకించారు. లౌకిక దేశానికి అధిపతి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనకూడదని అన్నారు.

నెహ్రూ మాత్రమే కాదు, ఉపరాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్, భారత మాజీ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి కూడా దీన్ని వ్యతిరేకించారు.

"సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవం గురించి మీరు వార్తాపత్రికలలో వచ్చిన వార్తలను చదివి ఉంటారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని, భారత ప్రభుత్వానికి దీనితో ఎటువంటి సంబంధం లేదని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి" అని 1951 మే 2న ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో నెహ్రూ పేర్కొన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)