లాపతా లేడీస్ ఆస్కార్ నామినేషన్‌పై వివాదం ఏమిటి?

లాపతా లేడీస్

ఫొటో సోర్స్, Prodip Guha/Getty Images

    • రచయిత, అజయ్ బ్రహ్మాత్మజ్, ఫిల్మ్ జర్నలిస్ట్
    • హోదా, బీబీసీ కోసం

ఈ ఏడాది భారతదేశం తరపున ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్‌లో, కిరణ్ రావు దర్శకత్వం వహించిన 'లాపతా లేడీస్' చిత్రాన్ని ఆస్కార్‌కు పంపనున్నట్లు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ ప్రకటనతో వివాదం మొదలైంది.

పాయల్ కపాడియా నటించిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ను పంపితే బాగుండేదని చాలామంది అంటున్నారు.

ఈ ఏడాది భారత్‌లో వివిధ భాషలకు చెందిన 29 చిత్రాలను పరిశీలించారు.

వీటిలో 'కల్కి 2898 ఎ.డి.', 'యానిమల్', 'చందు చాంపియన్', 'సామ్ బహదూర్', 'ఆర్టికల్ 370' లాంటి చిత్రాలున్నాయి. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన 13 మంది సభ్యుల జ్యూరీ, కిరణ్ రావు 'లాపతా లేడీస్'ను ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో ఆస్కార్‌కు పంపాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది.

ఈ చిత్రాన్ని గత ఏడాది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. కానీ భారత్‌లో ఇది ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైంది.

8 వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఈ చిత్రం, అత్యధికంగా వీక్షించిన చిత్రంగా నిలిచింది.

భారత్‌కు చెందిన ‘లాపతా లేడీస్'తో పాటు, 50-52 దేశాల నుంచి చిత్రాలను ఈ విభాగంలో పంపుతారు.

‘లాపతా లేడీస్‌' చిత్రం ఆస్కార్‌ ఎంట్రీకి ఎంపికైన అనంతరం దర్శకురాలు కిరణ్‌రావు మాట్లాడుతూ, ‘‘ఇది మా టీమ్‌ సమిష్టి కృషికి గుర్తింపు. మనసులను కలిపేందుకు, సరిహద్దులను చెరిపేందుకు, అర్ధవంతమైన చర్చలను ప్రారంభించడానికి సినిమా ఎప్పుడూ ఒక శక్తిమంతమైన మాధ్యమం. భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లాపతా లేడీస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాపతా లేడీస్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో చాలా ఆదరణ లభించింది

ఆమిర్ ఖాన్ అనుభవం నుంచి లాభం పొందుతారా?

'లాపతా లేడీస్' నిర్మాత ఆమిర్ ఖాన్. ఆయన నిర్మించిన 'లగాన్', 'తారే జమీన్ పర్' గతంలో ఈ వర్గంలో ఆస్కార్‌కు వెళ్లాయి. ఆమిర్ ఖాన్ గత అనుభవాలను ఉపయోగించుకుని ‘లాపతా లేడీస్' ఆస్కార్ ఎంట్రీని ప్రత్యేక స్థానానికి తీసుకెళతాడని భావిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో పంపిన చిత్రాలను ఆస్కార్ జ్యూరీ పరిశీలిస్తుంది.

తమ సినిమాను వాళ్ల దృష్టికి తీసుకువెళ్లాలంటే ఆయా సినిమాల నిర్మాతలు చాలా పబ్లిసిటీ ఏర్పాట్లు చేసుకోవాలి.

ఈ ప్రచారానికి భారీగా ఖర్చవుతుంది. ఎంచుకున్న సినిమా వెనుక బలమైన నిర్మాత లేకుంటే, దాని ప్రమోషన్, అవసరమైన ఖర్చుల కోసం ఒక్కోసారి నిధుల సేకరణ కూడా చేయాల్సి వస్తుంది.

ఆస్కార్ అవార్డుల నిపుణుల అభిప్రాయం ప్రకారం, అవార్డులకు అర్హమైన చిత్రాలను నిర్ణయించడం, వాటిని పరిశీలించడం కోసం ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. భారత్ సహా పలు దేశాలు దీనిలో వెనుకబడ్డాయి.

ముంబై హిందీ చలనచిత్ర పరిశ్రమ, ఇతర భాషా చిత్ర పరిశ్రమలకు చెందిన చిత్రనిర్మాతలు ఈ 'ఆస్కార్ ప్రచారాన్ని' భారతీయ చిత్రాలకు అనవసరంగా భావిస్తారు. భారతీయ చిత్రాల సామర్థ్యానికి ఆస్కార్‌ ముద్ర అవసరం ఏమిటని మరికొందరు అంటారు.

