గడ్చిరోలి ఎన్‌కౌంటర్ మృతుల్లో మావోయిస్టు కమాండర్ మిలింద్ తెల్తుంబ్డే, ధ్రువీకరించిన పోలీసులు

ఫొటో సోర్స్, MAHARASHTRA POLICE
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహారాష్ట్ర పోలీసుల ప్రత్యేక దళం సీ-60, మావోయిస్టు గెరిల్లాల మధ్య గడ్చిరోలి జిల్లా ధానోరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కనీసం 26 మంది మావోయిస్టులు చనిపోయినట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ధ్రువీకరించారు.
ఈ ఎదురుకాల్పుల్లో ప్రత్యేక పోలీసు దళానికి చెందిన నలుగురు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు చనిపోయిన మావోయిస్టుల్లో కొందరిని గుర్తించారు. మృతుల్లో ఇప్పటివరకూ వారు గుర్తించిన మావోయిస్టుల జాబితాను బీబీసీ గడ్చిరోలి పోలీసుల నుంచి సంపాదించింది.
మృతుల్లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో జరిగిన మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న మావోయిస్టు కమాండర్ మిలింద్ తెల్తుంబ్డే కూడా ఉన్నారు. ఈయనపై 50 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు ఆ వివరాల్లో తెలిపారు.
గడ్చిరోలి పోలీసులు బీబీసీకి ఇచ్చిన మొత్తం 26 మంది మృతుల జాబితాలో 20 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరిలో 10 మందిని ఇంకా గుర్తించాల్సి ఉంది.
ఇప్పటివరకూ గుర్తించిన 16 మంది మృతుల్లో మిలింద్ తెల్తుంబ్డేతోపాటూ 1. ఓడ్మా పోడ్యాం, 2. బండూ అలియాస్ రాజు గోటా, 3. ప్రమోద్ అలియాస్ దలపత్ లాల్‌సాయ్ కచ్లామీ, 4. కోసా అలియాస్ ముసాఖీ, 5. చేతన్ పదా, 6. కిషన్ అలియాస్ జైమన్, 7. మహేష్ అలియాస్ శివాజీ రావ్‌జీ గోటా, 8. భగత్ సింగ్ అలియాస్ ప్రతీద్ అలియాస్ మాన్‌కుర్ జాడే, 9. సన్నూ అలియాస్ సాధూ సోనూ బోగా, 9. లచ్ఛూ, నవ్లూరామ్ అలియాస్ దిలీప్ హిరురామ్ తుల్వీ, 10. లోకేష్ అలియాస్ మంగూ పోడ్యాం ఉన్నారు. వీరంతా పురుషులు.
మృతిచెందిన మహిళా మావోయిస్టుల్లో 1. విమలా అలియాస్ ఇమలా అలియాస్ కమలా అలియాస్ సుఖరామ్ బోగా, 2. నారో ఉన్నారు. మరో నలుగురు మహిళా మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Gadchiroli police
బీబీసీతో మాట్లాడిన గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ఎదురు కాల్పులు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలకు చీకటి పడేవరకూ కొనసాగాయని చెప్పారు. ఆగి ఆగి కాల్పులు జరిగాయని తెలిపారు. అక్కడ మొత్తం ఎంతమంది గెరిల్లాలు ఉన్నారో మేం తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాం అన్నారు.
ఈ ఎన్‌కౌంటర్లో ఇంకా ఎక్కువ మంది మావోయిస్టులు చనిపోయారా, వారి శవాలను తీసుకువెళ్లడంలో మావోయిస్టులు విజయవంతం అయ్యారా అనేది కూడా ఆరా తీస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఘటనాస్థలంలో అడవిలో చాలా దూరం వరకూ రక్తం ఆనవాళ్లు కనిపించాయని, దానిని బట్టి చనిపోయిన లేదా గాయపడిన గెరిల్లాలను మావోయిస్టులను లాక్కుని వెళ్లినట్లు అంచనా వేయచ్చని ఆయన తెలిపారు.
తమ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఎస్పీ గోయల్ చెప్పారు. గాయపడ్డ పోలీసుల గురించి మాట్లాడిన ఆయన వారిని సమయానికి హెలికాప్టర్లో నాగపూర్‌కు తరలించగలిగామని, వాళ్లిప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
మొదట ధ్రువీకరించలేదు
మృతుల జాబితా విడుదల చేయడానికి ముందు మిలింద్ తెల్తుంబ్డే ఎన్‌కౌంటర్ మృతుల్లో ఉన్నాడా, లేదా అనేది పోలీసులు ధ్రువీకరించలేదు.
గడ్చిరోలిలో 70కి పైగా సాయుధ మావోయిస్టు గెరిల్లాలు ఉన్నట్టు మహారాష్ట్ర పోలీసుల సీ-60 ప్రత్యేక దళానికి సమాచారం అందిందని తెలిపారు.
