'స్త్రీల బొమ్మలను కూడా వదిలిపెట్టని నీచమైన మనస్తత్వం, సిగ్గుచేటు'.. అసహ్యం వేస్తోందంటూ విద్యార్థిని పోస్ట్

ఫొటో సోర్స్, @aashihoops/Instagram
- రచయిత, గీతా పాండే, అనహితా సచ్‌దేవ్, విష్ణుకాంత్ తివారి
- హోదా, బీబీసీ ప్రతినిధులు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో, పబ్లిక్ గోడపై గీసిన ఆర్ట్‌వర్క్‌లను అసభ్యకరంగా మార్చిన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయింది.
దీనిపై సోషల్ మీడియాల్లో, కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వీడియోను గత వారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్కూల్ విద్యార్థిని షేర్ చేశారు.
ఈ వీడియోలో యోగా చేస్తున్నట్లు ఉన్న స్త్రీ బొమ్మలలో జననేంద్రియాలపై గీతలు గీయడం, మార్కులు పెట్టడం కనిపించింది.
తాను ప్రతిరోజూ ఈ గోడ దగ్గర్నుంచి వెళ్తానని, నల్లని రంగులో ఉన్న మహిళల బొమ్మలను తెల్లని గుర్తులతో అసభ్యకరంగా మార్చడం చూసి తనకు చాలా కోపం, అసహ్యం కలిగాయని ఆ విద్యార్థిని తన పోస్టులో పేర్కొంది.
''ఇది చిన్న విషయం కాదు. నీచమైన ఆలోచన, అసహ్యమైన మనస్తత్వం, తీవ్రమైన అగౌరవం. స్త్రీల బొమ్మలకు కూడా భద్రత ఇవ్వలేనంత సంకుచిత మనస్తత్వాలు మన మధ్య ఉన్నాయి. ఇది సిగ్గు చేటు'' అని ఆమె రాశారు.

ఈ కళాకృతులు అభ్యంతరకరంగా మారిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది.
ఈ వీడియో చూసిన చాలామంది ఇది తమకు అసౌకర్యాన్ని కలగజేసిందని అంటున్నారు.
గోడపై ఉన్న మహిళల బొమ్మలకు కూడా భద్రత లేకుండా పోయిందని వాపోతున్నారు.
ఈ చర్యలు వార్తల్లో ప్రధానాంశంగా నిలిచాయి. ఇది సిగ్గు చేటైన విషయమని, అవమానకరమైన అంశమని, మహిళల గౌరవంపై దాడి అని మీడియా అభివర్ణిస్తోంది.
వీడియో వైరల్ కావడంతో, నగర అధికారులు స్పందించి, వెంటనే చర్యలు తీసుకున్నారు. గోడకు సున్నం వేసి, చిత్రాలను చెరిపేశారు.
అయితే, ఇది అసలు సమస్యకు పరిష్కారంకాదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.
స్త్రీ పెయింటింగ్స్‌ను సైతం లైంగిక కోణంలో చూసే మనస్తత్వమే ప్రధాన సమస్య అని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.
గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహిస్తూ.. ప్రాచీన యోగ విధానాన్ని ప్రోత్సహిస్తోంది భారత్. దేశ రాజధాని దిల్లీతో సహా పలు నగరాల్లో గోడపై యోగా భంగిమలకు సంబంధించి పలు ఆర్ట్‌వర్క్‌లను గీశారు.
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో గోడలపై కనిపించే ఈ రంగురంగుల కళాకృతులు నగరాన్ని సర్వాంగ సుందరంగా మార్చే ప్రాజెక్టులో భాగంగా వేసినవే.

