కర్ణాటక నుంచి ‘పవన్ కల్యాణ్ తెచ్చిన’ కుంకీ ఏనుగులు ఇప్పుడు ఏం చేస్తున్నాయి? వాటిపై విమర్శలు ఎందుకు?

కుంకీ ఏనుగు
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల దాడిలో మరో రైతు ప్రాణాలు కోల్పోయారు.

జులై 26న చిత్తూరు జిల్లా సోమల మండలం కొత్తూరులో పొలంలో ఉన్న రైతును ఏనుగులు తొక్కి చంపేశాయని స్థానికులు తెలిపారు.

ఆ ఏనుగులు అక్కడ మూడు రోజుల నుంచి ఉన్నాయని చెప్పారు.

ఏనుగుల దాడుల నుంచి ప్రజల్ని కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్ణాటక నుంచి తెప్పించిన కుంకీ ఏనుగులు ఏం చేస్తున్నాయి? దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీకి 4 కుంకీలు

ఈ ఏడాది మేలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సమక్షంలో ఏపీకి నాలుగు కుంకీ ఏనుగులు అప్పగించారు.

మొత్తం ఆరు కుంకీ ఏనుగులు ఇస్తామని చెప్పిన కర్ణాటక, రెండింటికి ఇంకా శిక్షణ పూర్తి కాలేదని చెప్పింది.

బెంగళూరులోని విధాన సౌధ దగ్గర ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అప్పగింత జరిగింది.

పవన్ కల్యాణ్‌ను శాలువా, తలపాగాతో సత్కరించి వీటిని సిద్ధరామయ్య ఏపీకి అప్పగించగా, శాస్త్రోక్తంగా గజపూజ నిర్వహించిన తర్వాత వాటిని రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు అప్పగించారు పవన్ కల్యాణ్.

దేవా, కృష్ణ, అభిమన్యు, రంజన్ అనే పేర్లు కలిగిన కుంకీ ఏనుగులతో రెండు నెలల పాటు ఉన్న కర్ణాటక మావటీలు ఏపీ మావటీలకు శిక్షణ ఇచ్చారు.

కుంకీ ఏనుగులు

కుంకీలు ఇప్పుడు ఎక్కడున్నాయి?

కర్ణాటక నుంచి వచ్చిన ఈ నాలుగు కుంకీలు, ప్రస్తుతం చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని అటవీశాఖ కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంపులో ఉన్నాయి.

అయితే, ఈ ఏనుగుల్లో ఒకదానికి చూపు లేదని, మరొకటి పిచ్చిదని, మిగతా రెండు అసలు ఎందుకూ పనికిరావని ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి.

ఆ ఏనుగుల భారాన్ని మోయలేకే కర్ణాటక వాటిని ఏపీకి అప్పగించి చేతులు దులుపుకొందని విమర్శలు వచ్చాయి.

దీంతో, బీబీసీ ఆ ప్రాంతానికి వెళ్లి విమర్శల్లో వాస్తవాలు ఏంటో పరిశీలించే ప్రయత్నం చేసింది.

బీబీసీ మొదట పలమనేరు దగ్గరున్న ఏనుగుల క్యాంపుకు వెళ్లింది.

ఆ సమయంలో కుంకీలను మేత కోసం క్యాంపు లోపలే ఉన్న అడవిలోకి తీసుకెళ్లడంతో బీబీసీ కూడా ఆ ప్రాంతానికి వెళ్లింది.

మొదట చిన్న ఏనుగులుగా కనిపిస్తున్న కృష్ణ, అభిమన్యులతో అడవుల్లో డ్రైవ్స్ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించింది.

ఆ ఏనుగులతో ఇప్పటికిప్పుడు ఫ్రంట్ రోల్ ఆపరేషన్స్ చేయలేమని, అవి భవిష్యత్ కుంకీ ఏనుగులని అధికారులు సమాధానం ఇచ్చారు.

కుంకీ ఏనుగు
ఫొటో క్యాప్షన్, కుంకీ ఏనుగు

పిచ్చి పట్టిందని మీడియాలో చెబుతున్న రంజన్‌ ఏనుగును బంధించి ఉంచారు.

