ఈ ఏడు ప్రశ్నలకు గుజరాత్ సీఎం విజయ్ రూపాణీ ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అంకుర్ జైన్
- హోదా, ఎడిటర్, బీబీసీ గుజరాతీ
డిసెంబర్ 9వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలకు గుజరాత్ సిద్ధమవుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఆయా పార్టీల నాయకులంతా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ బీబీసీ గుజరాతీ నిర్వహించిన ఫేస్‌బుక్ లైవ్‌లో పాల్గొని అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఏడు ప్రధాన ప్రశ్నలకు ఇలా సమాధానాలు ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
మొదటి ప్రశ్న: గుజరాత్‌కు ముఖ్యమంత్రి మీరు, కానీ.. అధికారం మాత్రం ఢిల్లీలో కేంద్రం వద్ద ఉంది.
సమాధానం: ఇటు గుజరాత్‌లోనూ, అటు కేంద్రంలోనూ ప్రభుత్వాలను పాలిస్తోంది బీజేపీయే. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం మాకు మార్గదర్శనం చేస్తే.. అందులో తప్పేముంది.
రెండో ప్రశ్న: గుజరాత్‌లో జరిగిన అభివృద్ధి గురించి సోషల్ మీడియాలో ‘అభివృద్ధికి పిచ్చెక్కింది’ అంటూ ట్రెండవుతున్న విమర్శల గురించి మీరేమంటారు?
సమాధానం: కాంగ్రెస్ పార్టీకి చెందిన ‘పెయిడ్ సోషల్ మీడియా ఆర్మీ’యే ఇలా మాకు వ్యతిరేకంగా ట్రెండ్ చేస్తోంది. వారంతా రోడ్లపై గుంతల గురించి వేళాకోళం ఆడుతున్నారు.. కానీ, మేం రోడ్లు వేయబట్టే గుంతలున్నాయి. కాంగ్రెస్ రోడ్లే వేయలేదు. మరి ప్రజలు వారినెందుకు విమర్శించరు.

ఫొటో సోర్స్, Getty Images
మూడో ప్రశ్న: నిరుద్యోగం గురించి రాహుల్ గాంధీ కొన్ని లెక్కలు చెప్పారు. వాటి గురించి మీరేమంటారు?
సమాధానం: రాహుల్ తప్పుడు లెక్కలు చెబుతున్నారు. అవి సరైనవి కావు. ఉపాధి కల్పనలో గత 14 ఏళ్ల నుంచీ గుజరాతే నెంబర్ వన్. గతేడాది 84 శాతం ఉపాధి కల్పించాం. 72 వేల మందికి ఉద్యోగాలొచ్చాయి.
నాలుగో ప్రశ్న: పటీదార్ల నుంచి బీజేపీకి ఎందుకంత వ్యతిరేకత ఎదురవుతోంది?
సమాధానం: పటీదార్ల వర్గం బీజేపీని అసలు వ్యతిరేకించట్లేదు. ఆ వర్గం లేవనెత్తిన నాలుగు డిమాండ్లను పరిష్కరించాం. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వటం కుదరదు.

ఫొటో సోర్స్, Getty Images
ఐదో ప్రశ్న: పటీదార్లంతా బీజేపీకి అనుకూలంగా ఉంటే హార్దిక్ పటేల్ సభలకు అంత మంది ఎలా హాజరవుతున్నారు?
సమాధానం: వాళ్లు పటీదార్లు కాదు. అవన్నీ కాంగ్రెస్ సభలు. ఆ వేదికలపై కాంగ్రెస్ ప్రతినిధులు ఉన్నారు. సభలకు జనాల్ని సమీకరించినంత మాత్రాన ఎన్నికలు గెలుస్తారనేం లేదు. దాని అర్థం అది కాదు.
ఆరో ప్రశ్న: మీరు విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగారు. ఇప్పుడు హార్దిక్ పటేల్, జిగ్నేశ్, అల్పేశ్ లాంటివారు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటాన్ని ఎలా చూస్తారు?
సమాధానం: నేను ఏమాత్రం సంతోషించట్లేదు. మేం సిద్ధాంతపరమైన రాజకీయాలు చేస్తూ ఎదిగాం. ఇప్పటికీ అవే చేస్తున్నాం. కులం పేరిట ప్రజల్ని సమీకరించటం రాజకీయాలకు మంచిది కాదు. వాళ్లంతా కాంగ్రెస్ తోలుబొమ్మలు. కులం పేరిట జాతిని విభజిస్తూ వాళ్లు మనల్ని బలహీనం చేస్తున్నారు. అలాంటి నాయకత్వం ప్రజల్ని మోసం చేస్తుంది.

ఫొటో సోర్స్, RAZA HAIDER
ఏడో ప్రశ్న: దళితులతో మీరు చర్చలు ఎందుకు జరపరు?
సమాధానం: ఏంటి.. నిజంగానే దళితులకు జిగ్నేశ్ ప్రతినిధా? ఉనా సంఘటన జరిగి ఏడాదిన్నర అయ్యింది. ఎంత మంది దళితులు దానిపై నిరసన తెలిపారు? ఈ సంఘటన తర్వాత కూడా (ఉనా ప్రాంతం ఉన్న) సమధియాలా ఎన్నికల్లో బీజేపీయే విజయం సాధించింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








