పశ్చిమ బెంగాల్: మెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఫిర్యాదుపై పోలీసులు ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లా దుర్గాపూర్‌లో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ విద్యార్థిని మెడికల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె స్వస్థలం ఒడిశా.
ఈ కేసులో ముగ్గురుని అరెస్టు చేసినట్టు ఆసన్‌సోల్-దుర్గాపూర్ పోలీస్ కమిషనరేట్ తెలిపిందని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది.
దీనిపై పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ వైద్య కళాశాల నుంచి నివేదిక కోరింది.
అంతకుముందు కేసు విషయంలో పుకార్లు నమ్మొద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
" కేసు దర్యాప్తు జరుగుతోంది.ఈ విషయం చాలా సున్నితమైనది కాబట్టి పోలీసులు అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతున్నారు" అని ఆసన్‌సోల్-దుర్గాపూర్ పోలీస్ కమిషనరేట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభిషేక్ గుప్తా విలేఖరులతో చెప్పారు.
అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు చేసింది.
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఈ సంఘటనను బాధాకరంగా అభివర్ణించారు.
సరైన చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరారు.
ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, విద్యార్థిని తల్లిదండ్రులకు దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉందని పశ్చిమ బెంగాల్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పాంజా అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
పోలీసులేంచెప్పారు?
విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. బాధిత 23 ఏళ్ల విద్యార్థిని మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్నారు.
"అక్టోబర్ 10న రాత్రి 8 గంటల ప్రాంతంలో అదే కళాశాలకు చెందిన ఒక విద్యార్థి తన స్నేహితులతో కలిసి విద్యార్థినిని నిర్జన ప్రదేశానికి రప్పించారు. తర్వాత, తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని తల్లిదండ్రులకు తెలిసింది" అని ఫిర్యాదులో ఉంది.
విద్యార్థిని తన పరిచయమున్న వ్యక్తితో కలిసి శుక్రవారం(అక్టోబరు 10) రాత్రి 8 గంటల ప్రాంతంలో ఏదైనా తినడానికి కళాశాల క్యాంపస్ నుంచి బయటకు వెళ్లారని, అక్కడ కొంతమంది యువకులు ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి, ఆమె మొబైల్ ఫోన్, డబ్బు లాక్కున్నారని పోలీసులు స్థానిక జర్నలిస్టులకు తెలిపారు.
తర్వాత ఆమెతో పాటు ఉన్న వ్యక్తిని బెదిరించి అక్కడి నుండి పంపించివేశారని, సమీపంలోని అడవిలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు చెప్పారు.
సామూహిక అత్యాచారం తర్వాత నిందితులు పారిపోయారని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని ఆమెను దుర్గాపూర్‌లోని ఆసుపత్రిలో చేర్పించారని ఫిర్యాదులో ఉంది.
"మా అమ్మాయి ఇక్కడ సురక్షితంగా లేదు. దోషులను కఠినంగా శిక్షించాలి’’ అని విద్యార్థిని తల్లిదండ్రులు అన్నారు.
సామూహిక అత్యాచారం జరిగిందని విద్యార్థిని తల్లి ఆరోపించారు. అయితే, వైద్య పరీక్షల నివేదిక వచ్చే వరకు దీనిపై కచ్చితమైన ప్రకటన చేయలేమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, X
‘పుకార్లు నమ్మొద్దు’
ఈ ఘటనపై పుకార్లు వ్యాపింపచేయవద్దని ఆసన్‌సోల్-దుర్గాపూర్ పోలీసులు శనివారం సాయంత్రం సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
"అక్టోబరు 10న రాత్రి దుర్గాపూర్‌లోని ఒక వైద్య సంస్థ విద్యార్థిని దురదృష్టవశాత్తూ క్యాంపస్ వెలుపల ఉన్న అడవిలో లైంగిక వేధింపులకు గురయ్యారు. దర్యాప్తు జరుగుతోంది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకండి'' అని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతిపక్షాలేమంటున్నాయి?
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఈ సంఘటనను ఖండిస్తూ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేశారు.
"పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఒడిశా విద్యార్థినిపై జరిగిన దురదృష్టకర సంఘటన అత్యంత బాధాకరమైనది. ఈ వార్త విని నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ సున్నితమైన విషయంలో, ఒక ఉదాహరణగా నిలిచేలా చట్ట ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని డిమాండ్ చేస్తున్నాను. బాధితురాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీనియర్ అధికారులను కూడా ఆదేశించాను. బాధితురాలి కుటుంబానికి ఒడిశా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుంది" అని ఆయన అన్నారు.
"మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఏ మహిళ సురక్షితంగా లేదు. పోలీసులు, రాజకీయ పక్షపాతంతో పనిచేస్తారు. మమతా బెనర్జీ, ఆమె అవినీతిపరుడైన మేనల్లుడిని రక్షించడమే పోలీసుల ఎజెండా" అని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు.
ఈ సంఘటనపై పశ్చిమ బెంగాల్ మంత్రి శశి పంజా ఒక వీడియోను విడుదల చేశారు.
"దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. సామూహిక అత్యాచారం జరిగిందనే ఆరోపణ ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. బాధితురాలి తల్లిదండ్రులు దర్యాప్తుపై విశ్వాసం వ్యక్తం చేశారు. బాధితురాలికి వైద్య చికిత్స, మానసిక చికిత్స కొనసాగుతోంది. ఆమె వాంగ్మూలం కూడా చాలా ముఖ్యమైనది" అని శశి పంజా అన్నారు .
"బీజేపీ ఒక రాజకీయ పార్టీ. మహిళలపై జరిగే ఇలాంటి నేరాలను రాజకీయం చేయకూడదు. దురదృష్టవశాత్తు, బీజేపీ ఎల్లప్పుడూ రాజకీయ దృష్టితోనే చూస్తుంది. ఇది అనవసరం. దేశంలో అత్యంత సురక్షితమైన మెట్రోపాలిటన్ నగరాల్లో కోల్‌కతా ఒకటి అని మనం మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలు, బాలికల సాధికారత కోసం పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పనిచేస్తూనే ఉంటుంది" అని శశి పంజా అన్నారు.
" మహిళలపై జరిగే ఎలాంటి అన్యాయాల విషయంలోనూ ముఖ్యమంత్రి రాజీపడరని అందరికీ తెలుసు. దర్యాప్తు పూర్తయ్యే వరకు మనం వేచి ఉండాలి. రాజకీయాలు చేయడానికి లేదా దీని నుంచి రాజకీయ ప్రయోజనం పొందడానికి బీజేపీ ప్రయత్నించకూడదు" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ బెంగాల్‌లో వరుస ఘటనలు
పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కొంతకాలంగా మహిళల భద్రత అంశంపై విమర్శలు ఎదుర్కొంటోంది.
ముఖ్యంగా కోల్‌కతా కళాశాల ప్రాంగణంలో రెండు అత్యాచార కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత విమర్శలు పెరిగాయి.
ఈ సంవత్సరం జూలైలో కోల్‌కతాలోని ఒక లా కాలేజీలో ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ఆ కాలేజీ పూర్వ విద్యార్థిని నిందితుడిగా గుర్తించారు. ఆయనతో పాటు ప్రస్తుతం అదే కాలేజీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులను, ఒక సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు.
గత ఏడాది ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ఒక మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా అనేక రోజుల పాటు నిరసనలు జరిగాయి.
ఈ కేసులో, అదే కళాశాలలో పనిచేసిన సంజయ్ రాయ్‌ను అరెస్టు చేసి జీవిత ఖైదు విధించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














