జీఎన్ సాయిబాబా: వీల్‌ఛైర్ ప్రొఫెసర్ @ నాగ్‌పూర్ ’అండా సెల్’

ఫొటో సోర్స్, A S VASANTHA
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
’'రాబోయే చలికాలాన్ని తలచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. ఇప్పటికే నేను నిరంతరం జ్వరంతో వణుకుతున్నాను. నాకు దుప్పటి లేదు. స్వెటర్ లేదు. ఉష్ణోగ్రత తగ్గుతున్న కొద్దీ నా కాళ్లు, ఎడమ చేతిలో భరించలేని నొప్పి ఇంకా పెరుగుతోంది. నవంబర్ ఒకటో తేదీ నుంచి మొదలయ్యే చలికాలంలో నేను ఇక్కడ మనుగడ సాగించడం అసాధ్యం. నేనిక్కడ చావబోతున్న జంతువులా బతుకుతున్నా. ఈ 8 నెలలు నేను ఎలాగోలా బతకగలిగాను. కానీ రాబోయే చలికాలాన్ని దాటి బతకలేను..."
నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో 'అండా సెల్' అనే చీకటి ఒంటరి గదిలో బందీగా ఉన్న ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా తన సహచరికి రాసిన లేఖలోని అంశాలివి. వైద్య పరిభాషలో ఆయనది 90 శాతం వైకల్యం.
తన లాంటి ఓ వ్యక్తి అనేక జబ్బులతో బాధపడుతూ ఒకే చేయి పనిచేస్తున్న స్థితిలో కటకటాల వెనుక ఉన్నాడన్న విషయాన్ని అర్థం చేసుకోకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమని కూడా ఆయన ఆ లేఖలో రాశారు.
అరెస్టయ్యే నాటికి ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లిష్ బోధించేవారు. చక్రాల కుర్చీ ఉంటే తప్ప ఎటూ కదలలేని సాయిబాబా ప్రస్తుతం యావజ్జీవశిక్ష అనుభవిస్తున్నారు.
ఈ లేఖ మీద గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ చర్చ జరుగుతోంది.

ఫొటో సోర్స్, A S VASANTHA
డాక్టర్ జి.ఎన్.సాయిబాబా ఎవరు?
- ఢిల్లీ యూనివర్సిటీలోని రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగ్లిష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
- ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన వయసు ఇప్పుడు 49 సంవత్సరాలు. ఐదేళ్ల వయసులోనే పోలియో సోకి రెండు కాళ్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉపాధ్యాయుల సాయంతో విద్యాభ్యాసం కొనసాగించారు. అమలాపురం డిగ్రీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తిచేశారు.
- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ (ఇప్పుడు ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)లో పీజీ, ఆ పై విద్యాభ్యాసం పూర్తిచేశారు.
- 2003లో డీయూ రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు. 2013లో పీహెచ్‌డీ పూర్తిచేశారు.
- డిగ్రీ రోజుల్లోనే వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్ (ఏఐఆర్‌పీఎఫ్) లో చేరారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో చదివేటపుడు 1992లో ఆ ఫోరమ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యదర్శి అయ్యారు. 1995 నాటికి ఆ సంస్థ ఇండియా ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత ఆయన ఆర్‌డీఎఫ్ అనే సంస్థలో పని చేశారు.
- పై సంస్థలన్నీ నిషేధిత మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థలని పోలీసులు, హోంశాఖ అధికారులు చెబుతున్నారు.
- మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో సాయిబాబాను 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో విచారణ కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రస్తుతం సాయిబాబా నాగ్‌పూర్ జైలులోని ’అండా సెల్‘లో ఏకాంతచెరలో ఉన్నారు.

