‘కాల్పుల్లో మరణించిన 17 మందిలో ఒక్కరు కూడా మావోయిస్టు కాదు’ - సర్కెగూడ ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిటీ నివేదిక

చత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా సర్కెగూడలో 2012 జూన్‌లో నక్సలైట్లతో ఎదురుకాల్పులుగా చెబుతూ భద్రతా దళాలు చేపట్టిన ఎన్‌కౌంటర్లో మైనర్లు సహా 17 మంది మరణించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన జస్టిస్ వీకే అగర్వాల్ కమిటీ తన నివేదికను ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.
ఈ ఘటనలో మరణించిన వారంతా స్థానిక గిరిజనులేనని కమిటీ తన నివేదికలో తేల్చింది. గిరిజనుల వైపు నుంచి ఎలాంటి కాల్పులూ జరగలేదని, వారు నక్సలైట్లు అని రుజువు కాలేదని స్పష్టం చేసింది. చాలా సమీపం నుంచే వారిపై కాల్పులు జరిగాయని చెప్పింది.

ఫొటో సోర్స్, Justice V.K.Agarwal commission report
‘జస్టిస్ వీకే అగర్వాల్ ఏక సభ్య విచారణ కమిషన్’ నివేదిక ప్రధానంగా చెప్పిందేమిటి?
* సర్కెగూడ, చిమ్లిపెంటల్లో 2012 జూన్ 28వ తేదీ రాత్రి ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో, ఆ సమయంలో మావోయిస్టులు ఉన్నారనడానికి తగిన ఆధారాలు లేవు.
* సీఆర్పీఎఫ్ బలగాల కాల్పుల్లో మరణించిన, గాయపడినవారిలో మావోయిస్టులు ఉన్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

ఫొటో సోర్స్, Justice V.K.Agarwal commission report
* భద్రతాదళాలు ఉన్న ప్రాంతానికి కొద్ది దూరంలో వారికి అనుమానాస్పద శబ్దం వినిపించడంతో వారిలో కొందరు అక్కడ సమావేశమైన గిరిజనులపై కాల్పులు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
* భద్రతాదళాల వైపు నుంచే ఈ కాల్పులు జరిగాయి.

ఫొటో సోర్స్, Justice V.K.Agarwal commission report
బాధ్యులపై ఏ చర్యలు తీసుకోవాలో నివేదికలో చెప్పలేదు : మానవ హక్కుల వేదిక
2012లో ఈ ఘటన జరిగిన తరువాత ‘మానవ హక్కుల వేదిక’కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం సర్కెగూడలో పర్యటించింది. ఆ బృందంలోని సభ్యులు వీఎస్ కృష్ణ ‘బీబీసీ’తో మాట్లాడారు.
‘‘మేం ముందు నుంచి చెబుతున్నదే జ్యుడీషియల్ కమిటీ కూడా తేల్చింది. ఇవి ఎదురుకాల్పులు కాదు ఏకపక్ష కాల్పులని మేం మొదటి నుంచి చెబుతున్నాం.
కమిటీ నివేదికలో లోపమేంటంటే అకౌంటబులిటీ లేదు. ఎదురు కాల్పుల సంఘటన కాదు ఏకపక్ష కాల్పులు అని చెప్పినప్పుడు ఆ ఏకపక్ష కాల్పులకు బాధ్యులైన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న సిఫారసులు లేవు.
పోలీసులకు ఇంకా శిక్షణ కావాలి, రాత్రిపూట చూడగలిగే కళ్లద్దాలు కావాలి వంటి రికమెండేషన్స్ చేస్తున్నారు. అవి చేయనివ్వండి.
అదేసమయంలో ఈ ఘటనలో 17 మంది నిరాయుధులైన పౌరులు చనిపోవడానికి కారణమైనవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా సూచించాల్సింది.
దీనిపై స్వతంత్ర విచారణ సంస్థతో నేర విచారణ జరిపించాలి. అలాంటిది ఉన్నప్పుడే ముందుముందు ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఈ దిశగా సిఫారసులు లేవు’’ అన్నారాయన.
‘నక్సలిజంపై రాజ్యం అణచివేత.. మూల్యం చెల్లిస్తున్న ఆదివాసులు’ పేరిట మానవ హక్కుల వేదిక ప్రచురించిన పుస్తకంలో సర్కెగూడలో ఆ రోజు ఏం జరిగిందో వివరించారు.
సెలవులకు ఇంటికి వచ్చిన పదో తరగతి విద్యార్థులూ మరణించారు
‘సర్కెగూడ, కొత్తగూడ, రాజపెంట గ్రామాలకు చెందిన సుమారు 60 మంది ఆదివాసులు 2012 జూన్ 28 రాత్రి 8 గంటల సమయంలో సర్కెగూడ, కొత్తగూడల మధ్యనున్న ఖాళీ స్థలంలో సమావేశమయ్యారు. వారిలో స్త్రీపురుషులతో పాటు పిల్లలు కూడా ఉన్నార’’ని అందులో పేర్కొన్నారు.
పగలంతా పనులతో తీరికలేకుండా ఉండే ఆదివాసీలు సమష్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయాలకు సంబంధించిన సమావేశాలు రాత్రిపూట నిర్వహిస్తారని, విత్తనాల పండగ ఎప్పుడు జరపాలో నిర్ణయించేందుకు వారంతా ఆ రోజు రాత్రి సమావేశామయ్యారని మానవ హక్కుల వేదిక తెలిపింది.
‘‘అక్కడ సమావేశంలో ఉన్నవారిలో ఎవరి దగ్గరా ఆయుధాలు లేవు. సమావేశం జరుగుతున్న సమయంలో సీఆర్పీఎఫ్ దళాలు, కోబ్రా కమెండోలు చుట్టుముట్టి ఎలాంటి హెచ్చరిక చేయకుండా కాల్పులు ప్రారంభించారు. 30 నిమిషాల పాటు జరిగిన కాల్పుల్లో 17 మంది ఆదివాసీలు మరణించార’’ని తెలిపారు.
బసగూడలోని ఒక హాస్టల్‌లో ఉంటూ వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులూ ఈ కాల్పుల్లో మరణించారని మానవ హక్కుల వేదిక పుస్తకం పేర్కొంది.

