తాజ్‌మహల్‌కు పొదిగిన 40 రకాల రత్నాలను బ్రిటిష్ వాళ్ళు దోచుకెళ్లారా?

షాజహాన్

ఫొటో సోర్స్, WALKER AND CO

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

షాజహాన్ అంత పొడగరి కాకున్నా విశాలమైన భుజాలతో ఆయన శరీరం చాలా బలిష్టంగా ఉండేది.

యువరాజుగా ఉన్న సమయంలో ఆయన కూడా తన తండ్రి జహంగీర్, తాత అక్బర్‌లాగే మీసాలు మాత్రమే ఉంచుకున్నారు. కానీ చక్రవర్తి కాగానే షాజహాన్ గడ్డం పెంచడం కూడా మొదలుపెట్టారు.

షాజహాన్ వ్యక్తిత్వం మొఘలుల ఘనతను, వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. షాజహాన్‌కు తన తండ్రి జహంగీర్‌లా మూడ్ పదే పదే మారిపోయేది కాదు. ఆయన చాలా మృదుభాషి, వినయంగా ఉండేవారు.

మొఘలుల గురించి 'ఎంపరర్స్ ఆఫ్ ద పీకాక్ థ్రోన్ ద సాగా ఆఫ్ ద గ్రేట్ మొఘల్స్' అనే పుస్తకం రాసిన అబ్రహాం ఇరాలీ షాజహాన్ గురించి రాశారు.

"షాజహాన్‌ లక్షణాల్లో అతిగొప్పది ఆయన స్వీయ నియంత్రణ. మద్యం పట్ల ఆయన వైఖరిలో అది ప్రతిబింబిస్తుంది. 24 ఏళ్ల వయసులో ఆయన మొదటిసారి మద్యం రుచి చూశారు. అది కూడా తండ్రి బలవంతం చేయడంతో. తర్వాత ఆరేళ్ల వరకూ ఆయన చాలా తక్కువ సార్లే మద్యం తాగారు. 1620లో దక్షిణాది యాత్రకు బయల్దేరే సమయానికి ఆయన పూర్తిగా మద్యం మానేశారు. తన మద్యం నిల్వలను చంబల్ నదిలో కుమ్మరించాడు" అని ఇరాలీ రాశారు.

వీడియో క్యాప్షన్, తాజ్‌మహల్‌పైనా కరోనా ఎఫెక్ట్

ముంతాజ్ మహల్ పూర్తిగా అంకితం

షాజహాన్ కచ్చితంగా ఒక సంప్రదాయ ముస్లిం అయినప్పటికీ, ఆయన సాధువులా జీవించలేదు. కానీ ఆడంబరం ప్రదర్శించడంలో ఆయన తన తండ్రిని మించిపోయారు. ఇటలీ చరిత్రకారుడు నికోలావ్ ఆయన ఎలా గడిపేవారో రాశారు.

"పాలన నుంచి కాస్త సేదతీరడానికి ఆయన సంగీత, నృత్యాల్లో మునిగితేలేవారు. రకరకాల సంగీత వాద్యాలు వినడం, కవితలు, పాటలు వినడం ఆయనకు అలవాటు. షాజహాన్ స్వయంగా ఒక మోస్తరుగా పాడేవారు. ఆయనతోకలిసి పాడడానికి, నాట్యం చేయడానికి యువతుల బృందం ఒకటి ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. వారిని కంచన్ అని పిలిచేవారు" అని ఆయన చెప్పారు.

షాజహాన్ క్రూరత్వం గురించి ఎన్నో కథలు ఉన్నప్పటికీ, తన భార్య ముంతాజ్ మహల్ జీవించి ఉన్నంతవరకూ ఆయన పూర్తిగా ఆమె పట్ల అంకితభావంతో ఉన్నారు. అది ఎంతగా అంటే, షాజహాన్ మిగతా భార్యలకు ఆయన వ్యక్తిగత జీవితంలో చాలా తక్కువ చోటు లభించింది.

షాజహాన్ దర్బారులోని చరిత్రకారుడు ఇనాయత్ ఖాన్ తన పుస్తకం 'షాజహానామా'లో ఆ వివరాలన్నీ రాశారు.

