వందేళ్ల చెస్ ఒలింపియాడ్‌‌లో తొలిసారి స్వర్ణాన్ని ముద్దాడిన భారత్‌, ఈ కల ఎలా సాకారమైందంటే..

చెస్ ఒలింపియాడ్‌ 2024 విజేతలు..

ఫొటో సోర్స్, X/International Chess Federation

చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. బుడాపెస్ట్‌లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్‌లో ఓపెన్, మహిళల విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాలు సాధించింది. చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణ పతకాలు సాధించడం ఇదే తొలిసారి.

యువ గ్రాండ్ మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్‌, అర్జున్ ఇరిగేశి, దివ్య దేశ్‌ముఖ్ అద్భుతంగా రాణించడంతో భారత్ రెండు కేటగిరీల్లోనూ గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది.

శ్రీనాథ్ నారాయణన్ కెప్టెన్సీలో, దొమ్మరాజు గుకేశ్‌, ఆర్ ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేశి, విదిత్ గుజరాతి, హరికృష్ణ పెంటేల బృందం ఓపెన్ కేటగిరీలో పోటీపడింది.

భారత జట్టు తొలి నుంచీ ఆధిక్యత ప్రదర్శించింది. మొత్తం 11 మ్యాచ్‌లలో 10 మ్యాచ్‌లను గెలిచింది. 11వ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

బీబీసీ న్యూస్ తెలుగు

చివరి రౌండ్‌కు ముందు చైనా కంటే 2 పాయింట్ల ఆధిక్యంలో ఉన్న భారత జట్టు ఫైనల్‌ రౌండ్‌ను డ్రాగా ముగించినా స్వర్ణ పతకం ఖాయమయ్యేది.

అయితే, ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆధిక్యత ప్రదర్శించిన భారత్, స్లోవేనియాను 3.5 - 0.5తో ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.

చెస్ ఒలింపియాడ్‌ 2024 విజేతలు..

ఫొటో సోర్స్, X/International Chess Federation

ఫొటో క్యాప్షన్, గుకేశ్

ఈ టోర్నమెంట్‌లో యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మొత్తం 10 గేమ్‌లలో గుకేశ్ 9 పాయింట్లు సాధించి టాప్ బోర్డులో వ్యక్తిగత స్వర్ణం కూడా గెలుచుకున్నాడు.

మరో గ్రాండ్ మాస్టర్, తెలుగు కుర్రాడు అర్జున్ ఇరిగేశి 11 గేమ్‌లలో 10 పాయింట్లు సాధించి బోర్డ్ త్రీలో వ్యక్తిగత స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

చెస్ ఒలింపియాడ్‌ 2024 విజేతలు..

ఫొటో సోర్స్, X/International Chess Federation

ఫొటో క్యాప్షన్, అర్జున్ ఇరిగేశి

వీరిద్దరూ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీ ఎకెక్స్(ఎఫ్‌ఐడీఈ) రేటింగ్స్‌లోనూ మెరుగైన పాయింట్లతో ముందుకు దూసుకెళ్తున్నారు. 2800 పాయింట్లకు చేరువయ్యారు.

ఈ ఎఫ్‌ఐడీఈ (ఫిడే), ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీ ఎకెక్స్ అనే ఫ్రెంచ్ పదానికి సంక్షిప్త పదం. దీనినే వరల్డ్ చెస్ ఫెడరేషన్‌‌గా వ్యవహరిస్తారు.

1924లో ప్రారంభమైన ఈ చెస్ ఒలింపియాడ్‌లో భాగంగా ఈసారి జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ తొలిసారి స్వర్ణ పతకాలు సాధించినట్లు ది హిందూ అనుబంధ వెబ్‌సైట్ స్పోర్ట్స్స్‌స్టార్ పేర్కొంది.

చెస్ ఒలింపియాడ్ 2024 విజేతలు..

ఫొటో సోర్స్, X/International Chess Federation

ఫొటో క్యాప్షన్, దివ్య దేశ్‌ముఖ్

మహిళల విభాగంలో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. ఏడు రౌండ్ల వరకూ వరుస విజయాలతో ముందంజలో ఉన్న భారత మహిళల జట్టు 8వ రౌండ్‌లో పోలాండ్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత అమెరికాతో జరిగిన గేమ్‌ను డ్రాగా ముగించింది. అయినప్పటికీ, ఫైనల్ మ్యాచ్‌లో పోరాడి గెలిచిన మహిళల జట్టు భారత్‌కు గోల్డ్ మెడల్‌ను సాధించిపెట్టింది.

