హైదరాబాద్: 'మూసీ నదిలో 5 నెలల గర్భిణి శరీర భాగాలు', ఈ హత్య ఎలా బయటపడిందంటే..

మహేందర్ రెడ్డి, స్వాతి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, నిరుడు జనవరిలో కూకట్‌పల్లిలోని ఆర్య సమాజ్‌లో మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమ వివాహం చేసుకున్నారు.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

(గమనిక: ఈ వార్తలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలిచివేయొచ్చు)

ఐదు నెలల గర్భవతి అత్యంత దారుణంగా హత్యకు గురైన ఘటన హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో జరిగింది. ఆమెను భర్తే పాశవికంగా హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు.

నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని మల్కాజ్‌గిరి డీసీపీ పద్మజ తెలిపారు.

రాచకొండ పోలీసు కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. స్వాతి అనే మహిళను హత్య చేశాక ఆమె శరీర భాగాలను భర్త మహేందర్ రెడ్డి మూసీ నదిలో పడేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

కేసుకు సంబంధించి మల్కాజ్‌గిరి డీసీపీ పీవీ పద్మజ వివరాలు వెల్లడించారు.

ఈ ఏడాది జనవరిలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్ పేటలో భార్యను భర్త అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తర్వాత, మరోసారి అదే తరహా ఘోరం జరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
స్వాతి, మేడ్చల్ హత్య

ఫొటో సోర్స్, UGC

కులాంతర వివాహం.. తరచూ గొడవలు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వికారాబాద్ జిల్లా, వికారాబాద్ మండలం కామారెడ్డిగూడకు చెందిన సామల మహేందర్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన బి.స్వాతి అలియాస్ జ్యోతి(21)కి పరిచయం ఉంది. అది ప్రేమగా మారి, నిరుడు జనవరిలో కూకట్‌పల్లిలోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు.

మహేందర్‌ది 'రెడ్డి' సామాజికవర్గం కాగా, స్వాతిది యాదవ సామాజికవర్గం.

మొదట ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ఒప్పుకోలేదని, తర్వాత అంగీకరించి వివాహం చేశారని పోలీసులు చెప్పారు. పెళ్లయ్యాక దంపతులు హైదరాబాద్‌‌లో కాపురం పెట్టారు.

మహేందర్ రెడ్డి ర్యాపిడో బైకు రైడర్‌గా పనిచేస్తుండగా.. స్వాతి గతంలో కొన్ని రోజులపాటు కాల్ సెంటర్‌లో పనిచేసి, మానేశారు.

అయితే, బోడుప్పల్ బాలాజీహిల్స్‌లో ఏడెనిమిది నెలలు ఉన్నాక, తర్వాత చిలుకానగర్‌కు మారారు. తిరిగి దాదాపు 20 రోజుల కిందట మళ్లీ బాలాజీహిల్స్‌లోని అదే ఇంటికి మారినట్లుగా పోలీసులు చెప్పారు.

స్వాతి ఐదు నెలల గర్భిణి అని డీసీపీ తెలిపారు.

''ఈ నెల 27న మెడికల్ చెకప్ తర్వాత ఇంటికి వెళ్లాలని మహేందర్ రెడ్డిని శుక్రవారం (22వ తేదీన) స్వాతి అడిగారు. అందుకు భర్త ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత స్వాతిని చంపాలని మహేందర్ నిర్ణయించుకున్నారు'' అని డీసీపీ పద్మజ చెప్పారు.

శనివారం(23వ తేదీ) సాయంత్రం నాలుగున్నర సమయంలో మరోసారి గొడవ జరగడంతో, స్వాతిని మహేందర్ అత్యంత దారుణంగా హత్య చేశారని డీసీపీ చెప్పారు.

తర్వాత ఆమె శరీర భాగాలను తీసుకెళ్లి మూసీ నదిలో పడేసినట్లుగా విచారణలో తేలినట్లు పోలీసులు చెప్పారు.

పోలీసుల మీడియా సమావేశం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పెళ్లైన నెల రోజుల తర్వాత నుంచే మహేందర్ రెడ్డి, స్వాతి మధ్య గొడవలు మొదలయ్యాయని డీసీపీ పద్మజ వివరించారు.

