ఉన్నావ్ అత్యాచార బాధితురాలు: ‘వాళ్లు నన్ను మరో ఫూలన్ దేవి అయ్యేలా చేస్తున్నారు’

ఉన్నావ్ అత్యాచార బాధితురాలు

ఫొటో సోర్స్, Antariksh Jain/BBC

    • రచయిత, ప్రేరణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘మేడం.. వాళ్లు తప్పించుకుంటారా, శిక్ష నుంచి బయటపడతారా?’’

మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానాను 24 ఏళ్ల ఉన్నావ్ అత్యాచార బాధితురాలు అడుగుతున్న ప్రశ్న ఇది.

ఆమె పక్కనే కూర్చున భయానా, ''లేదు, ముందు ఇంటర్వ్యూపైనే దృష్టిపెట్టు, ఎక్కువగా ఆలోచించకు’’ అని చెప్పారు.

బాధితురాలు మావైపు తిరిగి, మళ్లీ మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆమె కళ్లల్లో భయం, ఆందోళన కనిపించాయి.

ఆమెతో మాట్లాడేందుకు బాధితురాలి న్యాయవాది మహమూద్ ప్రాచ ఆఫీసులో మేం కూర్చుని ఉన్నాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆఫీసులోకి ఒక పెద్ద హాల్, హాల్ మధ్యలో ఒక పొడవాటి, పెద్ద టేబుల్, దాని చుట్టూ న్యాయవాదుల బృందం కూర్చుని ఉంది.

దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భవిష్యత్ వ్యూహం ఎలా ఉండాలనే దానిపై వారక్కడ చర్చిస్తున్నారు.

మరోవైపు, బాధితురాలు, ఆమె తల్లి, ఇతర మీడియా ప్రతినిధులు, యోగితా భయాన బృందం ఆ హాల్‌కు ఎదురుగా ఉన్న గదిలో కూర్చుని ఉంది

మేం కూడా వారితోనే కూర్చుని, బాధితురాలితో మాట్లాడటం ప్రారంభించాం.

''దిల్లీ హైకోర్టు నిర్ణయంపై సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయబోతుందని మీరు విన్నారా?'' అని బాధితురాలిని అడిగాం.

''ఇంత చర్చ జరుగుతుంటే సీబీఐ ఏం చేస్తోంది? ఇప్పుడు ప్రతి అమ్మాయిలో ధైర్యం సడలుతోంది. అత్యాచారం జరిగితే, వారిని (బాధితులను) చంపేస్తారు లేదా నేరస్తుడికి శిక్ష పడి, ఐదేళ్ల తర్వాత విడుదల అవుతారు అంతే కదా. ఈ తీర్పు చూసిన తర్వాత, ప్రతి ఒక్క అమ్మాయిలో ధైర్యం నశించిపోయింది'' అని బాధితురాలు అన్నారు.

ఉన్నావ్ అత్యాచార బాధితురాలు గత ఎనిమిదేళ్లుగా తన జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు.

ఆమెపై మొదట అత్యాచారం, తర్వాత సామూహిక అత్యాచారం, ఆపై పోలీసు కస్టడీలో తండ్రి మరణం, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బంధువులు, న్యాయవాది మృతి, ఆస్పత్రిలో తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఆరు నెలల సుదీర్ఘ పోరాటం.. ఇలా ఆమె పడని కష్టాలు లేవు.

ఈ ఎనిమిదేళ్లలో నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలు జరిగాయి. తీర్పులు వచ్చాయి. శిక్షలు కూడా ఖరారయ్యాయి. అయితే, తాజాగా దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపట్ల బాధితురాలిలో ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది

ఉన్నావ్ అత్యాచార కేసు

ఫొటో సోర్స్, Antariksh Jain/BBC

ఫొటో క్యాప్షన్, ఉన్నావ్ బాధితురాలు

''ఒకవేళ విచారణ హిందీలో సాగిఉంటే...’’

'' నాకు ఇంగ్లీష్ అంతగా రాదు. కొన్ని విషయాలను అర్థం చేసుకోగలను. ఎలాగంటే, 'అలౌ (అనుమతించండి)' అంటే నాకు అర్థం అవుతుంది. విచారణ హిందీలో జరిగి ఉంటే నా కేసుపై నేనే పోరాడేదాన్నేమో. బాధితురాలికి, ఆమె తల్లికి, వారు ఉంటున్న ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో కుల్దీప్ సింగ్ సెంగర్ ప్రవేశించకూడదని కోర్టు చెప్పింది. కానీ, ఐదు కిలోమీటర్లు ఏంటి మేడం.. ఐదు వేల కిలోమీటర్లు కూడా ఆయనకు పెద్ద లెక్క కాదు'' అని బాధితురాలు అన్నారు.