"మిగతా మహిళల పట్ల షాజహాన్‌కు ఉన్న భావనలు, ముంతాజ్ మహల్ అంటే ఆయనకున్న ఇష్టంలో వెయ్యో వంతు కూడా ఉండేవి కావు. మహలులో ఉన్నా బయట ఉన్నా ఆమె లేకుండా ఆయన ఉండలేకపోయేవారు" అని చెప్పారు..

షాజహాన్, ముంతాజ్, తాజ్‌మహల్

ఫొటో సోర్స్, WALKER AND CO.

చివరిక్షణాల్లో మాట తీసుకున్న ముంతాజ్

ముంతాజ్ అంటే షాజహాన్‌కు ఎనలేని ప్రేమ. ఆయన ఆమె అందానికి ఎంత దాసోహం అవడంతోపాటూ, తన తండ్రి జహంగీర్.. నూర్జహాన్ మీద ఆధారపడినట్లే.. పాలనా కార్యాల్లో కూడా ఆమెపై ఆధారపడేవారు.

షాజహాన్ చక్రవర్తి అయిన నాలుగేళ్లకే ముంతాజ్ మరణించారని, లేదంటే మొఘల్ సింహాసనంపై ఆమె ప్రభావం ఇంకా ఎక్కువగానే కనిపించేదని చెప్పుకొంటారు.

"చివరి క్షణాల్లో ముంతాజ్ చాలా బలహీనంగా అయిపోయారు. ఇక వేరే ఏ మహిళతోనూ సంతానం పొందనని ఆమె చక్రవర్తి దగ్గర మాట తీసుకున్నారు. నా కలలో ఒక అందమైన భవనం, తోట చూశానని, అది ప్రపంచంలో ఇంకెక్కడా లేదని షాజహాన్‌కు చెప్పిన ముంతాజ్.. మీరు కూడా నా జ్ఞాపకంగా అలాంటి సమాధి నిర్మించాలని ఆయన్ను కోరారు'' అని ఇనాయత్ ఖాన్ రాశారు.

ముంతాజ్ 1631 జూన్ 17న బుర్హాన్‌పూర్‌లో తుదిశ్వాస విడిచారు. తన 14వ సంతానానికి జన్మనిస్తున్న సమయంలో ఆమె 30 గంటలపాటు ప్రసవ వేదన అనుభవించారు.

భగవంతుడు తన భార్యను కాపాడుతాడనే ఆశతో షాజహాన్ ఆమె చనిపోయే ముందు పేదలకు ఎంతో డబ్బు దానం చేశాడు. కానీ వైద్యులు, హకీమ్‌లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెను కాపాడలేకపోయారు.

ముంతాజ్

ఫొటో సోర్స్, WALKER AND CO.

షాజహాన్ గడ్డం హఠాత్తుగా తెల్లబడింది

"ముంతాజ్ మృతితో షాజహాన్ చాలా కుంగిపోయారు. ఆయన ఒక వారం వరకూ తన గది నుంచి బయటికి రావడంగానీ, రాచకార్యాల్లో, వేరే ఏదైనా పనిలో పాల్గొనడం చేయలేకపోయారు. సంగీతం వినడం, పాటలు వినడం, మంచి బట్టలు వేసుకోవడం అన్నీ వదిలేశారు. ముంతాజ్ బుధవారం చనిపోవడంతో తర్వాత రెండేళ్ల వరకూ ఆయన ప్రతి బుధవారం తెల్ల బట్టలే ధరించేవారు. ఆయన చూపు కూడా తగ్గిపోయింది" అని ఇనాయత్ ఖాన్ రాశారు.

"ముంతాజ్ చనిపోక ముందు ఆయన మీసాలు, గడ్డంలో అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు ఉండేవి. ఆయన వాటిని చేత్తో పీకేసేవారు. కానీ, ఆమె చనిపోయాక కొన్ని రోజుల్లోనే ఆయన మూడొంతుల గడ్డం తెల్లబడింది. ఒకానొక సమయంలో ఆయన సింహాసనం కూడా వదిలేయాలనుకున్నారు. కానీ రాజ్యపాలన పవిత్ర బాధ్యత అని, వ్యక్తిగత సమస్యలతో దానిని వదలకూడదని ఆలోచించాక తన నిర్ణయం మార్చుకున్నారు." అని చెప్పారు.

