చైనా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్ష లక్ష్యం ఎవరు? జపాన్, ఆస్ట్రేలియా ఎందుకు ఆందోళన చెందుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి చైనా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ని పరీక్షించడంతో పొరుగుదేశాల నుంచి నిరసన వ్యక్తమైంది.
నలభై ఏళ్ల తరువాత బుధవారం జరిపిన ఈ పరీక్ష సాధారణమైనదేనని.. ఏ దేశాన్నీ లక్ష్యం చేసుకుని పరీక్షించలేదని చైనా చెప్పింది.
‘సంబంధిత దేశాలకు’ ముందే సమాచారం ఇచ్చినట్లు చైనా మీడియా పేర్కొంది.
కానీ తమకు ఎలాంటి హెచ్చరికలు అందలేదని జపాన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ ఆందోళన వ్యక్తం చేశాయి.
చైనా అణుసామర్థ్యాలను పెంపొందించుకుంటోందనే విషయాన్ని ఈ పరీక్ష స్పష్టం చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
తన రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో భాగంగా చైనా అణ్వాయుధాలను పెంచుకుంటోందని నిరుడు అమెరికా హెచ్చరించింది.
ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 5,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
అమెరికా ప్రధాన భూభాగం, హవాయి కూడా ఈ రేంజ్‌లో ఉంటాయి.


ఫొటో సోర్స్, Getty Images
చైనా ఆయుధ సంపత్తి ఎంత?
చైనా ఆయుధ సంపత్తి ఇప్పటికీ అమెరికా, రష్యా ఆయుధ సంపత్తిలో అయిదో వంతు కంటే తక్కువే అని అంచనా వేస్తున్నారు.
మరోవైపు చైనా తన అణ్వస్త్రాల పెంపు కేవలం ఆత్మరక్షణ కోసమేనని చాలా కాలంగా చెబుతోంది.
ఈ ఖండాంతర క్షిపణికి డమ్మీవార్ హెడ్ అమర్చి స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8:44 గంటలకు పరీక్షించినట్లు చైనా ప్రకటించింది.
దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉన్నట్లుగా చెప్తున్న నిర్దేశిత లక్ష్యానికి ఈ క్షిపణి చేరుకుంది.
తమ వార్షిక శిక్షణలో భాగంగా ఇదో సాధారణ పరీక్ష అని చైనా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.
చైనా చివరిసారిగా 1980ల్లో అంతర్జాతీయంగా ఐసీబీఎంను పరీక్షించిందని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా చైనా అంతర్గతంగా పరీక్షలు జరుపుతుంది. గతంలో జిన్‌జియాంగ్ ప్రాంతంలోని ఎడారిలో పరీక్షలు జరిపింది.
ఈ తరహా పరీక్షలు అమెరికా సహా ఇతరదేశాలకు సాధారణమేనని కానీ చైనా విషయంలో ఇది అసాధారణమేనని అణుక్షిపణి విశ్లేషకుడు అంకిత్ పాండా బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, 3DSCULPTOR
ఇతర దేశాల ఆందోళన
చైనా క్షిపణి ప్రయోగంపై ఇతర దేశాలు వెంటనే ప్రతిస్పందించాయి. తమకు ఎటువంటి హెచ్చరికలు అందలేదని జపాన్ తెలిపింది. బీజింగ్ సైనిక సామర్థ్యం పెంపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
చైనా చర్య ప్రాంతీయ అస్థిరతను పెంచుతోందని, దీనిపై వివరణ కోరామని ఆస్ట్రేలియా తెలిపింది. చైనా క్షిపణి ప్రయోగాన్ని అవాంఛనీయమైన, అందోళనకర పరిణామంగా న్యూజీలాండ్ అభివర్ణించింది.
చైనా చర్యలు ప్రధానంగా రాజకీయ సందేశాన్ని పంపడానికి ఉద్దేశించినట్టుగా తాను భావించడం లేదని పాండా చెప్పారు. "కానీ, ఇది ఆసియాలో అణు విధానాలు వేగంగా మారుతున్నాయనే విషయాన్ని ఈ ప్రాంతానికి, అమెరికాకు స్పష్టంగా గుర్తు చేస్తుందనడంలో సందేహం లేదు’’ అన్నారు.
