టీ20 వరల్డ్ కప్ ఫైనల్: గెలుపుకోసం భారత్ ఏం చేయాలి, న్యూజీలాండ్ కట్టడికి ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Prakash Singh/Getty Images
- రచయిత, మనోజ్ చతుర్వేది
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
టీ20 ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించడానికి భారత క్రికెట్ జట్టు ఒక గెలుపు దూరంలో ఉంది. అయితే ఈ అంతరాన్ని పూడ్చాలంటే గత కొన్ని మ్యాచ్‌లలో బయటపడిన లోపాలను అధిగమించాల్సి ఉంటుంది.
వీటిని సరిదిద్దుకోవడం ద్వారానే ఇండియా రెండోసారి టైటిల్ గెలుచుకున్న జట్టుగా అవతరిస్తుంది.
ఈ ఏడాది జనవరిలో న్యూజీలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో సునాయాసంగా గెలుచుకుంది. కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్‌లో న్యూజీలాండ్ ప్రదర్శనను చూస్తే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో భారత్ గెలుపు అంత తేలికకాదని స్పష్టమవుతోంది.
"ప్రేక్షకులను మౌనంగా ఉండేలా చేయడమే మా అతిపెద్ద లక్ష్యం. టీ20 అనేది అనూహ్యమైన ఫార్మాట్. చిన్న చిన్న విషయాలు ఆట ఫలితాన్ని నిర్ణయిస్తాయి. స్వదేశంలో ప్రపంచ కప్ గెలవాలనే ఒత్తిడిలో భారత్ ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని మేం ప్లాన్ చేస్తున్నాం" అని న్యూజీలాండ్ కెప్టెన్ శాంట్నర్ చెప్పారు.
"ఫైనల్‌ను గెలవడం, దేశం సంబరాలు జరుపుకునే అవకాశం కల్పించడమే జట్టు ఏకైక లక్ష్యం" అని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images

ఈ ప్రపంచ కప్‌లో భారత్ తమ ఓపెనింగ్ జోడీపై ఎక్కువగా ఆధారపడింది. కానీ వారి ఆటతీరు సరిగ్గా లేకపోవడం జట్టుకు అతిపెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఫామ్‌లో లేకపోవడం.
ఈ ఫార్మాట్‌లో నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా అభిషేక్ శర్మ ఈ ప్రపంచకప్‌లో అడుగుపెట్టాడు. కానీ మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఖాతా తెరవలేకపోవడం అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి ఉండవచ్చు.
మొదటి బంతి నుంచే భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించడం వల్ల ఈ సమస్య ఏర్పడింది.
ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లతో ఇన్నింగ్స్ ప్రారంభించడం ద్వారా టీమిండియా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అయితే అభిషేక్‌కు మరో అవకాశం ఇవ్వాలా వద్దా అనేది జట్టు యాజమాన్యం నిర్ణయించాల్సి ఉంటుంది. ఫైనల్‌లో ఎలాంటి మార్పులు చేయడానికి జట్టు యాజమాన్యం ఇష్టపడకపోవచ్చు.
అభిషేక్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌ల్లో 12.71 సగటుతో 89 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో జింబాబ్వేపై చేసిన 55 పరుగులు కూడా ఉన్నాయి. ఈ అర్ధ సెంచరీ తప్ప మిగిలిన మ్యాచ్‌లన్నింటిలో అతను పేలవమైన ఆటతీరు కనబర్చాడు.
టీమిండియా ఓపెనింగ్ బలహీనంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ప్రారంభ మ్యాచ్‌లు పక్కనపెడితే చివరి రెండు మ్యాచ్‌లలో జట్టును ఒంటిచేత్తో విజయపథంలో తీసుకెళ్లాడు సంజూ శాంసన్.
అభిషేక్ వికెట్ స్వభావాన్ని అర్థం చేసుకుని, ఆపై జాగ్రతత్తగా ఆడగలిగితే, సమస్య పరిష్కారం కావచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ ప్రపంచ కప్‌లో న్యూజీలాండ్ ఓపెనింగ్ జోడీ ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ విధ్వంసక బ్యాటింగ్ వారి జట్టు పోరాటాన్ని ఫైనల్‌కు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.
ఫిన్ అలెన్ పవర్ ప్లేలో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. బౌలర్ ఎవరన్నది అతను ఎప్పుడూ ఆలోచించడం లేదు. బంతి అతనికి అనుకూలంగా వచ్చిన తర్వాత దానిని భారీ షాట్‌గా మలచడానికి వెనుకాడడు. ఈ ప్రపంచ కప్‌లో అతను 9 మ్యాచ్‌ల్లో 369 పరుగులు చేశాడు. 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడు.
సీఫర్ట్ 10 మ్యాచ్‌ల్లో 341 పరుగులు చేశాడు. ఈ జంట భారత బౌలర్లకు తలనొప్పిగా మారనుందని సూచించడానికి ఈ గణాంకాలు ఉదాహరణ.
మిడిల్ ఆర్డర్‌లో రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్‌కు ఇన్నింగ్స్‌ను వేగవంతం చేయగల సామర్థ్యం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