ఫొటో సోర్స్, A S VASANTHA
అరెస్టుకు ముందు ఏం జరిగింది?
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మహేశ్ టిర్కీ, పాండు నారోటే అనే ఇద్దరు వ్యక్తులు నిషిద్ధ సీపీఐ (మావోయిస్ట్) కోసం, దాని అనుబంధ సంస్థగా ఆరోపిస్తున్న రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఆర్‌డీఎఫ్) కోసం పనిచేస్తున్నారని, వారు ఆ సంస్థ క్రియాశీల సభ్యులని 2013 ఆగస్టులో మహారాష్ట్ర పోలీసులకు 'రహస్య సమాచారం' అందింది.
ఆగస్టు 22న అహేరీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న మహేశ్, పాండులను హేమ్ మిశ్రా కలిశారు. వారు ముగ్గురూ 'ఏకాంత ప్రదేశంలో అనుమానాస్పదంగా మాట్లాడుకోవడం పోలీసులు గమనించి అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వారిని సోదా చేసినపుడు మహేశ్ వద్ద నిషిద్ధ సంస్థకు చెందిన మూడు కరపత్రాలు, ఇతర వ్యక్తిగత వస్తువులు, హేమ్ మిశ్రా వద్ద 16 జీబీ మెమొరీ కార్డు, కెమెరా తదితర వస్తువులు లభించాయి.
వీరి మీద యూఏపీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మావోయిస్టు పార్టీకి చెందిన నర్మదక్క తమను హేమ్ మిశ్రాను తీసుకు రావాలని పంపించినట్లు మహేశ్, పాండులు ఇంటరాగేషన్‌లో నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చారని పోలీసులు పేర్కొనగా.. పోలీసులు తమను హింసించి ఆ వాంగ్మూలం తీసుకున్నారని వారిద్దరూ ఆ తర్వాత పేర్కొన్నారు.
జి.ఎన్.సాయిబాబా తనకు 'కాగితంలో చుట్టిన ఒక మెమొరీ కార్డు' ఇచ్చినట్లు హేమ్ మిశ్రా ఇంటరాగేషన్‌లో చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.
2013 సెప్టెంబర్‌లో.. 'దొంగలించబడ్డ' వస్తువులను వెదికేందుకు జి.ఎన్.సాయిబాబా ఇంట్లో సోదాలు నిర్వహించడం కోసం మహారాష్ట్రలోని అహేరీ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వారెంట్ జారీ చేశారు.
మహారాష్ట్ర పోలీసులు ఢిల్లీ యూనివర్సిటీ ఆవరణలోని సాయిబాబా ఇంట్లో సోదాలు నిర్వహించి ఆయన వ్యక్తిగత ల్యాప్‌ట్యాప్, హార్డ్‌డిస్క్, పెన్‌డ్రైవ్‌లను తీసుకెళ్లారు.
తదుపరి ప్రశ్నించడం కోసం ఢిల్లీ వెలుపల నాగ్‌పూర్‌లో పోలీసుల ఎదుట హాజరుకావాలని సాయిబాబాకు సమన్లు జారీ చేశారు.
సాయిబాబాను ప్రశ్నించడం కోసం మహారాష్ట్రకు రావాలని ఎందుకు పిలిచారో వివరణ ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ అక్టోబర్‌లో మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చింది.
'దొంగిలించబడ్డ వస్తువుల కోసం' పేరుతో జరిపిన సోదాల్లో ల్యాప్‌ట్యాప్, హార్డ్ డిస్కులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవడంపై విచారించాలని కూడా నిర్దేశించింది.
2014 జనవరిలో సాయిబాబాను ఢిల్లీలోని ఆయన నివాసంలో పోలీసులు, నిఘా సిబ్బందితో కూడిన బృందం మూడు గంటల పాటు ప్రశ్నించింది.