పెద్ద కర్రలతో ఒక జైలులా ఏర్పాటు చేసి, అందులో రంజన్‌ను పెట్టారు.

రంజన్ ప్రవర్తనలో తేడా కనిపించింది. ఎవరైనా దానికి దగ్గరగా వెళ్లగానే దానిలో ఆవేశం కనిపిస్తోంది.

"రంజన్‌కు శిక్షణ ఇంకా పూర్తి కాలేదు. దానితోపాటు ఉన్న మావటీ వెళ్లిపోవడంతో అది ఇక్కడి మావటీలకు అలవాటు పడలేదు. అది పూర్తి స్థాయిలో ఇంకా ఏపీ మావటీల నియంత్రణలోకి రాలేదు. శిక్షణలో ఉంది. అందుకే రంజన్‌ను ఇలా ఉంచాం" అని చెప్పారు అధికారులు.

ఇక కుంకీ ఏనుగుల్లో ఒక ఏనుగుకు చూపు లేదు అనే విమర్శలపై అధికారులను బీబీసీ ప్రశ్నించింది.

దేవా అనే ఆ ఏనుగు దగ్గరకు వెళ్లిన బీబీసీకి అది చాలా మామూలుగానే ఉన్నట్లు కనిపించింది.

"దేవా అనే ఆ కుంకీ ఏనుగుకు ఒక కన్ను కనిపించదు. దానిని ఇక్కడకు తీసుకువచ్చేసరికే అది అలా ఉంది" అని అధికారులు చెప్పారు.

కుంకీలు

ఈ ఏనుగులు అసలు పనికొస్తాయా?

కర్ణాటక నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ కుంకీ ఏనుగులు, రాష్ట్రంలో అవసరాలకు.. అంటే పల్లెలు, పొలాలపై దాడులు చేస్తున్న ఏనుగులను తరిమికొట్టడానికి పనికి రావన్న విమర్శలపై చిత్తూరు డీఎఫ్ఓ భరణి బీబీసీతో మాట్లాడారు.

''కుంకీ ఏనుగులు అంటే మావటీలు తప్ప ఎవరు చెప్పినా వినని ఏనుగులు. వాళ్లను మేం ఏర్పాటు చేశాం. కర్ణాటక నుంచి వచ్చిన మావటీలతో ఇక్కడి మావటీలను అటాచ్ చేశాం. మావటీతో అటాచ్మెంట్ ఉంటేనే ఆ ఏనుగు ఫీల్డ్‌లో వింటుంది. ఇప్పుడు మేం ఆ ట్రైనింగ్‌లోనే ఉన్నాం'' అని భరణి తెలిపారు.

''చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల నుంచి 17 మందిని ఈ ట్రైనింగ్ కోసం తీసుకువెళ్లాం. నెల రోజులు ఈ ట్రైనింగ్ జరిగింది. వాళ్లను ఇక్కడ ఉపయోగిస్తున్నాం. జనరల్ ట్రైనింగ్ పూర్తయ్యాక, ఏనుగుకు వీళ్లకు బాండింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాం" అని భరణి తెలిపారు.

కర్ణాటక నుంచి తీసుకొచ్చిన నాలుగు ఏనుగులూ తమకు ఉపయోగపడతాయని భరణి చెప్పారు.

''వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి అనుకోండి.. వేరే మంద ఉన్న చోటికి అవి రావు. కుంకి మనం చెప్పిన కమాండ్ వింటుంది కాబట్టి, అడవి ఏనుగులు వస్తున్నప్పుడు మనం వీటిని తీసుకెళ్లి సౌండ్స్ చేపించడం వల్ల అవతల వాటిని రాకుండా అడ్డుకునేందుకు సాయపడతాయి'' అని చెప్పారు.

చిత్తూరు డీఎఫ్ఓ భరణి

దేవా అనే ఏనుగుకు కళ్లు కనిపించడం లేదనేది సరి కాదని, అది గాయపడిన ఏనుగని ఆమె అన్నారు.

