నిఫా వైరస్‌తో బాలుడి మృతి: ఏమిటీ వైరస్? పందులు, గబ్బిలాల నుంచే కాకుండా ఇంకా ఎలా సోకే ప్రమాదం ఉంది

నిఫా వైరస్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, సోఫీ విలియమ్స్
    • హోదా, బీబీసీ న్యూస్

నిఫా వైరస్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో కేరళలో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు.

మరో 60 మందిని హై-రిస్క్ కేటగిరీలో ఉన్నట్టు గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

చనిపోయిన బాలుడిది పండిక్కాడ్ పట్టణం అని కేరళ ఆరోగ్య మంత్రి వీణ జార్జ్ చెప్పారు.

ఆ బాలుడితో కాంటాక్ట్ అయిన వారందరినీ ఐసోలేట్ చేసి, పరీక్షలు జరిపామని వెల్లడించారు.

ఈ ప్రాంతంలోని ప్రజలందరూ ముందు జాగ్రత్తగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాస్క్‌లు ధరించాలని, ఆస్పత్రిలో ఉన్నవారి వద్దకు రావడం మానుకోవాలని సూచించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

నిఫా వైరస్ అంటే ఏమిటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, నిపా వైరస్ అనేది జంతువుల నుంచి సంక్రమించే వ్యాధి.

నిఫా వైరస్ పందులు, గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుందని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.

మహమ్మారిగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటం వల్ల ఈ వైరస్‌ను ‘ప్రయారిటీ పాథోజెన్స్’ లిస్టులో చేర్చింది డబ్ల్యూహెచ్‌వో.

యాంటీ బయాటిక్స్‌ను తట్టుకోగలుగుతూ మానవాళికి తీవ్ర ముప్పు కలిగించే వ్యాధి కారకాలను డబ్ల్య్యూ హెచ్‌వో ‘ప్రయారిటీ పాథోజెన్స్’ లిస్ట్‌లో చేరుస్తుంది.

నిఫా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిఫా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది

నిఫా వైరస్ లక్షణాలేంటి?

నిఫా వైరస్ సోకిన తర్వాత ప్రాథమికంగా కనిపించే లక్షణాలు..

  • జ్వరం
  • తలనొప్పి
  • కండరాల నొప్పి
  • వాంతులు
  • గొంతు నొప్పి

పైన చెప్పిన లక్షణాలతో పాటు మరికొన్ని లక్షణాలూ కొందరిలో కనిపిస్తాయి.. అవి..

  • కళ్లు తిరగడం, మగతగా అనిపించడం
  • స్పృహ తప్పడం
  • మెదడు వాపు
  • న్యూమోనియా
  • ఇతర తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు
గబ్బిలాల నుంచి నిఫా వైరస్ సోకుతుంది

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, గబ్బిలాల నుంచి నిఫా వైరస్ సోకుతుంది

ఎంత ప్రమాదకరం?

ఈ వైరస్ సోకినవారికి కొన్నిసార్లు గుర్తించదగ్గ లక్షణాలు కనిపించవు. కొందరిలో శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తాయి.

మరికొన్ని కేసుల్లో, నిఫా ఇన్‌ఫెక్షన్ ఎన్‌సెఫలైటిస్‌కు దారి తీస్తుంది. మెదడును ప్రభావితం చేసే తీవ్రమైన పరిస్థితి ఇది.

ఈ వైరస్ సోకిన వారు మరణించే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే ఈ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా మందులు లేదా వ్యాక్సీన్ అందుబాటులో లేదు.

వైరస్ లక్షణాలను గుర్తించి, వ్యక్తి కోలుకునేందుకు సహకరించేలా మాత్రమే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

నిఫా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది?

కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి సోకిన వ్యక్తితో కాంటాక్ట్ అవ్వడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది.

ఆవాస ప్రాంతాలు తగ్గిపోతుండటంతో, మనుషులకు దగ్గరగా జంతువులు నివసిస్తున్నాయని, దీంతో జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకడం పెరుగుతుందని వైద్య నిపుణులు చెప్పారు.

నిఫా మహమ్మారిని నిరోధించేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది.

గత ఏడాది ఐదు కేసులు నమోదైన తర్వాత, రాష్ట్రంలో స్కూళ్లను, ఆఫీసులను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

కోజికోడ్

నిఫా వైరస్‌ను భారత్‌లో ఎక్కడ గుర్తించారు?

డబ్ల్యూహెచ్‌వో చెప్పిన వివరాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో 2001, 2007లో రెండు సార్లు ఈ వైరస్ వ్యాపించింది.

ఆ తరువాత 2018లో కేరళలోని కోజికోడ్, మలాప్పురం జిల్లాలలో 18 నిఫా వైరస్ కేసులు వెలుగుచూస్తే అందులో 17 మంది మరణించారు.

2019లో ఎర్నాకులం జిల్లాలో ఒక నిఫా వైరస్ కేసు నమోదైంది. అయితే బాధితుడు కోలుకున్నాడు.

2021లో చాతమంగళం గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు వైరస్ బారినపడి మరణించాడు.

కేరళ రాష్ట్రంలో 2018లో ఈ కేసు తొలిసారి నమోదైన తర్వాత డజన్ల కొద్ది కేసులు అక్కడ రిపోర్టు అయ్యాయి.

నిఫా వైరస్ సోకినట్లు గుర్తించిన ఒక్కరోజులోనే ఆదివారం 14 ఏళ్ల బాలుడు మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

రాయిటర్స్ సంస్థ మే నెలలో నిఫా వైరస్ వ్యాప్తిపై పరిశోధనల వివరాలను ప్రచురించింది. ఉష్ణమండల రాష్ట్రమైన కేరళలో పట్టణీకరణతోపాటు ఇష్టానుసారంగా చెట్లను నరికివేయడం వంటి పరిస్థితులు నిఫా వైరస్ లాంటి వైరస్‌లు వ్యాపించడానికి అనువుగా మారాయని తెలిపింది.

అటవీ ప్రాంతం తగ్గిపోవడం వలన జంతువులు ఆవాసాలను కోల్పోయి మానవులకు మరింత దగ్గరగా జీవిస్తున్నాయని, ఇందువల్ల వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తోందని నిపుణులు అంటున్నారు.

ఫ్రూట్ బ్యాట్స్ ఏమిటి? ఈ గబ్బిలాలు ఎక్కడుంటాయి

ఫ్రూట్ బ్యాట్స్‌ను ‘‘మెగా బ్యాట్స్’’ అని కూడా అంటారు. ఇవి ప్రపంచంలో అతిపెద్ద గబ్బిలాల సమూహం.

ఈ గబ్బిలాలు సాధారణంగా ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలలో గుర్తించవచ్చు. నిఫా వైరస్‌ సాధారణంగా వీటి ద్వారానే వ్యాపిస్తుంది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)