కళ, సంస్కృతి, సినిమాల ప్రపంచీకరణ నేపథ్యంలో సినిమాలను ఎలాంటి ప్రమాణాలతో నిర్మిస్తున్నారో, అంతర్జాతీయ వేదికలపై వాటికి ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుందో మనందరికీ తెలుసు.

కిరణ్ రావు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిరణ్ రావు

లాపతా లేడీస్ విశిష్టత

కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్' 23 ఏళ్ల క్రితం 2001లో జరిగిన కథ.

ఎలాంటి వివాదాలు లేకుండా ఉండేందుకు కథ జరిగే ప్రదేశానికి కిరణ్ రావు 'నిర్మల్ ప్రదేశ్' అనే పేరు పెట్టారు. ఈ సినిమాలో కిరణ్ శతాబ్దాలుగా సమాజంలో ఉన్న పురుషాధిక్యతను బట్టబయలు చేశారు.

సినిమా రచయితలు, దర్శకురాలు నిశితమైన దృష్టితో, సమాజంలో ప్రబలంగా ఉన్న లైంగిక వివక్ష, సంప్రదాయవాదాన్ని ఒక మామూలు కథలోని రెండు స్త్రీ పాత్రల ద్వారా వివరంగా వెల్లడించారు.

మంచి విషయమేమిటంటే, సినిమాలో ఎలాంటి నినాదాలు లేవు, దూకుడుగా ఉండే స్త్రీవాదమూ లేదు.

రోజువారీ జీవితంలోని సంఘటనలతో హిందీ సమాజంలో మహిళల పరిస్థితులను సున్నితంగా వెల్లడించారు.

చాలా కాలం తర్వాత ఈ హిందీ సినిమాలో గ్రామీణ జీవితాన్ని చూపించారు. అదే సమయంలో గ్రామీణ జీవితంలోని అసౌకర్యాలూ సినిమాలో కనిపిస్తాయి.

నెమ్మదిగా సాగే జీవిత కథ

మెల్లగా సాగిపోయే జీవితంలో తప్పు లేకున్నా, గ్రామీణ పరిసరాలను, జీవితాన్ని చూస్తే ఈ ప్రాంతాలకు అభివృద్ధి ఎందుకు చేరలేదా అని ఆశ్చర్యం కలుగుతుంది?

ఈ సినిమాలో ఏదీ కృత్తిమంగా కనిపించదు. ‘లాపతా లేడీస్’ క్రియేటివ్ అండ్ టెక్నికల్ టీమ్ ఉమ్మడి ప్రయత్నాల వల్ల అన్నీ సహజంగానే కనిపిస్తాయి. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా, సన్నివేశం, వాతావరణం, సెట్, దుస్తులు నకిలీగా కనిపించేవి.

కథ విషయానికి వస్తే - ఫూల్, జయ ఇద్దరు వధువులు. పెళ్లయ్యాక ఇద్దరూ ఒకే రైలులో ప్రయాణిస్తుంటారు. రైలు కంపార్ట్‌మెంట్‌లో మరికొందరు వధువులూ కూర్చుని ఉంటారు.

దాదాపు అందరూ ముసుగులు వేసుకుని ఉంటారు. ఆ ముసుగు వాళ్ల సామాజిక పరిస్థితికి ప్రతిరూపం. అయితే ఒక పొరబాటు కారణంగా ఇద్దరు వధువులు మారిపోతారు.

యాదృచ్ఛికంగా జరిగిన ఈ సంఘటనను చూసి మనకు నవ్వొస్తుంది, అయితే మనం పాత్రలతో కలిసి ముందుకు వెళ్లే క్రమంలో పరిస్థితి సంక్లిష్టత మనకు అర్థమవుతుంది. ఫూల్, జయ తమ వాళ్లను ఎలా చేరుకుంటారో అని మనమూ ఆందోళన చెందుతాము.

కొంచెం భిన్నమైనా ఫూల్, జయల పరిస్థితి దాదాపు ఒకటే. ఇద్దరి పరిస్థితీ అనిశ్చితమే. వాళ్ల భర్తలు ఇద్దరూ భిన్న స్వభావం కలిగిన వాళ్లు. దీపక్ ఆలోచనల్లో ప్రగతిశీలి, కానీ ప్రదీప్ సంప్రదాయవాది, పురుషాధిక్యత కలిగిన వాడు.

