రేవంత్ చేరికతో తెలంగాణలో సమీకరణలు మారుతాయా?

ఫొటో సోర్స్, REVANTHAREDDY/FACEBOOK
- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ తెలుగు ప్రతినిధి
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలమైన గొంతుగా పేరున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన గురించి వస్తున్న ఈ వార్తలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్‌లో చేరికపై ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించకపోయినప్పటికీ ఇటీవల ఏపీలోని టీడీపీ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు, తెలంగాణలోని ఆయన పార్టీ సహచరులు చేసిన వ్యాఖ్యలు చూస్తే రేవంత్ పార్టీ మారడం ఖాయమనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే, రేవంత్ రెడ్డి పార్టీ మారడం వల్ల తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఏమైనా మార్పులొస్తాయా? తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీలోలో రేవంత్ పాత్ర ఎలా ఉంటుంది? కేసీఆర్ వైరి వర్గం అంతా ఒకే పార్టీ కేంద్రంగా ముందుకువెళ్లాలనుకుంటుందా? అనే విషయాలపై రాజకీయ విశ్లేషకులు, వివిధ పార్టీల నేతలు భిన్నఅభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారుతుందని చెప్పలేమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అభిప్రాయపడ్డారు.
మీడియానే ఈ విషయాన్ని ఎక్కువ చేసి చూపిస్తోందని రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణలో నిన్నటిదాకా పోరాడిన వ్యక్తే ఇప్పుడు పార్టీ మారుతుండటం గమనార్హమని పేర్కొన్నారు.
''తెలంగాణలో ఇప్పటికే టీడీపీ చాలా వరకు బలహీనపడింది. ఇక ఆ పార్టీలో కొనసాగటం వల్ల రాజకీయంగా భవిష్యత్తు ఉండదని ఆయనకు తెలుసు, అందుకే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు'' అని రవి అన్నారు.
'రేవంత్ చేరికతో కాంగ్రెస్ బలపడుతుంది అనేదానికంటే కేసీఆర్ వ్యతిరేక వర్గం కాంగ్రెస్ వేదికగా ఏకమవుతోందంటే బాగుంటుందని' విశ్లేషించారు. ఆయన పార్టీ మారుతుండటాన్ని సామాజిక సమీకరణలు, ఘర్షణాత్మక వైఖరి కోణంలో చూడాల్సి ఉంటుందన్నారు.
''ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాక స్వరం మార్చే అవకాశాన్ని కాదనలేం. కానీ, ఈ కేసు ఇంకా కోల్డ్ స్టోరేజ్‌లోనే ఉండిపోయింది.
ఇక్కడ ఎవరి ప్రయోజనాలు వారివి. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ చూడని ద్వంద్వ నీతి, దూషణల పర్వం ఇప్పుడు కొనసాగుతోంది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'ప్రజాస్వామ్యశక్తులన్నీ ఏకం కావాలి'
రేవంత్ రెడ్డి చేరిక వల్ల తమ పార్టీ బలపడుతుందని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. రేవంత్ మాత్రమే కాదు ఎవరొచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు.
''ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలోని ప్రజాస్వామ్యశక్తులన్నీ ఏకం కావాలి. ఇదో చారిత్రక అవసరం కూడా''అని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ ఏ ఒక్క వ్యక్తి మీదో ఆధారపడి లేదని, కార్యకర్తలే తమకు అసలైన బలమైని పేర్కొన్నారు.
రేవంత్‌ను చూస్తే రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అనిపిస్తుందని పాత్రికేయులు సత్యం పేర్కొన్నారు. ''టీడీపీకి తెలంగాణ వ్యతిరేక పార్టీ అనే ముద్రపడిపోయింది. ఆ పార్టీలో ఉంటూ ప్రభుత్వ లోపాలను రేవంత్ ఎంతగా ఎండగట్టినా ప్రజలు నమ్మడం లేదు. ఇప్పుడు ఆ విషయాన్ని రేవంత్ కూడా గ్రహించి ఉంటారు. కాంగ్రెస్‌లోకి రేవంత్ రావడం ఇద్దరికీ లాభదాయకమైనదేనని చెప్పొచ్చు. బలహీనమైన కాంగ్రెస్‌కు రేవంత్ బలమైన గొంతు కాస్త సహాయపడొచ్చు’’ అని అన్నారు.

రాజకీయ భవిష్యత్తు కోసమే
తెలంగాణలో టీడీపీ మునిగిపోయిన పడవ అని దానిలో ప్రయాణించలేకే రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నారని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి కర్నె ప్రభాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ పనితీరు నచ్చడంతోనే ఏపీకి చెందిన టీడీపీ నేతలు కూడా ఆయనను పొగడుతున్నారని చెప్పారు.
కేసీఆర్ వ్యతిరేక వర్గాలన్నీ ఏకమై వచ్చినా టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేవన్నారు. ఇటీవల జరిగిన వరంగల్ అర్బన్, పాలేరు ఉపఎన్నికలు, సింగరేణి ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీలన్నీ ఏకమైనా టీఆర్ఎస్ అంతిమంగా విజయం సాధించిందని గుర్తు చేశారు.
వచ్చే ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌పార్టీలో చాలా మంది నాయకులు సీఎం రేసులో ఉన్నారని, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్‌లో చేరబోతోన్న రేవంత్ వారితో పోటీ పడగలరా అనేది అనుమానమేనని పాత్రికేయులు అడిదం రవి పేర్కొన్నారు.
అయితే, కాంగ్రెస్ పెద్దల బలమైన అండదండలతోనే ఆయన పార్టీలోకి వస్తున్నారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రాకను వ్యతిరేకించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. '
'కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓ బలమైన సామాజిక వర్గం ఏకమవుతోంది. అందుకు కాంగ్రెస్ పార్టీ వేదికగా మారుతోంది. రేవంత్ చేరిక ఈ పరిణామంలో ఒక భాగంగా చూడాలి'' అని పేర్కొన్నారు.
కాగా, రేవంత్ పార్టీ మారుతున్నారనే విషయం మీడియా సృష్టేనని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారని ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ పేర్కొంది.
ఏపీ మంత్రులపై రేవంత్ చేసిన ఆరోపణలు ఆయన వ్యక్తిగతమని, తెలంగాణలో పార్టీ రాజకీయ భవిష్యత్తు గురించి ఏ నిర్ణయం అయినా పొలిట్‌బ్యూరోలో చర్చించే తీసుకుంటామని ఆయన చెప్పారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