2013 నవంబర్‌లో కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌లో.. ''నగరాలు, పట్టణాల్లోని సీపీఐ (మావోయిస్టు) మేధావులు, మద్దతుదారులు రాజ్యాన్ని చెడుగా చిత్రీకరించడానికి, తప్పుడు సమాచారంతో అఫఖ్యాతి పాలు చేయడానికి ఉమ్మడిగా ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నారు. ... నిజానికి, మావోయిస్టు ఉద్యమాన్ని సజీవంగా ఉంచింది ఈ మేధావులే. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ శ్రేణుల కన్నా వీరు చాలా రకాలుగా మరింత ప్రమాదకరం'' అని పేర్కొంది.


ఫొటో సోర్స్, A S VASANTHA
ఎప్పుడు, ఎలా అరెస్ట్ చేశారు?
2014 మే 9 మధ్యాహ్నం దిల్లీ విశ్వవిద్యాలయం ఆవరణలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పోలీసులు ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్ట్ చేశారు. ఆయన నిషేధిత మావోయిస్టు సంస్థలో సభ్యుడనీ, ఆరు నెలలలో నాలుగు సార్లు ఆయనను ప్రశ్నించాకే అరెస్ట్ చేశామని గడ్చిరోలి డీఐజీ తెలిపారు.
అయితే "విధులు పూర్తిచేసుకుని ఇంటికి తిరిగివస్తున్న సాయిబాబాను ఆయన ఇంటికి 200 మీటర్ల దూరంలో సాధారణ దుస్తుల్లోని వ్యక్తులు అపహరించారు'' అని కుటుంబ సభ్యులు, హక్కుల కార్యకర్తలు ఆరోపించారు.
మరుసటి రోజు ఆయనను మహారాష్ట్రలోని అహేరీ కోర్టులో హాజరు పరిచిన పోలీసులు నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో 'అండా సెల్'కు తరలించారు. అదే నెల 15వ తేదీన డీయూ రామ్‌లాల్ ఆనంద్ కాలేజీ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది.
సాయిబాబా అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ నగరాలు, నెదర్లాండ్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, అమెరికా, కెనడా తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు జరిగాయి.
సాయిబాబా 'అపహరణ' ఉదంతంలో హక్కుల ఉల్లంఘనపై నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ నాగ్‌పూర్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్‌కు నోటీసు ఇచ్చింది.
సాయిబాబా మీద కేసు ఏమిటి?
మహేశ్ కరీమన్ టిర్కీ, పాండు పోరా నారోట్, హేమ్ కేశవాదత్త మిశ్రా, ప్రశాంత్ రాహి నారాయణ్ సాంగ్లికర్, విజయ్ నాన్ టిర్కీలతో పాటు.. గోల్కొండ నాగ సాయిబాబా మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967(యూఏపీఏ)లోని 13, 18, 20, 38 39 సెక్షన్లు, భారత శిక్షా స్మృతి 120బి సెక్షన్ కేసు నమోదు చేశారు.
తొలుత మొదటి ఐదుగురి మీద నమోదు చేసిన కేసులో తర్వాత సాయిబాబా పేరును చేర్చారు.

