గుజరాత్: కాంగ్రెస్‌లో చేరిన ఓబీసీ నేత అల్పేష్

ఫొటో సోర్స్, Getty Images/facebook
- రచయిత, రాక్సీ గగ్డేకర్ ఛారా
- హోదా, బీబీసీ గుజరాతీ
అసెంబ్లీ ఎన్నికల సమరం సమీపిస్తుండటంతో గుజరాత్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నట్లు రాష్ట్ర ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ ప్రకటించారు.
మరో యువ నేత, దళిత ఉద్యమకారుడు జిగ్నేష్ మేవానీ మాత్రం కాంగ్రెస్‌లో చేరిక పట్ల స్పష్టతనివ్వలేదు.
గాంధీనగర్‌లో సోమవారం రాహుల్ గాంధీతో కలిసి బహిరంగ సభలో పాల్గొంటున్నట్లు అల్పేష్ వెల్లడించారు. గుజరాత్‌లో నెల వ్యవధిలో రాహుల్‌ది ఇది మూడో పర్యటన.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ అల్పేష్ ఠాకూర్?
మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలున్న గుజరాత్‌లో దాదాపు 70 స్థానాల భవితవ్యం తేల్చేది ఓబీసీ ఓటర్లే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఓబీసీ నేతగా అల్పేష్‌కు మంచి ప్రాబల్యం ఉంది. ఆయన తండ్రి ఒకప్పుడు పేరున్న భాజపా నేత. గుజరాత్‌లో మద్యనిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలంటూ చేపట్టిన ఉద్యమాలతో అల్పేష్ ప్రజల్లో పేరు సంపాదించారు.
దాంతోపాటు ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల హక్కుల సాధన కోసం ఐక్యత ఫోరాన్ని సైతం ఏర్పాటు చేశారు.
మూడేళ్లుగా రాష్ట్రంలో నిరుద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ర్యాలీలకు ఆయన సారథ్యం వహించారు.
"నేను రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నా. పేదలు, నిరుద్యోగ యువత కోసం పోరాడుతున్నా. రాహుల్ గాంధీ కూడా అదే బాటలో వెళ్తున్నారు. నిజాయితీ గల ప్రభుత్వ ఏర్పాటు కోసం నేను కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు నేను పునాదిరాయిని వేస్తా" అని బీబీసీ గుజరాతీతో అల్పేష్ అన్నారు.
మరోవైపు, పాటీదార్ల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న హార్దిక్ పటేల్ సన్నిహితులు ఇద్దరు తాజాగా భాజపాలో చేరడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేస్తోందంటూ వారు విమర్శించారు.
'ఇంకా నిర్ణయించుకోలేదు'
దళిత నేత జిగ్నేష్ మేవానీ కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా సాగుతున్నాయి. అయితే తానింకా ఈ విషయంలో ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన బీబీసీ గుజరాతీతో చెప్పారు. "బీజేపీని ఓడించడం నా లక్ష్యం. అయితే కాంగ్రెస్‌లో చేరడం విషయంలో ఇంకా నిర్ణయించుకోవాల్సి ఉంది" అని ఆయన అన్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








