ఇక్ష్వాకులు: రాముడి వంశీకులమని కొందరు ఎందుకు చెప్పుకుంటున్నారు? చరిత్ర, పురాణాల్లో ఏముంది...

ఇక్ష్వాకు వంశం

ఫొటో సోర్స్, @ShriRamTeerth

    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"ఇక్ష్వాకు కుల తిలకా.. ఇకనైన పలుకవే రామచంద్రా.." అంటూ సాగేభక్త రామదాసు కీర్తన తెలుగు వారికి బాగా పరిచితం. రాముణ్ణి తరచుగా ఇక్ష్వాకు వంశీకుడిగా పురాణాల్లో వర్ణిస్తూ ఉంటారు. తాజాగా మరోసారి ఇక్ష్వాకు వంశం పేరు వార్తల్లోకి వచ్చింది.

''భూమండలం అంతా ఇక్ష్వాకులదా కాదా? ఇక్ష్వాకుల గోత్రం ఏంటి?'' అంటూ చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్‌ను బెదిరిస్తూ 'రామరాజ్యం' సంస్థకు చెందిన వీర రాఘవ రెడ్డి మాట్లాడిన వీడియో ఈ మధ్య వైరల్ అయింది.

"ఇక్ష్వాకుల గోత్రం కూడా నీకు తెలియదు" అంటూ రంగరాజన్‌ను విమర్శించారు రాఘవ రెడ్డి.

ఇంతకీ ఎవరీ ఇక్ష్వాకులు? ఏంటి వారి వంశం? అనేవి అర్థం కావాలంటే మూడు విషయాలు తెలియాలి. ఈ పదం మూడు చోట్ల ప్రముఖంగా వినిపిస్తుంది.

  • ఒకటి హిందూమతంలో రాముడి వంశం పేరిట.
  • రెండోది ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల చరిత్రలో ఆంధ్ర ఇక్ష్వాకులు అనే రాజవంశం.
  • మూడోది జైన మతంలో మొదటి తీర్థంకరుడైన రిషభనాథుడి మరో పేరు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీరాముడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీరాముని వంశ వృక్షం గురించి రఘువంశం కావ్యంలో వర్ణించారు.

రాముని వంశం

హిందూ పురాణాల ప్రకారం రాముడి వంశాన్ని ఇక్ష్వాకు వంశం అంటారు. సూర్యుడి నుంచి ఆ వంశం ఏర్పడింది కాబట్టి సూర్య వంశం అని, రఘు అనే గొప్ప మహారాజు కూడా ఆ వంశీకుడే కాబట్టి రఘువంశం అని కూడా అంటారు.

పురాణాల ప్రకారం.. రాముడి వంశంలో మొట్టమొదటి పాలకుడు అంటే అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించిన వ్యక్తి ఇక్ష్వాకుడు. ఆ ఇక్ష్వాకుడు వైవస్వత మనువు కొడుకు. అలా వారి క్రమంలో 80వ రాజు రాముడు.

ముచుకుంద, అంబరీష, భరత, బాహుబలి, హరిశ్చంద్ర, దిలీప, సగర, రఘు, దశరథ...ఇలా వీరంతా రాముడి కంటే ముందు ఇక్ష్వాకు వంశపు రాజులు.

''శ్రీరాముని వంశ వృక్షాన్ని రఘువంశ మహాకావ్యంలో వర్ణించారు. అది కాళిదాసు రాసిన సంస్కృత మహా కావ్యం. ఇక ఇక్ష్వాకుల వంశ మొదటి రాజుగా ఇక్ష్వాక చక్రవర్తే ఉంటారు. ఇక్ష్వాకు వంశంలో చివరి రాజుగా బృహద్బలుడి పేరు కనిపిస్తుంది. ఆయనే మహాభారతంలో కూడా కనిపిస్తారు. బృహద్బలుడు కౌరవుల తరపున భారత యుద్ధంలో పాల్గొన్నాడు'' అని వాస్తు జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త పాలెపు రాజేశ్వర శర్మ బీబీసీతో చెప్పారు.

రామాయణంతో పాటు వేదాల్లో కూడా ఇక్ష్వాకు పదం ప్రస్తావన ఉంది. వీటన్నింటిని హిందువుల విశ్వాసాలతో పాటు రామాయణం, భాగవతం, ఇతర పురాణాలు, రఘువంశం కావ్యం పేర్కొన్నాయి.

చరిత్ర పుస్తకాలు

ఫొటో సోర్స్, Getty Images

చరిత్రలో ఇక్ష్వాకులు

హిందూ గ్రంథాలతో సంబంధం లేకుండా చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే, భారతదేశంలో కొన్ని రాజ కుటుంబాలు ఈ పేరును ఉపయోగించుకున్నాయి.

అయోధ్య ప్రాంతాన్ని క్రీస్తు పూర్వం 530 ప్రాంతంలో పాలించిన ప్రసేన్‌జిత్ అనే రాజు ఇక్ష్వాకు వంశీకుడని, అలాగే క్రీస్తు పూర్వం 345 ప్రాంతంలో పాలించిన సుమిత్రుడనే రాజు సూర్య వంశీకుడని చెప్పుకున్నట్టు కొందరు చరిత్రాకారులు రాశారు.