ఫొటో సోర్స్, Human Rights Forum
అసలు ఆ రోజు ఏం జరిగింది?
ఆ ఘటన తర్వాత, 2012లోనే బీబీసీ ప్రతినిధి సల్మాన్ రవి సర్కెగూడలో పర్యటించారు. ఆయన అక్కడి పరిస్థితులు వివరించారు.
బిజాపూర్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన సర్కెగూడలోని పోలీస్ శిబిరాన్ని చేరుకోవడానికి వీలుగా అక్కడి నదిపై ఒక వంతెన ఉంది.
వంతెనను ఆనుకుని ఓ కనిపించని సరిహద్దు ఉంది. ఆ బ్రిడ్జికి ముందు ఓ పోలీస్ స్టేషన్, పారామిలిటరీ దళాల శిబిరం ఉంది.
ఆ బ్రిడ్జి తర్వాత నుంచి మావోయిస్టుల సమాంతర ప్రభుత్వం (జనతన సర్కార్) మొదలవుతుందని చెబుతుంటారు.
ఒంటరిగా ఈ బ్రిడ్జిని దాటేందుకు పోలీసులు సాహసం చెయ్యరు. బయటి ప్రజలు ఆ బ్రిడ్జి దాటి లోపలకు వెళ్లే ప్రశ్నే లేదు.
2012 జూన్ 28 అర్థరాత్రి సీఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్‌కు, మావోయిస్టులకు మధ్య సర్కెగూడలో ఎదురుకాల్పులు జరిగాయని, ఆ కాల్పుల్లో చాలా మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఎన్‌కౌంటర్ సమయంలో ఆరుగురు పోలీసులు కూడా గాయపడ్డారని, వారిని సమీపంలోని నగరాలకు చికిత్సకోసం తరలించారని తెలిపారు.
మరణించినవారిలో 8 మంది చిన్నారులు ఉన్నారు.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం సర్కెగూడ పోలీస్ స్టేషన్, పోలీస్ శిబిరాల నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడకు చేరాలంటే జిల్లా కేంద్రం నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