హత్యకు కారణంపై పోలీసులు ఏం చెబుతున్నారంటే..

పెళ్లైన నెల రోజుల తర్వాత నుంచే మహేందర్ రెడ్డి, స్వాతి మధ్య గొడవలు మొదలయ్యాయని డీసీపీ పద్మజ తెలిపారు.

''నిరుడు ఏప్రిల్‌లో మహేందర్ రెడ్డిపై గృహహింస చట్టం కింద వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో స్వాతి కేసు పెట్టారు. తర్వాత పెద్దలు రాజీ కుదర్చడంతో హైదరాబాద్‌కు వచ్చి ఉంటున్నారు'' అని ఆమె చెప్పారు.

ఆ తర్వాత కూడా, భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయన్నారు డీసీపీ పద్మజ. ఈ క్రమంలో స్వాతిని చంపాలని మహేందర్ ముందుగానే నిర్ణయించుకుని హత్య చేశారని చెప్పారు.

అత్యంత క్రూరంగా హత్య చేయడంతోపాటు ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించారని డీసీపీ వివరించారు.

మహేందర్, స్వాతి ఉంటున్న ఇల్లు
ఫొటో క్యాప్షన్, మహేందర్, స్వాతి ఉంటున్న ఇల్లు

ఎలా బయటపడింది?

శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో క్యాప్ పెట్టుకుని, చేతిలో కవర్ పట్టుకుని మహేందర్ రెడ్డి బయటకు వెళ్లడం చూశానని, ప్రస్తుతం అదే బిల్డింగ్‌లో ఉంటున్న సుజాత అనే మహిళ బీబీసీతో చెప్పారు.

''నేను వెల్లుల్లి పొట్టు తీసుకుంటూ అరుగుమీద కూర్చున్నా. ఆ సమయంలో చేతిలో సంచి పట్టుకుని మహేందర్ రెడ్డి బయటకు వెళ్లారు'' అని ఆమె చెప్పారు.

శనివారం సాయంత్రం 7.10 గంటల సమయంలో చేతిలో క్యారీ బ్యాగ్ పట్టుకుని మహేందర్ రెడ్డి బయటకు వెళ్లినట్లుగా సీసీ కెమెరాలో రికార్డైంది.

ఆ కవర్‌లోనే స్వాతి శరీర భాగాలను తీసుకెళ్లి హైదరాబాద్ శివారులోని మూసీ నదిలో పడవేసినట్లుగా డీసీపీ పద్మజ చెప్పారు. మూడుసార్లు మూసీ నది వద్దకు వెళ్లి వచ్చాక, స్వాతి కనిపించడం లేదంటూ తన చెల్లెలు చంద్రకళకు ఫోన్ చేసి చెప్పారు మహేందర్ రెడ్డి.

''మహేందర్ రెడ్డి, స్వాతి మధ్య తరచూ గొడవలు జరుగుతున్న విషయం ఆయన చెల్లెలు చంద్రకళకు తెలుసు. వెంటనే ఆమె హైదరాబాద్‌లో ఉండే బంధువు గోవర్దన్ రెడ్డి అనే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి పోలీసుల వద్దకు తీసుకెళ్లారు. మిస్సింగ్ విషయంపై ఫిర్యాదు చేయాలని మహేందర్ రెడ్డి భావించారు. పోలీసులకు అనుమానం వచ్చి మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో హత్య చేసినట్లుగా అంగీకరించారు'' అని డీసీపీ చెప్పారు.

శనివారం సాయంత్రం నాలుగున్నర సమయంలో హత్య జరిగిందని చెప్పారు.

మూసీ నది, స్వాతి హత్య

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కవర్‌లో స్వాతి శరీర భాగాలను తీసుకెళ్లి హైదరాబాద్ శివారులోని మూసీ నదిలో పడవేసినట్లుగా డీసీపీ పద్మజ చెప్పారు.