ఫొటో సోర్స్, A S VASANTHA

కేసులో ఆరోపణ ఏమిటి?
''2013 సెప్టెంబర్ 12 నాడు లేదా అంతకుముందు ఈ ఆరుగురు నిందితులూ భారత ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి ప్రజలను సమీకరించడానికి పూనుకున్నారు.
నేరపూరిత బలప్రయోగం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వాన్ని లోబరచుకోవడానికి, ప్రాణాలు, ఆస్తుల మీద భారీ స్థాయి హింస, విధ్వంసం చేయడానికి కుట్ర పన్నారు.
తద్వారా సాధారణ పౌరుడికి ప్రజాస్వామ్య ప్రభుత్వం మీద విశ్వాసాన్ని సడలించడానికి, క్షీణింపజేయడానికి, తద్వారా చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వ వ్యవస్థను అస్థిరపరచడానికి ఒడిగట్టారు.
రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా వేర్పాటు, తిరుగుబాటు ఆలోచనలను వ్యాప్తిని నిర్వహించడానికి సిద్ధపడ్డారు.
ఈ నేరపూరిత కుట్ర లక్ష్యాలను సాధించడానికి, భారతదేశంలో అక్రమ మార్గాల ద్వారా డబ్బు సేకరించడానికి కుట్ర చేశారు.
ఈ నేరపూరిత కుట్ర లక్ష్యాలను సాధించడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్), దాని అనుబంధ సంస్థ రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఆర్‌డీఎఫ్)ల చట్టవ్యతిరేక కార్యకలాపాలను కొనసాగించడానికి కుట్ర చేశారు.
ఉగ్రవాద ముఠా, నిషిద్ధ సీపీఐ (మావోయిస్ట్), దాని అనుబంధ సంస్థ ఆర్‌డీఎఫ్‌తో సభ్యుడిగా ఒంటరిగా లేదా సంయుక్తంగా చట్టవ్యతిరేక అనుబంధాన్ని, కార్యకలాపాలను కొనసాగించడానికి, హింసా ప్రయోగం లేదా ఇతర చట్టవ్యతిరేక మార్గాల్లో ఉగ్రవాద చర్య చేపట్టడానికి కుట్ర పన్నారు.
ఇంకా దానిని ప్రచారం చేయడం, ప్రేరేపించడం, ప్రోత్సహించడం, తెలిసి సాయం చేయడానికి భారతదేశంలో నేరపూరిత కుట్ర పన్నారు'' అనేది ఆరోపణ.
- ఆధారం: గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు (07-03-2017) ప్రతి

ఆరోపణలకు సాక్ష్యాధారాలు ఏమిటి?
హేమ్ మిశ్రా నుంచి స్వాధీనం చేసుకున్న మెమొరీ కార్డు, సాయిబాబా ఇంట్లో సోదా చేసి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్కులు తదితర ఎలక్ట్రానిక్ పరికరాల నుండి ఫోరెన్సిక్ ల్యాబ్ విశ్లేషణ ద్వారా సేకరించిన పత్రాలు, ఫొటోలు, వీడియోల ద్వారా.. సాయిబాబా తదితరులు మావోయిస్టు పార్టీ, ఆర్‌డీఎఫ్ కార్యకలాపాల్లో క్రియాశీలంగా ఉన్నట్లు నిరూపణ అవుతోందని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఫొటో సోర్స్, A S VASANTHA
'వికలాంగుడన్న కారణంతో దయ చూపలేం'
సాయిబాబా 90% వైకల్యంతో ఉన్న కారణం చేతనే ఆయన మీద దయ చూపలేమని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
"ఆయన శారీరకంగా అంగవైకలుడైనా మానసికంగా దృఢంగా ఉన్నారు. ఆయన నిషిద్ధ సీపీఐ (మావోయిస్ట్)కు, ఆ పార్టీ బాహ్య సంస్థ ఆర్‌డీఎఫ్‌కు చెందిన మేధావి, ఉన్నతస్థాయి నాయకుడు. ఈ ఆరుగురు నిందితులు, నిషిద్ధ సీపీఐ (మావోయిస్ట్), దాని బాహ్య సంస్థ ఆర్‌డీఎఫ్ సభ్యుల హింసాత్మక కార్యకలాపాల వల్ల గడ్చిరోలి జిల్లా 1982 నుండి ఇప్పటివరకూ సంఘర్షణా స్థితిలో ఉంది. నక్సలైట్లు వారి హింసాత్మక కార్యకలాపాల భయం వల్ల పారిశ్రామికంగా కానీ ఇతరత్రా గానీ అభివృద్ధి జరగడం లేదు. కాబట్టి నా అభిప్రాయంలో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష కూడా సరిపోదు. కానీ యూఏపీఏ 18, 20 సెక్షన్లు కోర్టు చేతులను కట్టివేస్తున్నాయి. కనుక సాయిబాబా సహా ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష సరైనది.'' అని తీర్పు ఉత్తర్వులో గడ్చిరోలి సెషన్స్ జడ్జి వ్యాఖ్యానించారు.
ఈ కేసులో మరొక నిందితుడు విజయ్ టిర్కీకి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేస్తామని డిఫెన్స్ న్యాయవాదులు ప్రకటించారు. మహారాష్ట్ర హైకోర్టులో అప్పీలు చేయడంతో పాటు బెయిల్ దరఖాస్తును కూడా సమర్పించారు. కానీ బెయిల్ దరఖాస్తు వాయిదా పడింది.

