హెపటైటిస్: ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎంత ప్రమాదం, ఎలా రక్షించుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తమకు తెలియకుండానే హెపటైటిస్‌తో బాధపడుతున్నందు వల్ల, ఈ వ్యాధి పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య అధికారులు, స్వచ్ఛంద సంస్థల వాళ్లు సూచిస్తున్నారు.
జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినంగా జరపుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ కారణంగా సంవత్సరానికి 10 లక్షల కంటే ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
హెపటైటిస్ అంటే ఏమిటి? అది ఎందుకంత ప్రాణాంతకం?
హెపటైటిస్ అనేది ఒక కాలేయ వ్యాధి. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది.
ఇది లివర్ కేన్సర్, లివర్ ఫెయిల్యూర్ సహా అనేక ఇతర కాలేయ సమస్యలకు దారి తీస్తుంది.
ఈ వైరస్‌లో ‘ఏ’ నుంచి ‘ఈ’ వరకు అయిదు రకాలు ఉన్నాయి.
హెపటైటిస్ బీ, సీ అత్యంత ప్రమాదకరమైనవి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా హైపటైటిస్ వల్ల వచ్చే వ్యాధులతో సంవత్సరానికి 13 లక్షల మంది మరణిస్తున్నారు.
అంటే ప్రతి 30 సెకన్‌లకు ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారన్నమాట.

హెపటైటిస్ ఎంత విస్తృతంగా వ్యాపిస్తోంది?
డబ్ల్యూహెచ్‌ఓ అంచనా ప్రకారం 25.4 కోట్ల మంది దీర్ఘకాలిక హెపటైటిస్ బీతో జీవిస్తుండగా, 5 కోట్ల మంది దీర్ఘకాలిక హెపటైటిస్ సీతో బాధపడుతున్నారు.
ప్రతి సంవత్సరం ఈ వ్యాధులకు సంబంధించి 20 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
• డబ్ల్యూహెచ్‌ఓ పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో (ఇందులో చైనా, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి) 9.7 కోట్ల మంది ప్రజలు దీర్ఘకాలికంగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
• ఆఫ్రికాలో 6.5 కోట్ల మంది ప్రజలకు ఇది సోకింది.
• డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా ప్రాంతంలో 6.1 కోట్ల మంది(ఇందులో భారత్, థాయ్‌లాండ్, ఇండోనేషియా ఉన్నాయి) దీంతో ఇబ్బంది పడుతున్నారు.
డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది హెపటైటిస్ ఈ అనే వ్యాధి బారిన పడుతున్నారు.
దీని కారణంగా 2015లో 44,000 మంది మరణించారు. ఇది దక్షిణ, తూర్పు ఆసియాలో సర్వసాధారణంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
మీకు హెపటైటిస్ ఎలా రావచ్చు?
హెపటైటిస్ ఏ ఎక్కువగా మలంతో కలుషితమైన నీరు తాగడం లేదా ఆహారం తినడం లేదా అది సోకిన వ్యక్తిని ప్రత్యక్షంగా తాకడం వల్ల వస్తుంది.
పారిశుద్ధ్య పరిస్థితులు సరిగా లేని తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో ఇది సర్వసాధారణం.
దీని లక్షణాలు త్వరగానే నయం అవుతాయి. దాదాపు ప్రతి ఒక్కరూ దీని నుంచి కోలుకుంటారు. అయితే, ఒక్కోసారి ఇది కాలేయం దెబ్బతినేందుకు కారణమై, ప్రాణాంతకం కావచ్చు.
కలుషితమైన ఆహారం లేదా నీరు ఉన్న ప్రాంతాలలో హెపటైటిస్ ఏ కారణంగా అంటువ్యాధులు ఎక్కువయ్యే అవకాశం ఉంది.
ఉదాహరణకు, 1998లో చైనాలోని షాంఘైలో ఇది 3,00,000 మందికి సోకింది.
1998లో షాంఘైలో వ్యాప్తి చెందినప్పటి నుంచి చైనా హెపటైటిస్ ఏకి వ్యతిరేకంగా ప్రజల రోగనిరోధక శక్తిని పెంచడం ప్రారంభించింది.
