పోర్చుగల్ 'విశ్రాంతి తీసుకునే హక్కు': ఆఫీస్ టైమ్ ముగిశాక ఉద్యోగులకు బాస్‌లు మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ పంపటానికి వీల్లేదు.. అమల్లోకి కొత్త చట్టం

ఫోన్ చూస్తున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

ఆఫీస్ పనివేళలు ముగిసిన తర్వాత ఉద్యోగులకు బాస్‌లు మెసేజ్‌లు, ఈమెయిల్‌ చేయడాన్ని పోర్చుగల్ నిషేధించింది.

దీని కోసం ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. దీన్ని 'విశ్రాంతి తీసుకునే హక్కు'గా అభివర్ణిస్తున్నారు.

పోర్చుగల్‌లో వర్క్ ఫ్రం హోంను విస్తరించారు. దీంతో ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత (వర్క్-లైఫ్ బ్యాలెన్స్) కోసం తీసుకొస్తున్న మార్పుల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.

కొత్త చట్టం ప్రకారం నిర్ణీత పనిగంటల తర్వాత ఉద్యోగులకు ఆఫీస్ పనికి సంబంధించిన మెసేజ్‌లు, ఈమెయిల్స్ పంపించే సంస్థలకు జరిమానా విధిస్తారు.

10 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న అన్ని సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

కొత్త నిబంధనల ప్రకారం పిల్లలున్న తల్లిదండ్రులు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే వర్క్ ఫ్రం హోం చేయవచ్చు.

వారి పిల్లలకు ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు పేరెంట్స్ ఇంటి దగ్గరి నుంచే పని చేయవచ్చు.

అలాగే, ఇంటి దగ్గరి నుంచి పని చేయడం వల్ల పెరిగే ఇంటర్నెట్, విద్యుత్ ఛార్జీలను కూడా కంపెనీలు చెల్లించాల్సి రావొచ్చు.

వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులు ఒంటరిగా ఫీల్ కాకుండా ఉండేందుకు కంపెనీలు తరచూ ఫేస్ టు ఫేస్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

ఫోన్ చూస్తున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఈ ప్యాకేజీలోని కొన్ని అంశాలను పోర్చుగల్ పార్లమెంట్ ఆమోదించలేదు.

ఉదాహరణకు కార్యాలయ పనివేళలు ముగిసిన తర్వాత ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్విచాఫ్ చేసే 'రైట్ టు డిస్‌కనెక్ట్'కు పోర్చుగల్ పార్లమెంట్ ఆమోదం తెలపలేదు.

టెలీవర్క్ (రిమోట్ వర్క్) కీలక మార్పులు తీసుకొస్తుందని, అయితే, దీని అభివృద్ధిని నియంత్రించాల్సిన అవసరం ఉందని పోర్చుగల్ కార్మిక, సామాజిక భద్రత శాఖా మంత్రి అన మెండెస్ అన్నారు.

కార్మికులకు మరింత రక్షణ కల్పించడం వల్ల పోర్చుగల్‌లో పనిచేసేందుకు విదేశీయులు కూడా ఆసక్తి చూపిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

డిజిటల్, రిమోట్ ఉద్యోగులు నివసించేందుకు ప్రపంచంలోని అత్యుత్తమ దేశాల్లో పోర్చుగల్ ఒకటని ఆమె అన్నారు. విదేశీయులను తమ దేశానికి ఆకర్షించాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.

పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లను ఆకర్షించేందుకు పోర్చుగల్‌ ఇదివరకే 'తాత్కాలిక నివాస వీసా పథకం' తీసుకొచ్చింది.

పోర్చుగల్‌కు చెందిన మదీరా ద్వీపంలో ఇప్పటికే ఉచిత వైఫై, ఆఫీస్ డెస్క్ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఈ ద్వీపాన్ని 'డిజిటల్ సంచార గ్రామం'గా అభివర్ణిస్తున్నారు.

సాధారణ టూరిస్ట్ వీసాలకు బదులుగా బార్బడోస్, క్రొయేషియా వంటి పలు దేశాలు 'డిజిటల్ సంచార వీసా'లను ప్రవేశపెట్టాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)