ఆ 'ఆరు' కోసమే రెండు పార్టీల పోరు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి, దిల్లీ
వచ్చే పార్లమెంట్ ఎన్నికలకంటే ముందు దేశంలోని 11 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో 6 రాష్ట్రాల ఎన్నికలు అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లకు అత్యంత కీలకమైనవి. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో రెండు పార్టీలు ప్రత్యక్షంగా తలపడనున్నాయి.
ఈ ఆరింటిలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో బీజేపీ అధికారంలో ఉంది. మిగిలిన రెండు రాష్ట్రాలు కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి. వచ్చే 18 నెలల్లో ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, మిజోరంలలో కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది.
అయితే, బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ ఈశాన్య రాష్ట్రాలపై కాకుండా ప్రధానంగా పై 6 రాష్ట్రాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఈ ఆరు చోట్ల 994 అసెంబ్లీ సీట్లు, 123 పార్లమెంటరీ సీట్లు ఉండటమే ఇందుకు కారణం.
ఈ ఆరు రాష్ట్రాల ఎన్నికలు దేశంలోని రెండు ప్రధాన పార్టీలకు సెమీ ఫైనల్ మ్యాచ్‌లా తయారయ్యాయని చెప్పొచ్చు. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 9 నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. గుజరాత్‌లో ఎన్నికల తేదీలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ ఏడాది చివరి లోపే అక్కడ ఎన్నికలు జరగొచ్చు.
ఈ ఆరు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2019లో నిర్వహించే పార్లమెంటరీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలో అధికారం నిలుపుకోవడం కాంగ్రెస్‌కు పెద్ద సవాలే. ఒక వేళ ఈ ఆరు రాష్ట్రాలలో మూడింటిలోనైనా కాంగ్రెస్ విజయం సాధిస్తే ఆ పార్టీకి కొండంత బలం సమకూరినట్లే. అప్పుడు 2019 ఎన్నికలను కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, PTI
ఒక వేళ కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో విజయం సాధించి బీజేపీ పాలిత గుజరాత్, రాజస్థాన్‌లలో మంచి ఫలితాలు సాధిస్తే ఆ పార్టీ నైతికంగా విజయం సాధించినట్లే. కానీ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో అధికారం నిలబెట్టుకొని మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోతే పార్లమెంటరీ ఎన్నికలను ఎదర్కోవడం కాంగ్రెస్‌కు కష్టమే కావొచ్చు.
తమ పార్టీకి ఇంకా ప్రజల్లో ఆదరణ తగ్గలేదని నిరూపించుకునే అవకాశం ఈ 6 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి కల్పిస్తున్నాయి. దీన్ని ఆ పార్టీ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో కూడా బీజేపీ విజయం సాధిస్తే 'కాంగ్రెస్ రహిత భారత్' అనే తన నినాదాన్ని బీజేపీ సాకారం చేసుకున్నట్లే.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 1995 నుంచి బీజేపీనే అధికారంలో ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరు దిల్లీలో కీలక స్థానాల్లో ఉన్నారు. తమ ప్రియమైన సొంత రాష్ట్రాన్ని ఈ ఇద్దరు కీలక నేతలూ మరిచిపోకుండా తరచూ సందర్శిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరి పర్యటనలు మరింత ఎక్కువయ్యాయి.
గౌరవయాత్ర ప్రచారంలో భాగంగా మోదీ అక్టోబర్‌లో పలుమార్లు గుజరాత్‌లో పర్యటించారు. కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఎన్నికలకు వారిని సన్నద్ధం చేస్తున్నారు.
గుజరాత్ ఎన్నికలు మోదీ-షా ద్వయానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనవనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ అధికారం నిలబెట్టుకోవడం వారికి అత్యంత కీలకం.
ఇటీవల దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ బీబీసీతో మాట్లాడుతూ, మూడు పర్యాయాలు సుదీర్ఘంగా తాను సీఎంగా ఉండటంతో ప్రజలు విసుగుచెందారు. అందుకే ఓడిపోయానని చెప్పుకొచ్చారు.
కానీ, గుజరాత్ దిల్లీ కాదు.
గత స్థాయిలో కాకపోయినప్పటికీ మోదీ మ్యాజిక్ ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. మోదీ-షా ద్వయం దిల్లీకి వెళ్లాక గుజరాత్‌లో మొదటిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రజాదరణ గల నేతలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్‌కు కాస్త కలిసొచ్చే అవకాశంగా కనిపిస్తోంది. 2012లో రాష్ట్రంలోని మొత్తం 182 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 116 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ కేవలం 60 సీట్లకే పరిమితమైంది.

ఫొటో సోర్స్, Indian National Congress
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ 80 సీట్లకు మించి గెలుచుకుంటే అది మోదీ-షా ద్వయానికి ఓటమిలాంటిదే. గుజరాత్ ప్రచారంలో ఇప్పటికే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దూసుకుపోతున్నారు. గతంలో కంటే ఆయన చాలా ఆత్మవిశ్వాసంతో ప్రచారంలో పాల్గొంటున్నారు. మోదీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. గుజరాత్‌లోని దేవాలయాలను దర్శిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. అయితే, దీనిపై బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
రాహుల్ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని హిందూ ఓట్ల కోసం ఆడుతున్న నాటకమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. "ఎప్పుడూ పూజలు చేయని రాహుల్ బాబా ఇప్పుడు నుదుట తిలకం పెట్టుకుంటున్నారు" అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.
ఇతర కథనాలు
బీజేపీ అతివాద హిందుత్వ సిద్ధాంతాన్ని తనదైన హిందూ ఎజెండాతో ఎదుర్కోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. షీలా దీక్షిత్ ఇటీవల బీబీసీతో మాట్లాడుతూ, ''గాంధీ కుటుంబీకులు హిందువులే కావొచ్చు. కానీ, మైనారిటీల హక్కులను పరిరక్షించాలనే అవగాహన వాళ్లకు ఉంది.'' అని చెప్పారు.
గుజరాత్‌లో దేవాలయాలను సందర్శిస్తూ రాహుల్ గాంధీ పూజలు నిర్వహించడం కాంగ్రెస్ అనుసరిస్తున్న సరికొత్త వ్యూహంగా భావించవచ్చు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