''ఆయన ఎవరినైనా చంపాలనుకుంటే, తనకు తాను ఆపని చేయరు. ఆయన దగ్గర మనుషులుంటారు. ఎందుకంటే, ఈ దేశంలో వీటిని నా కళ్లారా చూశాను. అత్యాచారం చేసిన తర్వాత, వారిని చంపేస్తారు. కానీ, నా అదృష్టంకొద్దీ నేను బతికి బయటపడ్డాను. ఆరు నెలలు వెంటిలేటర్‌పై ఉన్నాను. చావు బతుకుల మధ్య పోరాడాను. నా వాంగ్ములం తీసుకునేందుకు జిల్లా కోర్టు జడ్జి ఆస్పత్రికి వచ్చారు. నేనెలా పోరాడానో చూశారు, మాటలు వచ్చేవి కావు. కళ్లు తిరిగి పడిపోయేదాన్ని. అయినా, సరే వాంగ్ములాలు ఇస్తూనే ఉండేదాన్ని'' అని తెలిపారు.

2017లో, బీజేసీ నాయకుడు, అప్పటి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించిన నాటికి ఆమె వయస్సు 17 సంవత్సరాలు.

2019లో దిల్లీలోని దిగువ కోర్టు (ట్రయల్ కోర్టు) ఈ అత్యాచారం కేసులో తీర్పునిచ్చింది. పోక్సో చట్టంలోని 'అగ్రివేటెడ్ పెనెట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్' అంటే ‘‘తీవ్రమైన లైంగిక హింస’’ అనే ప్రొవిజన్ కింద కుల్దీప్ సింగ్ సెంగర్‌కు జీవిత ఖైదు శిక్షను విధించింది.

ఒక ప్రజాప్రతినిధి అత్యాచార నేరానికి పాల్పడితే, ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 376(2)(బి) ప్రొవిజన్లు, లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ 5(సీ) కింద శిక్ష విధిస్తారు. కుల్దీప్ సింగ్ సెంగర్‌కు కూడా ఇదే సెక్షన్ల కింద దోషిగా నిర్ధరించి, శిక్ష వేశారు.

అయితే, ఐపీసీ ప్రకారం, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను ప్రజాసేవకుడిగా (పబ్లిక్ సర్వెంట్‌గా) పరిగణించలేమని, ట్రయల్ కోర్టు పొరపాటున ఆయన్ను పబ్లిక్ సర్వెంట్‌గా పరిగణించిందని సెంగర్ తరఫు న్యాయవాదులు వాదించారు.

ఈ వాదనలను దిల్లీ హైకోర్టు అంగీకరించింది. ప్రజా సేవకుడు (పబ్లిక్ సర్వెంట్) అనే నిర్వచనం సెంగర్‌కు వర్తించదని దిల్లీ హైకోర్టు తెలిపింది.

ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పబ్లిక్ సర్వెంట్లు కాదన్న 1984 నాటి సుప్రీంకోర్టు తీర్పుపై ఈ తీర్పు ఆధారపడింది.

కుల్దీప్ సింగ్ సెంగర్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కుల్దీప్ సింగ్ సెంగర్‌

‘‘నా కుటుంబంలో ముగ్గురిని కోల్పోయాను’’

''నా కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. నా తండ్రిని, అత్తను, పిన్నిని కోల్పోయాను. వారితో పాటు నా న్యాయవాదిని కోల్పోయాను. నేనొక్కదాన్నే మిగిలాను. నన్ను దేవుడు కాపాడాడు'' అని బాధితురాలు అన్నారు.

‘‘ నా భద్రత కోసం 2017లోనే ఉన్నావ్‌ను వదిలి వెళ్లాలనుకున్నా. నాకు చాలా భయం వేసింది. నన్ను ఆయన అత్యాచారం చేసిన తర్వాత, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. నా తండ్రిని చంపిన తర్వాత, నా మొత్తం కుటుంబాన్ని కిడ్నాప్ చేయాలని కుల్దీప్ సింగ్ సెంగర్ పథకం వేశారు. మమ్మల్నందర్ని తీసుకెళ్లి, చంపాలనుకున్నారు. కానీ, మాకు ఆ విషయం తెలిసి, అక్కడ్నుంచి పారిపోయాం'' అని బాధితురాలు తెలిపారు.

