మైక్ టైసన్: విజయ్ దేవరకొండ 'లైగర్'లో ఈ బాక్సింగ్ హీరో ఏం చేస్తున్నాడు?

మైక్ టైసన్‌తో విజయ్ దేవరకొండ

ఫొటో సోర్స్, VijayDevarakonda/Twitter

ఫొటో క్యాప్షన్, మైక్ టైసన్‌తో విజయ్ దేవరకొండ
    • రచయిత, బెన్ డిర్స్, బీబీసీ స్పోర్ట్స్
    • హోదా, మైక్ కోస్టెలో, బీబీసీ బాక్సింగ్ కామేంటేటర్

మైక్ టైసన్... అనగానే బాక్సింగ్ రింగ్‌లో పదునైన పిడిగుద్దులతో ప్రత్యర్థిని కుప్పకూల్చే మహాబలుని రూపం అందరికీ గుర్తుకు వస్తుంది. కోపంతో ఊగిపోతూ ఎదుటివారికి ముచ్చెమటలు పట్టించడం, బౌట్‌లో కనికరం లేకుండా ఎదురుదాడి చేయడం, గెలవడం కోసం చివరకు ప్రత్యర్థి చెవిని తెగేలా కొరకడం లాంటి పనులన్నీ ఒక్కొక్కటిగా కళ్ల ముందు మెదులుతాయి.

ఇవన్నీ 1980, 90 దశకాల్లో క్రీడాభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనలు. ఆ సమయంలో బాక్సింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు మైక్ టైసన్.

ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో 20 ఏళ్ల వయస్సులోనే డబ్ల్యూబీసీ హెవీ వెయిట్ చాంపియన్‌గా నిలిచిన ఏకైక బాక్సర్ అతను.

ఒకే సమయంలో ఆయన వద్ద వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (WBC), వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ (WBA), ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ (IBF) టైటిళ్లు ఉన్నాయంటే రింగ్‌లో ఆయనెంత పవర్‌ఫుల్ బాక్సరో అర్థం చేసుకోవచ్చు.

కెరీర్‌లో ఆడిన 58 మ్యాచ్‌ల్లో 50 సార్లు విజయం ఆయననే వరించింది. బాక్సింగ్ రింగ్‌ను ఆయన ఎంతలా ఏలారో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. అందులో 44 మ్యాచ్‌ల్లో నాకౌట్ విజయాలు సాధించడం మరింత విశేషం.

టైసన్

ఫొటో సోర్స్, MIKE TYSON/FACE BOOK

ఐరన్ మ్యాన్, కిడ్ డైనమేట్, 'ద బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్' అని ఆయనకున్న ముద్దుపేర్లే ఆయన వైఖరి ఎలాంటిదో తెలుపుతాయి.

చిన్నతనంలో ఎప్పుడూ గొడవలు, దొంగతనాల కేసులో జైలుకు వెళ్లిన కుర్రాడు... తర్వాత తన కసి, పట్టుదలతో బాక్సింగ్ ప్రపంచానికి రారాజయ్యాడు.

తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడంతో టైసన్ బాల్యమంతా గందరగోళంగా గడిచింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. ఇంట్లో గొడవలతో మొండిగా తయారైన అతను ఎఫ్పుడూ వీధి గొడవల్లో తలదూర్చేవాడు. ప్రతీ చిన్న విషయానికి విపరీతమైన కోపం తెచ్చుకునేవాడు. దీంతో అనవసర తగాదాలకు పోయి అందరిలో చెడ్డ బాలుడిగా పేరు తెచ్చుకున్నాడు.

అదే సమయంలో 'కస్ డి అమాటో' అనే ట్రైనర్ టైసన్‌ను చేరదీసి బాక్సింగ్‌లో రాటుదేలేలా తయారు చేశారు. అతనికి బతకడం ఎలాగో నేర్పించాడు. మాజీ చాంపియన్ ఫ్లాయిడ్ ప్యాటర్సన్‌ కెరీర్ ఎదుగుదలలో కూడా కస్ డి అమాటో కీలక పాత్ర పోషించారు.