అయితే ఈ ఇద్దరూ హిందూ పురాణాల్లోని ఇక్ష్వాకు వంశీకులే అనడానికి స్పష్టమైన ఆధారం లేదు.

తెలుగునాట కూడా ఓ రాజ వంశానికి ఈ పేరు ఉంది. కృష్ణా నదీ తీరంలో శాతవాహనుల తరువాత పాలించిన రాజులు ఆంధ్ర ఇక్ష్వాకులు. వీళ్లనే విజయపురి ఇక్ష్వాకులు అని కూడా అంటారు.

క్రీస్తు శకం 3-4 శతాబ్దాల్లో వీరు పాలించారని ఎక్కువ మంది చరిత్రకారులు చెప్పారు. ప్రస్తుత పల్నాడు జిల్లా మాచర్ల దగ్గర నాగార్జునకొండ వీరి రాజధాని. ఆంధ్ర, తెలంగాణల్లో పలు ప్రాంతాలను వీరు పాలించారు.

రాముడి గురించి చెప్పే ఇక్ష్వాకు వంశానికీ వీరికీ సంబంధం ఉన్నట్టు పురాణపరంగా గానీ, చరిత్రపరంగా గానీ ఆధారాలు లేవు.

''శాతవాహనుల తరువాత ఆంధ్ర ఇక్ష్వాకులు తెలుగునేలను పాలించారు. హిందూ పురాణాల్లో ఇక్ష్వాకులు, వీరూ ఒకరని చెప్పడానికి ఏ ఆధారమూ లేదు'' అని చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్ బీబీసీతో చెప్పారు .

"నేటికి 2500 ఏళ్ల క్రితమూ, 1700 సంవత్సరాల కిందటా పాలించిన కొందరు రాజులు తమను తాము ఇక్ష్వాకులు అని చెప్పుకున్నారు. కానీ చరిత్రలోని ఇక్ష్వాకులు, పురాణాల్లోని ఇక్ష్వాకులు ఒకరే అని చెప్పే ఆధారాలు లేవు. అసలు హిందూ పురాణాల్లో ఇక్ష్వాకులుగా చెబుతున్నవారు నిజంగా చరిత్రలో ఉన్నారా? అనే దానికి సైతం స్పష్టమైన ఆధారాలు లేవు. ఇక ఇన్ని వందల సంవత్సరాల తరువాత ఇక్ష్వాకు వంశం వారు ఇంకా ఉన్నారా అంటే సాక్ష్యాలు, ఆధారాలు ఉండవు" అంటున్నారు చరిత్రకారులు హరగోపాల్.

బౌద్ధ క్షేత్రం

ఫొటో సోర్స్, Lakkoju Srinivas/BBC

జైన, బౌద్ధ మతాల్లో ఇక్ష్వాకులు

జైన సాహిత్యంలోని స్వయంభూ స్తోత్రంలో 1-3-3 శ్లోకంలో 'భగవంతుడైన రిషభదేవుడు ఇక్ష్వాకు వంశానికి మొదటి రాజు' అని రాశారు. ఆయన్నే ఇక్ష్వాకుడు అని జైనులు పిలుస్తారు.

రిషభదేవుడు లేదా రిషభనాథుడు జైనుల్లో మొదటి తీర్థంకరుడు. ఈయన్ను జైన మత స్థాపకుడిగా పరిగణిస్తారు.

ఇక బౌద్ధంలో కూడా ఇక్ష్వాకు వర్ణనలు ఉన్నాయి. భారత్‌తో పాటు టిబెట్ బౌద్ధ సంప్రదాయాల్లో ఇక్ష్వాకుకు సమానార్థకమైన పదాలతో రాజ వంశాల వర్ణన బౌద్ధ సాహిత్యంలో కనిపిస్తుంది.

ఇక్ష్వాకులు ఇప్పుడు ఉన్నారా?

''ఏ కులం వారైనా ఇక్ష్వాకులు అని చెప్పడానికి ఏ ఆధారమూ లేదు. ఇక్ష్వాకు వంశం ఇప్పటి వరకూ కొనసాగి, ఆ వంశం వారు ఎవరో ఒకరు ఇంకా ఉన్నారనడానికి చెప్పే అవకాశం లేదు. ఎవరైనా చెప్పుకున్నా దానికి సాక్ష్యం ఉండదు. ఈ మధ్య కాలంలో చాలామంది తమ కులం, కుటుంబ గతం ఘనమైనది అని చెప్పుకునే క్రమంలో రాజరికాన్ని ఆపాదించుకుంటున్నారు. వారికి నిజంగా ఘన చరిత్ర ఉందా లేక లేనిదాన్ని ఘనంగా చెప్పుకుంటున్నారా అన్నది చూడాలి'' అన్నారు హరగోపాల్.

''ఒకసారి ఒకరు రాజరికం పొందాక తమను తాము కాని, లేదా వారి ఆస్థానంలోని వారు కాని ఈ రాజులకు దైవత్వం ఆపాదించడం, సూర్య, చంద్ర వంశాల వారంటూ కీర్తించడం భారత చరిత్రలో బాగా కనిపిస్తుంది. దీన్నే శాసనాల్లో, గ్రంథాల్లో రాజ ప్రశస్తి అంటారు'' అని శ్రీరామోజు హరగోపాల్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)