‘‘సొంత పిన్ని తన కాపురంలో చిచ్చుపెడుతోందన్న అనుమానంతో ఆమెను చంపేసి శరీరాన్ని వేర్వేరుచోట్ల పడేశాడు’’

ఫొటో సోర్స్, UGC
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
(గమనిక: ఈ కథనంలోని అంశాలు కలచివేయొచ్చు.)
వృద్ధురాలి దారుణ హత్య విజయవాడ నగరంలో కలకలం రేపింది.
వ్యక్తిగత కక్ష పెంచుకుని సొంత చిన్నమ్మను ఆమె అక్క కొడుకే హత్య చేసి, శరీర భాగాలను వేర్వేరు చోట్ల పడేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
నిందితుడు ఈ హత్యకు తన 16 ఏళ్ల కుమారుడి ( మైనర్) సాయం తీసుకున్నట్లు చెప్పారు.
భవానీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన గురించి విజయవాడ పశ్చిమ ఏసీపీ దుర్గారావు ఈ వివరాలను బీబీసీకి చెప్పారు.

పోలీసులు ఏం చెప్పారంటే..
ఏసీపీ దుర్గారావు చెప్పిన వివరాల ప్రకారం..
విజయవాడ ఊర్మిళనగర్‌లో పొత్తూరు విజయలక్ష్మి (60) నివాసముంటున్నారు. సమీపంలోని హెచ్‌బీ కాలనీలో ఆమె సొంత అక్క కుమారుడు జి.సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. కొంతకాలంగా సుబ్రహ్మణ్యానికి, ఆయన భార్యకు గొడవలు జరుగుతున్నాయి.
తమ మధ్య విభేదాలకు పిన్ని విజయలక్ష్మే కారణమని, ఆమె సహకారంతోనే తన భార్య అలా ప్రవర్తిస్తోందని సుబ్రహ్మణ్యం అనుమానం పెంచుకున్నారు.
అలాగే, ప్రస్తుతం ఆయన ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా సంబంధిత యజమాని ఒత్తిడి చేస్తున్నారు. ఇంటి ఓనర్ సమీప బంధువే అయినప్పటికీ పిన్ని ఉసిగొల్పడంతోనే తనను ఖాళీ చేయాలని ఇబ్బంది పెడుతున్నారని భావించారు.
"దీంతో పిన్ని విజయలక్ష్మిని హత్య చేస్తే తప్పించి, తన సమస్యలకు పరిష్కారం దొరకదని సుబ్రహ్మణ్యం ఈ దారుణానికి పాల్పడ్డారు" అని పోలీసులు చెప్పారు.
అలాగే, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండడంతో పిన్నిని హత్యచేసి ఆమె నగలు కాజేస్తే కొన్నాళ్లు డబ్బుకు లోటు ఉండదని భావించారనీ, విజయలక్ష్మి హత్యకు ఇది కూడా ఓ కారణంగా తాము భావిస్తున్నామని ఏసీపీ దుర్గారావు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
పథకం ప్రకారమే..
ఎలాగైనా విజయలక్ష్మిని హత్య చేయాలని భావించిన సుబ్రహ్మణ్యం ఆ తర్వాత ఎవరికీ దొరకకూడదని పక్కాగా పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.
"అక్టోబర్ 1వ తేదీన ఆమె ఇంటికి వెళ్లి తన ఇంటికి రావాలని పిలిచారు. దగ్గరి బంధువైన తన ఇంటి ఓనర్‌తో మాట్లాడాలని చెప్పి టూవీలర్‌పై ఎక్కించుకుని బయలుదేరారు.
అప్పటికే సుబ్రహ్మణ్యం భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి అతనికి దూరంగా ఉంటున్నారు.
ఇంట్లో ఉన్న తన మైనర్ కుమారుడికి విషయం చెప్పి అతని సాయం తీసుకున్నారు.
ఇంటికి తీసుకువెళ్లిన వెంటనే విజయలక్ష్మిని చంపేశారు.
ఆ తర్వాత శరీర భాగాలను వేరుచేసి గోనె సంచిలో కట్టారు.
విజయవాడ బొమ్మసానినగర్, విజయవాడ అట్‌కిన్‌సన్ స్కూల్ సమీపంలో శరీర భాగాలను పడేశారు.
ఆ తర్వాత తమ సొంతూరు కర్నూలు జిల్లా రుద్రవరం గ్రామానికి పరారయ్యారు" అని పోలీసులు చెబుతున్నారు.
ఇలా బయటపడింది..
గత మూడు రోజులుగా తన తల్లి కనబడటం లేదని విజయలక్ష్మి కుమారుడు భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
విజయలక్ష్మి సుబ్రహ్మణ్యంతో టూవీలర్‌పై వెళ్లడం సీసీ కెమెరాల్లో నమోదైంది.
ఆ తర్వాత ఆమె జాడ ఎక్కడా తెలియరాలేదు.
దీంతో పోలీసులు సుబ్రహ్మణ్యం కేంద్రంగా విచారణ మొదలుపెట్టారు.
అతను విజయవాడలో లేరని నిర్ధరించుకొని పోలీసులు కర్నూలు జిల్లా రుద్రవరం వెళ్లారు.
పోలీసుల రాకను పసిగట్టి నిందితులు పరారయ్యారని, విచారణ కొనసాగుతోందని, త్వరలోనే నిందితులిద్దరినీ అరెస్టు చేస్తామని ఏసీపీ దుర్గారావు తెలిపారు.
దీనిపై మాట్లాడేందుకు, ఈ కేసులో ఆరోణలు ఎదుర్కొంటున్న సుబ్రహ్మణ్యం కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ అందుబాటులోకి రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