కెరీర్ ప్రతీ దశలోనూ టైసన్ వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొన్నాడు. సమస్య ఎదుర్కొన్న ప్రతీసారి కోపాన్నంతా బాక్సింగ్‌లో చూపించేవాడు. కారణాలేవైనా ఆయన ఇద్దరు భార్యలతో విడిపోయాడు. ప్రత్యర్థుల కుట్రలతో అత్యాచార కేసులో నిందితునిగా జైలు శిక్ష అనుభవించాడు. లెక్కలేనన్ని డబ్బులు సంపాదించి చివరకు పేదరికాన్ని కూడా అనుభవించాడు. ఒకానొక దశలో డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. ఆకాశానికి ఎక్కినట్లే ఎక్కి అంతలోనే అథ:పాతాళానికి దిగజారేవాడు. ఇలా టైసన్ జీవితమంతా సమస్యలమయం.

బాక్సింగ్‌లో ఎవరూ సాధించలేని రికార్డులు నెలకొల్పిన అతను, డ్రగ్స్ వ్యాపారం కూడా చేశాడు. రైటర్మెంట్ అనంతరం హాలీవుడ్‌ హిట్ సినిమాల్లో నటించి ఆయన ఈ తరం యువతకు కూడా పరిచయమయ్యారు.

తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తోన్న చిత్రంలో మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో క్రీడాభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులకు కూడా ఆయన చేరువ కానున్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

తాజాగా మైక్‌టైసన్‌తో దిగిన ఫొటోను విజయ్ దేవరకొండ ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ఆయనతో గడిపిన ప్రతీ నిమిషాన్ని తన జ్ఞాపకాల్లో పదిలపరుచుకుంటానని విజయ్ రాసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో మైక్ టైసన్ గురించి కాస్త విపులంగా తెలుసుకుందాం.

వ్యక్తిగత జీవితం

హెవీ వెయిట్ బాక్సింగ్‌లో తనదైన ముద్ర వేసిన మైక్ టైసన్ 1966 జూన్ 30న అమెరికాలోని న్యూయార్క్‌లో జన్మించారు.

టైసన్ చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు విడిపోయారు. ఆయనకు మాటలు సరిగా రాకపోవడం, లావుగా ఉండటం చూసి తోటి పిల్లలు ఎగతాళి చేసేవారు. కుటుంబంలో నిరాదరణతో పాటు అవమానాలు భరించలేక టైసన్ ప్రతీ చిన్న విషయానికి గొడవకు దిగుతుండేవాడు. ఇలా బాల్యంలోనే పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. 1979లో బాల్య నేరస్థుల పాఠశాలలో మైక్ టైసన్‌ను తొలిసారిగా కస్ డి అమాటో చూశారు.

ట్రైనర్ కస్ డి అమాటో దృష్టిలో పడ్డాక ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన పర్యవేక్షణలో జూనియర్ ఒలింపిక్స్‌లో పాల్గొనే స్థాయికి టైసన్ ఎదిగాడు. 1985లోనే ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాడు. ప్రొఫెషనల్‌గా మారకముందే 15 బౌట్లలో పాల్గొన్న అతను అన్నింటిలోనూ విజయాలు సాధించాడు. అందులో 11 విజయాలు తొలిరౌండ్‌లోనే రావడం విశేషం.

మైక్ టైసన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1986లో ట్రెవర్ బెర్బిక్‌ను ఓడించి టైసన్ అతి చిన్న వయస్సులోనే హెవీవెయిట్ ఛాంపియన్‌గా నిలిచాడు.