భారత వికెట్లపై మన స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోవడం అరుదు. ఈ టోర్నమెంట్‌లో మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తి సమస్య ఇది.
ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అతను నాలుగు ఓవర్లలో 64 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ ప్రదర్శన పునరావృతం కాకుండా ఉండాలని టీమిండియా, వరుణ్ ఇద్దరూ కోరుకుంటారు.
వరుణ్ ఒత్తిడికి తలొగ్గుతాడని ఈ మ్యాచ్ నిరూపించింది. తన మొదటి మూడు బంతులనూ బెతెల్ సిక్స్‌లు కొట్టిన తర్వాత వరుణ్ చక్రవర్తి ఎప్పుడూ సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయలేదు.
సూపర్ ఎయిట్ మ్యాచ్‌ల తర్వాత వరుణ్ ఫామ్‌లో లేడు. ఒత్తిడిలో ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. బంతి స్పిన్ అయ్యే అవకాశాన్ని తగ్గిస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు.
వరుణ్ ఆటతీరును రెండు భాగాలుగా విభజించవచ్చు. మొదటి నాలుగు మ్యాచ్‌లలో, అతను తన సామర్థ్యం మేరకు బౌలింగ్ చేశాడు. తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. అయితే సూపర్ ఎయిట్స్ తర్వాత అతని బౌలింగ్ సరిగ్గా లేదు. కొన్నిసార్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేదు. నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే సాధించాడు.
అక్షర్ పటేల్ తన బౌలింగ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ తన ఫీల్డింగ్‌తో బ్యాటింగ్‌లో ప్రభావం చూపగల సామర్థ్యం అతనికి ఉంది. సెమీ-ఫైనల్స్‌లో రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టడం ద్వారా ఈ విషయాన్ని అతను నిరూపించాడు.
ఫైనల్లో వరుణ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను పరిగణించవచ్చు. అయితే సమస్య ఏమిటంటే అతను ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాబట్టి జట్టు యాజమాన్యం ఈ రిస్క్ తీసుకునే అవకాశం లేదు. కాబట్టి వరుణ్ కొంచెం జాగ్రత్తగా బౌలింగ్ చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images

ఇది హెన్రీ కెరీర్‌లో చివరి మ్యాచ్ అవుతుంది. అతను కచ్చితంగా దీన్ని చిరస్మరణీయంగా మార్చాలని కోరుకుంటాడు. పవర్‌ప్లేలో వికెట్లు తీయడంలో అతను ఇప్పటికే మాస్టర్. ఎనిమిది మ్యాచ్‌ల్లో పది వికెట్లు తీసిన అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. పవర్‌ప్లేలో ఒకటి లేదా రెండు వికెట్లు తీయడం ద్వారా అతను భారత్‌పై ఒత్తిడి పెంచగలడు.
లాకీ ఫెర్గూసన్ ఆరు వికెట్లే తీసుండొచ్చుగానీ అతను తన వేగంతో జట్టుకు లాభం కలిగించగలడు.
న్యూజీలాండ్ స్పిన్ బౌలింగ్ కూడా బలంగా ఉంది. కెప్టెన్ శాంట్నర్ పెద్దగా విజయం సాధించలేదుగానీ మిడిల్ ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ను అదుపులో ఉంచుకోగలుగుతున్నాడు. మెకాంకీ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు. కాబట్టి అతన్ని ఎదుర్కోవాల్సిఉంది.