''ఆపరేషన్లలో ఉయోగిస్తున్నప్పుడు దానికి గాయమైంది. దానికి పూర్తిగా చూపు లేదని చెప్పడం కరెక్ట్ కాదు. అది గాయం మాత్రమే. అక్కడ్నుంచి దాన్ని తెచ్చేటప్పుడే గాయం ఉంది. అయితే, దేవా చాలా కమాండ్స్ వింటుంది. ఫీల్డులో ఆపరేషన్‌కు తీసుకెళ్లినప్పుడు దాని పెర్ఫార్మెన్స్ చూస్తే చాలా క్యాపబుల్ అనిపిస్తుంది'' అని తెలిపారు.

ఇక పిచ్చిదని విమర్శించిన రంజన్‌ను బంధించారు. దాని గురించి కూడా భరణి మాట్లాడారు.

''అది ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంది. కమాండ్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ ఇవ్వడం కనీసం ఇన్ని రోజులని ఉంటుంది. ఒకదాని తర్వాత ఒక కమాండ్ నేర్పిస్తూ రావాలి. ఆ విధంగా కంప్లీట్ షేప్‌కు తీసుకురావాలి. కుంకి తన మావటి మాట మాత్రమే వింటుంది. కుంకీ ఏనుగులన్నింటికీ మావటితో శిక్షణ ఇచ్చాం’’ అని తెలిపారు.

కుంకీలు

కృష్ణ, అభిమన్యుల గురించి చిత్తూరు డీఎఫ్ఓ ఏమన్నారు?

చిన్నవి పనికి రావని విమర్శిస్తోన్న కృష్ణ, అభిమన్యుల గురించి కూడా చిత్తూరు డీఎఫ్ఓ భరణి వివరణ ఇచ్చారు.

'' వాటికి 15, 16 సంవత్సరాలు ఉంటాయి. పూర్తిగా శిక్షణ పొంది ఉన్నాయి. అన్ని కమాండ్స్ వింటాయి. మన ప్రాంతానికి అనుగుణంగా అదనపు కమాండ్స్ కూడా నేర్పిస్తున్నాం. కృష్ణ, అభిమన్యు డ్రైవ్‌కు ఉపయోగపడతాయి. ఫ్రంట్ లైన్‌కు అయితే నాలుగైదు సంవత్సరాల్లో వస్తాయి'' అని భరణి చెప్పారు.

కర్ణాటక అంచనా ప్రకారం.. నాలుగు కుంకీల పోషణకు సంవత్సరానికి కోటి రూపాయల వరకు అవుతుందని ఆమె అన్నారు. ఒక్కో దానికి సంవత్సరానికి 25 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు.

ఈ ఏనుగుల్లో ఒకటి గుడ్డిది, ఇంకొకటి పిచ్చిది, రెండు చిన్నవి అసలు పనికిరావని, కర్ణాటక ప్రభుత్వం వాటి భారం మోయలేక మనకిచ్చి చేతులు దులుపుకొందనే విమర్శలను భరణి కొట్టిపారేశారు.

''ఇవి అబద్ధం. ప్రతి ఏనుగుకు హెల్త్ చెకప్ చేశాం. సర్టిఫై చేసిన తర్వాత, ఇవి ఫిట్‌గా లేవనడం కరెక్ట్ కాదు. ట్రైనింగ్‌లో చాలా కమాండ్స్ ఉంటాయి. అవి ఇచ్చినప్పుడు తెలుస్తుంది. ఇదెన్ని కమాండ్స్ వింటుంది, ఎలా మూమెంట్స్ చేస్తుందనేది మావటీలకు తెలుసు. ఇక రంజన్, దేవాతో ఎలా పనిచేస్తామో మీరు కొన్ని రోజుల్లోనే మా డ్రైవ్స్‌లో చూస్తారు'' అని చెప్పారు.

రంజన్

కొత్త ఏనుగులతో జయంత్, వినాయక్

కర్ణాటక నుంచి కొత్తగా వచ్చిన కుంకీలతోపాటూ, ఇక్కడ ఏనుగులను తరమడంలో ఇప్పటికే మంచి శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, వినాయక్‌లు కూడా కనిపించాయి.