ముంతాజ్ మొదటి సమాధి

ఫొటో సోర్స్, PENGUIN VIKING

ఫొటో క్యాప్షన్, తపతీ నదీ తీరంలో ముంతాజ్ మొదటి సమాధి

ముంతాజ్‌ను మూడుసార్లు ఖననం చేశారు

ముంతాజ్ మహల్‌ను మొదట బుర్హాన్‌పూర్ దగ్గర తపతి నదీతీరంలోని ఒక తోటలో ఖననం చేశారు. ఆరు నెలల తర్వాత ఆమె పార్థివ శరీరాన్ని అక్కడ నుంచి తీసీ 15 ఏళ్ల యువరాజు షా షుజా పర్యవేక్షణలో ఆగ్రాకు తీసుకొచ్చారు. అక్కడ 1632 జనవరి 8న ఆమెను యమునా నదీ తీరంలో రెండోసారి ఖననం చేశారు.

తర్వాత అక్కడ షాజహాన్ ఆమె సమాధిని నిర్మించారు. దానికి ఆయన 'రవుజా-ఎ-మునవ్వరా' అనే పేరు పెట్టారు. ఆ తర్వాత దానినే తాజ్ మహల్ అని పిలవడం ప్రారంభించారు. మీర్ అబ్దుల్ కరీమ్, ముకుమ్మత్ ఖాన్‌కు ఆ సమాధి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు.

మకుమ్మత్ ఖాన్ జహంగీర్ పాలనా కాలంలో దక్షిణ ఇరాన్‌లోని షీరాజ్ నగరం నుంచి భారత్ వచ్చారు. షాజహాన్ ఆయనను తన నిర్మాణ మంత్రిగా నియమించారు. 1641లో ఆయనను దిల్లీ గవర్నర్‌గా చేశారు. కొత్త నగరం షాజహానాబాద్‌లో ఎర్ర కోట నిర్మించే బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు.

తాజమహల్‌ను 1560వ దశకంలో దిల్లీలో నిర్మించిన హుమయూన్ సమాధిలాగే నిర్మించారు. దానికోసం 42 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. దాని నాలుగు మీనార్లు 139 అడుగుల ఎత్తున నిర్మించారు. అన్నిటికంటే పైన ఒక గుమ్మటం ఏర్పాటు చేశారు.

షాజహాన్

ఫొటో సోర్స్, WALKER AND CO.

మక్రానా నుంచి తెప్పించిన పాలరాయి

తాజ్‌మహల్ నిర్మించాలని నిర్ణయించిన తర్వాత ఆ సమాధి కోసం స్థలం ఎంచుకోవడం షాజహాన్‌కు ఒక పెద్ద సవాలుగా నిలిచింది.

తాజ్‌మహల్ గురించి పుస్తకం రాసిన మైకెల్ ప్రెస్టన్ ఆయన ఎలాంటి స్థలం కోసం వెతికాడో వివరించారు.

"షాజహాన్ మొదట తాజ్‌మహల్‌ను ఆగ్రా నగరానికి దూరంగా, ప్రశాంతంగా ప్రాంతంలో నిర్మించాలని భావించారు. రెండోది ఈ భవనం దూరం నుంచి కూడా కనిపించేంత భారీగా ఉండాలని అనుకున్నారు. మూడోది తోటల పెంపకానికి నీళ్ల కొరత లేకుండా అది యమునా నదికి దగ్గరగా ఉండాలని కోరుకున్నారు. తాజ్‌మహల్ తాను ఉంటున్న ఆగ్రా కోట వరకూ కనిపించాలని కూడా షాజహాన్ భావించారు. అందుకే షాజహాన్ ఆగ్రా కోటకు రెండున్నర మైళ్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని దానికోసం ఎంచుకున్నారు" అని చెప్పారు.

తాజహమల్ నిర్మాణ పనులు 1632 జనవరి నుంచి మొదలయ్యాయి. అప్పటివరకూ షాజహాన్ దక్షిణాదినే ఉన్నారు. అదే సమయంలో భారత్‌లో పర్యటించిన పీటర్ మండీ తన 'ట్రావెల్స్ ఆఫ్ పీటర్ మండీ ఇన్ యూరోప్ అండ్ ఏసియా' పుస్తకంలో ఆ వివరాలు రాశారు.

వీడియో క్యాప్షన్, తరిగిపోతున్న తాజ్ మహల్ అందాలు. కళ్లు తెరవకపోతే కనుమరుగే.