‘‘నేనక్కడికి వెళ్లేసరికి రాత్రైంది. అప్పుడే నా ఫోన్ రింగ్ అయింది.
ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టులతో జరగలేదని స్థానికులు నాకు చెప్పారు. ఇక్కడున్నవన్నీ సాధారణ గ్రామీణ ప్రాంతాలే.
అధికారికంగా ఏమీ తెలియకపోవడం వల్ల, నేను ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళ్లాలనుకున్నా. నేను సర్కెగూడ పోలీస్ స్టేషన్ దగ్గరకి వెళ్లేసరికి మధ్యాహ్నం 12 గంటలైంది.
దట్టమైన అడవుల్లోనుంచి ప్రయాణిస్తున్నాను. ఆ దారిలో ఎన్నో సెక్యూరిటీ పోస్టులు, పోలీసులు తారసపడ్డారు.
వాళ్లు మమ్మల్ని ముందుకు వెళ్లనివ్వలేదు. మమ్మల్ని పూర్తిగా తనిఖీ చేశారు. ఆ తర్వాత ఎలాగోలా వారిని ఒప్పించి సర్కెగూడ చేరుకున్నాం.
అక్కడున్న వంతెన దాటుకుని మావోయిస్టుల జనతన ప్రభుత్వ పరిధిలోకి ప్రవేశించాం.’’

ఎక్కడ చూసినా ఖాళీ కియోస్కులే!
పోలీసులు తమను దాటి వాహనాలను ముందుకు వెళ్లనివ్వడం లేదు. దాంతో కారును అక్కడే వదిలేసి, కాలినడకనే ముందుకు కదిలాం.
రాజ్పెంటా గ్రామాన్ని చేరేసరికి అక్కడంతా పిచ్చిమొక్కలు కనిపించాయి. ఎక్కడపడితే అక్కడ ఖాళీ కియోస్కులు కనిపించాయి.
మేం అక్కడకు వచ్చే ముందే పోలీసులు అక్కడకు వచ్చారని, తమను బెదిరించారని స్థానికులు చెప్పారు. సీఆర్పీఎఫ్ డీఐజీ, స్థానిక పోలీసు అధికారులు ఈ బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.

సర్కెగూడకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిలాగర్‌లో మావోయిస్టు గెరిల్లాలు సమావేశమయ్యారని భద్రతా దళాలకు సమాచారం అందిందని చత్తీస్‌గఢ్ సీఆర్పీఎఫ్ అప్పటి ఐజీ జుల్ఫికర్ హసన్ నాకు చెప్పారు.
దీంతో రాత్రికిరాత్రే పారామిలిటరీ దళాలు, స్థానిక పోలీసులు ఆపరేషన్ చేపట్టారని ఆయన చెప్పారు.
ఆ రాత్రి చీకటిలో కొందరు సరదాగా సంబరాలు చేసుకోవడాన్ని తాను దూరం నుంచి చూశానని, వాళ్లంతా మావోయిస్టులే అయ్యుండొచ్చని తాము భావించామని ఆయన తెలిపారు.
వాళ్లే తమపై కాల్పులు జరిపారని, ఆ తర్వాతే తాము ఎదురు కాల్పులు ప్రారంభించామని పోలీసులు చెప్పారు.

పండగపై చర్చించుకుంటున్నాం
ఘటనా స్థలం నుంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నామని కూడా పోలీసులు తెలిపారు. కానీ ఈ కేసులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ ప్రదేశంలో ఒక్క ఆయుధం కూడా లభ్యం కాలేదు.
స్థానిక ఆదివాసీలు తమ పండగ గురించి మాట్లాడుకునేందుకు అక్కడ సమావేశమయ్యారని ఆ ఘటన తర్వాత కొత్తగూడ గ్రామ పెద్ద ఒకరు ‘బీబీసీ’కి చెప్పారు.
రాబోయే 'బిజా పండుమ్' పండగను ఎలా జరుపుకోవాలనే విషయంపై వాళ్లంతా మాట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు.
పొలాల్లో విత్తనాలు నాటే ముందు వచ్చే పండుగ ఇది.

"గ్రామస్తులంతా కలిసి చర్చించుకుంటున్నారు, అక్కడ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్లు ఆడుకుంటూ, మా మాటలను వింటున్నారు.
అదే సమయంలో భద్రతా దళాలు మమ్మల్ని చుట్టుముట్టాయి. చుట్టూ అంతా చీకటిగా ఉంది.
ఒక్క నక్సలైట్ కూడా ఈ సమావేశంలో లేరు. కానీ అన్నివైపుల నుంచి చుట్టుముట్టిన భద్రతా దళాలు మాపై కాల్పులకు దిగాయి" అని కొత్తగూడ గ్రామ పెద్ద చెప్పారు.

"భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులు జరపలేదు, వాళ్లే తమకుతాముగా కాల్చుకున్నారు" అని సర్కెగూడకు చెందిన కమలా కాకా, ఆమెతో ఉన్న గ్రామంలోన ఇతర ఆదివాసీలు బీబీసీకి చెప్పారు.
నేను కమలా కాకాను కూడా ఓ రేడియో కార్యక్రమం కోసం ఇంటర్వ్యూ చేశాను.
"మేమంతా ఖాళీ ప్రదేశంలో మధ్యలో కూర్చుని ఉన్నాం. నాలుగు వైపుల నుంచి బులెట్లు దూసుకురావడం మొదలైంది. ఆ బులెట్లు భద్రతా దళాల నుంచి వచ్చాయి. మా ఊళ్లోని కొన్ని పశువులు, పందులు కూడా ఆ కాల్పుల్లో మరణించాయి. భయంతో పరుగెత్తినవారిపైనా భద్రతా దళాలు కాల్పులు జరిపాయి.
వారిపై వారే కాల్పులు జరుపుకొని, మావోయిస్టులు కాల్పులు జరిపారని చెబుతున్నారు. ఆ సమావేశంలో కేవలం గ్రామస్తులే ఉన్నారు" అని ఆమె చెప్పారు.

చెట్లకు తగిలి బులెట్లు కింద పడ్డాయి
"పోలీసులు చీకట్లో అన్ని వైపులా మమ్మల్ని చుట్టుముట్టారు. అంతా చీకటిగా ఉండటం వల్ల వారిపై వారే కాల్పులు జరుపుకొన్నారు" అని కమల చెప్పారు.
"చాలా తూటాలు చెట్లలోకి దూసుకెళ్లాయి. వాటిలో కొన్ని తిరిగి మళ్లీ వారికే తగిలాయి".
కమలతోపాటు కొత్తగూడ గ్రామస్తులు ఈ ఉదంతం గురించి చెబుతూ, మరణించిన చిన్నపిల్లలను తలచుకుని కంటతడి పెట్టుకున్నారు. చనిపోయిన ఆ పిల్లలంతా పోలీస్ కేంపుల్లో రోజూ ఆ జవాన్లతో ఫుట్‌బాల్ ఆట ఆడుకునేవారని వారు చెప్పారు.
"మా గ్రామంలోని పిల్లలందరూ జవాన్లను గుర్తుపడతారు. వారిని రోజూ కలిసేవారు. కానీ ఆ పిల్లలనే జవాన్లు చంపేశారు. మేము చాలా షాకయ్యాం" అని ఆమె అన్నారు.

కమలతోపాటు అదే గ్రామానికి చెందిన శశికళ తేలమ్ కూడా పోలీసులే తన సోదరుడు ఇర్పా రమేశ్‌ను చంపేశారని ఆరోపించారు. పోలీసులు తమ గ్రామంలోకి తర్వాత రోజు ఉదయం వస్తున్నప్పుడు రమేశ్ తన గుడిసె కిటికీలోంచి చూసేవాడని ఆమె అన్నారు.
రమేశ్‌ను పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లి, తొలుత కొట్టారు, ఆ తర్వాత కాల్చి చంపారని అదే గ్రామానికి చెందిన ముట్టా కాకా ఆరోపించారు.

అధునాతన ఆయుధాలు ఉపయోగించారు.
ఆ సమయంలోనే సీఆర్పీఎఫ్ కూడా గాయపడిన జవానులకు సంబంధించిన వైద్య పరీక్షల నివేదికను బీబీసీకి అందించింది.
కే.రాజన్ అనే ఓ యువ జవానుకు పేలుడు శకలాల కారణంగా గాయాలయ్యాయని దానిలో పేర్కొన్నారు. మరో ఐదుగురు జవాన్లకు అధునాతన ఆయుధాల కారణంగా గాయాలయ్యాయని నివేదించారు. కానీ ఆ ఆయుధాలన్నీ పోలీసుల వద్దే ఉన్నాయి.
కోబ్రా బెటాలియన్‌కు చెందిన జవాన్లు గజేంద్ర సింగ్, వహీదుల్ ఇస్లాం, అరుణవ్ ఘోష్, కిషన్ కుమార్, ఎస్ఎస్ రాణా అధునాతన ఆయుధాల కారణంగా గాయాలపాలయ్యారు. వీరికి రాయ్‌పూర్ ఆస్పత్రిలో చికిత్స జరిగింది.

