అభిప్రాయం: అమేథీపై కన్నేసిన అమిత్ షా, జయ్ షా వ్యవహారంపై రాహుల్ ఫైర్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
మోదీ-షాల గడ్డ గుజరాత్‌లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎందుకు పర్యటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మరో రెండు నెలల్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.
కానీ కాంగ్రెస్ కంచుకోటగా అభివర్ణించే అమేథీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అమిత్ షాకు అక్కడ ఏం పని? ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
పైకి మాత్రం ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి అమేథీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వెళ్లారని మాత్రమే చెబుతున్నారు.
కానీ ఆయన ప్రసంగాన్ని గమనిస్తే అది పూర్తిగా రాజకీయపరమైందనే అనిపిస్తోంది. అమేథీ అభివృద్ధిని రాహుల్ పట్టించుకోవడం లేదంటూ ఆయన పలు ఆరోపణలు చేశారు.
రాహుల్ గాంధీ 2014లో అమేథీ నుంచి మూడోసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కానీ ఆయన అమేథీ అభివృద్ధిపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టలేదని షా అన్నారు. యువరాజు (షాహ్‌జాదే) గుజరాత్‌కు బదులు అమేథీలో పర్యటించాల్సిందని అంటూ వ్యంగ్యాస్త్రం వదిలారు.
బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని విమర్శించే ఏ అవకాశాన్నీ వదులుకోరు. మరోవైపు 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ఈ మధ్యే కాస్త గొంతు సవరించుకుంటున్నట్టు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ చేతికి ‘జయ్’ అస్త్రం
అమిత్ షా కుమారుడు జయ్ షా ఆస్తుల వ్యవహారానికి సంబంధించి రాహుల్ గాంధీ దూకుడుగా మాట్లాడుతున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని ఆయన తిరిగి పొందుతున్నట్టు కనిపిస్తోంది.
జయ్ షా వ్యవహారంపై మీడియాలో వార్తలు వెలువడ్డ నేపథ్యంలో రాహుల్ గాంధీ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సవాల్ చేస్తూ, "మోదీ జీ, జయ్ 'షాహ్‌జాదా' మెక్కేశారు. మీరు కాపలాదారుగా ఉన్నారా లేక భాగస్వామిగానా? ఏదో ఒకటి చెప్పండి" అని ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి ప్రారంభించిన 'బేటీ బచావో' కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు 'బేటీ బచావో' కాస్తా 'బేటా బచావో'గా మారిపోయిందంటూ ఆయనను ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ నేరుగా ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకొని ట్వీట్ల రూపంలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఇప్పటి వరకైతే ఆయన వ్యాఖ్యలపై మోదీ ఏమీ స్పందించలేదు.
అయితే చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రాహుల్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలలో ఏమంత దూకుడు లేదు. గత సాధారణ ఎన్నికల తర్వాత మొదటిసారి బీజేపీ ఆత్మరక్షణలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, TWITTER
కాంగ్రెస్ దూకుడు
అయితే ఇక్కడ అమిత్ షా, రాహుల్ గాంధీలిద్దరినీ నేనీ ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. అమిత్ గారూ, అమేథీలో రాహుల్ గాంధీపై విమర్శలు చేసినంత మాత్రాన ఆయన కోట పునాదులు ఏమైనా కదలిపోతాయా?
రాహుల్ గారూ, ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి గత మూడు, నాలుగేళ్లలో అనేక సార్లు అవకాశాలొచ్చినా మీరు వాటిని పోగొట్టుకున్నారు. ఈసారి కూడా మీ గురి తప్పదని గ్యారంటీ ఏమిటి?
అయితే జయ్ షా వ్యవహారంపై కాంగ్రెస్ వ్యూహం దూకుడుగా కనిపిస్తోంది. ఓవైపు రాహుల్ గాంధీ నేరుగా ప్రధానిని లక్ష్యంగా చేసుకొని దాడికి దిగగా, మరోవైపు పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ ఈ వ్యవహారంలో పలు సూటి ప్రశ్నలు లేవనెత్తి బీజేపీని ఇరుకున పెట్టారు.
కాగా, మరో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ జయ్ షా వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించాలని ప్రధానిని డిమాండ్ చేశారు. ప్రధాని ఈ అంశంపై మౌనం వీడాలనీ, విచారణ కమిషన్ ఏర్పాటుకు ఆదేశించాలనీ ఆయన కోరారు.
