'బ్రేకప్ తర్వాత ఏ అమ్మాయైనా మందు తాగేసి, గడ్డం పెంచుకుందా చారూ' అంటూ నవీన్ పొలిశెట్టి చేసిన అల్లరి అలరించిందా?

ఫొటో సోర్స్, FB/Sithara Entertainments
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
నవీన్ పొలిశెట్టికి కామెడీ బాగా పండిస్తాడనే పేరుంది.
దీనికి కారణం.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిసెస్ శెట్టి సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్.
సంక్రాంతికి అనగనగా ఒక రాజు అంటూ థియేటర్‌లోకి వచ్చాడు. మరి నవ్వులు పండాయా?


ఫొటో సోర్స్, FB/Sithara Entertainments
ఆస్తులు లేని పిల్ల జమిందారు..
కథ ఏమంటే రాజు (నవీన్) గౌరవపురం జమిందారు మనవడు. తాతతో పాటు ఆస్తులు కూడా పోయాయి. డాంభికం మాత్రం మిగిలింది. ఎలాగైనా డబ్బున్న అమ్మాయిని చేసుకుని కోటీశ్వరుడు కావాలనేది రాజు ప్లాన్.
పెద్దపాలెం జమిందారు భూపతిరాజు (రావు రమేష్) కూతురు చారులత (మీనాక్షి చౌదరి). ఆమెని చేసుకుంటే డబ్బు కష్టాలు పోతాయని రాజు ప్లాన్. ఆమెను ప్రేమలో పడేయడానికి ఆపరేషన్ చారులత అని రకరకాల ఎత్తులు వేస్తాడు.
అనుకున్నట్టుగానే ప్రేమలో పడేస్తాడు. పెళ్లి గ్రాండ్‌గా జరుగుతుంది. ఫస్ట్ నైట్ మామ నుంచి ఒక ఉత్తరం అందుతుంది. అందులో భయంకర నిజం ఉంటుంది. అదేమిటి?
రాజకీయాల్లో ఓనమాలు తెలియని రాజు, పంచాయతీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది. ఇది మిగతా కథ.

ఫొటో సోర్స్, FB/naveeen polishetty
ఆ రెండింటినీ మిక్స్ చేసి సక్సెస్..
ఈ సినిమాలో కొత్త కథేమీ లేదు. కానీ కథనం, డైలాగులతో రక్తి కట్టించారు. సినిమా మొత్తం నవీన్ భుజాలపైనే నడుస్తుంది. వన్ మ్యాన్ షో. చూస్తున్నపుడు ఈవీవీ సినిమాలు గుర్తుకొస్తాయి. రాజేంద్రప్రసాద్, అల్లరి నరేష్ తరహా కామెడీకి నెక్ట్స్ వెర్షన్ నవీన్ పొలిశెట్టి.
పెద్దగా కష్టపడకుండా, తొడమీద మచ్చ ఉన్న అమ్మాయిని చేసుకునే లేడీస్ టైలర్, మామ ఆస్తి మీద బతికేయాలనుకునే ఆ ఒక్కటి అడక్కు, నాని పిల్ల జమిందార్ ఇవన్నీ ఇదే జానర్.
ఎలక్షన్ కామెడీ మీద కూడా చాలా వచ్చాయి. కె.విశ్వనాథ్ గతంలో ప్రెసిడెంట్ పేరమ్మ తీశారు. నిజానికి అనగనగా ఒకరాజు రెండు వేర్వేరు కథల సినిమా. ఇంటర్వెల్‌తో వచ్చిన టర్నింగ్ పాయింట్‌తో సెకెండాఫ్ లాగడం కష్టం. అందుకని పొలిటికల్ కామెడీ ఎంచుకున్నారు. రెండింటిని మిక్స్ చేసి విజయం సాధించారు.

ఫొటో సోర్స్, FB/Sithara Entertainments
అతి తెలివితనం, అమాయకత్వం మన హీరోయిన్..
సినిమా ప్రారంభంలో 15 నిమిషాలు స్లోగా ఉంటుంది. తర్వాత నవ్వులు మొదలవుతాయి. సెకెండాఫ్‌లో అక్కడక్కడ డ్రాప్ అయినా వన్‌లైనర్లతో లేచి నిలబడుతుంది. అనవసరమైన ఐటెం సాంగ్ సినిమా ఫ్లోకి అడ్డం తగులుతుంది.
హీరోయిన్ మీనాక్షి చౌదరికి మంచి పాత్ర లభించింది. కొంచెం అమాయకత్వం, అతి తెలివితనంతో పాత్రలో ఒదిగిపోయింది. రావు రమేష్ కాసేపు కనిపించినా చూపులు, బాడీ లాంగ్వేజ్‌తోనే నటించాడు.
అదరగొట్టిన బుల్లిరాజు, పేలిన వన్‌లైనర్లు
చమ్మక్ చంద్ర, మహేష్, భద్రం హీరో స్నేహితులుగా నవ్వించారు. బుల్లిరాజు అదరగొట్టాడు. హీరోయిన్ స్నేహితురాలిగా జబర్దస్త్ సత్యశ్రీ కనిపించారు.
విలన్‌గా తారక్ పొన్నప్పకి పెద్ద ప్రాధాన్యత లేదు. ఇది హీరో సినిమానే తప్ప , విలన్ అవసరం ఉన్న సినిమా కాదు.
డైలాగ్‌లు సినిమాకి ముఖ్యమైన బలం. 'విమానం కనిపెట్టింది ఆర్ఎస్ బ్రదర్స్' అని హీరోయిన్ అంటే 'కాదు, రాంగ్ బ్రదర్స్' అని హీరో అంటాడు. అఫెక్షన్ అంటే తెలుగులో ఆస్తులు అని అర్థం వంటి డైలాగ్స్‌తో ప్రేక్షకుల్ని నవీన్ ఆకట్టుకుంటాడు.
నవీన్ ఈ సినిమాకి రచయిత కూడా కావడం కలిసొచ్చింది. పాత కథని కొత్తగా కామెడీతో చెప్పడంతో రెండున్నర గంటలు నిడివి బరువు అనిపించదు. గుర్తుండిపోయే సినిమా కాకపోయినా ప్రేక్షకుడిని నవ్విస్తూ, సంతృప్తిగా బయటికి పంపే సినిమా.

ఫొటో సోర్స్, FB/naveen polishetty
ప్రేక్షకుడి నాడి పట్టిన నవీన్...
ప్రీక్లైమాక్స్‌లో వచ్చిన ఎమోషనల్ టర్నింగ్ కథలో అతకలేదు. అయినా ప్రేక్షకుడికి అతిగా అనిపించదు.
ముతక కామెడీతో కాకుండా ఫ్రెష్ కామెడీతో నవ్విస్తే మార్కులు పడతాయి. ఈ రహస్యం నవీన్ పొలిశెట్టికి తెలుసు కాబట్టి , సక్సెస్‌లో ఉన్నా మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు.
ఫ్లస్ పాయింట్స్
1.నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్
2.మీనాక్షి చౌదరి నటన
3.వన్ లైనర్లు
మైనస్ పాయింట్స్
1.సెకెండాఫ్‌లో ఐటం సాంగ్
2.క్లైమాక్స్‌లో అతకని ఎమోషన్
3.మొదటి 15 నిమిషాలు
ఫైనల్‌గా ఇది వన్ మ్యాన్ షో - వన్ లైనర్ షో
(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