1986 నవంబర్‌లో, అంటే 20 ఏళ్ల వయస్సులోనే మైక్ టైసన్ వరల్డ్ హెవీవెయిట్ చాంపియన్‌గా అవతరించాడు. లాస్ వెగాస్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో రెండో రౌండ్‌లోనే ట్రెవర్ బెర్బిక్‌ను ఓడించి అతిపిన్న వయస్సులోనే ఈ టైటిల్ గెలుచుకున్న బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు.

టైసన్ సాధించిన ఈ ఘనవిజయాన్ని చూసేందుకు ఆయన కోచ్ 'కస్ డి అమాటో' లేరు. ఈ పోటీ జరగడానికి ఏడాదికి ముందే అమాటో మరణించారు.

''నా జీవితంలో కస్ పాత్ర మరవలేనిది. ఆయన నన్ను దత్తత తీసుకున్నారు. నా బాగోగులన్నీ చూసుకున్నారు. నాకు లీగల్ గార్డియన్‌గా మారారు. అతను నాకు తండ్రి లాంటి వారు. ఆయనొచ్చే వరకు నాకు తండ్రి అంటే ఎలా ఉంటారో తెలియదు'' అని మైక్ టైసన్ చెప్పారు.

''ఆయన తన స్నేహితులను పిలిచేవారు. వారిలో 70, 80 ఏళ్ల వయస్సున్న వారు ఉండేవారు. వారితో నా గురించి చెప్పేవారు. చూడండి ఈ పిల్లవాడి వయస్సు 14 ఏళ్లే. ఇతను రాబోయే కాలంలో వరల్డ్ హెవీవెయిట్ చాంపియన్‌ అవుతాడు. బాక్సింగ్‌లో లైట్ బల్బ్‌లా వెలుగుతుంటాడు' అని కస్ చెప్పేవారని టైసన్ గుర్తు చేసుకున్నాడు.

బర్త్ సర్టిఫికెట్‌లో టైసన్ తండ్రిగా పెర్సెల్ టైసన్ పేరుంటుంది. కానీ ఆయన్ను టైసన్ ఎప్పుడూ చూడలేదంట. జిమ్మీ కిర్క్‌పాట్రిక్‌ అనే వ్యక్తినే టైసన్ తన తండ్రిగా భావించేవారు.

''నేను పాఠశాలకు వెళ్లకపోయేవాడిని. ఎందుకంటే అక్కడ అందరూ నన్ను హేళన చేసేవారు. నిజంగానే నేను చాలా లావుగా ఉండేవాడిని. మాట్లాడేప్పుడు తడబడుతుండేవాడిని. అందుకే నేను మొరటుగా ఉండాలనే నిశ్చయించుకున్నా. చిన్నతనంలో పావురాలను పెంచుతుండేవాడిని. వాటికి గూడు నిర్మించడంలో నా తోటివారు నాకు సహాయం చేసేవారు.''

''నాకు 11 ఏళ్లున్నప్పుడు, ఒక స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు వెళ్లాను. అలాంటి కార్యక్రమాలకు వెళ్లేముందు ఇంటికి వెళ్లి శుభ్రంగా తయారై, మంచి బట్టలు వేసుకొని వెళ్లాలని నాకు తెలియదు. అక్కడికి వెళ్లగానే అందరూ నన్ను చూసి నవ్వడం ప్రారంభించారు. ఎందుకంటే నా బట్టలపై పావురం రెట్టలు ఉన్నాయి. మట్టి ఉంది. నేను శుభ్రం చేసుకోకుండానే అక్కడికి వెళ్లాను. అప్పుడు నన్ను చూసి నాకే నవ్వొచ్చింది''

''నాకన్నా వయస్సులో పెద్దవాడైన ఒక పిల్లవాడు, నా దగ్గరికి వచ్చి రేపు ఉదయం అతన్ని కలవమని చెప్పాడు. అతను నాకు ఇళ్లను ఎలా దోచుకోవాలో నేర్పించాడు. ఆ తర్వాత ఒక రోజంతా ఇళ్లను దోచుకునే పనిలోనే ఉన్నాం. అతను నన్ను షాపింగ్‌కు తీసుకెళ్లి, కొత్త దుస్తులు కొనిచ్చాడు. వాటిని వేసుకొని స్కూల్ డ్యాన్స్‌కు వెళ్లమని నాకు సలహా ఇచ్చాడు.''

