ఒలింపిక్స్-ఇమేన్ ఖెలిఫ్: ‘మగ’ ఆరోపణల మధ్య స్వర్ణం సాధించిన మహిళా బాక్సర్

ఫొటో సోర్స్, Getty Images
లింగ అర్హత పరీక్షలో విఫలమై ప్రపంచ చాంపియన్‌షిప్‌ల నుంచి అనర్హురాలైన ఏడాది తర్వాత ఇమేన్ ఖెలిఫ్ ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ స్వర్ణాన్ని గెలుచుకుంది.
66 కేజీల విభాగంలో జరిగిన బాక్సింగ్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్, చైనాకు చెందిన యాంగ్ లియును ఈ అల్జీరియన్ బాక్సర్ ఓడించింది.
"ఇది నా కల. నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇదొక అద్భుతం" అని 25 ఏళ్ల ఖెలిఫ్ బీబీసీతో అన్నది.
"ఎనిమిదేళ్లు కష్టపడ్డా, నిద్ర కూడా సరిగా లేదు. అల్జీరియా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. నా పెర్ఫార్మెన్స్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నా. నేను బలమైన మహిళను. ఈ పోటీలో పాల్గొనేందుకు నాకు పూర్తి అర్హత ఉంది’’ అని అన్నదామె.
"నేను మహిళగా పుట్టాను. మహిళగా జీవించాను. మహిళగానే పోటీ పడ్డాను. అందులో ఎటువంటి సందేహం లేదు" అని ఇమేన్ ఖెలిఫ్ స్పష్టం చేసింది.
వేధింపులకు బాధితురాలినని, ఐబీఏ తనను అసహ్యించుకుంటోందని ఆమె ఆరోపించింది. 'నా విజయం చూసి ఓర్వలేని వాళ్లే విమర్శిస్తున్నారు' అన్నది ఖెలిఫ్.
ఫైనల్ ముగిశాక ఖెలిఫ్‌ను ప్రత్యర్థి యాంగ్ ఆమెను అభినందించింది.
ఇటలీకి చెందిన ఏంజెలా కరినితో ఖెలిఫ్ ఫైట్ తర్వాతి దృశ్యాలకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. రజత, కాంస్య పతక విజేతలు ఖెలిఫ్‌ను అభినందించారు. అల్జీరియన్ జాతీయ గీతం ప్లే చేసినపుడు ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
తైవాన్ బాక్సర్ లిన్ యు-టింగ్ కూడా గత సంవత్సరం ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ద్వారా నిషేధం ఎదుర్కొన్న మరొక బాక్సర్. శనివారం ఆమె 57 కేజీల మహిళల ఫైనల్‌లో పోరాడుతోంది.


