ఏపీలో మే 13న ఎన్నికలు పూర్తయితే జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఇవ్వకూడదు?

Woman Voter

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తరువాత కూడా విజయంపై అంచనాలలో స్పష్టత రాలేదు. పోలింగ్ శాతం 80కి మించడంతో అది ఎవరికి అనుకూలం? ఎవరికి ప్రతికూలం? అనే విశ్లేషణలు వస్తున్నా ఎవరికెన్ని సీట్లు వస్తాయనే అంచనాలు మాత్రం చెప్పలేని పరిస్థితి.

ఆంధ్రప్రదేశ్‌లో ఒకే దశలో మే 13న పోలింగ్ ముగిసినప్పటికీ ఇంకా ఎగ్జిట్ పోల్స్ ఎందుకు రాలేదు, ఎవరు గెలుస్తారో మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఎందుకు చెప్పడం లేదనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.

ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉండటమే దీనికి కారణం.

ఏపీలో ఎన్నికలకు ముగిసినప్పటికీ దేశంలోని 8 రాష్ట్రాల పరిధిలోని 163 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉండడంతో అవన్నీ పూర్తయేవరకు ఫలితాలపై ఎలాంటి అంచనాలు వెలువరించరాదని ఎలక్షన్ కమిషన్ నిషేధం విధించింది.

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 126(ఏ)(1) ప్రకారం 2024 ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి జూన్ 1 సాయంత్రం 6.30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వరాదని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎందుకు?

ఈ తేదీలు, సమయం నిర్దేశించడానికి కారణం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ నాలుగు రాష్ట్రాలు కాకుండా తెలంగాణ సహా మరో 13 రాష్ట్రాలలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కూడా ఇదే సమయంలో జరుగుతున్నాయి.

ఈ మొత్తం ఎన్నికల పోలింగ్ 7 దశలలో నిర్వహిస్తోంది ఎలక్షన్ కమిషన్. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ఉదయం 7 గంటలకు మొదలైంది.

ఏడో దశ పోలింగ్ జూన్ 1న సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది.

ఈ రెండు దశల మధ్యలో ఏప్రిల్ 26, మే 7, మే 13(ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎన్నికలు జరిగాయి), మే 20, మే 25 తేదీలలో ఎన్నికలు ఉన్నాయి.

వీటిలో ఏ దశలో జరిగిన ఎన్నికల పోలింగ్ తరువాతైనా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తే అది ఆ తరువాత దశలలో ఓటేయాల్సినవారిపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.

ఆ కారణంతోనే చివరి దశ అయిన జూన్ 1న పోలింగ్ ముగిశాక 6.30 వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదంటూ నిషేధం విధించారు.

Ink on Finger

ఫొటో సోర్స్, Getty Images

ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126(ఏ)(1) ఏం చెప్తోంది?

1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 126 ఏ ప్రకారం వేర్వేరు దశలలో పోలింగ్ జరిగినప్పుడు మొదటి దశ పోలింగ్ మొదలైన సమయం నుంచి చివరి దశ పోలింగ్ ముగిసి మరో అర గంట గడిచే వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మీడియా వెల్లడించరాదు.

దాని ప్రకారమే...జూన్ 1న పోలింగ్ సాయంత్రం 6 గంటలతో ముగుస్తున్నప్పటికీ 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంది.

నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది?

ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉన్న సమయంలో ఎవరైనా దాన్ని ఉల్లంఘిస్తే శిక్షకు అర్హులవుతారు.

నేరం రుజువైతే గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష కానీ, జరిమానా కానీ.. జరిమానా-జైలు శిక్ష రెండూ కానీ విధించొచ్చు.

tv studio

ఫొటో సోర్స్, Getty Images

ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధ సమయంలో మీడియా ఏం చేయకూడదంటే..

నేరుగా ఫలితాలపై తమ అంచనాలు ప్రకటించడం ఒక్కటే కాదు రాజకీయ విశ్లేషకులు, ఎన్నికల విశ్లేషకులతో అంచనాలు చెప్పించేలాంటి కార్యక్రమాలు ప్రసారం చేయరాదు, అలాంటి కథనాలు ప్రచురించరాదు.

జ్యోతిష్యులు, ఇతర విధానాలలో అంచనాలు వేసేవారితోనూ ఎలాంటి ముందస్తు ఊహాగానాలు చెప్పించడానికి వీల్లేదు.

సినిమా నటులు పోటీలో ఉన్నప్పుడు..

ఎలక్షన్లలో పోటీ చేసే సినిమా నటులు, టీవీ నటులకు సంబంధించిన సినిమాలు, సీరియళ్లు వంటివి ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు దూరదర్శన్‌లో ప్రసారం చేయడానికి వీల్లేదు. దూరదర్శన్ ప్రజాధనంతో నడుస్తుందన్న ఉద్దేశంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ఇలాంటి ప్రసారాలకు వీలు కల్పించడం లేదు.

అయితే, ప్రైవేట్ చానళ్లు, సినిమా థియేటర్లలో ఆయా నటుల సినిమాలు ప్రదర్శించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)