ఫూల్, జయ, దీపక్, ప్రదీప్ అనే ఈ నాలుగు పాత్రల మధ్య స్త్రీల గుర్తింపు, కుటుంబ ప్రతిష్ట అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కిరణ్ రావు ఈ ప్రశ్నలను చాలా మామూలుగా చూపిస్తూ, కొన్ని ముఖ్యమైన విషయాలను వివరిస్తారు.

రవి కిషన్, కిరణ్ రావు, అమీర్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రవి కిషన్, కిరణ్ రావు, ఆమిర్ ఖాన్

ఆస్కార్‌కు పంపే చిత్రాలపై విమర్శలు

బిప్లవ్ గోస్వామి, స్నేహా దేశాయ్, దివ్యనిది శర్మల రచనలో కొత్తదనం ఉంది. దానితో పాటు కొత్త నటీనటులు కావడం వల్ల వారిపై ప్రేక్షకులు ఎలాంటి ముందస్తు అంచనాలు పెట్టుకోరు.

‘లాపతా లేడీస్‌’లో కిరణ్‌రావు ఒక్క రవికిషన్‌ను తప్ప మరే పాపులర్‌ ఆర్టిస్టునూ తీసుకోలేదు. రవి కిషన్‌కూ ఆయన పాపులర్ ఇమేజ్‌కి భిన్నంగా చిన్న పాత్రను ఇచ్చారు. అయితే ఆయన తనదైన శైలి, నటనతో ఆకట్టుకుంటారు.

దశాబ్దాలుగా పేదరికం, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే సినిమాలనే భారతదేశం నుంచి అంతర్జాతీయ వేదికలకు పంపుతున్నారని ‘లాపతా లేడీస్' విమర్శకులు అంటున్నారు.

‘లాపతా లేడీస్’ కొత్త ప్రయత్నం. బహుభాషా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చిత్రాల ఎంపిక విషయంలో ప్రతి సంవత్సరం వివాదాలు ఉంటూనే వస్తున్నాయి.

నటీనటులతో కిరణ్ రావు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నటీనటులతో కిరణ్ రావు

హిందీ చిత్రాలకే ప్రాధాన్యత ?

ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ముంబయిలో ఉంది.

ఆస్కార్ ఎంట్రీ కోసం చాలా హిందీ సినిమాలు పరిశీలనకు వస్తాయి. జ్యూరీలో ముంబయి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతినిధులూ ఉంటారు. అందుకే హిందీ చిత్రాలను ఎక్కువగా ఎంపిక చేసినట్లు కనిపిస్తుంది.

ఈ ఏడాది సైతం పరిశీలనకు వచ్చిన 29 సినిమాల్లో, 14 సినిమాలు హిందీవి.

జ్యూరీ సభ్యుల అర్హతలపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్న ఉత్తమ చిత్రాన్ని మాత్రమే ఆస్కార్ ఎంట్రీకి పంపాలనే సూచనా ఒకటి వచ్చింది.

గత కొన్నేళ్లుగా పరిశీలనకు పంపే సినిమాలతో పాటు భారీగా ఫీజులు చెల్లించాల్సి రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకలాపాల గురించి తమకు సకాలంలో సమాచారం అందడం లేదని అనేకమంది నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్కార్‌కు ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీకి చిత్రాలను పంపుతున్న నేపథ్యంలో, మన చిత్రాలకు ఎలాంటి ఆదరణ లభిస్తోంది అనే ఆసక్తి అందరిలోనూ కలుగుతుంది. దానికి సంబంధించిన వార్తలతో మనం సంతోషిస్తుంటాము.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్-ఫిబ్రవరి మధ్య భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'ఆస్కార్ క్యాంపెయిన్' నడుస్తుంది.

ఈ ప్రచారంలో నిజమెంతో కూడా మనకు తెలుసు. 2001లో, ఆమిర్ ఖాన్ నిర్మాణంలో అశుతోష్ గోవరికర్ దర్శకత్వం వహించిన చిత్రం 'లగాన్' నామినేషన్ జాబితాను చేరుకుంది.

ప్రతి సంవత్సరం ఒక సినిమాను పంపడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇప్పటి వరకు మూడు భారతీయ సినిమాలు మాత్రమే నామినేట్ అయ్యాయి.

రికార్డుల ప్రకారం, 1957 నుంచి ఈ విభాగంలో ప్రతి సంవత్సరం ఒక భారతీయ చిత్రాన్ని పంపుతున్నారు. కానీ ఇప్పటివరకు 'మదర్ ఇండియా' (1957), 'సలామ్ బాంబే' (1988), 'లగాన్' (2001) మాత్రమే నామినేషన్ దశను చేరుకోగలిగాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)