‘తైవాన్ జలసంధి ప్రాంతంలో ఘర్షణల్లో అమెరికా ప్రత్యక్ష్య జోక్యం చేసుకుంటే దాని ప్రధాన భూభాగానికి ముప్పు ఉంటుందని వాషింగ్టన్‌కు నేరుగా సందేశం పంపడమే’ అని దక్షిణ కొరియాలోని ఈవా మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ లీఫ్ ఎరిక్ ఈస్లే చెప్పారు.
‘‘తమ పరీక్ష ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకున్నది కాదని చైనా చెబుతోంది. కానీ చైనా, జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నాయి. ఇక తైవాన్‌తో శాశ్వత ఉద్రిక్తతలు ఎటూ ఉండనే ఉన్నాయి’’ అని సింగపూర్‌లోని లీ కువాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విజిటింగ్ రీసెర్చ్ ఫెలో డ్రూ థాంప్సన్ ‘ఎక్స్’లో రాశారు.

ఫొటో సోర్స్, TASS
చైనా దూకుడు
గత ఏడాది కాలంలో బీజింగ్, వాషింగ్టన్ మధ్య సంబంధాలు మెరుగుపడినప్పటికీ ఈ ప్రాంతంలో చైనా దూకుడు పెరుగుతోంది. వివాదాస్పద జలాల్లో చైనా, ఫిలిప్పీన్స్ నౌకలు తలపడడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.
చైనా గూఢచారి విమానం తమ గగనతలాన్ని ఉల్లంఘించిందని ఆరోపించిన జపాన్... ‘‘ఎట్టిపరిస్థితులలోనూ ఇటువంటివి ఉపేక్షించమంటూ’’ గత నెలలో యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది.
స్వపరిపాలన కలిగిన తైవాన్‌తో చైనా సంబంధాలు దెబ్బతినడం మరో కారణం.
చైనా ఇటీవల ముమ్మరంగా క్షిపణి ప్రయోగాలు, ఇతర విన్యాసాలు చేస్తోందని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
తైవాన్ పరిసరాలలో 23 చైనా సైనిక విమానాలు చక్కర్లు కొడుతున్నట్టు గుర్తించామని పేర్కొంది.
తన చొరబాట్లను సాధారణీకరించడానికి ‘‘గ్రేజోన్ వార్‌ఫేర్’’ వ్యూహంతో చైనా తరచూ తైవాన్ జల్లాలోకి నౌకలను, గగనతలంలోకి విమానాలను పంపుతోంది.
తైవాన్‌కు అమెరికా ఆయుధ విక్రయాలను కొనసాగిస్తుండడంతో జులైలో చైనా వాషింగ్టన్‌తో తన అణ్వాయుధ నియంత్రణ చర్చలను నిలిపివేసింది.
అమెరికా కంటే చైనా అణ్వాయుధాల సంఖ్య తక్కువే అయినప్పటికీ చైనా అణు ఆధునికీకరణ గురించి నిరుడు అమెరికా హెచ్చరించింది. చైనా వద్ద 500 ఆపరేషనల్ న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయని పెంటగాన్ అంచనా వేసింది. వీటిల్లో 350 ఖండాంతర క్షిపణులు కూడా ఉన్నాయి.
2030 నాటికి చైనా దగ్గర వెయ్యి వార్‌హెడ్‌లు ఉండొచ్చని నివేదిక అంచనా వేసింది. తమ వద్ద 5,000 వార్‌హెడ్స్ ఉన్నాయని అమెరికా, రష్యాలు చెబుతున్నాయి.
చైనా మిలటరీకి చెందిన రాకెట్ ఫోర్స్, దాని అణ్వాయుధాలను నిర్వహించే యూనిట్ చుట్టూ వివాదాలు ఉన్నాయి.
అవినీతి వ్యతిరేక ప్రచారంలో భాగంగా గత ఏడాది ఇద్దరు నేతలను విధుల నుంచి తప్పించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