గతంలో ఈ కుంకీలపై బీబీసీ ఒక కథనం ప్రచురించింది. ఈ నాలుగు ఏనుగులతో జయంత్, వినాయక్‌లను ఎందుకు పెట్టారో భరణి వివరించారు.

''ఒక ఏనుగుకు 'డ్రైవ్ ఆన్ క్యాప్చర్'‌లో రెండు ఏనుగులు, నాలుగు ఏనుగులు సరిపోవు. కనీసం ఆరు ఏనుగులు, ఇంకా ఎక్కువుంటే ఆ ఆపరేషన్ విజయవంతం అవుతుంది. అది లేకపోతే ఆపరేషన్ రివర్స్ అవ్వొచ్చు. అప్పుడు ఉన్న సమస్యగా అవుతుంది. అందుకే, వాటిని వీటితో బాండింగ్ ఏర్పరిచేందుకు ఉంచాం'' అని తెలిపారు.

''ప్రతి ప్రాంతానికి కుంకీని తీసుకు వెళ్లి ఇదే పరిష్కారం అని చెప్పలేం. ఏ ప్రాంతంలో కుంకీ ఏనుగులను వాడి ఆపరేషన్ చేయాలనేది సైంటిఫిక్ డిసిషన్. మనిషి దగ్గరికి వచ్చి ఏనుగులు దాడి చేస్తున్నాయన్న సందర్భంలో కచ్చితంగా కుంకీ ఏనుగులను వాడాలి. పంటనష్టం లాంటివి చేస్తున్నప్పుడు భిన్నమైన స్ట్రాటజీ వాడాలి'' అని భరణి అన్నారు.

ఇదే అంశంపై అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి చెందిన ఎన్.వి శివరాం బీబీసీతో మాట్లాడారు.

''కర్ణాటక నుంచి వచ్చిన నాలుగు కుంకీ ఏనుగుల్లో ఒక కుంకీ ఏనుగుకి ఓ కన్ను సమస్య ఉంది. ఆ విషయం కర్ణాటక ప్రభుత్వం ముందుగానే చెప్పింది. కంటి సమస్య ఉన్నప్పటికీ, ఆ ఏనుగు అద్భుతంగా పని చేస్తుందని తెలిపింది. మిగిలిన మూడు ఏనుగుల్లో రెండు చిన్న ఏనుగులు. అవి పూర్తిస్థాయి పనిలోకి దిగేందుకు మూడు నాలుగు ఏళ్ళు పడుతుంది. ఇక్కడి వాతావరణానికి చిన్న వయసు నుంచి అలవాటు పడతాయని తీసుకువచ్చాం'' అని శివరాం తెలిపారు.

''ఆ నాలుగు ఏనుగులు తీసుకొచ్చినప్పటికీ, అవి ఇంకా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడే దశలోనే ఉన్నాయి. వాటిని ఉపయోగించే పరిస్థితికి రాలేదు. త్వరలోనే వాటిని ఉపయోగించేలా అటవీశాఖ తీర్చిదిద్దుతోంది. ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి వాటిని తీసుకు రావడం అంత చిన్న విషయం కాదు. వీటిపై అవగాహన లేకుండా ఎవరూ దుష్ప్రచారం చేయొద్దు'' అని అన్నారు.

మావటి గోవిందస్వామి

మావటీలు ఏం చెబుతున్నారు?

చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల నుంచి 17 మంది వాచర్లకు కుంకీలతో ఎలా పనిచేయించాలో కర్ణాటకలో శిక్షణ ఇప్పించామని అటవీ అధికారులు చెప్పారు. ఆ మావటీలతో బీబీసీ మాట్లాడింది .

కర్ణాటకలో నెల రోజులు శిక్షణ ఇచ్చారని, కుంకీ ఏనుగులతో ఎలా ఉండాలి, పడుకున్నప్పుడు ఏనుగును ఎలా లేపాలి, ఎలా పడుకోమని చెప్పాలి, ఎలా వాకింగ్‌కు తీసుకెళ్లాలి అంతా శిక్షణ ఇచ్చారని మావటి గోవిందస్వామి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)