‘మా తాబేలు తప్పిపోయింది, ఆచూకీ తెలిస్తే చెప్పగలరు’.. 20 ఏళ్ల పెంపుడు ప్రాణి ఎలా దొరికింది

ఫొటో సోర్స్, Linzi Cavanagh
- రచయిత, కేట్ మోజర్ ఆండన్, డాటీ మెక్‌లాయిడ్
- హోదా, బీబీసీ న్యూస్, కేంబ్రిడ్జ్‌షైర్
పద్దెనిమిది నెలల కిందట తప్పిపోయిన ఒక పెంపుడు తాబేలు, ఇంటికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని ఒక గుంతలో కనిపించింది.
20 ఏళ్ల ఈ తాబేలు పేరు టలూలా.
కేంబ్రిడ్జ్‌షైర్‌లోని అరింగ్టన్‌లో ఉండే లింజి కావనా కుటుంబం దీన్ని పెంచుకుంటుండేది.
అయితే, గత ఏడాది ఆ ఇంట్లో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఇది తప్పించుకుంది.
దీంతో లింజి కావనా, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
‘టలూలా కనిపించకుండా పోవడంతో నేను, నా నలుగురు పిల్లలం చాలా బాధపడ్డాం’ అని లింజి చెప్పారు.
టలూలా కోసం వారు చాలా వెతికారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది దొరకలేదు.
గుర్రంపై వెళ్తున్న ఓ వ్యక్తి గత నెలలో క్రొయ్దన్ గ్రామ సమీపంలో ఈ తాబేలును చూడడంతో దాని ఆచూకీ తెలిసింది.

‘మేం ఒక పదహారు, పదిహేడు మంది చుట్టూ ఉన్న పొలాలన్నీ వెతికాం. టలూలా ఎక్కడా కనిపించలేదు’ అని కావనా చెప్పారు.
టలూలా ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ లింజి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడంతో పాటు తాముండే ప్రాంతం, చుట్టుపక్కల ఉన్న బస్‌స్టాప్‌లలో పోస్టర్లు అతికించారు.
18 నెలల తరువాత స్థానికుడైన బ్రయాన్ ముర్రే గుర్రంపై వెళ్తూ టలూలా కోసం వేసిన పోస్టర్ చూశారు.
ఆ మరుసటి రోజే ఒక గుంతలో టలూలాను చూశాారాయన.
"నాకు పక్షులను వీక్షించే అలవాటు ఉంది, కాబట్టి ఏదైనా తేడాగా కనిపిస్తే ఇట్టే పసిగట్టేయగలను"
"ఆ తాబేలు దగ్గరికి వెళ్లి చూసి వెంటనే గుర్తుపట్టాను" అని బ్రయాన్ చెప్పారు.
టలూలా తనని తాను రక్షించుకోవడానికి ఒక గుంత తవ్వి.. అందులో తలదాచుకుని కనిపించిందని ముర్రే చెప్పారు.
టలూలాను తిరిగి తనకి అప్పగించినప్పుడు నమ్మశక్యంగా అనిపించలేదని, టలూలా మళ్లీ తమ ఇంటికి చేరుతుందని అనుకోలేదని కావనా అన్నారు .
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