''ఆయన చెప్పినట్లే నేను కొత్త బట్టలు వేసుకొని అక్కడికి వెళ్లాను. ఎవరూ నన్ను గుర్తించలేదు. గతవారం, వారంతా చూసి నవ్విన వ్యక్తిని నేనే అని వారు తెలుసుకోలేకపోయారు. అప్పుడే నాకు, మనల్ని మనం ఇతరుల ముందు ఎలా ప్రవేశపెట్టుకోవాలో మొదటి సారి తెలిసొచ్చింది'' అని మైక్ టైసన్ బీబీసీతో చెప్పారు.

మైక్ టైసన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎడమ నుంచి వరుసగా డొనాల్డ్ ట్రంప్, మైక్ టైసన్, ఫాదర్ ఫ్రెడ్

టైసన్ కన్నా ముందు మార్విన్ హాగ్లర్, సుగర్ రే లియోనార్డ్, థామస్ హెర్న్స్, రోబెర్టో డ్యూరాన్ హెవీవెయిట్ డివిజన్‌లో స్టార్ పర్ఫార్మర్లు. బాక్సింగ్ నుంచి వీరు తప్పుకున్నాక ఏర్పడిన వెలతిని మైక్ టైసన్ తీర్చాడు.

20 ఏళ్ల వయస్సులోనే డబ్ల్యూబీసీ వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌షిప్‌ గెలుపొందిన టైసన్ ఆ తర్వాత వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ (డబ్ల్యూబీఏ- 1987 మార్చి) బెల్ట్‌ను కూడా సాధించాడు. దీంతో మీడియాలో 'టైసన్ మానియా' గురించి మారుమోగింది. అదే ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ (ఐబీఎఫ్) బెల్ట్‌ను కూడా గెల్చుకున్నాడు. తద్వారా WBC, WBA, IBF బెల్ట్‌లను సాధించిన మొదటి బాక్సర్‌గా ఘనత సాధించాడు.

ప్రొఫెషనల్ కెరీర్‌లో కీలక క్షణాలు

  • అతిపిన్న వయస్సులో మైక్ టైసన్ డబ్ల్యూబీసీ హెవీవెయిట్ చాంపియన్‌గా నిలిచాడు. 20 ఏళ్ల వయస్సులోనే ఆయన ట్రెవర్ బెర్బిక్‌ను ఓడించి ఈ టైటిల్‌ను అందుకున్నాడు. రెండో రౌండ్‌లోనే ఈ పోటీని ముగించాడు.
  • నాలుగేళ్ల ఏకఛత్రాధిపత్యం అనంతరం 1990లో జేమ్స్ బస్టర్ డౌగ్లస్ చేతిలో టైసన్ ఓడిపోవడంతో ప్రపంచం నివ్వెరపోయింది. అంతకుముందు వరుసగా 37 మ్యాచ్‌ల పాటు అతని దండయాత్ర సాగింది. ఓటమి ఎరుగకుండా టైసన్ దూసుకెళ్లాడు.
  • 1995లో జైలు నుంచి విడుదల అయిన ఏడాది తర్వాత 1996లో టైసన్ మరోసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. ఫ్రాంక్ బ్రూనోపై ఆయన గెలుపొందాడు.
  • 1997లో తనను తాను మరోసారి వివాదాస్పద వ్యక్తిగా రుజువుచేసుకున్నాడు. బౌట్ సందర్భంగా ఇవాండర్ హోలీఫీల్డ్ చెవిని గట్టిగా కొరికాడు. మళ్లీ అవమానాల పాలయ్యాడు.
  • 2002లో లెనాక్స్ లెవిస్ ఎనిమిది రౌండ్లలో టైసన్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు. అప్పడు ఆయన చాలా నిరాశగా కనిపించారు. లెవిస్ ముందు నిలవలేక టైసన్ విలవిల్లాడిపోవడంతో ఇక టైసన్ కాలం చెల్లిందని అందరూ భావించారు.
  • కానీ 2003లో టైసన్ బలంగా పుంజుకున్నాడు. ఫిబ్రవరిలో జరిగిన బౌట్‌లో ప్రత్యర్థి క్లిఫర్డ్ ఎటినెను కేవలం 49 సెకన్లలోనే మట్టి కరిపించి విమర్శకుల నోళ్లు మూయించాడు.
  • 2004 ఏడాది, టైసన్‌కు మరింత చేదు స్మృతులను మిగిల్చింది. లూయిస్‌విల్లేలో జరిగిన మ్యాచ్‌లో డానీ విలియమ్స్ నాలుగో రౌండ్‌లో టైసన్‌పై నాకౌట్ విజయం సాధించాడు.
  • 2005 జూన్‌లో తిరిగి పుంజుకునేందుకు టైసన్ ప్రయత్నించాడు. కానీ ఐర్లాండ్ బాక్సర్ కెవిన్ మెక్‌బ్రైడ్ చేతిలో ఓటమి పాలు కావడంతో టైసన్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

