ఛత్తీస్‌గఢ్: వందకుపైగా గ్రామాల గిరిజనులు ఎందుకు నిరసనలు చేపడుతున్నారు? వారి డిమాండ్లు ఏమిటి?

గిరిజనులు

ఫొటో సోర్స్, CG KHABAR/Alok Putul

    • రచయిత, ఆలోక్ ప్రకాశ్
    • హోదా, బీబీసీ కోసం

ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత కాంకేర్ జిల్లాలో గిరిజనుల నిరసనలు పెరుగుతున్నాయి. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)కు చెందిన రెండు శిబిరాలను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆరు రోజుల నుంచి వందకుపైగా గ్రామాల ప్రజలు ఫఖాంజూర్‌లో నిరసన తెలుపుతున్నారు.

నిరసనలకు మద్దతు తెలుపుతూ ఇప్పటివరకు 56 జిల్లా, జనపద్ పంచాయతీల సభ్యులు, సర్పంచ్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు శిబిరాలను తొలగించకపోతే జిల్లాలోని అందరు సర్పంచ్‌లూ తమ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

కంకేర్ జిల్లాలోని కర్కాఘాట్, తుమ్రిఘాట్‌లోని తమ దేవుని స్థలాలను ధ్వంసం చేసి ఆ శిబిరాలు ఏర్పాటుచేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రార్థనా స్థలాలు, గిరిజన మతపరమైన ప్రాంతాలను తాము ధ్వంసం చేయలేదని అధికారులు చెబుతున్నారు.

మావోయిస్టులు ఒత్తిడి చేయడంతోనే వారు నిరసనలు చేపడుతున్నారని అధికారులు అంటున్నారు.

‘‘మావోయిస్టులు ఒత్తిడి చేయడంతో వారు నిరసనలకు వస్తున్నారు. కంకేర్‌లో మాత్రమే కాదు. బస్తర్‌లోనూ ఇలానే నిరసనలు చేపడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు’’అని జిల్లా ఎస్పీ ఎంఆర్ అహిరే బీబీసీతో చెప్పారు.

గిరిజనులు

ఫొటో సోర్స్, CG KHABAR/Alok Putul

భారీ శిబిరాలు..

మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఎఫ్, ఐటీబీపీలకు చెందిన దాదాపు 70,000ల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి కోసం గత కొన్నేళ్లుగా భారీ స్థాయిలో శిబిరాలను ఏర్పాటుచేశారు. వీటిని క్రమంగా విస్తరిస్తూ వస్తున్నారు.

బస్తర్‌లో ఈ ఏడాది 16 కొత్త పోలీసు శిబిరాలను ఏర్పాటుచేసినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ముఖ్యంగా మావోయిస్టు పీడిత ప్రాంతాల్లో కొత్త శిబిరాలను ఏర్పాటుచేస్తున్నామని, వీటి వల్ల మావోయిస్టుల చర్యలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.

అయితే, ఈ శిబిరాల వల్ల మావోయిస్టుల నుంచి రక్షణ కంటే, పోలీసుల నుంచి వేధింపులే ఎక్కువని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

శిబిరాలను గిరిజనులు వ్యతిరేకించడానికి కూడా ఇదే ప్రధాన కారణం.

దంతేవాడలోని పోటాలిలో గతేడాది కూడా శిబిరాలను తొలగించాలని గిరిజనులు నిరసన చేపట్టారు.

గిరిజనులు

ఫొటో సోర్స్, CG KHABAR/Alok Putul

ప్రార్థనా స్థలం..

బిజాపుర్‌కు చెందిన గంగలూర్ ప్రాంత గిరిజనులు కూడా గతేడాది ఈ శిబిరాలను వ్యతిరేకించారు. గత సెప్టెంబరులో దంతేవాడలోని గుమియాపాల్‌కు వేల మంది ర్యాలీగా కూడా వెళ్లారు.

‘‘కార్కాఘాట్, తుమ్రిఘాట్‌లలో శిబిరాలు ఏర్పాటుచేసిన ప్రాంతాల్లో ఏళ్ల నుంచీ మేం పూజలు చేస్తున్నాం. అవి మాకు పూజా స్థలాలు. ఏదైనా మసీదు లేదా గుడి ధ్వంసం చేస్తే ఏం జరుగుతుంది? వారు నిరసనలు చేపడతారు కదా.. మేం కూడా ఇప్పుడు అదే చేస్తున్నాం. ఆ శిబిరాలను వ్యతిరేకిస్తున్నాం’’అని ఆదివాసీ నాయకుడు లిచ్ఛు గావడే వ్యాఖ్యానించారు.

గిరిజనులు

ఫొటో సోర్స్, CG KHABAR/Alok Putul

ఫొటో క్యాప్షన్, లిచ్ఛు గావడే

గ్రామ సభ అనుమతి

గిరిజనులు అధికంగా ఉండే బస్తర్ ప్రాంతం రాజ్యంగంలోని ఐదో షెడ్యూల్ ప్రాంతాల పరిధిలోకి వస్తుంది.

ఇక్కడ ఏదైనా నిర్మాణపు పనులు చేపట్టాలంటే గ్రామ సభ అనుమతి తప్పనిసరి.

‘‘ఆ శిబిరాల ఏర్పాటు సమయంలో మాంఝీ, ముఖియా, గైతా, పటేల్ లాంటి గిరిజన ప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు’’అని గోండ్వానా గణతంత్ర పార్టీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు, జిల్లా పంచాయతీ సభ్యుడు హేమ్‌లాల్ మార్కమ్ చెప్పారు.

గిరిజనులు

ఫొటో సోర్స్, CG KHABAR/Alok Putul

ఫొటో క్యాప్షన్, హేమ్‌లాల్ మార్కమ్

‘‘మేం మా రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతున్నాం. రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూల్ కిందకు వచ్చే ప్రాంతాల్లో ఆ శిబిరాలను ఏర్పాటుచేశారు. మా మతపరమైన హక్కులనూ ఉల్లంఘించారు’’అని ఆయన అన్నారు.

అయితే, శిబిరాలు ఏర్పాటుచేసిన ప్రాంతాలకు సమీపంలోని ప్రజలు సంతోషంగానే ఉన్నారని, మావోయిస్టు చర్యల నుంచి వారికి భద్రత లభిస్తోందని ఆహిర్ చెప్పారు. తాము ఎలాంటి ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయలేదని వివరించారు.

ఇప్పటివరకు నిరసనకారులు, అధికారుల మధ్య రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి ఫలితమూ రాలేదు. శిబిరాలను పూర్తిగా తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)