లక్షలాది దోమలను ల్యాబ్‌లో పుట్టించి ఈ దేశంలో వదిలిపెట్టారు ఎందుకు?

దోమ ఫొటో

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డోర్కాస్ వాంగిరా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మలేరియాను వ్యాపింపజేసే దోమ జాతి వ్యాప్తిని ఆపడానికి ఇటీవల జన్యుపరంగా మార్పులు (GMO) చేసిన పది వేల దోమలను జిబూటిలో విడుదల చేశారు.

''ఈ స్నేహపూర్వక, కాటు వేయని మగ అనాఫెలిస్ స్టెఫెన్సీ దోమల్లో, పరిపక్వతకు రాక ముందే ఆడదోమలను చంపే జన్యువు ఉంటుంది'' అని వాటికి జన్యుమార్పిడి చేసిన బ్రిటన్‌కు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ ఆక్సిటెక్ చెబుతోంది.

ఈ ఆడ దోమలు కుడితే మలేరియా, ఇతర వైరల్ వ్యాధులు వస్తాయి.

తూర్పు ఆఫ్రికాలో ఇలాంటి దోమలను విడుదల చేయడం ఇదే తొలిసారి. కానీ ఆఫ్రికా ఖండంలో ఇది రెండోసారి.

అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం బ్రెజిల్, కేమన్ దీవులు, పనామా, భారతదేశంలో ఇలాంటి సాంకేతికతను విజయవంతంగా ప్రయోగించారు.

2019 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి 100 కోట్ల దోమలను విడుదల చేశారని సీడీసీ తెలిపింది.

జిబూటిలోని అంబౌలి నగర శివార్లలో ఇటీవల మొదటి బ్యాచ్ దోమలను బహిరంగ ప్రదేశంలో వదిలిపెట్టారు.

ఆక్సిటెక్ లిమిటెడ్, జిబూటి ప్రభుత్వం, అసోసియేషన్ మ్యూచువాలిస్ అనే స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న పైలట్ కార్యక్రమం ఇది.

“మేం కుట్టని, వ్యాధులను వ్యాప్తి చేయని మంచి దోమలను తయారు చేశాం. ఈ స్నేహపూర్వక దోమలను విడుదల చేసినప్పుడు, అవి అడవిలో ఉండే ఆడ దోమలను వెతుక్కుని, వాటితో సహజీవనం చేస్తాయి” అని ఆక్సిటెక్ హెడ్, గ్రే ఫ్రాండ్‌సెన్ తెలిపారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం ప్రయోగశాలలో ఉత్పత్తి చేసిన ఈ దోమలలో "స్వీయ-పరిమిత" (సెల్ఫ్-లిమిటింగ్) జన్యువు ఉంటుంది. ఇవి ఆడ దోమలతో జతకట్టినప్పుడు పుట్టే ఆడదోమలు యుక్తవయస్సుకు చేరలోపే నశిస్తాయి.

వాటికి పుట్టే మగదోమలు మాత్రమే బతుకుతాయని ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలు చెప్పారు.

జిబూటీ, దోమలు, మలేరియా

ఫొటో సోర్స్, Oxitec company

ఫొటో క్యాప్షన్,

2018లో బుర్కినా ఫాసోలో విడుదల చేసిన సంతానోత్పత్తి లక్షణం లేని మగ అనాఫిలిస్ కొలుజీ దోమల మాదిరి కాకుండా, స్నేహపూర్వక స్టెఫెన్సీ దోమలలో సంతానోత్పత్తి లక్షణం ఉంటుంది.

2012లో దేశంలో మొట్టమొదటగా గుర్తించిన అనాఫెలిస్ స్టెఫెన్సీ దోమ జాతి వ్యాప్తిని అరికట్టడానికి ఈ ప్రత్యేకమైన దోమలను అభివృద్ధి చేశారు.

అప్పట్లో బుర్కినాఫోసోలో 30 మలేరియా కేసులు మాత్రమే ఉన్నాయి. ఆ దేశం మలేరియా నిర్మూలనకు దగ్గరగా ఉండేది. అయితే 2020 నాటికి దేశంలో మలేరియా కేసులు 73 వేలకు పెరిగాయి.

ఈ దోమ జాతి ఇప్పుడు ఇతర ఆఫ్రికన్ దేశాలైన ఇథియోపియా, సోమాలియా, కెన్యా, సూడాన్, నైజీరియా, ఘనాలకు వ్యాప్తి చెందింది.

