ఎబోలా: ఈ మహమ్మారి పెరుగుదలను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, థామస్ ముఖ్వానా, యాంగ్ టియాన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా మహమ్మారి వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా (పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది.
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్ కాంగో)లోని తూర్పు ఇటూరి ప్రావిన్స్‌లో సుమారు 246 అనుమానిత కేసులు నమోదై, 80 మంది చనిపోయినప్పటికీ.. ఈ మహమ్మారి వ్యాప్తి అత్యవసర పరిస్థితి ప్రమాణాలను చేరుకోలేదని భావించామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
అయితే, ప్రస్తుతం గుర్తించి, నివేదిస్తున్న దాని కంటే చాలా ఎక్కువగా ఈ మహమ్మారి ప్రబలే అవకాశం ఉందని.. ప్రాంతీయంగా, స్థానికంగా వ్యాపించే ప్రమాదం గణనీయంగా ఉందని హెచ్చరించింది.
ప్రస్తుత రకానికి చెందిన ఎబోలాకు బండిబుగ్యో వైరస్ కారణమని ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
దీనికి డ్రగ్ రెగ్యులేటర్స్ నుంచి ఆమోదం పొందిన మందులు కానీ, టీకాలు కానీ లేవు.

ఈ వ్యాధి లక్షణాలు
ఈ మహమ్మారి లక్షణాల్లో మొదట జ్వరం, కండరాల నొప్పులు, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి ఉంటాయి.
ఆ తర్వాత వాంతులు, విరోచనాలు, చర్మంపై దద్దుర్లు, రక్తస్రావం అవుతుంది.
ప్రస్తుతం అక్కడ ల్యాబ్‌లో నిర్ధరణ అయిన ఎబోలా వైరస్ కేసులు ఎనిమిది ఉన్నాయని, ఇటూరి ప్రావిన్స్ రాజధాని బునియాతో పాటు బంగారం గనులు ఉన్న మొంగ్వాలు, ర్వంపారా వంటి మూడు హెల్త్ జోన్లలో మరికొన్ని అనుమానిత కేసులు, మరణాలు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ఈ వైరస్‌కు చెందిన మరో కేసు డీఆర్ కాంగో రాజధాని కిన్షాసాలో నమోదైంది. ఇటూరి నుంచి తిరిగి వచ్చిన రోగికి ఈ వ్యాధి నిర్ధరణ అయినట్లు భావిస్తున్నారు.
డీఆర్ కాంగోను దాటి ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మరో రెండు కేసులు సరిహద్దులోని ఉగాండాలో రిపోర్ట్ అయ్యాయి. గురువారం మరణించిన 59 ఏళ్ల వ్యక్తికి ఎబోలా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ఉగాండా అధికారులు తెలిపారు.
చనిపోయిన రోగి కాంగో పౌరుడని, ఆయన మృతదేహాన్ని ఇప్పటికే డీఆర్ కాంగోకు పంపినట్లు ఉగాండా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
డీఆర్ కాంగోలో కొనసాగుతున్న భద్రతా పరిస్థితులు, మానవీయ సంక్షోభంతో పాటు, అధిక జనాభా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లడం, వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతం పట్టణ పరిధిలో ఉండటం, ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో అనధికారిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉండటం వంటివి ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
వాణిజ్యం, ప్రయాణాల కారణంగా డీఆర్ కాంగోతో సరిహద్దు పంచుకునే దేశాలను అత్యంత ముప్పు కలిగినవిగా పరిగణిస్తున్నారు.
డీఆర్ కాంగో, ఉగాండాలు ఈ వైరస్ కేసులను పర్యవేక్షించేందుకు, గుర్తించేందుకు ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలను అమలు చేయాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
ఈ వ్యాధి వ్యాప్తిని తగ్గించేందుకు.. ఈ వైరస్ నిర్ధరిత కేసులను వెంటనే ఐసోలేట్ చేసి, కనీసం 48 గంటల వ్యవధిలో నిర్వహించే రెండు బండిబుగ్యో వైరస్ పరీక్షలు నెగిటివ్ వచ్చేలా చికిత్స అందించాలని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ఈ కేసులు నిర్ధరణ అయిన ప్రాంతాలకు సరిహద్దులుగా ఉన్న దేశాల ప్రభుత్వాలు నిఘాను, ప్రజా ఆరోగ్య పర్యవేక్షణను, క్లినికల్ డేటా ట్రాకింగ్‌ను (హెల్త్ రిపోర్టింగ్‌ను) పెంచాలని చెప్పింది.
ప్రభావిత ప్రాంతం వెలుపల ఉన్న దేశాలు తమ సరిహద్దులను మూసివేయడం కానీ, ప్రయాణాలపై ఆంక్షలు విధించడం కానీ, వాణిజ్యాన్ని పరిమితం చేయడం కానీ చేయవద్దని.. ఎందుకంటే, "అలాంటి చర్యలు సాధారణంగా భయం కారణంగానే అమలు చేస్తారు తప్ప, వాటికెలాంటి శాస్త్రీయ ఆధారం లేదు'' అని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
ఆ వ్యాధి సోకిన రోగుల వాస్తవ సంఖ్యపై, ఈ మహమ్మారి భౌగోళిక వ్యాప్తిపై ప్రస్తుతం చాలా అస్థిరత ఉందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ హెచ్చరించారు.
ప్రస్తుతం ఈ వ్యాధి ప్రబలిన డీఆర్ కాంగోలోనే తొలుత 1976లో దీన్ని గుర్తించారు. ఇది గబ్బిలాల నుంచి సోకిందని అనుమానించారు. దేశంలో ఈ ప్రాణాంతక వైరల్ వ్యాధి విజృంభించడం ఇది 17వ సారి.
శరీర ద్రవాలతో నేరుగా కాంటాక్ట్ కావడం ద్వారా, గాయపడిన చర్మం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తీవ్రమైన రక్తస్రావం జరిగి, అవయవాలు దెబ్బతింటాయి.
ఎబోలా వ్యాధిని నయం చేయడానికి ఎలాంటి చికిత్స లేదు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. సగటు మరణాల రేటు సుమారు 50 శాతంగా ఉంది.
ర్వంపారా, బునియాల్లో పట్టణ పరిస్థితులు పెరగడం, మొంగ్వాలులో గనుల కార్యకలాపాల వల్ల ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆఫ్రికా సీడీసీ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రభావిత ప్రాంతాలు, సరిహద్దు దేశాల మధ్య ప్రజల రాకపోకలు ఎక్కువగా సాగిస్తుండటం వల్ల ప్రాంతీయ సమన్వయం అవసరమని హెల్త్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీన్ కసేయా చెప్పారు.
గత 50 ఏళ్లుగా ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ వల్ల సుమారు 15 వేల మంది మరణించారు.
2018 నుంచి 2020 మధ్య డీఆర్ కాంగోలో ఇది ప్రాణాంతక మహమ్మారిగా వ్యాప్తి చెంది సుమారు 2,300 మంది ప్రజల మరణానికి కారణమైంది.
గత ఏడాది మారుమూల ప్రాంతంలో ఈ వ్యాధి వ్యాప్తి తర్వాత 45 మంది మరణించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























