పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో పిండి ధరలపై ఆందోళనలు, హింసాత్మక ఘర్షణలో పోలీసు అధికారి మృతి

ఫొటో సోర్స్, SARDAR SAEED IQBAL
పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో కరెంట్ ఛార్జీలు, పిండి ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు, పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఈ ఘర్షణలో ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ మరణించారని స్థానిక జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ ఖాన్ బీబీసీ ఉర్దూతో చెప్పారు.
వివిధ ప్రాంతాల్లో 90 మందికి పైగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.
మీర్పూర్‌లోని ఇస్లాంఘర్‌లో నిరసనకారులు జరిపిన కాల్పుల్లో అద్నాన్ ఖురేషి అనే పోలీసు ఇన్‌స్పెక్టర్ చనిపోయారని పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ప్రభుత్వ ప్రతినిధి అబ్దుల్ మజీద్ ఖాన్ తెలిపారు.
శాంతిభద్రతలను కాపాడేందుకు వెళ్లిన పోలీసులపై నిరసనకారులు దాడి చేశారని చెప్పారు.
హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ముజఫరాబాద్‌లోనూ కొన్ని చోట్ల చిన్నపాటి ఘర్షణలు జరిగాయని, ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

ఫొటో సోర్స్, ABDUL WAHEED
నిరసన హింసాత్మకంగా ఎలా మారింది?
ముజఫరాబాద్‌కు లాంగ్ మార్చ్ చేసి, నిరసన తెలపాలని పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది.
కరెంటు ఛార్జీల పెంపు, పిండి ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈ కమిటీ నిరసనలకు పిలపునిచ్చింది.
ఈ పిలుపు తర్వాత, నిరసనకారులను అడ్డుకునేందుకు స్థానిక పోలీసులు భద్రతను పెంచారు. ముజఫరాబాద్‌లోకి వచ్చి వెళ్లే రహదారులను మూసివేశారు.
ఈ కమిటీకి చెందిన పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
లాంగ్ మార్చ్‌కు ఒకరోజు ముందు శుక్రవారం కూడా కమిటీ రోడ్డును దిగ్బంధించి దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఆందోళనలతో ముజఫరాబాద్, ధడియాల్, కోట్లి తదితర ప్రాంతాల్లో రెండు రోజులుగా సాధారణ జనజీవనం స్తంభించింది.

ఫొటో సోర్స్, KHAWAJA KABEER
లాంగ్ మార్చ్ సందర్భంగా ఘర్షణలు..
శనివారం లాంగ్ మార్చ్ సందర్భంగా అనేక ప్రాంతాల్లో నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
చాలా మందిని పోలీసులు అరెస్టు చేశారని ఆందోళనకారులు ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే ఆందోళన కొనసాగిస్తామన్నారు.
అయితే, నిరసనకారుల వాదనలను స్థానిక ప్రభుత్వ ప్రతినిధి, శాసన సభ్యుడు అబ్దుల్ మజీద్ ఖాన్ తోసిపుచ్చారు. రోడ్లు మూసివేయలేదని, ప్రధాన మార్గాలన్నీ తెరిచే ఉన్నాయన్నారు.
శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి అనుమతి ఇవ్వలేమన్నారు.