వివాదాల సమయం...

1990 నాటికి హెవీవెయిట్‌లోని అన్ని ప్రతిష్టాత్మక టైటిళ్లను సాధించాడు. అతని మొదటి భార్య, నటి రాబిన్ గివెన్స్‌తో విడాకులు తీసుకున్నాడు. ప్రమోటర్ డాన్ కింగ్‌తో చేతులు కలిపాడు. ఇక అప్పటినుంచి తనను చాంపియన్‌గా మలిచిన వ్యక్తుల బృందానికి టైసన్ దూరమయ్యాడు.

మైక్ టైసన్
ఫొటో క్యాప్షన్, డాన్ కింగ్‌తో మైక్ టైసన్

1990 ఫిబ్రవరి 11న ప్రపంచం అంతా ఊహించని ఘటన జరిగింది. జపాన్‌ రాజధాని టోక్యోలో పది రౌండ్ల పాటు జరిగిన బౌట్‌లో జేమ్స్ బస్టర్ డగ్లస్ చేతిలో మైక్ టైసన్ ఓటమి పాలయ్యాడు. బాక్సింగ్ చరిత్రలో అత్యంత షాక్‌కు గురిచేసే ఓటముల్లో ఇది కూడా ఒకటి. బౌట్ ముందు రోజు రాత్రి టైసన్ ఇద్దరు మహిళలతో సన్నిహితంగా గడిపాడు.

''గతంలో పటిష్టమైన, బలవంతులైన బాక్సర్లతో తలపడేముందు కూడా నేను ఇలాగే చేశాను. విజయం సాధించాను. ఇప్పుడు వారికన్నా తక్కువ బలవంతుడైన ఫైటర్‌తో ఆడేటప్పుడు కూడా ఇలా గడపడం వల్ల నేను విజయం సాధించగలను అనుకున్నా'' అని టైసన్ చెప్పుకొచ్చాడు.

1992లో టైసన్‌ అత్యాచార నేరంలో దోషిగా తేలాడు. ఇండియానాలోని అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఒక మోడల్ డిజైరీ వాషింగ్టన్... తనను టైసన్ రేప్ చేశాడని ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరపగా, టైసన్‌ను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. తర్వాత ఆయన 1995లో జైలు నుంచి బయటకొచ్చారు.

కానీ ఈ నేరంలో తనను ఇరికించారని, తను డిజైరీ వాషింగ్టన్ అనే అమ్మాయిని రేప్ చేయలేదని టైసన్ ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు.

చట్టం తనను బాధితున్ని చేసిందని వాపోతుంటారు.