కోర్టు తీర్పు తర్వాత, ఉన్నావ్‌లో ఉండేందుకు తన మిగతా కుటుంబ సభ్యులు భయపడుతున్నారని బాధితురాలు చెప్పారు.

అయితే, బాధితురాలి తండ్రిని ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేసిన కేసులో కుల్దీప్ సింగ్ సెంగర్‌ దోషిగా తేలారు. ఈ కేసులో పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

అయితే, అత్యాచారంలాంటి పెద్ద కేసులోనే సెంగర్‌ బెయిల్ పొందగలిగినప్పుడు, ఆ కేసు ఆయనకు పెద్ద విషయం కాదని బాధితురాలు అంటున్నారు.

భద్రతా సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

ఈ కేసులో తన శిక్షను రద్దు చేయాలని కుల్దీప్ సింగ్ సెంగర్‌ దరఖాస్తు చేసుకున్నారు. అయితే, బాధితురాలి భద్రత కూడా ముఖ్యమైన అంశమని పేర్కొంటూ.. ఈ అభ్యర్థనను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

బాధితురాలిని, ఆమె బంధువులను, ఆమె న్యాయవాదిని చంపేందుకు కుట్ర పన్నారనే కేసులో, సెంగర్‌కు వ్యతిరేకంగా ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ 2021 డిసెంబర్‌లో దిల్లీ కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది.

2019లో బాధితురాలు తన అత్త, పిన్ని, న్యాయవాదితో కలిసి కారులో రాయ్‌బరేలీ వెళ్తుండగా.. ఆమె కారును నెంబర్ ప్లేట్ లేని ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు మాత్రమే బతికారు.

ఇద్దరు కుటుంబ సభ్యులు, న్యాయవాది చనిపోయారు. బాధితురాలు కూడా ఆరు నెలల పాటు వెంటిలేటర్‌పైనే ఉన్నారు.

ఉన్నావ్ అత్యాచార కేసు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉన్నావ్ అత్యాచార కేసు దోషి కుల్దీప్ సింగ్ సెంగర్‌పై చర్యలు తీసుకోవాలని దిల్లీలో నిరసనలు

'మేం పోరాటం కొనసాగిస్తాం'

ఆ ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడిన బాధితురాలు, ''నాకు ప్రమాదం జరిగినప్పుడు, నేను ధైర్యంగా నిలబడ్డాను. అసలు వెనుకడుగు వేయకూడదని నిర్ణయించుకున్నా. సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీ భద్రత నాచుట్టూ ఉన్నా, మాకు బెదిరింపులు వచ్చేవి. అయినా, భయపడలేదు. ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాం. అప్పట్లో వాళ్లు మమ్మల్ని చంపగలరని నాకు తెలుసు. అంటే ఇప్పడు చంపలేరని కాదు. కానీ, మాపై నేరుగా దాడి చేయరు. కచ్చితంగా తన మనుషుల ద్వారా ఆ పని చేయించగలరు’’ అన్నారామె.

‘‘నేను ఫూలన్ దేవిలా మారేలా కుల్దీప్ సింగ్, ఆయన కుటుంబం రెచ్చగొడుతోంది. నిందితులందర్ని జైలుకు పంపాలని నేను డిమాండ్ చేస్తున్నా. వారి బెయిల్‌ను నిరాకరించాలి'' అని అన్నారు.

బాధితురాలు ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లి. మేం మాట్లాడేటప్పుడు, తన భర్త నుంచి కాల్ వచ్చింది.

‘‘ఈ పోరాటానికి నీ భర్త నుంచి మద్దతు లభిస్తోందా?’’ అని మేం అడిగాం.

''నా భర్తను జాబ్ నుంచి తీసేశారు. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నారు. నా పిల్లలు నా పాలు తాగరు. నేను ఈ పోరాటం చేస్తూనే ఉండాలి కాబట్టి పాలను అలవాటు చేయలేదు. ఇప్పుడు వారు ఇంట్లో ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నా, నాకు ఇంకా భయం వేస్తూనే ఉంటుంది. బయటికి వెళ్తే ఏం జరుగుతుందో ఊహించుకోండి. నేనెక్కడికి వెళ్లాలి. అసలు ఊహించుకోలేం. కానీ, అసలు వెనుకడుగు వేయం..పోరాడతాం'' అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)