వివాదం తీవ్రం కావడంతో, కాంగ్రెస్ తన నివేదికపైనే ఆరోపణలు చేసింది. కొత్తగూడ, సర్కెగూడలో జరిగిన ఎన్‌కౌంటర్లో మరణించినవారిలో 13 నుంచి 16 ఏళ్ల లోపు చిన్నారులు ఎనిమింది ఉన్నారని వ్యాఖ్యానించింది. గాయపడినవారిలో కూడా ముగ్గురు పిల్లలున్నారని పేర్కొంది.
ఆ సమయంలో, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. ఈ ఘటనపై తన పార్టీ ఎమ్మెల్యే కవాసి లక్మాతో విచారణ నిర్వహించారు.
పార్టీ అధినాయకత్వానికి పంపించిన నివేదికలో ఈ ఘటనను 'నరమేథం'గా పేర్కొన్నారు.

అప్పట్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. హోంమంత్రిగా చిదంబరం ఉన్నారు.
చనిపోయినవారంతా మావోయిస్టులే అని అప్పట్లో చిదంబరం ప్రకటించారు.
కానీ, పార్టీలోనే కొన్ని వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి రావడంతో "ఒకవేళ గ్రామస్తులెవరైనా చనిపోతే, దానికి చాలా బాధపడుతున్నా" అని తర్వాత వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత, సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీల ఒత్తిడితో ప్రభుత్వం 2012 జులై 11న మధ్యప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ వీకే అగర్వాల్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేసింది.

ఇది బూటకపు ఎన్‌కౌంటరేనా?
నవంబరు మొదటి వారంలో కమిటీ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక త్వరలోనే కేబినెట్ ముందుకు, ఆ తర్వాత అసెంబ్లీ ముందుకు వెళ్తుంది. అందువల్లే నివేదికలో ఏముందనేది ప్రభుత్వం అధికారికంగా ఇంకా వెల్లడించడం లేదు.
కానీ, ఈ నివేదికను అధ్యయనం చేసిన ప్రభుత్వ, పోలీసు వర్గాల సమాచారం ప్రకారం... ఈ మొత్తం ఎన్‌కౌంటర్ బూటకం అని అందులో స్పష్టం చేశారని తెలిసింది. భద్రతా దళాలను ముందుకు నడిపించిన డీఐజీ ఎస్ ఇలాంగో, డిప్యూటీ కమాండెంట్ మనీశ్ బెర్మోలాలు తమ ఆయుధాల నుంచి ఒక్క బులెట్ కూడా కాల్చలేదని చెప్పారు.
అంటే, గ్రామస్తుల వైపు నుంచి కాల్పులు జరలేదనే విషయం అర్థమవుతోంది. ఎందుకంటే, గ్రామస్తులు కాల్పులు జరిపి ఉంటే భద్రతా దళాలు కూడా రక్షణ కోసం కాల్పులు ప్రారంభించి ఉండేవి.

కేసు విచారణపై ఈ నివేదిక తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది.
అయితే, తమ ప్రభుత్వం త్వరలోనే జస్టిస్ అగర్వాల్ నివేదిక ఆధారంగా ఈ కేసుకు సంబంధించి చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ చత్తీస్‌గఢ్ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీ రాయ్‌పూర్ ప్రతినిధి అలోక్ ప్రకాశ్ పుతుల్‌తో చెప్పారు.
ఇవి కూడా చదవండి.
- ‘దిశ’ అత్యాచారం: "నాకు చాలా బాధేసింది.. ఆ బాధితురాలు కూడా సాటి ఆడదే" - ఓ నిందితుడి భార్య ఆవేదన
- హైదరాబాద్ అత్యాచారం: 'పురుషులను నిందించండి - సురక్షితమైన నగరాన్ని కాదు'
- నాటో అంటే ఏమిటి.. దానికి ఇంకా ప్రాధాన్యం ఉందా
- చక్కెర తినడం మంచిదా, కాదా? ప్రపంచంలో చక్కెర ఎక్కువగా తినే ప్రజలు ఎవరు?
- 5 నెలలు.. 7 జిల్లాలు.. 2 రాష్ట్రాలు.. 1300 కి.మీ... ఆడ తోడు కోసం తిరిగిన మగ పులి
- హైదరాబాద్: బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి?
- 'దేవుడు లేడు.. నన్ను నాస్తికుడిగా గుర్తించాలి' అంటూ పోరాడుతున్న యువకుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








