8 మందిని పెళ్లి చేసుకున్న మహిళ, ఈ మోసం ఎలా బయటికి వచ్చిందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, భాగ్యశ్రీ రౌత్
- హోదా, బీబీసీ కోసం
ఓ వధువును నాగ్‌పుర్ పోలీసులు అరెస్టు చేశారు.
ఆమె ఒకసారి కాదు ఎనిమిది సార్లు పెళ్లి చేసుకున్నారని.. ఆ ఎనిమిది మంది భర్తలనూ డబ్బు కోసం మోసం చేశారని పోలీసులు చెప్పారు.
ఆమెపై నాగ్‌పుర్‌లోని మూడు పోలీస్ స్టేషన్‌లతో పాటు, ముంబయి ఛత్రపతి శంభాజీ నగర్, పావని పోలీస్ స్టేషన్‌లలోనూ కేసులు నమోదయ్యాయి.
ఆమె ఎనిమిదిమంది భర్తలు వచ్చి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తాము ఎలా మోసపోయామో కోర్టుకు సమాచారమిచ్చారు.
''ఈ 'దొంగ వధువు' పేరు సమీరా ఫాతిమా. ఆమె ఎంఏ (ఇంగ్లీష్), బీఈడీ చదివారు. ఆమె మోమిన్‌పురాలోని ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయురాలు కూడా. సమీరా మొదటి వివాహం భివాండిలో జరిగింది'' అని గిట్టిఖాదన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ శారదా భోపాలే చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
ఫేస్‌బుక్‌లో మాటలు కలిపి..
సమీరా ఫాతిమా తనను మోసం చేశారని 2024లో నాగ్‌పుర్‌కు చెందిన గులాం గౌస్ పఠాన్ గిట్టిఖాదన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తమ ఇద్దరికీ ఫేస్‌బుక్‌లో పరిచయమైనట్లు పఠాన్ చెప్పారు.
''నేను విడాకులు తీసుకున్నాను, మళ్లీ పెళ్లిచేసుకోవడం గురించి ఆలోచిస్తున్నాను'' అని ఆమె చెప్పారు.
‘‘ఆ తర్వాత వారిద్దరూ ఎక్కువగా కలవడం మొదలుపెట్టారు. రాత్రింబవళ్లు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఆ తర్వాత అశ్లీల వీడియోను వైరల్ చేస్తానని బెదిరించి, పెళ్లి చేసుకోవాలని సమీరా ఒత్తిడి చేశారు.
ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ వివాహం తర్వాత కూడా, వీడియోను విడుదల చేస్తామని బెదిరిస్తూ డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.
అలాగే, ఇతర కారణాలతో లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే, ఆమె తన వాళ్లను పిలిపించి భయభ్రాంతులను సృష్టించేవారు. దీంతో సమీరాకు దూరంగా ఉండటం ప్రారంభించారు గులాం పఠాన్’’ అని గిట్టిఖాదన్ పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘తప్పుడు విడాకుల సర్టిఫికెట్ చూపించి మరో పెళ్లి’
‘సమీరా అప్పటికే చాలాసార్లు వివాహం చేసుకున్నారని వారికి తర్వాత తెలిసింది. మునుపటి భర్త నుంచి విడాకులు తీసుకోకముందే ఆమె గులాంను పెళ్లిచేసుకున్నారు.
సమీరా ఆయనకు తప్పుడు విడాకుల సర్టిఫికెట్ కూడా చూపించారు. అనేక రకాల కారణాలతో గులాం దగ్గర నుంచి ఆమె లక్షల రూపాయలు తీసుకున్నారు’ అని పోలీసులు చెప్పారు.
గులాం ఫిర్యాదు తర్వాత గిట్టిఖాదన్ పోలీసులు సమీరా కోసం వెతికారు. కొన్ని నెలల క్రితం పోలీసులు ఆమెను అరెస్టు చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె గర్భవతి.
పోలీసులు ఆమెను ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్పించారు. కానీ, ఆమె ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. పోలీసులు నోటీసులిచ్చినా ఆమె హాజరు కాలేదు. ఆ తర్వాత పోలీసులు ఆమెను పట్టుకునేందుకు ప్రణాళిక వేసి అరెస్టు చేశారు.