హెపటైటిస్ బీ సర్వసాధారణంగా ఇలా వ్యాపిస్తుంది:
• పుట్టుక, కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకు
• పిల్లలకు పిల్లలు కాంటాక్ట్‌లో ఉండటం వల్ల
• కలుషితమైన సూదులు, సిరంజీలు, పచ్చబొట్టు పొడిపించుకోవడం, గుచ్చడం లేదా ఇన్ఫెక్షన్ సోకిన రక్తం, శరీర ద్రవాలు తగలడం (ఉదాహరణకు, సెక్స్ సమయంలో)
హెపటైటిస్ సీ, డీ ఇన్ఫెక్షన్ సోకిన రక్తాన్ని తగలడం ద్వారా కూడా వ్యాపిస్తాయి. ఉదాహరణకు సూదులు, సిరంజీలను తిరిగి ఉపయోగించడం ద్వారా లేదా కలుషితమైన రక్తాన్ని ఎక్కించడం ద్వారా ఇవి వ్యాపిస్తాయి.
హెపటైటిస్ బీ ఉన్న వ్యక్తులు మాత్రమే హెపటైటిస్ డీ బారిన పడతారు.
హెపటైటిస్ బీ కారణంగా దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్‌తో బాధ పడుతున్న దాదాపు 5% మంది విషయంలో ఇది జరుగుతుంది. ప్రత్యేకించి ఇది వాళ్లకు తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ను కలుగజేస్తుంది.
హెపటైటిస్-ఈ అనే వ్యాధి కలుషిత ఆహారం తినడం, కలుషిత నీరు త్రాగడం వల్ల సోకుతుంది.
ఇది దక్షిణ, తూర్పు ఆసియాలో సర్వసాధారణం. ముఖ్యంగా గర్భిణీలకు ప్రమాదకరం.
మీకు హెపటైటిస్ ఉందని ఎలా తెలుసుకోవచ్చు?
డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం, హెపటైటిస్‌లో ఈ కింది లక్షణాలు ఉండవచ్చు:
- జ్వరం
- అలసట
- ఆకలి లేకపోవడం
- అతిసారం
- వికారం
- పొట్ట చుట్టూ నొప్పి
- ముదురు రంగు మూత్రం, లేత రంగు మలం
- కామెర్లు (చర్మం పసుపు రంగులోకి మారడం, కళ్ళు తెల్లగా మారడం)
కాకపోతే, హెపటైటిస్‌తో బాధపడుతున్న చాలా మందిలో వీటికి సంబంధించిన తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. కొన్నిసార్లు అసలు కనిపించవు కూడా.
డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించిన తాజా డేటా ప్రకారం, 2022 నుంచి, ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక హెపటైటిస్ బీ ఉన్నవారిలో 13% మందికి, దీర్ఘకాలిక హెపటైటిస్ సీ ఉన్నవారిలో 36% మందికి మాత్రమే రోగనిర్ధరణ జరిగింది.
దీని వల్ల ప్రమాదం ఏమిటంటే, వాళ్లకు తెలియకుండానే వాళ్ల ఇన్ఫెక్షన్ మరొకరికి సోకవచ్చు.
అందుకే డబ్ల్యూహెచ్‌ఓ, వైద్య స్వచ్ఛంద సంస్థలు ఎక్కువ మందిని పరీక్ష చేయించుకోవాలని కోరుతున్నాయి.
హెపటైటిస్ కోసం ఏ పరీక్షలు ఉన్నాయి, వాటికి చికిత్సలు ఏమిటి?
హెపటైటిస్ ఏ, బీ, సీ కోసం మీరు మీ కుటుంబ వైద్యుడు నుంచైనా లేదా సెక్సువల్ హెల్త్ క్లినిక్‌లోనైనా రక్త పరీక్షలు చేయించుకోవచ్చు.
హెపటైటిస్ ఏ కు నిర్దిష్టంగా ఎలాంటి చికిత్స లేదు. వ్యాధి ఉన్న చాలామంది వ్యక్తులు త్వరగా కోలుకుంటారు. దానిని తట్టుకునే రోగనిరోధక శక్తి పెంపొందించుకుంటారు.
దీర్ఘకాలిక హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ రెండింటికీ యాంటీ వైరల్ ఏజెంట్లతో చికిత్స చేయవచ్చు.
