బాంధవ్‌గఢ్: ఈ నేషనల్ పార్కులో వరసగా 10 ఏనుగులు ఎందుకు చనిపోయాయి?

సారాంశం
  • బాంధవ్‌గఢ్ నేషనల్ పార్కులో 10 ఏనుగులు మరణం
  • పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
  • కోడో(అరికెలు) పంట తినడం వల్లే మరణించాయనడంపై అనుమానాలు
  • అటవీ విభాగానిదే నిర్లక్ష్యమని విపక్షాల విమర్శలు
  • 1536 చదరపు కి.మీలలో విస్తరించి ఉన్న బాంధవ్‌గఢ్ నేషనల్ పార్కు
    • రచయిత, శురై నియాజీ
    • హోదా, బీబీసీ కోసం
ఏనుగులు

ఫొటో సోర్స్, Vishnukant Tiwari/BBC

ఫొటో క్యాప్షన్, అక్టోబర్ 29న నాలుగు ఏనుగులు మృతి చెందాయి.

మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ నేషనల్ పార్కులో ఇటీవలికాలంలో 10 ఏనుగులు మరణించాయి. ఈ మరణాలకు కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు.

కోడో(అరికెలు) పంటలో ఫంగస్ ఏర్పడి విషపూరితంగా మారిందని, దానిని తిన్న ఏనుగులు మరణించాయని అటవీ విభాగపు ప్రాథమిక దర్యాప్తు చెబుతోంది.

‘‘ఏనుగులు మరణాలకు కారణంపై పూర్తి రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నాం. ఏనుగులు అరికెల పంటను తిన్నాయి. అవి వాటికి విషపూరితంగా మారాయి.’’ అని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వు డిప్యూటీ డైరెక్టర్‌ పీకే వర్మ అన్నారు.

ఈ ఘటనపై ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.

అటవీ విభాగం నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని విపక్షాలు ఆరోపించాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

3 రోజుల్లోనే 10 ఏనుగులు మరణం

అక్టోబర్ 29న నాలుగు ఏనుగులు మరణించాయి. అలాగే ఆరు ఏనుగులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు అటవీ విభాగం గుర్తించింది.

అస్వస్థతతో ఉన్న ఏనుగులకు చికిత్స అందించినా పలు అవయవాలు దెబ్బతినడంతో ఆ తర్వాతరోజు నాలుగు ఏనుగులు చనిపోయాయి. అక్టోబర్ 31న అస్వస్థతతో ఉన్న మరో రెండు ఏనుగులు కూడా మరణించాయి.

ఇక్కడ 13 ఏనుగులు ఒక మందగా ఉండేవి. ఈ మందలో మిగిలిన మూడు ఆరోగ్యంగానే ఉన్నాయని అటవీ విభాగం చెప్పింది. వాటిని కూడా జాగ్రత్తగా గమనిస్తున్నట్లు తెలిపింది.

ఒకేసారి పది ఏనుగులు మరణించిన ఘటన జరగడం ఇదే తొలిసారి. రాష్ట్రం నుంచి కేంద్రం స్థాయిలో ఈ ఘటనపై విచారణ సాగుతోంది.

బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వులో ఈ ఏనుగుల మరణానికి కారణాలను కనుగొనేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్, వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి చెందిన డాక్టర్లు, నిపుణులు ప్రయత్నిస్తున్నారు.

జబల్పూర్ స్కూల్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ ఫోరెన్సిక్, హెల్త్‌కు చెందిన వైద్యుల బృందం ఈ ఏనుగులకు పోస్టుమార్టం చేసింది. రిపోర్టు రావాల్సి ఉంది.

ఈ ఘటనపై విచారణకు కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది.

ఏనుగులు

ఫొటో సోర్స్, ANI

అరికెల పంట తినడం వల్లే మరణించాయా?

‘‘పోస్టుమార్టం సమయంలో, చనిపోయిన ఏనుగుల కడుపులో కోడో పంట(అరికెలు) ధాన్యాలు గుర్తించాం. ఇవే మరణానికి కారణం కావొచ్చు. అంతకుముందు కూడా, మధ్యప్రదేశ్‌లో పాడైపోయిన చిరుధాన్యాలను తినడం వల్ల వన్యప్రాణులు మరణించిన ఘటనలు నమోదయ్యాయి.’’ అని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్‌లైఫ్) వీఎన్ అంబార్డ్ చెప్పారు.

ఆ పార్కులో విస్తరించిన అరికెల పంటను అటవీ విభాగం ధ్వంసం చేయడం ప్రారంభించింది. రెండు రోజుల్లో ఈ పంటను పూర్తిగా ధ్వంసం చేస్తామని అటవీ విభాగం చెప్పింది. ప్రభావితమైన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని పేర్కొంది.

అంతేకాక, ఘటన జరిగిన ప్రాంతం నుంచి 5 కి.మీల వ్యవధిలో పూర్తి స్థాయిలో విచారణ చేసింది అటవీ విభాగం. నీటిలో ఏమైనా విష కారకాలు కలిశాయేమోనన్న అనుమానంతో నీటి వనరులను కూడా తనిఖీ చేసింది.