ఫొటో సోర్స్, Getty Images

ఈ ప్రపంచ కప్‌లో మన బ్యాట్స్‌మెన్ స్పిన్నర్లను సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారు. స్పిన్‌పై భారత స్ట్రైక్ రేట్ 6.23గా ఉంది.
భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మలతో సహా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ పుష్కలంగా ఉండటం వల్ల ఈ సమస్య మరింత జటిలమైంది.
గత కొన్ని మ్యాచ్‌లలో, ఈ బ్యాట్స్‌మెన్ స్పిన్నర్లపై ఫోర్లు,సిక్సర్లు కొట్టలేకపోయారు. స్ట్రైక్‌ను రొటేట్ చేయలేకపోయారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేయడానికి స్పిన్నర్లను ఉపయోగించడం కనిపించింది.
న్యూజీలాండ్‌తో జరిగే ఫైనల్‌లో టీమిండియా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు. న్యూజీలాండ్ ఆఫ్ స్పిన్నర్ కోల్ మెకాంకీ ఈ ప్రపంచ కప్‌లో, ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌పై ఆకట్టుకున్నాడు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కూడా చాలా అనుభవజ్ఞుడైన బౌలర్.

ఫొటో సోర్స్, Getty Images

ఇంగ్లండ్ యువ బ్యాట్స్‌మన్ జాకబ్ బెతెల్ స్పిన్నర్లపై విరుచుకుపడడంతో జస్‌ప్రీత్ బుమ్రా ముందుగానే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అతను రెండు ఓవర్లలో 14 పరుగులు ఇచ్చాడు. భారత్ సమస్య ఏంటంటే, బుమ్రా, అర్ష్‌దీప్ తప్ప బలమైన డెత్ ఓవర్ల బౌలర్ లేడు.
శివమ్ దుబే దీనికి సిద్ధంగా ఉన్నాడు. అతను వైడ్ యార్కర్లు వేస్తాడు. కానీ ఈ రకమైన బంతిని బౌలింగ్ చేయడానికి మంచి నియంత్రణ అవసరం. ఈ నియంత్రణ లేకపోవడంతో తరచుగా అతని బంతులు సిక్సర్లుగా మారుతున్నాయి.
అతను సెమీఫైనల్‌లో బౌలింగ్ చేసే సమయానికి మ్యాచ్ ఇంగ్లాండ్ చేతిలో లేదు. లక్ష్యం ఇంకా తక్కువగా ఉండుంటే మూడు సిక్సర్లు బాదితే పరిస్థితి దిగజారేది. అతను ఇప్పటికే రెండు ఓవర్లలో 46 పరుగులు ఇచ్చాడు.
బుమ్రాతో పాటు అర్ష్‌దీప్, హార్దిక్ చివరి నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసే విధంగా భారత్ బౌలింగ్ క్రమం ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images

గత మ్యాచ్‌ల కంటే సెమీఫైనల్‌లో భారత్ ఫీల్డింగ్ మెరుగ్గా ఉందన్నది నిజమే. అక్షర్ పటేల్ పట్టిన రెండు క్యాచ్‌లు మ్యాచ్‌ను భారత్‌కు అనుకూలంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయి. కానీ టోర్నమెంట్ అంతటా ఫీల్డింగ్ సమస్య ఉంది. మరోవైపు న్యూజీలాండ్ ఈ విషయంలో బాగా రాణించింది.
ఈ ప్రపంచ కప్‌లో భారత్ 13 క్యాచ్‌లు వదిలేసింది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి అగ్రశ్రేణి ఫీల్డర్లు కూడా క్యాచ్‌లు వదిలేశారు.
వెస్టిండీస్‌తో జరిగిన సూపర్ ఎయిట్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ క్యాచ్‌ను వదిలేయడం భారత్‌కు ముప్పుగా మారినట్టు కనిపించింది. కాబట్టి ఈ విషయంలో జట్టు గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.
ఫైనల్ మ్యాచ్ కు వేదికైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లైటింగ్‌కు అలవాటుపడడంలో ఫీల్డర్లు ఇప్పటికే ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈ విషయంలో భారత్ ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