"మావోయిస్టుల ఒక దళం కోట్‌గుల్, గ్యారాపత్తిలోని దట్టమైన అడవుల్లో ఉన్నట్లు మాకు సమాచారం వచ్చింది. సీ-60 ప్రత్యేక దళానికి చెందిన సుశిక్షితులైన కమాండర్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు" అని చెప్పారు.
"ఆ ఎన్‌కౌంటర్ రోజంతా జరిగింది. తర్వాత మేం ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, యూనిఫాంలో ఉన్న 26 మంది మావోయిస్టు గెరిల్లాల శవాలు స్వాధీనం చేసుకున్నాం" అని బీబీసీతో ఫోన్లో మాట్లాడిన అధికారులు తెలిపారు.
ఎస్పీ గోయల్ ఆదివారం మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మిగతా మావోయిస్టు గెరిల్లాల కోసం ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.

గడ్చిరోలి పోలీసులు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న పోలీస్ స్టేషన్లను కూడా అప్రమత్తం చేశారు. ఛత్తీస్‌గడ్ వైపు నుంచి కూడా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
మావోయిస్టు నేత మిలింద్ తెల్తుంబ్డేను మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ గిరిజన ప్రాంతాల్లో దీపక్ అనే పేరుతో గుర్తిస్తారు. మహారాష్ట్ర లోని చాలా ప్రాంతాల్లో ఆయన్ను సహ్యాద్రి అనే పేరుతో పిలుస్తారు.
ఆయనకు జ్యోతిరావ్, శ్రీనివాస్ లాంటి ఎన్నో మారు పేర్లు కూడా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఆయన్ను రకరకాల పేర్లతో పిలుస్తారని తెలిపారు.
ఆయన భీమా కోరెగావ్ కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన ఆనంద్ తెల్తుంబ్డే సోదరుడు. భీమా కోరెగావ్ కేసులో మిలింద్ తెల్తుంబ్డే కూడా నిందితుడుగా ఉన్నారు.
మిలింద్ తెల్తుంబ్డే భార్య ఏంజెలా సోంటాకేపై కూడా పోలీసుల హత్య లాంటి ఆరోపణలు ఉన్నాయి. ఆమె ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సీ-60 అంటే ఏంటి
గెరిల్లా వ్యూహాన్ని ఎదుర్కోడానికి మహారాష్ట్ర పోలీస్ ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. అందులో స్థానిక గిరిజనులను కూడా చేర్చింది.
1992లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక దళంలో 60 మంది స్థానిక గిరిజనులను కూడా చేర్చుకున్నారు. మెల్లమెల్లగా ఈ దళం సామర్థ్యం పెంచారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా వారి ఆపరేషన్లు కూడా పెరుగుతూ వచ్చాయి.
ఈ దళంలో ఉండే గిరిజన సమూహాలకు స్థానిక సమాచారం, భాష, సంస్కృతి గురించి బాగా తెలిసుండడంతో మావోయిస్టు గెరిల్లాలపై పైచేయి సాధించడంలో అది విజయవంతం అయ్యింది.
2014, 2015, 2016లో సీ-60 కమాండోలు ఎన్నో ఆపరేషన్లలో విజయం సాధించారు.
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ: కరెన్సీ నోట్లు, అలంకార వస్తువులకే పరిమితం కానున్నారా?
- డెమిసెక్సువాలిటీ అంటే ఏమిటి? ఈ లైంగిక భావనను వివరించడం ఎందుకు క్లిష్టమైన విషయం?
- జుల్ఫికర్ అలీ భుట్టో: 47 ఏళ్ల కిందటి ఒక హత్య కేసు ఈ నేత మెడకు ఉరి తాడులా ఎలా చుట్టుకుంది?
- టీ20 ప్రపంచకప్ ఫైనల్: న్యూజీలాండ్, ఆస్ట్రేలియా జట్లలో ఎవరిది పైచేయి...
- బంగ్లాదేశ్ హిందువుల ఉపవాస దీక్ష, ఇజ్రాయెల్‌లో పెలికాన్ల సందడి, కొలంబోలో వరద బీభత్సం - ఈ వారం ప్రపంచ చిత్రాలు ఇవీ
- దిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టు సీరియస్... అవసరమైతే లాక్డౌన్ విధించాలని సూచన
- టీ20 ప్రపంచకప్: వేడ్ క్యాచ్‌ను హసన్ అలీ వదిలేయడం వల్లే పాకిస్తాన్ సెమీస్‌లో ఓడిందా?
- ఆంధ్రప్రదేశ్: పీఆర్సీ కోసం ఉద్యోగుల పట్టు... ఎందుకీ జాప్యం? ప్రభుత్వం ఏమంటోంది?
- ఆనందం లేదా భయం కలిగినప్పుడు మనం గట్టిగా ఎందుకు అరుస్తాం?
- హిందుత్వను ఐసిస్, బోకోహరామ్లతో పోల్చిన సల్మాన్ ఖుర్షీద్... కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