ఫొటో సోర్స్, Getty Images
46 సెకన్లలోనే గెలుపు
ఖెలిఫ్‌తో మొదటి ఫైట్‌లో ఇటలీ బాక్సర్ ఏంజెలా కరిని 46 సెకన్లలోనే పోటీ నుంచి నిష్క్రమించింది. బౌట్‌ను వదిలేసిన ఏంజెలా ‘ నా ప్రాణాలను కాపాడుకోవాలి’ అని అన్నది.
యాంగ్‌తో ఫైనల్ కష్టమని అనుకున్నా, ఖెలిఫ్ సులువుగానే గెలిచింది. ఖెలిఫ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం లభించింది.
ఖెలిఫ్ గత సంవత్సరమే ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో యాంగ్‌తో తలపడాల్సి ఉంది. ఖెలిఫ్‌పై ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) అనర్హత వేటు వేసింది. దీంతో ఖెలిఫ్, యాంగ్ ఆ టోర్నీలో పోటీపడలేదు. ఆ పోటీలలో వాంగ్ టైటిల్ గెలుపొందింది.
‘‘ఖెలిఫ్, లిన్ యులు ఐబీఏ నిబంధనల ప్రకారం మహిళల పోటీలో పాల్గొనే అర్హత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యారు" అని ఐబీఏ ఆ రోజు ప్రకటించింది.
అయితే, ఒలింపిక్స్‌లో బాక్సింగ్ ఈవెంట్‌లను నిర్వహించే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఇరువురిని పోటీలకు అనుమతించింది. దీనిని ఐబీఏ తీవ్రంగా విమర్శించింది. అయితే ఖెలీఫ్, లిన్‌లు ‘మహిళలుగా పుట్టి పెరిగారు’ అని ఐఓసీ స్పష్టం చేసింది.
అంతేకాదు, పురుషులు, స్త్రీలను గుర్తించడానికి శాస్త్రీయంగా పటిష్టమైన వ్యవస్థ లేదని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ శుక్రవారం అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘పురుషుడితో ఫైట్ వద్దు’
ఈ జంటను ఎదుర్కొనే కొందరు ప్రత్యర్థులు, కోచింగ్ టీమ్‌లు ఐఓసీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఖెలిఫ్ చేతిలో ఓడిపోయిన వెంటనే ‘ఇది కరెక్ట్ కాదు’ అని కరిని వ్యాఖ్యానించింది. అయితే ఆ తర్వాత క్షమాపణ చెప్పింది.
ఫైట్ చేయవద్దని, పురుషుడితో పోరాడవద్దని చెప్పానని కరిని కోచ్ కూడా అన్నారు.
తదుపరి పోటీలో ఫైట్‌కు ముందు ఖెలిఫ్ ప్రత్యర్థి హంగేరీకి చెందిన అన్నా లూకా హమోరి కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
‘ఇది కరెక్టని నేను అనుకోవడం లేదు’’ అన్నదామె.
హంగేరియన్ బాక్సింగ్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది కూడా. అయితే, ఫైట్ తర్వాత ఖెలీఫ్‌కు హమోరీ శుభాకాంక్షలు తెలిపింది.
ఇక సెమీ-ఫైనల్ విషయానికొస్తే ఫైట్‌కు ముందు ఖెలిఫ్ ప్రత్యర్థి, థాయిలాండ్ బాక్సర్ జంజేమ్ సువన్నాఫెంగ్ ఈ వివాదంపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. అయితే ఫైట్ తర్వాత ‘ఆమె ఒక మహిళే అయితే చాలా బలంగా ఉంది’ అని అన్నది.

ఫొటో సోర్స్, Getty Images
‘ఎక్స్’ గుర్తునే ఎందుకు చూపారు?
లిన్ యు కూడా ఇదే తరహా స్పందనను ఎదుర్కొంది. ఆమె ప్రత్యర్థులలో ఇద్దరు ఓటమి తర్వాత చేతితో 'ఎక్స్' సంజ్ఞలు చేశారు. ఆ గుర్తు ఆడ క్రోమోజోమ్‌లను సూచించడానికి ఎక్కువగా వాడుతుంటారు.
లిన్‌తో క్వార్టర్ ఫైనల్ తర్వాత బల్గేరియన్ బాక్సర్ స్వెత్లానా కమెనోవా స్టానెవా "నో, నో, నో" అంటూ ఎరీనా నుంచి నిష్క్రమిస్తూ ‘ఎక్స్’ గుర్తును చూపించింది.
‘బాక్సింగ్‌కు ఇది మంచిది కాదు’ అని ఫైట్‌కు ముందు స్వెత్లానా అభిప్రాయపడింది. లిన్, ఖెలీఫ్‌లు పారిస్ 2024లో పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బల్గేరియన్ బాక్సింగ్ సమాఖ్య కూడా చెప్పింది.
లిన్‌పై సెమీఫైనల్లో ఓటమి తర్వాత తుర్కియే బాక్సర్ ఎస్రా యిల్డిజ్ కహ్రామన్ కూడా రింగ్ మధ్యలోనే 'ఎక్స్' గుర్తును చూపుతూ నిరసన తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