ఆసియన్ మూలాలు కలిగిన స్టెఫెన్సీ జాతిని నియంత్రించడం చాలా కష్టం. సాంప్రదాయ నియంత్రణ పద్ధతులకు లొంగని దీనిని ‘పట్టణ దోమ’గా పరిగణిస్తారు. ఇది పగలూరాత్రీ కాటు వేస్తుంది, రసాయన పురుగుమందులకు కూడా ఇది లొంగదు.

"గత దశాబ్దంలో జిబూటిలో పెరిగిన మలేరియాను వెంటనే తగ్గించడం ప్రభుత్వ లక్ష్యం’’ అని జిబూటి అధ్యక్షుడి ఆరోగ్య సలహాదారు డాక్టర్ అబ్దులిలా అహ్మద్ అబ్ది అన్నారు.

"కొంతకాలం క్రితం, మా ప్రజలలో ఈ మలేరియా చాలా అరుదుగా ఉండేది" అని అసోసియేషన్ మ్యూచువాలిస్ డైరెక్టర్ డాక్టర్ బౌహ్ అబ్ది ఖైరే చెప్పారు.

"ఇప్పుడు జిబూటి అంతటా మలేరియా రోగులు రోజూ బాధపడడాన్ని మేం చూస్తున్నాం. అందువల్ల ఇలాంటి కొత్త ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉంది" అని ఆయన తెలిపారు.

విస్తీర్ణంలో జిబూటీ చిన్నగా ఉండడం వల్ల కొత్త యాంటీ-మలేరియా ప్రాజెక్ట్‌ను చేపట్టడం చాలా సులభం అని నిర్వాహకులు తెలిపారు.

“మలేరియా మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే వ్యాధి. మలేరియాతో పోరాటంలో ఈ స్నేహపూర్వక దోమలు తమకు ఎలా సహాయపడతాయో చూడటానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు” అని ఈ ప్రాజెక్టులో పాల్గొన్న సాదా ఇస్మాయిల్ బీబీసీకి తెలిపారు.

ఆఫ్రికా, జిబూటీ, మలేరియా

ఫొటో సోర్స్, Oxitec company

ఫొటో క్యాప్షన్, ఆఫ్రికాలో మలేరియా వల్ల ప్రతీ ఏటా సుమారు 5 లక్షల మంది చనిపోతున్నారు.

మలేరియా కారణంగా ప్రతి సంవత్సరం ఆఫ్రికాలో 5 లక్షల కంటే ఎక్కువ మంది మరణిస్తున్నారు.

ఆఫ్రికాలో జీవుల జన్యు మార్పిడి ఎప్పుడూ వివాదాస్పద అంశమే.

ఇలాంటివి పర్యావరణ వ్యవస్థ, ఆహార గొలుసుపై చూపే పరిణామాల గురించి పర్యావరణ బృందాలు, సంస్థలు హెచ్చరిస్తుంటాయి.

కానీ జన్యుపరంగా మార్పులు చేసి విడుదల చేసిన 100 కోట్ల దోమలు, గత 10 సంవత్సరాల కాలంలో పర్యావరణం లేదా మానవ ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదు అని ఆక్సిటెక్‌కు చెందిన ఫ్రాండ్‌సెన్ అన్నారు.

“మేం పర్యావరణంలోకి విడుదల చేసేవి సురక్షితంగా, అత్యంత ప్రభావవంతంగా ఉండేలా చూసుకోవడం మా లక్ష్యం. ఈ దోమలు విషపూరితం కానివి, అలెర్జీ కారకం కానివి” అని అన్నారాయన.

జన్యుపరంగా మార్పు చేసిన జన్యువులు ఈ దోమల లాలాజలంలో ఉండవు. అందువల్ల ఆక్సిటెక్ ప్రకారం, ఒక వ్యక్తిని దోమ కాటు వేసినా, ఆ వ్యక్తి ఆ జన్యువుల ప్రభావానికి గురికాడు.

"ఈ కొత్త పరిష్కారం కొంచెం వివాదాస్పదం కావచ్చు కానీ భవిష్యత్తు ఇదే" అని అధ్యక్షుడి ఆరోగ్య సలహాదారు డాక్టర్ అబ్ది అన్నారు.

ఈ ప్రయోగం విజయవంతమైతే, భారీస్థాయిలో ట్రయల్స్ నిర్వహించి, ఇలాంటి దోమలను వచ్చే ఏడాది వరకు విడుదల చేయడం కొనసాగుతుంది.

మలేరియా ప్రాణాంతక వ్యాధి, దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కనీసం 6 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ఇలాంటి 10 మరణాలలో తొమ్మిది సబ్-సహారన్ ఆఫ్రికాలోనే సంభవిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)