ఫొటో సోర్స్, A S VASANTHA
సాయిస్థితి వర్ణనాతీతం: వసంతకుమారి
‘‘విచారణ కోర్టు తీర్పు చాలా అన్యాయంగా ఉంది. కలలు, ఆలోచనలు, రాజకీయ విశ్వాసాలను నియంత్రించాలనుకోవడం ప్రజాస్వామ్యం కాదు’’ అని జి.ఎన్.సాయిబాబా సహచరి వసంతకుమారి పేర్కొన్నారు.
ఆమె బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ, "సాయిబాబా మావోయిస్టు పార్టీ కోసం పనిచేస్తున్నారన్న ప్రచారాన్ని వారే నిర్వహించి ఈ శిక్ష వేశారు తప్ప సాక్ష్యాల ఆధారంగా కాదు" అని విమర్శించారు.
‘‘సాక్షులు 26 మంది ఉన్నారని చెప్పారు. కానీ సాయిబాబా కేసులో ఒక్క సాక్షినే చూపారు. అతడు కూడా పోలీసు మనిషేనని డిఫెన్స్ న్యాయవాది నిరూపించారు. అసలు ప్రధానంగా చూపిన ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు డిఫెన్స్ విచారణకు రానేలేదు. డిఫెన్స్ వాదనలను ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదు. 827 పేజీల తీర్పులో 300 పేజీలు సాయిబాబా మీదే రాశారు’’ అని ఆమె ఆరోపించారు.
‘‘దొంగతనం ఆరోపణలపై 2014లో మా ఇంట్లో సోదా నిర్వహించినప్పుడు పోలీసులు మా ఇంట్లోంచి ల్యాప్‌ట్యాప్, హార్డ్ డిస్కులు, పెన్‌డ్రైవ్‌లు సీల్ చేయకుండా తీసుకెళ్లారు. మా రీసెర్చ్ కలెక్షన్ అంతా, మా కుమార్తె ఫైళ్లు, నా ఫొటోగ్రఫీ ఫొటోలు అన్నీ వాటిలోనే ఉన్నాయి. ఇందుకు సాక్షిగా ఇక్కడ రోడ్డు మీద ఉన్న బార్బర్‌ను ప్రవేశపెట్టారు. అతడు క్రాస్ ఎగ్జామినేషన్‌లో.. తనకు పెన్‌డ్రైవ్ ఎలా ఉంటుందో, హార్డ్ డ్రైవ్ ఏమిటో తెలియదని, తనను బలవంతంగా పోలీసులు తీసుకొచ్చారని చెప్పాడు’’ అని వసంత అన్నారు.

