ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024: మీరు ఎవరికి ఓటేశారో తెలుసుకోవడమెలా?

ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా 96 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.
అయితే, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓటర్ గుర్తింపు కార్డు లేకపోయినా ఓటు వేయొచ్చా? ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? ఓటు ఎవరికి వేశామో తెలుసుకోవచ్చా? ఈవీఎంలో ఓటు ఎలా వేయాలి? మన ఓటు వేరేవాళ్లు వేస్తే ఏం చేయాలి? లాంటి సందేహాలు చాలామందికి ఉంటాయి.
ఈ సందేహాలను సమాధానాలను ఈ కథనంలో చూద్దాం.
ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడమెలా?
ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా? లేదా తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
అలాగే, స్థానిక ఎన్నికల కార్యాలయంలో కూడా తెలుసుకోవచ్చు.

పోలింగ్ బూత్ ఎక్కడుంది?
ఎన్నికల తేదీ కంటే ముందే ఓటరు స్లిప్‌లను అధికారులు ఓటర్లకు అందజేస్తారు.
అందులో మీ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ఈ వివరాలలో పోలింగ్ బూత్ ఎక్కడుందనే సమాచారం కూడా ఉంటుంది.
ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా.. ఓటు వేయవచ్చా?
ఓటరు జాబితాలో పేరు ఉండి, ఓటరు కార్డు లేకపోయినా ఓటు వేయొచ్చు.
అయితే, అందుకోసం ఇతర కొన్ని ఐడీలు చూపించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది.
పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పెన్షన్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డ్‌లో ఏదైనా ఉంటే ఆ కార్డు చూపించి ఓటేయొచ్చు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎవరికి ఓటు వేశారో వెంటనే తెలుసుకోవచ్చా?
ఈవీఎంకు అనుసంధానమై ఉన్న వీవీపాట్ ద్వారా మీరు ఎవరికి ఓటు వేశారో చూసుకోవచ్చు.
వీవీపాట్ ద్వారా మీ ఓటును ప్రింట్ తీసుకోవచ్చు.
ఓటర్ వెరిఫైడ్ పేపర్ అడిట్ ట్రయిల్‌కు సంక్షిప్త రూపమే వీవీపాట్. ఇది ఒక చిన్న ప్రింటిర్ లాంటిది. వీవీపాట్‌ను ఈవీఎంలకు అనుసంధానిస్తారు.
తాము వేసిన ఓటు ఎవరికి పడిందో ఓటర్లు చూసుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం దీన్ని తీసుకొచ్చింది.
మనం ఏ పార్టీకి ఓటు వేశామనదే వీవీపాట్‌ల ద్వారా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది.
ఈవీఎంలో మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత వీవీపాట్ ఒక స్లిప్‌లో ఆ అభ్యర్థి పేరు, గుర్తు వచ్చేలా ప్రింట్ తీసి సీల్డ్ బాక్స్‌లో పడేస్తుంది.
ఓటు వేసిన ఏడు సెకన్ల తర్వాత వీవీపాట్ బీప్ శబ్దం చేస్తూ ప్రింట్‌ను చూపిస్తుంది.
2013లో నాగాలాండ్‌లోని నొక్సెన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో తొలిసారి వీవీపాట్‌లను ఎన్నికల సంఘం ఉపయోగించింది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2014 సాధారణ ఎన్నికల్లో కొన్ని పోలింగ్ బూత్‌లలో వీవీపాట్‌లను ఎన్నికల సంఘం ఉపయోగించింది.

ఓటరు ఐడీ కార్డు పోతే కొత్తది ఎలా తీసుకోవాలి?
మొదట పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలి. రూ. 25 డిపాజిట్ చేయాలి. అప్పుడు కొత్త కార్డును తీసుకోవచ్చు.
మీ ఓటు వేరే వాళ్లు వేస్తే ఏం చేయాలి?
ఉంది. మీకు బదులుగా వేరే వ్యక్తి ఓటు వేస్తే ఎన్నికల సంఘం నిబంధన 49 (పీ) అనుసరించి మీకు సంబంధించిన గుర్తింపు కార్డులను ప్రిసైడింగ్ అధికారికి చూపి మీ ఓటు హక్కును పొందవచ్చు. పూర్తి వివరాలు..

ఆసక్తికరంగా ఏపీ ఎన్నికలు
ఈ ఎన్నికలలో కూడా వైసీపీ ఒంటరిగా పోటీచేస్తుండగా గత ఎన్నికలలో వేర్వేరుగా పోటీ చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఈసారి ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తున్నాయి.
వైసీపీ 175 సీట్లలో పోటీ చేస్తుండగా ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం పార్టీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తున్నాయి.
మరో కూటమి ‘ఇండియా’లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 159 సీట్లు, సీపీఎం 8, సీపీఐ 8 సీట్లలో పోటీ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ పాలిత కశ్మీర్లో పిండి ధరలపై ఆందోళనలు, హింసాత్మక ఘర్షణలో పోలీసు అధికారి మృతి
- Northern Lights: ఆకాశంలో ఈ రంగుల తుపాను మీకెప్పుడైనా కనిపించిందా?
- స్కార్పియన్: మానవ అక్రమ రవాణాలో ఆరితేరిన ఈ యూరప్ మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ బీబీసీ జర్నలిస్టుకు ఎలా దొరికాడంటే....
- ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?
- పాకిస్తాన్ ఆర్థికసంక్షోభం: ఈసారి చైనా, సౌదీ అరేబియా కూడా కాపాడలేవా
- జేపీ నడ్డా మీద నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఎందుకంత నమ్మకం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