ఈ మొత్తం ఘటనను దర్యాప్తు చేసేందుకు స్టేట్ టైగర్ స్ట్రయిక్ ఫోర్స్, వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్ర అటవీ శాఖలు సంయుక్తంగా ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేశాయి.

ఏనుగుల మృతి వార్త విని షాకైనట్లు రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు సభ్యుడు సంతోష్ శుక్లా వెల్లడించారు.

‘‘10 ఏనుగులు ఒకేసారి ఒకేరకంగా చనిపోయిన కేసు అంతకుముందు ఎప్పుడూ లేదు. దీనిపై విచారణ చేపట్టాలి. వీటి మరణానికి కారణమేంటన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతా లేదు’’ అని అన్నారు. వేటగాళ్ల ప్రమేయంపై కూడా విచారణ చేపట్టాలని సంతోష్ శుక్లా కోరారు.

‘‘ఏనుగుల ఆహారంగా అరికెల పంటను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ ధాన్యాలు తినడం వల్ల అవి మరణించే అవకాశాలు తక్కువ. అరికెలు తినడం వల్లే 10 ఏనుగులు మరణించాయని అనడం కాస్త అనుమానమే. ఇది చాలా క్లిష్టమైంది కేసు. ఉన్నత స్థాయిలో దీనిపై విచారణ చేపట్టాలి’’ అని మధ్యప్రదేశ్ వన్యప్రాణుల కార్యకర్త అజయ్ దుబే అన్నారు.

కోడో పంట

ఫొటో సోర్స్, S Shukla

ఫొటో క్యాప్షన్, అరికెల పంటను ధ్వంసం చేస్తున్న అధికారులు

మనుషులకు-వన్యప్రాణులకు మధ్య ఘర్షణ

మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలో 1536 చదరపు కి.మీలలో బాంధవ్‌గఢ్ నేషనల్ పార్కు విస్తరించి ఉంది. పులులు అధికంగా ఉన్న పార్కుగా దీనికి పేరుంది.

2018-19లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా 40 అడవి ఏనుగులు ఇక్కడికి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం 150 ఏనుగులు ఉంటే, వాటిల్లో 70 ఏనుగులు బాంధవ్‌గఢ్ నేషనల్ పార్కులోనే నివసిస్తున్నాయి.

అయితే, మనుషులు, వన్యప్రాణుల సంఘర్షణ‌కు ఈ ప్రాంతం నిలయంగా మారింది. ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు మనుషుల మీద దాడి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. శనివారం కూడా అడవి ఏనుగులు ముగ్గురిపై దాడి చేయగా వారిలో ఇద్దరు చనిపోయారు.

మనుషులు, వన్యప్రాణుల జనాభా పెరుగుతుండటం, నిర్వహణ లోపించడంతో ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని సంతోష్ శుక్లా భావిస్తున్నారు.

‘‘ఏనుగులు ఇద్దరిని చంపేశాయి. ప్రజలు కూడా వాటిపట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణలు జరగకుండా ఎలా అడ్డుకోవాలో బాంధవ్‌గఢ్ ఫీల్డ్ ఆఫీసర్లకు తెలియడం లేదు. దీని ఫలితమే మనం చూస్తున్నది’’ అని వన్యప్రాణుల కార్యకర్త అజయ్ దుబే అన్నారు.

ఇలాంటి ఘటనలు కేవలం పర్యాటకంపై మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో మన ప్రతిష్టపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయన్నారు.

ఏనుగులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అన్నారు.

అధికార, విపక్షాలు ఏం అంటున్నాయి?

అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఈ ఘటనపై అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసేందుకు ఉన్నత స్థాయి బృందాన్ని తక్షణమే అక్కడికి పంపించాలని ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్, రాష్ట్ర ప్రతిపక్ష నేత ఉమాంగ్ సింఘార్‌లు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అటవీ విభాగం నిర్లక్ష్యానికి ఫలితమే ఇదని అన్నారు.

ఈ ఘటన వల్ల ఏనుగుల జనాభా బాంధవ్‌గఢ్‌లో ఒక్కసారిగా 10 శాతం తగ్గిందని జైరాం రమేశ్ అన్నారు. తక్షణమే దీనిపై లోతైన విచారణ చేపట్టి, రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ ఘటనకు కారణాలు ఏమైనా ఛత్తీస్‌గఢ్, కర్ణాటకల నుంచి వచ్చిన ఏనుగులను సంరక్షించేందుకు సరైన ఏర్పాట్లు చేయని అటవీ విభాగానిదే అతిపెద్ద నిర్లక్ష్యమని ఉమాంగ్ అన్నారు.

అదనపు రిపోర్టింగ్ బీబీసీ ప్రతినిధి .. విష్ణుకాంత్ తివారి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)