ఫొటో సోర్స్, A S VASANTHA
‘ఒక చెయ్యీ, మెదడు మాత్రమే పనిచేస్తున్నాయి...‘
జైలులో సాయిబాబా పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని వసంత అన్నారు.
"2014లో అరెస్ట్ చేసినపుడు ఆయన పట్ల జైలులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఎడమ చేయి నరాలు దెబ్బతిన్నాయి. దానికి వైద్యం అందించకపోవడంతో ఆ చేయి బాగా పాడయింది. పాంక్రియాస్ దెబ్బతినింది. ప్రొస్టేట్ సమస్య పెరిగింది. మూత్రాశయంలో రాళ్లున్నాయి. 15 సంవత్సరాలుగా హైపర్ టెన్షన్ ఉంది" అని వసంత బీబీసీతో చెప్పారు.
జైలులో నిర్లక్ష్యం కారణంగా అనారోగ్య సమస్యలు ఇంకా తీవ్రమయ్యాయని ఆమె ఆరోపించారు.
"రోజువారీ మందులు కూడా అందించడం లేదు. లాయర్లు జైలు డాక్టర్లకు మందులు అందించిన తర్వాత కూడా ఆయనకు ఆ మందులు చేరడానికి తొమ్మిది, పది రోజులు పడుతోంది. ఫలితంగా ఆయన రెండు రోజుల్లో నాలుగు సార్లు కళ్లు తిరిగిపడిపోతున్నారు" అని వసంత చెప్పారు.
"ఇప్పుడు ఆయనకు ఒక్క చేయి, మెదడు మాత్రమే పని చేస్తున్నాయి. బయట ఇన్ని సదుపాయాలున్నా చలికాలంలో ఆయన చేతులు కొంకర్లు పోతాయి. అలాంటిది నాగ్‌పూర్ జైలులోని అండా సెల్ పైన అంతా తెరిచే ఉంటుంది. వర్షం వచ్చినా తడిసిపోతుంది. ఎండ, వాన, చలి ఏదైనా ఆ సెల్‌లోకి నేరుగా వచ్చేస్తుంది’’ అని వసంతకుమారి వివరించారు.
సాయిబాబా బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేశామని.. కానీ అది ఇంకా విచారణకు రాలేదని ఆమె తెలిపారు. ’’రాష్ట్ర ప్రభుత్వం మాటిమాటికీ వాయిదా తీసుకుంటుండం వల్ల జాప్యం జరుగుతోంది’’ అని ఆమె ఆరోపణ.

ఫొటో సోర్స్, A S VASANTHA
ఇది రాజ్యాంగ ఉల్లంఘనే: కల్పన కన్నబీరన్
డాక్టర్ సాయిబాబా కేసులో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయని ప్రముఖ హక్కుల న్యాయవాది, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ కల్పన కన్నబీరన్ అన్నారు.
"ఒకటి.. ఆయనకు శిక్ష విధించడానికి గల ప్రాతిపదిక. విచారణ కోర్టు తీర్పు మీద అప్పీలు కోర్టులో చాలా ప్రశ్నలు లేవనెత్తవచ్చు. రెండోది తక్షణ ఆవశ్యకత. బహుళ అంగవైకల్యాలతో, చాలా అనారోగ్యాలతో ఉన్న ఓ ఖైదీ విషయంలో జరుగుతున్నది చాలా అన్యాయం’’ అని ఆమె అన్నారు.
ఆమె బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ.. ‘‘ఇటువంటి వ్యక్తిని ఎటువంటి మద్దతు లేని, కనీస సౌకర్యాలు లేని ఏకాంతచెరలో ఉంచడం.. రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద అతడికి గల జీవన హక్కు, శారీరక సంపూర్ణత, స్వతంత్రలను ఉల్లంఘించడమే" అని అన్నారు.
"కోర్టు తీర్పులో ఆయనకు విధించిన శిక్ష ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను మాత్రమే నియంత్రిస్తుంది. వికలాంగ ఖైదీల విషయంలో అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల వరకూ వెళ్లనవసరం లేదు. జైలులో సాయిబాబాను ఉంచిన విధానం మన రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది" అని కల్పన చెప్పారు.
"సుప్రీంకోర్టు ‘వ్యక్తిగత గోప్యత హక్కు’ తీర్పులో ‘మానవ ఉనికికి జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛ అనేవి పరాధీనం చేయలేనివి‘ అని ఉద్ఘాటించింది. ఇది మన దేశపు చట్టం. సాయిబాబా జైలులోనూ గౌరవప్రదంగా, వ్యక్తిగత స్వేచ్ఛతో జీవించే హక్కును ఉల్లంఘిస్తున్నారు’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