"మొట్టమొదట ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి నేలను చదును చేశారు. ఆ తర్వాత వేలాది కార్మికులు రాత్రింబవళ్లూ కష్టపడి భవనానికి లోతైన పునాదులు తవ్వారు. యమునా నది నీళ్లు ఆ పునాదుల్లో చేరకుండా, జూన్, సెప్టెంబర్ నెలల మధ్య యుమున నదికి వచ్చే వరదలు తాజ్‌మహల్‌కు నష్టం కలిగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత మొదట 970 అడుగుల పొడవు, 364 అడుగుల వెడల్పుతో ఒక వేదిక నిర్మించారు. తర్వాత దానిపై సమాధిని నిర్మించారు'' అని చెప్పారు.

భవనానికి ఉయోగించే పాలరాయిని 200 మైళ్ల దూరంలో.. ప్రస్తుత రాజస్థాన్‌లో ఉన్న మక్రానా నుంచి తెప్పించారు. పోర్చుగల్ సందర్శకుడు సెబాస్టియో మెన్రిక్ ఆనాటి ఆ వివరాలు రాశారు.

''తాజ్‌మహల్‌ నిర్మాణం కోసం ఉపయోగించిన కొన్ని పాలరాతి ఫలకాలు ఎంత భారీగా ఉన్నాయంటే, వాటిని బలమైన ఎద్దులతో, దున్నపోతులతో లాగించి ఆగ్రాకు తీసుకొచ్చారు. ఆ పాలరాయి కోసమే ప్రత్యేకంగా భారీ ఎద్దుల బండ్లు తయారు చేయించారు. వాటిని 25 నుంచి 30 పశువులు లాగుతుండేవి" అని చెప్పారు.

తాజ్ మహల్

ఫొటో సోర్స్, WALKER AND CO.

కార్మికుల చేతులు నరికించారనే కథ నిజం కాదు

తాజ్‌మహల్ గురించి రాసిన "తాజ్‌మహల్ పాషన్ అండ్ జీనియస్ అట్ ద హార్ట్ ఆఫ్ మొఘల్ ఎంపైర్" పుస్తకంలో రచయిత డయానా, మైకెల్ ప్రెస్టన్ మరో విషయం రాశారు.

''తాజ్‌మహల్ నిర్మించడానికి వెదురు, కొయ్యలు ఇటుకలతో ఒక పరంజాను నిర్మించారు. పని పూర్తయిన తర్వాత ఆ పరంజాను కూల్చడానికే ఐదేళ్లు పట్టచ్చని ఆ పనుల్లో ఉన్నవారు షాజహాన్‌కు చెప్పారు. దాంతో షాజహాన్ దానిని కూల్చిన తర్వాత ఆ పరంజాలో ఉన్న ఇటుకలన్నీ తాజ్‌మహల్ కట్టిన వారికే ఇచ్చేస్తానని ప్రకటించారు."

"దాంతో కూలీలు తమ శక్తినంతా ఉపయోగించి రాత్రికిరాత్రే అంత పెద్ద పరంజాను కూల్చేశారు. తాజ్‌మహల్‌ నిర్మాణం పూర్తయ్యేవరకూ బయటి వారు దానిని చూడకుండా ఆ పరంజాను నిర్మించారని చెప్పడం నిజం కాదు. గోడల బయట నుంచి తాజ్‌మహల్ నిర్మాణాన్ని చూశాడని ఒక వ్యక్తికి కళ్లు తీసేశారనే కథ కూడా వాస్తవం కాదు" అని వారు రాశారు.

తాజ్ మహల్

ఫొటో సోర్స్, PENGUIN VIKING

తాజ్‌మహల్ నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి కూలీకీ షాజహాన్ చేతులు నరికేయించాడని, ప్రపంచ ఎనిమిదో వింతను వేరే ఎవరూ నిర్మించకుండా ఆయన అలా చేశాడని అక్కడ ప్రతి గైడ్ ఒక కథ చెబుతారు. కానీ ఆ ఘటనకు కూడా ఎలాంటి ఆధారాలూ లేవు. ఏ చరిత్రకారుడూ ఆ విషయం గురించి రాయలేదు.

షాజహాన్ జీవితచరిత్ర 'షాజహాన్ ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద మొఘల్ ఎంపరర్' రాసిన ఫర్గూస్ నికోల్ మరో విషయం కూడా రాశారు.