మొత్తానికి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ బ్యాక్ ఫుట్ పైకి నెట్టిందనేది నిజమే కానీ 2019 సాధారణ ఎన్నికల నాటి వరకు ఈ ఒత్తిడిని ఇలాగే కొనసాగించడం అంత సులువు కాదు.
గత ఎన్నికల్లో దారుణ ఓటమిని ఎదుర్కొన్న కాంగ్రెస్ పరిస్థితి మరీ నిరాశాజనకంగా తయారైంది. అయితే ఈ పరిస్థితి నుంచి బైట పడడానికి రాజకీయంగా దానికి చాలా అవకాశాలొచ్చాయి.
నోట్ల రద్దు సమయంలో కాంగ్రెస్‌కు మంచి అవకాశం వచ్చిందన్నది చాలా మంది అభిప్రాయం. కానీ దాని నుంచి లబ్ధి పొందడంలో అది పూర్తిగా విఫలమైందనడంలో సందేహం లేదు.
మరోవైపు రాహుల్ గాంధీ నాయకత్వానికి సంబంధించి కాంగ్రెస్ లోపలే అవిశ్వాసం నెలకొన్నట్టుగా కూడా పరిస్థితి కనిపించసాగింది.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియాలో కాంగ్రెస్ హవా
సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని 'పప్పూ' అని వెక్కిరిస్తూ ఆయన ఇమేజిని దెబ్బతీయడానికి బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నించింది. దాంతో రాహుల్ పట్ల సామాన్యుల్లో కూడా ఒక రకమైన అభిప్రాయం స్థిరపడిపోయింది. బహుశా ఆయనకు ఇది వినడం నచ్చకపోవచ్చు.
అయితే గత కొద్ది నెలలలో రాహుల్ గాంధీ పట్ల జనాభిప్రాయం మారుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలోని బర్కిలే విశ్వవిద్యాలయంలో ఆయన ప్రసంగాన్ని చాలా మంది మెచ్చుకున్నారు.
అదే సమయంలో ఆయన ప్రసంగానికి బీజేపీ కాస్త భయపడిపోయినట్టు కూడా కనిపించింది. లేదంటే ఆయన ప్రసంగాన్ని కౌంటర్ చేయడానికి కేంద్ర మంత్రుల్ని, అధికార ప్రతినిధుల్ని మోహరించాల్సిన అవసరం ఏమొచ్చింది?
కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై దాడులు చేయడానికి బీజేపీ సోషల్ మీడియాను చాలా దూకుడుగా వాడుకుంది. అయితే ఈసారి మాత్రం సోషల్ మీడియా బీజేపీ మంత్రుల ప్రకటనలను లైట్ తీసుకుందని చెప్పొచ్చు.
బీజేపీ నెగెటివ్ ప్రకటనలను చూసిన వారు అధికార పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీని సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించినట్టుగా కూడా వ్యాఖ్యానించారు.
జయ్ షాకు సంబంధించిన వార్తలపై రాహుల్ గాంధీ దూకుడుగా వ్యవహరించడాన్ని బట్టి ఇప్పుడు బీజేపీ తాను ఒత్తిడిలో ఉందన్న విషయాన్ని దాచి ఉంచలేదు.

ఫొటో సోర్స్, Getty Images
మెరుగుపడిన రాహుల్ స్థితి
రాహుల్ గాంధీ త్వరలోనే తన తల్లి సోనియా నుంచి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారని వార్తలు వినబడుతున్నాయి.
పార్టీ దిల్లీ, జమ్మూ కశ్మీర్ శాఖలు ఈ విషయంలో ఒక తీర్మానం కూడా చేశాయి. కాంగ్రెస్ లోపల రాహుల్ గాంధీ నాయకత్వంపై అనుమానాలు నివృత్తి అవుతున్నట్టు కూడా కనిపిస్తోంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో కూడా కాంగ్రెస్ పార్టీలో అతి పెద్ద నేతగా రాహుల్‌నే చూస్తున్నారు.
అయితే కాంగ్రెస్ యువరాజు ఇప్పుడు ప్రతిపక్షపు మహారాజుగా ఎదిగినట్టేనా మరి?
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