2000లో టైసన్ తమ దేశానికి రావొద్దంటూ బ్రిటన్ మహిళా హక్కుల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బీబీసీ, టైసన్‌కు గుర్తుచేయగా... ఆయన వెంటనే 'మీరు చెప్పండి. వాళ్లు నా నుంచి ఏం ఆశించి అలా చేశారు'' అని ఎదురుప్రశ్న వేశారు.

దానికి బదులుగా నేరం చేసినందుకు సారీ చెబితే సరిపోతుందిగా అని సలహా ఇవ్వగా టైసన్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నేనేం చేయాలో నాకు చెప్పకండి. నేనేం చెబుతున్నానో మీకు వినబడుతుందా? నేనెవరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు'' అని సమాధానమిచ్చారు.

జైలు నుంచి వచ్చాక మళ్లీ టైసన్ ప్రపంచ చాంపియన్‌గా మారాడు. 1996లో బ్రిటన్ స్టార్ బాక్సర్ ఫ్రాంక్ బ్రూనోపై గెలుపొంది మళ్లీ డబ్ల్యూబీసీ హెవీవెయిట్ టైటిల్‌ను అందుకున్నాడు.

చెవి తెగేలా కొరికిన టైసన్

కానీ ఈ ప్రయాణం ఎక్కువ రోజులు సాగలేదు. 1997లో ఇవాండర్ హోలీఫీల్డ్ చేతిలో వివాదాస్పద రీతిలో ఓటమి పాలైన అతను, మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారాడు.

మైక్ టైసన్
ఫొటో క్యాప్షన్, 1997లో బౌట్ సందర్భంగా ఇవాండర్ హోలీఫీల్డ్ చెవిని టైసన్ గట్టిగా కొరికాడు.

ఆ బౌట్‌లో హోలీఫీల్డ్ ఏకపక్షంగా టైసన్ తలపై పిడిగుద్దులు కురిపించడంతో అసహనం చెందిన టైసన్ కోపంతో అతని చెవిని గట్టిగా కొరికాడు. దీంతో కాసేపు మ్యాచ్ నిలిపేశారు. ఆ తర్వాత కూడా మరోసారి టైసన్, హోలీఫీల్డ్ రెండో చెవిని కూడా కొరకడంతో అతనిపై అనర్హత వేటు వేసి హోలీఫీల్డ్‌ను మ్యాచ్ విజేతగా చేశారు. టైసన్ తొలిసారి కొరికినప్పుడు హోలీఫీల్డ్ చెవి కొంతభాగం తెగి కిందపడింది. ఈ చర్యతో టైసన్ మళ్లీ అపఖ్యాతి పాలయ్యాడు.

ఈ చర్యతో అతనికి భారీ ఫైన్ విధించడంతో పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత హోలీఫీల్డ్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పిన అతను ఒక్క ఘటన కారణంగా జీవితకాల సస్పెన్షన్ విధించొద్దని కోరాడు.

''ఆ రోజు రాత్రి జరిగినది నా ప్రొఫెషనల్ కెరీర్‌లోనే అత్యంత చెత్త ఘటన. అసలు ఆరోజు అలా ఎందుకు చేశానో నాకే తెలియదు. దీనిపై పశ్చాత్తాపపడుతున్నా. ప్రపంచానికి, నా కుటుంబ సభ్యులందరికీ క్షమాపణ చెబుతున్నా'' అని బీబీసీతో టైసన్ చెప్పాడు.

ఆ తర్వాత ప్రమోటర్ కింగ్‌తో వివాదాల కారణంగా ఆయన మరోసారి జైలుకెళ్లాల్సి వచ్చింది.

చిన్నతనంలో తల్లిదండ్రుల నిరాదరణకు లోనైన టైసన్ జీవితం పెద్దయ్యాక కూడా సమస్యలు, గొడవలతోనే ముడిపడిపోయింది.