అభిజిత్ కుంటే కెప్టెన్సీలోని హారిక ద్రోణవల్లి, వైశాలి ఆర్, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, తానియా సచ్‌దేవ్ బృందం చెస్ ఒలింపియాడ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. ఫైనల్ రౌండ్‌కి ముందు చెరో 17 పాయింట్లతో భారత్, కజకిస్తాన్ సమానంగా ఉన్నాయి. ఇక ఫైనల్ రౌండ్‌లో భారత్ 3.5 - 0.5 పాయింట్లతో ప్రత్యర్థి అజర్‌బైజాన్‌ను ఓడించింది. అదే సమయంలో కజకిస్తాన్, అమెరికాతో మ్యాచ్‌ను 2-2తో డ్రాగా ముగించడంతో భారత్‌కు స్వర్ణ పతకం ఖాయమైంది.

భారత జట్టులో కొత్తగా చోటుదక్కించుకున్న 18 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ ఈ టోర్నమెంట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆమె ఆడిన గేమ్‌లలో 9.5 పాయింట్లు సాధించడంతో పాటు, చివరి మ్యాచ్‌లో కీలక విజయాన్ని సాధించి భారత్‌ స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించింది. అలాగే, వ్యక్తిగతంగానూ గోల్డ్ మెడల్ అందుకుంది.

చెస్ ఒలింపియాడ్ 2024 విజేతలు..

ఫొటో సోర్స్, X/International Chess Federation

రజతం, కాంస్య పతకాలకూ హోరాహోరీ పోటీ కొనసాగింది. రెండో స్థానం కోసం ఐదు జట్లు పోటీ పడ్డాయి. ఫైనల్‌ రౌండ్‌ కోసం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 17 పాయింట్లతో బలంగా ఉన్న చైనాను ఓడించి అమెరికా 17 పాయింట్లకు చేరింది. ఫ్రాన్స్‌ను స్వల్ప తేడాతో ఓడించిన ఉజ్బెకిస్తాన్, యుక్రెయిన్‌పై విజయం సాధించిన సెర్బియా, ఇరాన్‌ను స్వల్ప తేడాతో ఓడించిన అర్మేనియా కూడా 17 పాయింట్లు సాధించి రజతం, కాంస్య పతకాల రేసులో నిలిచాయి.

అయితే, ట్రై బ్రేక్స్‌ రేటింగ్‌లో ముందంజలో ఉన్న అమెరికా రజత పతకాన్ని సొంతం చేసుకోగా, ఉజ్బెకిస్తాన్ కాంస్యం సాధించింది.

మహిళల విభాగంలో కజకిస్తాన్ టోర్నమెంట్ చివరి వరకూ గట్టి పోటీనిచ్చింది. స్వర్ణ పతకం కోసం ఆఖరి వరకూ పోరాడింది. చెరి 17 పాయింట్లతో భారత్, కజకిస్తాన్ ఫైనల్ రౌండ్‌లో పోటీపడ్డాయి. ఈ రౌండ్‌లో అజర్‌బైజాన్‌ను భారత్ 3.5 - 0.5 పాయింట్లతో ఓడించడం, మరోవైపు అమెరికాతో జరిగిన మ్యాచ్‌ను కజకిస్తాన్ 2-2తో డ్రాగా ముగించడంతో భారత్ స్వర్ణం సాధించింది.

కజకిస్తాన్ 18 పాయింట్లతో రజత పతకానికి పరిమితమైంది. కాంస్య పతకం కోసం అమెరికా, స్పెయిన్, అర్మేనియా, జార్జియా పోటీపడ్డాయి. అయితే రేటింగ్‌లో ముందంజలో ఉన్న అమెరికా కాంస్య పతకం సొంతం చేసుకుంది.

గేమ్‌లో విజయం సాధించిన జట్టుకు 2 పాయింట్లు, మ్యాచ్ డ్రాగా ముగిస్తే ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తాయి.

చెస్ ఒలింపియాడ్ 2024

ఫొటో సోర్స్, Getty Images

ఫైనల్ రౌండ్‌లో టాప్ మ్యాచ్‌లు..

ఓపెన్ కేటగిరీ..

భారత్ (19) 3.5 - 0.5 స్లోవేనియా (16)

చైనా(17) 1.5 - 2.5 అమెరికా (15)

స్పెయిన్ (15) 2 - 2 హంగేరీ (15)

ఉజ్బెకిస్తాన్ (15) 2.5 - 1.5 ఫ్రాన్స్ (15)

సెర్బియా (15) 3.5 - 0.5 యుక్రెయిన్ (15)

అర్మేనియా (15) 2.5 - 1.5 ఇరాన్ (14)

మహిళల కేటగిరీ..