ఫొటో సోర్స్, @aashihoops/Instagram
విద్యార్థిని షేర్ చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒక స్థానికుడు ముందుకు వచ్చారు.
కాలేజీ విద్యార్థి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన లోకేంద్ర సింగ్.. అశ్లీల గుర్తులపై నలుపు రంగు పెయింట్‌ను వేశారు.
''ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో దేనినైనా సరిదిద్దాలంటే చాలా ధైర్యం కావాలి. కానీ, ఎవరో ఒకరు దాన్ని చేయాలని నేను అనుకున్నా'' అని లోకేంద్ర సింగ్ బీబీసీతో అన్నారు.
ఈయన వీడియో కూడా వైరల్ అయిన తర్వాత.. నగర అధికారులు రంగంలోకి దిగారు.
స్త్రీల పెయింటింగ్స్‌ను అసభ్యకరంగా మార్చింది కొందరు దుండగులేనని గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికార ప్రతినిధి ఉమేశ్ గుప్తా తెలిపారు. వారిని గుర్తించలేదని చెప్పారు.
ఎందుకంటే, ఈ గోడల చుట్టూ ఎక్కడా కూడా సీసీటీవీ కెమెరాలు లేవని అన్నారు.
గోడకు సున్నం వేయాలని వర్కర్లను తాము పంపినట్లు తెలిపారు.
‘‘పెయింటింగ్స్‌ను అసభ్యకరంగా మార్చిన కొన్ని ప్రాంతాల్లో సున్నం వేయడం పూర్తయింది. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా పనులు కొనసాగుతున్నాయి. పాడు చేసిన గోడలన్నింటికీ సున్నం వేయడం పూర్తి చేసిన తర్వాత.. కొత్త పెయింటింగ్స్ వేయిస్తాం’’ అని గుప్తా చెప్పారు.
అయితే, ఈ పునరుద్ధరణ చర్యలు మునపటి బొమ్మల్లాగా ఉంటాయా? అన్నదానిపై ఎలాంటి స్పష్టతా లేదు.
నగరాన్ని సర్వాంగ సుందరంగా మార్చేందుకు సాయం చేయాలని కళాకారులను ఆహ్వానిస్తూ.. ఆదివారం స్ట్రీట్ వాల్ పెయింటింగ్ కాంపిటీషన్‌ను ప్రకటించారు నగర మున్సిపల్ అధికారులు.
చిత్రలేఖనం పోటీలో థీమ్‌లుగా పరిశుభ్రత, పర్యావరణ సమస్యలు, నీటి సంరక్షణ, పొగాకు వాడటం వల్ల ప్రమాదాలు, బాధ్యతాయుతమైన పౌరునిగా ఎలా ఉండాలి అనేవి ఉన్నాయి. దీనిలో యోగాను ఒక థీమ్‌గా చేర్చలేదు.
గోడలపై సున్నం వేయడాన్ని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. సమస్యను ఇది పక్కదారి పట్టిస్తుందని కొందరు అంటున్నారు.
సమస్యను రంగులతో కప్పివేయడం సరైన సమాధానం కాదని, తొలుత ఇలాంటి వాటికి కారణమైన మనస్తత్వాలను మార్చాలని సూచిస్తున్నారు.
''గోడకు సున్నం వేసి బాగు చేస్తారు. కానీ, స్త్రీల పెయింటింగ్స్‌ను కూడా అశ్లీలంగా మార్చిన వారి మనస్తత్వాల పరిస్థితేంటి?'' అని మొదట ఈ వీడియోను షేర్ చేసిన టీనేజర్ ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్‌పేపర్‌తో అన్నారు.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty
బహిరంగ ప్రదేశాలను సురక్షితంగా మార్చడంపై పనిచేస్తోన్న సామాజిక సంస్థ ‘సేఫ్టిపిన్’ సహా వ్యవస్థాపకురాలు కల్పనా విశ్వనాథ్ దీనిపై మాట్లాడుతూ..
'' గ్వాలియర్‌లో ఈ చర్యలకు పాల్పడిన కొందరు వ్యక్తులు కేవలం సరదా కోసం చేసినట్లు మనం భావించినా, లోతైనా అర్థాన్ని ఆపాదించలేకున్నా, అది కచ్చితంగా లైంగిక వేధింపుల కిందకే వస్తుంది. అలా మహిళల పట్ల చేసినా లేదా బహిరంగ ప్రదేశాల్లో కళాఖండాలపట్ల చేసినా తప్పు తప్పే'' అని తెలిపారు.
మహిళల శరీర భాగాలను లేదా జననేంద్రియాలను ప్రదర్శించే కళాఖండాలు కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆకర్షిస్తున్నాయి.
గత ఏడాది జర్మనీలోని వుమెన్ రైట్స్ చారిటీ టెర్రే డెస్ ఫెమ్మెస్ ఒక విషయాన్ని ప్రస్తావించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళ కాంస్య విగ్రహాలను పదేపదే తాకడం, రుద్దడం ద్వారా వాటి రొమ్ము భాగాల వద్ద రంగు మారిపోయిందని టెర్రే డెస్ ఫెమ్మెస్ తెలిపింది.
స్త్రీవాదులే కొన్ని కళాఖండాలు అసభ్యకరంగా ఉన్నాయని భావించి, మహిళల విషయంలో మగవారి చూపు మారాలని నిరసనలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
గత ఏడాది రిపోర్టు అయిన కేసులో.. కొందరు స్త్రీవాద కార్యకర్తలు.. ఫ్రెంచ్ కళాకారుడు గుస్తావ్ కోర్బెట్ గీసిన 19వ శతాబ్దపు స్త్రీ జననేంద్రియ చిత్రాన్ని (ఉమెన్ వల్వా) ధ్వంసం చేశారు. ఇది స్త్రీల పట్ల చిన్నచూపుతో సృష్టించిన కళాకృతి అని వారు ఆరోపించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