"తాజ్‌మహల్ నిర్మాణంలో పనిచేసిన ఎక్కువ మంది కూలీలు కనోజ్‌కు చెందిన హిందువులు. దానిపై పువ్వులు, తీగలు లాంటివి చెక్కడానికి శిల్పులను పోఖ్రా నుంచి పిలిపించారు. కశ్మీర్‌కు చెందిన రాంలాల్‌కు తోటపని బాధ్యతలు అప్పగించారు" అని చెప్పారు.

తాజ్ మహల్

ఫొటో సోర్స్, WALKER AND CO.

తాజ్‌మహల్‌‌పై ఖురాన్ పంక్తులు, పువ్వుల నగిషీలు

అమానత్ ఖాన్‌కు తాజ్‌మహల్ మీద ఖురాన్ పంక్తులు చెక్కే బాధ్యతలు అప్పగించారు. తాజ్‌మహల్ మీద తన పేరు రాయడానికి షాజహాన్ ఆయన ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చారు.

ఖురాన్ పంక్తులతోపాటూ తాజ్‌మహల్ మీద చెక్కిన పువ్వులు ఎంత సజీవంగా అనిపించేవంటే, రెండు దశాబ్దాల తర్వాత దానిని సందర్శించిన రష్యా రచయిత హెలెనా బ్లావత్సకీ తన పుస్తకంలో రాశారు.

"తాజ్‌మహల్ గోడలపై చెక్కిన కొన్ని పువ్వులు ఎంత సజీవంగా ఉన్నాయంటే ఇవి నిజమైనవా అని నా చేతులు పదే పదే వాటిని తాకాలని వెళ్లేవి" అన్నారు.

తాజ్ మహల్ మీద పొదిగిన రత్నాలు

ఫొటో సోర్స్, WALKER AND CO.

ఫొటో క్యాప్షన్, తాజ్ మహల్ మీద పొదిగిన రత్నాలు

అమూల్యమైన రత్నాలను గోడలకు పొదిగారు

"షాజహాన్ తాజ్‌మహల్ కోసం ఆసియాలోని వివిధ ప్రాంతాల నుంచి 40 రకాల రత్నాలను తెప్పించారు.

"పచ్చలను సిల్క్ రూట్ ద్వారా చైనాలోని కాష్గర్ నుంచి తెప్పించారు. నీలంగా ఉండే లాపిస్ లాజూలిని అఫ్గానిస్తాన్ గనుల నుంచి తీసుకొచ్చారు. వైడూర్యాలను టిబెట్ నుంచి, పగడాలను అరేబియాలోని ఎర్ర సముద్రం నుంచి తెప్పించారు. పసుపుగా ఉండే అంబర్‌ను బర్మా నుంచి, కెంపులను శ్రీలంక నుంచి తెప్పించారు. కాట్స్ ఐని ఈజిఫ్టు నుంచి, నీలాలను గల్ఫ్ నుంచి తెప్పించారు. తర్వాత నీలాలను అశుభం అని చెప్పడంతో వాటిని సరిగా ఉపయోగించలేదు" అని డయానా రాశారు.

తాజ్ మహల్

ఫొటో సోర్స్, WALKER AND CO.

తాజ్‌మహల్ నిర్మాణానికి రూ.4 కోట్ల వ్యయం

షాజహాన్ కాలం నాటి చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ లాహోరీ.. తాజ్‌మహల్‌ నిర్మాణానికి రూ. 50 లక్షలు ఖర్చయ్యాయని రాశారు.

కానీ, మరో చరిత్రకారులు ఆ ఖర్చు కేవలం కూలీలకు ఇచ్చిన వేతనం మాత్రమే అని రాశారు. అందులో భవనానికి ఉపయోగించిన వస్తువుల విలువను చేర్చలేదన్నారు.

తర్వాత లభించిన పత్రాల ప్రకారం కొంతమంది చరిత్రకారులు తాజ్‌మహల్ వ్యయం రూ. 4 కోట్లుగా అంచనా వేశారు. భవనం నిర్మాణానికి ప్రభుత్వ ఖజానా, ఆగ్రా ఖజానాలోని మొత్తం డబ్బు ఖర్చు చేశారని చెప్పారు. తర్వాత కూడా తాజ్‌మహల్ పర్యవేక్షణ, సంరక్షణ కొనసాగేలా ఆగ్రా చుట్టుపక్కల 30 గ్రామాల నుంచి వచ్చే ఆదాయాన్ని వినియోగించాలని షాజహాన్ ఆదేశించారు.