భారత్ (17) 3.5 - 0.5 అజర్‌బైజాన్ (15)

కజకిస్తాన్ (17) 2 - 2 అమెరికా (16)

పోలాండ్ (16) 0.5 - 3.5 జార్జియా (15)

హంగేరీ (15) 0.5 - 3.5 స్పెయిన్ (15)

అర్మేనియా (15) 3 - 1 జర్మనీ (14)

చెస్ ఒలింపియాడ్ 2024

ఫొటో సోర్స్, X/International Chess Federation

ఫొటో క్యాప్షన్, కజకిస్తాన్

పాయింట్ల పట్టికలో ఎవరెక్కడ..

  • ఓపెన్:

భారత్ - 21

అమెరికా - 17

ఉజ్బెకిస్తాన్ - 17

చైనా - 17

సెర్బియా - 17

అర్మేనియా - 17

జర్మనీ - 16

అజర్‌బైజాన్ - 16

స్లోవేనియా - 16

స్పెయిన్ - 16

  • మహిళలు:

భారత్ - 19

కజకిస్తాన్ - 18

అమెరికా - 17

స్పెయిన్ - 17

అర్మేనియా - 17

జార్జియా - 17

చైనా - 16

ఉక్రెయిన్ - 16

పోలాండ్ - 16

బల్గేరియా - 16

చెస్ ఒలింపియాడ్ 2024లో హారిక ద్రోణవల్లి

ఫొటో సోర్స్, X/International Chess Federation

ఫొటో క్యాప్షన్, హారిక ద్రోణవల్లి

చాలా గర్వంగా ఉంది: హారిక ద్రోణవల్లి

అందరికంటే, తనకు చాలా ఎమోషనల్ విషయమని హారిక ద్రోణవల్లి అన్నారు. ''బంగారు పతకం కోసం 20 ఏళ్లుగా ఆడుతున్నా. ఎట్టకేలకు, పోడియంపై భారత్‌ నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. మహిళగా మరింత గర్వపడుతున్నా. యువ గ్రాండ్ మాస్టర్లు వచ్చారు, అద్భుతంగా ఆడారు'' అని ఆమె అన్నారు.

వ్యక్తిగతంగానూ, జట్టుపరంగానూ చాలా ఆనందంగా ఉందని గుకేశ్ అన్నారు. ''టోర్నమెంట్‌లో నా ప్రదర్శన, నా జట్టు ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉన్నా. కల నెరవేరింది'' అన్నారు.

''మంచి ప్రారంభం దొరికింది, కాకపోతే మధ్యలో కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. వాటిని తట్టుకుని విజయం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉంది. నిలకడగా రాణించి, గోల్డ్‌మెడల్ సాధించాం. చాలా ఎమోషనల్‌గా ఫీలవుతున్నా'' అన్నారు దివ్య దేశ్‌ముఖ్.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని ప్రశంసలు..

ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో ఓపెన్, మహిళల విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన భారత జట్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’లో అభినందనలు తెలిపారు.

''45వ చెస్ ఒలింపియాడ్‌‌లో భారత్ చారిత్రక విజయం సాధించింది. చెస్ ఒలింపియాడ్‌లో ఓపెన్, మహిళల విభాగాల్లో స్వర్ణాలు గెలుచుకుంది. ఇంతటి అద్భుత విజయం సాధించిన పురుషులు, మహిళల జట్లకు అభినందనలు. ఈ అద్భుత విజయం కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది''అని ఆయన తన ఎక్స్‌లో ఖాతాలో పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

చెస్ ఒలింపియాడ్‌లో విజయం సాధించిన భారత చెస్ గ్రాండ్ మాస్టర్లను లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు.

''చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారి స్వర్ణ పతకాలు సాధించడం థ్రిల్‌గా ఉంది. దొమ్మరాజు గుకేశ్, అర్జున్ ఇరిగేశి, విదిత్ గుజరాతీ, ఆర్ ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ, శ్రీనాథ్ నారాయణన్ బృందానికి హృదయపూర్వక అభినందనలు. దివ్య దేశ్‌ముఖ్, ఆర్ వైశాలి, డి హారిక, తానియా సచ్‌దేవ్, వంతికా అగర్వాల్, కెప్టెన్ అభిజిత్ కుంటే, అందరికీ హృదయపూర్వక అభినందనలు'' అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)