కాశీగూడలో 'దెయ్యం'తో సెల్ఫీకి హేతువాదుల ప్రయత్నం

ఫొటో సోర్స్, Babu Gogineni Facebook Group
- రచయిత, రవిశంకర్ లింగుట్ల
- హోదా, బీబీసీ ప్రతినిధి
అర్ధరాత్రి శ్మశానం నుంచి ఫేస్‌బుక్ లైవ్.. 'దెయ్యం'తో సెల్ఫీకి ప్రయత్నం... దెయ్యం వల్ల గ్రామానికి చేటు జరుగుతోందనే మూఢనమ్మకాన్ని పోగొట్టేందుకు ఒక హేతువాద బృందం చేసిన వినూత్న ప్రయోగాలివి.
తెలంగాణలోని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని కాశీగూడ అనే ఈ గ్రామం హైదరాబాద్‌కు దాదాపు 240 కిలోమీటర్ల దూరంలో ఉంది.
''ఊళ్లో ఆడ దెయ్యం తిరుగుతోంది. మగాళ్లను చంపేస్తోంది'' అనే ప్రచారంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. పలు కుటుంబాలు ఊరే వదిలి వెళ్లిపోయాయి.

ఫొటో సోర్స్, Babu Gogineni
ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు కృషి చేసే సైన్స్ ఫర్ సొసైటీ, ఇండియన్ హ్యూమనిస్ట్స్, బాబు గోగినేని ఫేస్‌బుక్ గ్రూప్ ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.
ప్రముఖ హేతువాది బాబు గోగినేని, విజయవాడకు చెందిన జర్నలిస్టు కుమార్ సాయి, చంద్రయ్య, కృష్ణారావు, అజయ్ కుమార్, మరికొందరు హేతువాదులు కాశీగూడకు వెళ్లారు. ఈ బృందంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు లక్ష్మణ్‌రావు, సుదర్శన్ తదితరులు ఉన్నారు.
స్థానికుల్లో అవగాహన కల్పించేందుకు శనివారం, ఆదివారం ఇంద్రజాలం, నిప్పుల మీద నడక, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. న్యూరో సైకియాట్రిస్ట్ రాజేందర్ సూరినీడుతో కౌన్సెలింగ్ ఇప్పించారు.
'దెయ్యంతో సెల్ఫీ (సెల్ఫీ విత్ ఘోస్ట్)', 'దెయ్యంతో భోజనం(డిన్నర్ విత్ డెవిల్)' పేర్లతో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.
శనివారం రాత్రి శ్మశానంతోపాటు దెయ్యం ఉందని గ్రామస్థులు చెబుతున్న ప్రదేశాల్లో కలియదిరిగారు. అర్ధరాత్రి శ్మశానం నుంచి ఫేస్‌బుక్ లైవ్ నిర్వహించారు.

ఫొటో సోర్స్, Babu Gogineni Facebook Group
'ఇదో సామాజిక సంక్షోభం'
ఈ కార్యక్రమంలో కుమార్ సాయి అడిగిన ప్రశ్నలకు బాబు గోగినేని బదులిస్తూ- సహజ మరణాలను, కలుషిత నీటివల్ల వచ్చే టైఫాయిడ్, కామెర్లు లాంటి ఆరోగ్య సమస్యలు, జన్యు లోపాల వల్ల వచ్చే వ్యాధులు, లేదా ప్రమాదాల వల్ల సంభవించే మరణాలను లేని దెయ్యాలకు ముడిపెట్టడం సరికాదని చెప్పారు.
దెయ్యాలు, భూతాలు ఉన్నాయనుకొని ప్రజలు భయభ్రాంతులవడం, ఊరు వదిలి వెళ్లే పరిస్థితులు రావడం ఒక సామాజిక సంక్షోభమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అవసరమైనంత స్థాయిలో అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు జరగడం లేదని విచారం వ్యక్తంచేశారు.
మూఢనమ్మకాల ఊబిలో చిక్కుకుపోకుండా ప్రజలను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. (ఈ కథనంతోపాటు ఉన్న వీడియోను చూడండి. వీడియో క్రెడిట్: కుమార్ సాయి/బాబు గోగినేని ఫేస్‌బుక్ గ్రూప్/సునీల్.)
'దెయ్యంతో సెల్ఫీ' కార్యక్రమంపై బాబు గోగినేని స్పందిస్తూ- ''మాతో సెల్ఫీ దిగాలని దెయ్యాన్ని కోరాం. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్- నాలుగు భాషల్లో పిలిచినా 'దెయ్యం' రాలేదు. అసలు ఉంటేగా రావడానికి..'' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
బాబు గోగినేని మంగళవారం 'బీబీసీ'తో మాట్లాడుతూ- దెయ్యాల ఉనికిని ఇప్పటివరకు నమ్మిన కాశీగూడ వాసులు ఇద్దరు మూఢనమ్మకాలపై పోరాటంలో తమతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చారంటూ సంతోషం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Babu Gogineni Facebook Group
కుమార్ సాయి మాట్లాడుతూ- ఆదివారం తెల్లవారాక గ్రామపెద్దలు, ఇతరులు తమ బృందాన్ని కలిశారని, ఊళ్లో అందరికీ బాగా ధైర్యం చెప్పారంటూ కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు.
అవగాహన కార్యక్రమాల్లో పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
నిర్మల్-మంచిర్యాల జాతీయ రహదారి(పాత ఎన్‌హెచ్ నంబరు: 222)కు దాదాపు 200 మీటర్ల దూరంలో కాశీగూడ ఉంది. ఊరికి సమీపంలోనే అడవి ఉంది.
రెండేళ్ల క్రితం కాశీగూడలో 50-60 వరకు కుటుంబాలు ఉండేవని గ్రామపెద్ద జమాల్ చెప్పారు. దెయ్యం, దుష్టశక్తులు ఉన్నాయనే భయంతో చాలా మంది ఊరు విడిచారని పేర్కొన్నారు. ప్రస్తుతం దాదాపు 25-30 కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.

ఫొటో సోర్స్, Kumar Sai/Sunil
గ్రామంలో అత్యధికులు రాళ్లు కొట్టే పని చేసి జీవనం సాగిస్తున్నారని లక్ష్మణచాంద మండల రెవెన్యూ అధికారి(ఎమ్మార్వో) నారాయణ 'బీబీసీ'తో చెప్పారు. అన్నీ ముస్లిం కుటుంబాలేనని తెలిపారు.
కాశీగూడలో అక్షరాస్యత శాతం చాలా తక్కువని ఆయన వివరించారు. స్థానికులకు పరిసరాల పరిశుభ్రత పట్ల చైతన్యం కొరవడిందన్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