గులాం పఠాన్‌ను మాత్రమే కాకుండా సమీరా మరో నలుగురైదుగురు వ్యక్తులను కూడా పెళ్లి చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎనిమిది పెళ్లిళ్లెలా చేసుకున్నారు?
అయితే కేసు కోర్టుకు వెళ్లినప్పుడు, ఎనిమిది మంది భర్తలు ముందుకు వచ్చారు. వారు కోర్టుకు హాజరై అఫిడవిట్లు దాఖలు చేశారు. ఈ ఎనిమిది మంది భర్తలు, వారి న్యాయవాదులతో కలిసి, విలేకరుల సమావేశం నిర్వహించి, సమాచారం ఇచ్చారు.
ప్రస్తుతం దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. సమీరా పెళ్లి చేసుకుని మోసం చేయడం 2017లో ప్రారంభించారు. తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వకముందే, ఆమె వివాహ వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా ద్వారా ముస్లిం సమాజానికి చెందిన విడాకులు తీసుకున్న సంపన్నులతో పరిచయం పెంచుకునేవారు.
''నేను కూడా విడాకులు తీసుకున్నాను..మళ్లీ పెళ్లిచేసుకోవాలని భావిస్తున్నాను అని ఆమె చెప్పేవారు. తరువాత నకిలీ విడాకుల సర్టిఫికేట్ చూపించి వారిని వివాహం చేసుకునేవారు. తరువాతి రెండు-మూడు నెలల్లో, ఆమె వారి నుంచి డబ్బు వసూలు చేసేవారు. వీడియోలతో, తప్పుడు ఫిర్యాదులతో బెదిరించేవారు. మరిన్ని డబ్బులు వసూలు చేసేవారు.
వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే, ఆమె తన వాళ్ళని పిలిపించి కొట్టించేవారు. వాళ్ళలో భయాన్ని సృష్టించేవారు. వాళ్ళ డబ్బు దోచుకుని గొడవ పడ్డాక, ఆమె మరొక వ్యక్తితో పరిచయం పెంచుకుని అలాగే చేసేవారు’’ అని ఆమె మాజీ భర్తలు విలేకరుల సమావేశంలో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంట్లోనే ముస్లిం సంప్రదాయప్రకారం పెళ్లిళ్లు
ఇప్పటివరకు ఈ రకంగా ఆమె లక్షల రూపాయలు దోచుకున్నారని పోలీసులు చెప్పారు.
ఆమె పెళ్లిచేసుకున్నవారిలో ఒక ప్రముఖ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కూడా ఉన్నారు. ఆ వ్యక్తి ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందినవారు. ఉద్యోగరీత్యా నాగ్‌పుర్‌లో ఉంటున్నారు. ఆయన్ను కూడా సమీర ఫేస్‌బుక్‌లో కలిశారు.
అధికారికంగా ఈ ఎనిమిది మంది భర్తలు మాత్రమే ముందుకు వచ్చారు. ముందుకు రావడానికి సిద్ధంగా లేని వారు ఇంకా చాలా మంది ఉన్నారని కూడా పోలీసులు పేర్కొన్నారు.
సమీరాను జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. తాను ఆరుసార్లు మాత్రమే పెళ్లిచేసుకున్నానని, వారంరదితో తనకు గొడవలు జరగడమే విడాకులకు కారణమని ఆమె పోలీసులకు చెప్పారు.
విడాకుల సర్టిఫికేట్ చూపించాలని కోర్టు కోరగా, ఆమె దానిని ఇవ్వలేకపోయారు.
ఈ వివాహాలన్నీ ఆమె ఇంట్లో ముస్లిం ఆచారాల ప్రకారం జరిగాయని పోలీసులు చెప్పారు.
కాగా తన బిడ్డకోసం తనకు బెయిల్ ఇవ్వాలని సమీరా డిమాండ్ చేశారు.
అయితే, కోర్టు ఆమె కొడుకు కస్టడీని చివరి భర్తకు అప్పగించి, ఆమెను జైలుకు పంపిందని ఫిర్యాదుదారు తరపు న్యాయవాది ఫాతిమా పఠాన్ తెలియజేశారు.
నిందితురాలి తరఫు న్యాయవాదులను సంప్రదించడానికి ప్రయత్నించాం.... కానీ, అది సాధ్యం కాలేదు. ఒకవేళ వారు స్పందిస్తే ఇక్కడ అప్‌డేట్ చేస్తాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