మహేందర్ రెడ్డిని మూసీ నది వద్దకు తీసుకెళ్లారు పోలీసులు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మూసీ నదిలో డీఆర్ఎఫ్(డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్) సిబ్బందితో వెతికించారు. అయితే, శరీర భాగాలు లభించలేదని డీసీపీ పద్మజ చెప్పారు.

గతంలో స్వాతి గర్భవతి అయినప్పుడు.. అప్పుడే పిల్లలు వద్దని ఒప్పించి అబార్షన్ చేయించారని, మరోసారి ఆమె గర్భం దాల్చడం కూడా మహేందర్ రెడ్డికి నచ్చలేదని పోలీసులు చెబుతున్నారు.

'శుక్రవారమే చివరిసారిగా చూశాం'

బాలాజీ హిల్స్‌లోని చిన్న సందులోంచి లోపలికి ఉన్న ఇంటి రెండో అంతస్థులో మహేందర్ రెడ్డి, స్వాతి కాపురం ఉంటున్నారు. ప్రస్తుతం ఆ ఇంటికి తాళం వేసి ఉంది. బీబీసీ అక్కడికి వెళ్లినప్పుడు స్వాతి చెప్పులు అక్కడే విడిచి ఉన్నాయి.

ప్రతిరోజూ కిందకు వచ్చి పలకరించే స్వాతి శనివారం రోజంతా కిందకు రాలేదని అదే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో నివాసం ఉండే ఊర్మిళ పవార్ బీబీసీతో చెప్పారు.

''ముందు రోజు అంటే.. శుక్రవారం బంగారం తాకట్టు పెట్టడానికి వెళ్లినట్లుగా నాతో చెప్పింది. గర్భవతిగా ఉండటంతో ఏమీ తినలేదని చెప్పడంతో ఇడ్లీ, వడ తినడానికి పెట్టాను. తర్వాత ఆయాసంగా ఉందని చెప్పి స్వాతి తన ఇంట్లోకి వెళ్లిపోయింది'' అని చెప్పారామె.

భర్త కొట్టడంతో చెవులు బాగా నొప్పిగా ఉన్నాయని స్వాతి చెప్పినట్లుగా ఊర్మిళ తెలిపారు. శుక్రవారం సాయంత్రం చివరిసారిగా స్వాతిని చూసినట్లు చెప్పారు సుజాత.

''ఆసుపత్రికి వెళ్లి వచ్చామని చెప్పారు'' అని సుజాత బీబీసీతో అన్నారు.

స్వాతి హత్య, రాములు
ఫొటో క్యాప్షన్, తన కుమార్తెను చంపినందుకు మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని స్వాతి తండ్రి రాములు డిమాండ్ చేశారు.

తల్లిదండ్రులు ఏమంటున్నారంటే..

స్వాతి హత్య విషయం తెలుసుకుని ఆమె తండ్రి రాములు సహా ఇతర బంధువులు మేడిపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకుని బోరున విలపించారు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తమతో స్వాతి మాట్లాడటం లేదని, అప్పట్నుంచి మాటల్లేవని రాములు చెప్పారు.

''పెళ్లయ్యాక హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. రెండుసార్లు గొడవలు జరిగితే ఇంటికి వస్తే సర్దిచెప్పి పంపించాం'' అని రాములు బీబీసీతో చెప్పారు.

తన కుమార్తెను చంపినందుకు మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని రాములు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు.

ఈ విషయంపై మహేందర్ రెడ్డి తండ్రి సోమిరెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించింది.

''ప్రస్తుతం నేను ఏమీ మాట్లాడలేను. గతంలో గొడవలు పడినా సర్ది చెప్పాం. ఇలా అవుతుందని అనుకోలేదు'' అని సోమిరెడ్డి అన్నారు.

మహేందర్ రెడ్డి ఇచ్చిన నేరాంగీకర వాంగ్మూలం ఆధారంగా సాంకేతిక, ఇతర ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్పారు.

''ఇంట్లో దొరికిన శరీర భాగానికి డీఎన్ఏ టెస్టు చేశాక స్వాతి కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం'' అని డీసీపీ పద్మజ వివరించారు.

''కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది'' అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)