తాజ్ మహల్

ఫొటో సోర్స్, WALKER AND CO

షాజహాన్‌ను ముంతాజ్ మహల్ సమాధి పక్కనే ఖననం చేశారు

1659లో కొడుకు ఔరంగజేబు తన తండ్రిని గద్దె దించి, ఆయన్ను జైల్లో పెట్టిన కొన్నిరోజుల తర్వాత షాజహాన్ జబ్బుపడ్డారు. తనకు ఇక ఎక్కువ సమయం లేదని గ్రహించిన ఆయన ఎప్పుడూ తాజ్‌మహల్‌ను చూసుకునేలా, తనను ఒక బాల్కనీలో ఉంచాలని కోరారు.

కశ్మీరీ శాలువ కప్పుకున్న షాజహాన్ ఆగ్రా కోటలో అదే బాల్కనీలో 1666 జనవరి 21న మృతిచెందారు. ఆ సమయంలో ఆయన కుమార్తె జహా ఆరా ఆయనతోనే ఉన్నారు. షాజహాన్ పార్థివ శరీరాన్ని గంధపు చెక్కతో చేసిన శవపేటికలో ఉంచారు.

షాజహాన్ కుమార్తె ఆయనకు రాజ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని భావించారు. కానీ ఔరంగజేబు ఆమె మాట వినలేదు. షాజహాన్‌ను తాజ్ మహల్‌లో భార్య ముంతాజ్ మహల్ పక్కనే ఖననం చేశారు.

తాజ్ మహల్

ఫొటో సోర్స్, WALKER AND CO

ఫొటో క్యాప్షన్, తాజ్‌మహల్ లోపల పక్కపక్కనే ముంతాజ్, షాజహాన్ సమాధులు

ఆంగ్లేయులకాలంలో తాజ్‌మహల్‌కు అవమానం

మొఘలుల పతనం తర్వాత 1803లో ఆంగ్లేయ జనరల్ లేక్ ఆగ్రాను ఆక్రమించాడు. తర్వాత కొన్ని రోజులకే తాజ్‌మహల్ గోడలకు పొదిగిన అమూల్యమైన రత్నాలు, తివాచీలు, గోడలకు ఉన్న కళాఖండాలు అక్కడ కనిపించకుండా పోయాయి.

తాజ్‌మహల్ లోపల ఉన్న మసీదును అద్దెకు తీసుకున్న ఆంగ్లేయులు, దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని హనీమూన్ కాటేజీలుగా మార్చేశారు. సమాధి వేదికపై సైనికులు బ్యాండ్ బాజాలు మోగించడం మొదలుపెట్టారు. తాజ్‌మహల్ ముందున్న తోటలో ఆంగ్లేయులు పిక్నిక్ జరుపుకొనేవారు.

1830 సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ తాజ్‌మహల్‌ను కూల్చేసి ఆ పాలరాయిని మొత్తం వేలం వేయాలని కూడా ఆలోచించినట్లు వదంతులు వచ్చాయి.

తాజ్ మహల్

ఫొటో సోర్స్, RAGHU RAI

1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ సైనికులు కొన్ని మొఘల్ భవనాలను ధ్వంసం చేశారు. వాటిలో ముంతాజ్ మహల్ తండ్రి ఆసఫ్ ఖాన్ మహల్ కూడా ఒకటి. కానీ ఆ సమయంలో తాజ్ మహల్ ఎలాగోలా సురక్షితంగా బయటపడింది. 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ తాజ్‌మహల్ మరమ్మతులు చేయించడానికి చాలా ఆసక్తి చూపించారు.

1965లో భారత పాకిస్తాన్ యుద్ధ సమయంలో సమీప వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు జరపవచ్చని భావించిన భారత ప్రభుత్వం తాజ్ మహల్‌ను కప్పడానికి నల్ల రంగు వస్త్రంతో ఒక భారీ కవర్‌ను కుట్టించింది.

ఆ కవర్‌ను 1995 వరకూ సురక్షితంగానే ఉంచారు. కానీ, అప్పటికే దానిని ఎలుకలు అక్కడక్కడా కొట్టేయడంతో తర్వాత దానిని ధ్వంసం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)