ఒకానొక దశలో అతను మద్యపానం, డ్రగ్స్‌ లాంటి వ్యసనాలకు విపరీతంగా బానిసయ్యాడు. 1990 దశకంలో కేవలం మూడేళ్ల కాలంలోనే అతను పార్టీల కోసం 100మిలియన్ డాలర్లు (రూ. 744 కోట్లు) ఖర్చు చేశాడు.

2007 ఆగస్టులో డ్రగ్స్ తీసుకొని కారు నడుపుతూ పోలీసులకు దొరికిపోయాడు. ఈ కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు. ఇలా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్న టైసన్ కఠిక పేదరికాన్ని కూడా అనుభవించాడు.

మైక్ టైసన్

ఫొటో సోర్స్, MIKE TYSON/FACE BOOK

''వందల మిలియన్ డాలర్లు సంపాదించిన నేను, ఒక సమయంలో డబ్బులు సరిపోతాయో లేదో లెక్కచూసుకొని సూపర్ మార్కెట్‌లో సరుకులు తెచ్చుకున్నాను.''

''నేను కఠిక దరిద్రాన్ని అనుభవించా. దాదాపు నిరాశ్రయుడిగా మారాను. అలాగే ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత డబ్బును కూడా సంపాదించా'' అని టైసన్ చెప్పుకొచ్చాడు.

రిటైర్మెంట్ అనంతరం జీవితం

రిటైర్మెంట్ ఇచ్చాక కొంతకాలం సమస్యల్లో చిక్కుకున్న టైసన్ తర్వాత ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడుతూ కూడబెట్టాడు. ఆతర్వాత 2009 నుంచి నటనా రంగంలోకి ప్రవేశించాడు. ఇప్పటివరకు చాలా చిత్రాల్లో నటించాడు. తాజాగా తెలుగు సినిమా లైగర్‌లో నటిస్తున్నాడు.

2012లో మైక్‌టైసన్ కేర్స్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. దీనిద్వారా నిరాదరణకు గురైన పిల్లలను చేరదీస్తున్నాడు. వీటితో పాటు ఇంకా చాలా కార్యక్రమాలను, వ్యాపారాలను చేస్తున్నాడు.

2009లో లకీఖా స్పైసర్‌ను పెళ్లి చేస్తున్నాడు. ప్రస్తుతం భార్య, పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నానని టైసన్ చెప్పుకొచ్చాడు. టైసన్‌కు ఇప్పుడు ఆరుగురు పిల్లలు ఉన్నారు.

తన జీవితంలో విషాదం అనేది తరచుగా వచ్చే బంధువుగా మారిందని టైసన్ చెప్పారు. 2009లో తన నాలుగేళ్ల కుమార్తె ఎక్సోడస్, ట్రెడ్‌మిల్ మిషన్ ప్రమాదంలో మరణించిందని చెబుతున్నప్పుడు ఆయన గొంతు గద్గదంగా మారిపోయింది.

'' ఆరోజు నేను ఆసుపత్రికి చేరుకోగానే నాకు విషయం అర్థమైపోయింది. అప్పుడు అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరి మొహంలో తమ బిడ్డే మరణించినట్లుగా విషాదం ఉంది. వారంతా నన్ను ఓదార్చడానికి వచ్చారు. కానీ నేను ఓదార్పులకు అర్హుడిని కాదు'' అని ఆయన చెప్పారు.

మైక్ టైసన్

ఫొటో సోర్స్, MIKE TYSON/FACE BOOK

ఇప్పుడు తనకున్న ఏకైక ఆశయం ఆదర్శవంతమైన తండ్రిగా నిలవడమే అని టైసన్ పేర్కొన్నారు.

''మిగతా అందరికీ ఇది మామూలు జీవితం కావొచ్చు. కానీ నాకు మాత్రం ఒక చిన్న గుడిసెలో సన్యాసి జీవితంలా ఉంది. నేను కోల్పోవాల్సింది ఇంకా చాలా ఉంది'' అని టైసన్ వ్యాఖ్యానించాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)