చదువు దూరం, బతుకు భారం: ఇది జోగిని పిల్లల జీవితం
- రచయిత, విజయ భాస్కర్
- హోదా, బీబీసీ తెలుగు కోసం
జోగిని పిల్లలు... అందరిలా వాళ్లకూ చదువుకోవాలని ఉంది. కష్టాన్ని ఎదిరించే తెగువుంది. కానీ నిన్నమొన్నటి వరకు బడిబాటే ఎరగరు. కారణం వారికి తండ్రెవరో తెలియకపోవడమే. ఆ తర్వాత ప్రభుత్వ విధానాలతో కాస్త వెసులుబాటు వచ్చినా తోటి విద్యార్థుల మాటలు ఆ పసి హృదయాలను గాయపరిచాయి. దాంతో స్కూల్‌కి వెళ్లడమే మానేసి మరింత పేదరికంలోకి జారిపోతున్నారు.
దేవుడి పేరుతో, ఆచారం సాకుతో ఆడపిల్లల జీవితాలను నరకప్రాయం చేస్తున్న జోగిని వ్యవస్థ ఇప్పటికీ కొన్నిచోట్ల కొనసాగుతోంది.

జోగినిలు మాత్రమే కాదు.. వారి పిల్లలూ నిత్య నరకం అనుభవిస్తున్నారు. వారికి తండ్రి ఎవరో తెలియదు. ఎవరికి పుట్టారో తెలియదు. తల్లిని అడిగినా ఆమె వద్ద కన్నీరు తప్ప ఎలాంటి సమాధానమూ ఉండదు. ఎందుకంటే జోగినిలు పెళ్లి చేసుకోరు. కానీ ఎవరు పిలిస్తే వారి దగ్గరకి వెళ్లాల్సిందే.
'నీ తండ్రి ఎవరు' అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక, నలుగురిలో కలవలేక, జోగినిల పిల్లలు గుమ్మందాటే వాళ్లే కాదు. అలాంటి పరిస్థితిలో బడికెళ్లి ఓనమాలు దిద్దడం వారికెలా సాధ్యం.! అందుకే 2009కి ముందు జోగినిల పిల్లలు స్కూల్‌కి వెళ్లింది లేదు. బడిగంట విన్నది లేదు.
ఒకవేళ ఆనాడు ఎవరైనా ధైర్యం చేసి స్కూల్‌కి వెళ్లినా చట్టాలు, నిబంధనలు వారికి అడ్డుపడేవి. గతంలో పిల్లల్ని స్కూల్లో చేర్పించాలంటే తండ్రి పేరు కచ్చితంగా ఉండాలి. తండ్రెవరో తెలియని జోగిని పిల్లలకు తండ్రి పేరు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే తోటి పిల్లల మాదిరిగా చదువుకోవాలని ఉన్నా పసివాళ్లు స్కూల్ గేటు బయటే ఆగిపోయేవాళ్లు.

జోగిని పిల్లల పరిస్థితి చూసి స్వచ్ఛంద సంస్థలు ఉద్యమాలు చేపట్టాయి. ఊరూరా తిరిగి అవగాహన కల్పించాయి. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరగటంతో 2009లో అప్పటి ప్రభుత్వం తండ్రిపేరుకు బదులుగా తల్లిపేరును రాసేందుకు వీలు కల్పించింది.
'సమస్య కొంతతీరినా సమాజం నుంచి అవమానాలు, ఛీత్కారాలు తప్పలేదు. 'ఎవరికి పుట్టారో తెలియదు' అంటూ తోటిపిల్లలు వారిని గేలి చేసేవాళ్లు. చదువులో, ఆటపాటల్లో అంటరానివారిగా చూసేవాళ్లు', అంటుంది రేవతి అనే ఓ జోగిని కుమార్తె.
కూతురు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సిగ్గుతో తల దించుకోవాల్సిన దుస్థితి తనదని బాలమ్మ అనే జోగిని కన్నీరుమున్నీరవుతోంది. ఆచారం పేరుతో పెద్దలు చిన్నప్పుడే తనకు పెద్దశిక్ష వేశారని ఆమె బోరుమంటోంది.

బాలకృష్ణమ్మ అనే జోగినికి మంగమ్మ అనే పదిహేడేళ్ల కూతురుంది. తాము పడిన బాధలు కూతురు పడకూడదనే ఉద్దేశంతో ఆమెను ఇంటర్ వరకు చదివించింది. ఇంకా చదువుకోవాలని ఆమెకున్నా.. పేదరికం ముందు ఓడిపోయి కూలిపని చేస్తోంది.
మరో జోగిని ఎల్లమ్మ కూలీ పని చేసుకుని బతుకుతోంది. 4వ తరగతి చదువుతున్న ఆమె కొడుకు కార్తిక్ చిన్నచిన్న పనులు చేస్తూ తల్లికి తోడుగా ఉంటున్నాడు.
ఏ జోగిని కుటుంబాన్ని కదిలించినా ఇలాంటి కన్నీటి కథలే కనిపిస్తాయి. అవమానాలు భరించలేక చదువులకు స్వస్తి చెప్పిన వారు చాలామంది ఉన్నారు.

జోగిని వ్యవస్థ అంతానికి OMIG అనే స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 200 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ ప్రచారం వల్ల ప్రజల ఆలోచన విధానంలో కాస్త మార్పు కనిపిస్తోంది. జోగిని వ్యవస్థకు పేదరికం, నిరక్షరాస్యతే కారణమని ఈ సంస్థ చెబుతోంది.
స్వచ్ఛంద సంస్థల కృషితో జోగినిల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగులు ప్రసరిస్తున్నాయి. 1985లో జోగినిగా మారిన హాజమ్మ, సమాజాన్ని ఎదిరించి మళ్లీ పెళ్లి చేసుకుంది. జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది. గతేడాది ఆలయాల్లో 22మందిని జోగినులుగా మారుస్తుంటే అడ్డుకున్నామని హాజమ్మ తెలిపింది.
అయితే, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. భక్తి, ఆచారం పేరుతో ఇంకా కొందరు జోగిని వ్యవస్థను కొనసాగిస్తూనే ఉన్నారు. ఫలితంగా వారి పిల్లలు అందమైన భవిష్యత్తును కోల్పోయి మరింత అంధకారం వైపు అడుగేస్తున్నారు.
మా ఇతర కథనాలు:
- ముద్రగడతో బీబీసీ ఇంటర్వ్యూ: బాబు గారూ ఆనాడు కాపు ఆందోళనకి మద్దతిచ్చారు..మరి డబ్బెంత ఇచ్చారు?
- హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎందుకు వాయిదా పడింది?
- మీ ద్వేషమే మీకు రక్ష!!
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
- సోషల్ మీడియా... నిద్ర రాదయా!
- రాయలసీమ అంటే హింస, వెన్నుపోట్లు, రక్తదాహం: వర్మ
- భర్తను హత్య చేసిన భార్య..ఆధార్‌తో గుట్టురట్టు
- ‘పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- బిట్కాయిన్లతో బిలియనీర్లయిపోగలమా?
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
- అనుపమా పరమేశ్వరన్ : కాలేజీ రోజుల్లో నన్నూ వేధించారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)