హెపటైటిస్ ఏ, బీ బారిన పడకుండా నిరోధించడానికి టీకాలు ఉన్నాయి. పుట్టినప్పుడు శిశువులకు ఇచ్చే హెపటైటిస్ బీ వ్యాక్సిన్ తల్లుల నుంచి పిల్లలకు వ్యాధిని సంక్రమించకుండా నిరోధిస్తుంది. ఇది హెపటైటిస్ డీ నుంచీ రక్షిస్తుంది.
హెపటైటిస్ సీకి వ్యాక్సిన్ లేదు. హెపటైటిస్ ఈ అనే వ్యాధి కోసం కూడా ప్రస్తుతం విస్తృతంగా వ్యాక్సీన్ అందుబాటులో లేదు.

ఫొటో సోర్స్, Getty Images
హెపటైటిస్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
హెపటైటిస్ ఈ బారిన పడకుండా ఉండాలంటే కాలేయంతో చేసిన వంటకాలను బాగా ఉడికించాలి.
డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం, హెపటైటిస్ ఏ వ్యాప్తిని ఈ కింది వాటి ద్వారా నివారించవచ్చు:
- భోజనానికి ముందు, టాయిలెట్‌కి వెళ్లిన తర్వాత క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం
- ప్రజలు ఉండే ప్రాంతాలలో తగినంత సురక్షితమైన తాగునీటి సరఫరా
- సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు
ఈ క్రింది వాటి ద్వారా మీరు హెపటైటిస్ బీ, సీ, డీ లను సమర్థంగా నివారించవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది.
- కండోమ్‌లను ఉపయోగించడం, సురక్షితమైన సెక్స్ పద్ధతులు
- మందులను ఇంజెక్ట్ చేసే, పొడిచే లేదా పచ్చబొట్టు వేసే సూదులను ఒకసారి ఉపయోగించాక మళ్లీ ఉపయోగించరాదు
- హెపటైటిస్ బీ రాకుండా ఉండాలంటే - రక్తం, శరీర ద్రవాలు లేదా కలుషితమైన ప్రాంతాలు తాకిన తర్వాత చేతులు కడుక్కోవడం
- హెపటైటిస్ బీ - మీరు పెద్దవారై, ఆరోగ్య సంరక్షణ విభాగాలలో పని చేస్తుంటే, వ్యాక్సీన్ వేయించుకోవాలి. ఎందుకంటే పుట్టినప్పుడు ఇచ్చిన టీకా 20 ఏళ్లు మాత్రమే పని చేసే అవకాశం ఉంది.
- హెపటైటిస్ ఈ ని పరిశుభ్రత పాటించడం ద్వారా నివారించవచ్చు. అలాగే తినడానికి ముందు జంతువుల కాలేయాన్ని ముఖ్యంగా పంది కాలేయాన్ని, బాగా ఉడికించి తినడం ద్వారా నివారించవచ్చు.
హెపటైటిస్‌ను నిర్మూలించడానికి ఆరోగ్య అధికారులు ఎలా ప్రయత్నిస్తున్నారు?
2030 నాటికి హెపటైటిస్ బీ, సీ బారిన పడే వారి సంఖ్యను 90% తగ్గించాలని, వారి మరణాల సంఖ్యను 65% తగ్గించాలని డబ్ల్యూహెచ్‌ఓ లక్ష్యంగా చెబుతోంది.
హెపటైటిస్ వైరస్‌ల వల్ల మరణాలు పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌ఓ తాజా డేటా ఆ మరణాలు 2019లో ప్రపంచవ్యాప్తంగా 11 లక్షల నుంచి 2022లో 13 లక్షలకు పెరిగాయని సూచిస్తోంది.
ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు హెపటైటిస్ పరీక్షలు చేయించుకోవడం చాలా కష్టంగా ఉందని ఈ డేటా చెబుతోంది.
ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 60% దేశాలు మాత్రమే ఉచితంగా లేదా రాయితీపై పరీక్షలు, చికిత్సను అందిస్తున్నాయి.
డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం ఆఫ్రికాలోని కేవలం మూడో వంతు దేశాలు మాత్రమే వీటిని అందిస్తున్నాయి.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














