‘కడప’.. యమద్వారపు గడప - వర్మ; కాదు ‘అది దేవుడి గడప’ - సీమ వాసులు

ఫొటో సోర్స్, RGV
- రచయిత, హృదయ విహారి బండి
- హోదా, బీబీసీ తెలుగు ప్రతినిధి
రాంగోపాల్ వర్మ ‘కడప’ వెబ్‌సిరీస్ సోషల్ మీడియాలో వేడి పుట్టించింది. డిసెంబర్ 15న విడుదలైన ట్రైలర్‌కు ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో లక్షల్లో లైకులు, వేలల్లో షేర్స్ వచ్చాయి. ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా.. అని అభిమానులు ఎదురుచూస్తుంటే మరోవైపు.. ట్రైలర్‌లో ఉన్న అంశాలపై రాయలసీమ వాదులు, సీమ విద్యార్థులు విరుచుకుపడుతున్నారు.
కడప వెబ్ సిరీస్ ఎలా ఉండబోతోందో వర్మ తన ఫేస్‌బుక్ పేజీలో వివరించారు.
తమ ప్రాంతాన్ని అవమానించే విధంగా వర్మ చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రకరకాల పోస్టులతో రాయలసీమ విద్యార్థులు తమ నిరసనను తెలుపుతున్నారు. మరోవైపు మేధావులు, సామాజికవేత్తలూ రాంగోపాల్ వర్మ వైఖరిని ఖండిస్తున్నారు.

ఫొటో సోర్స్, facebook
తెలంగాణపై కూడా ఇలాగే దాడి చేశారు
రాయలసీమలో ఫ్యాక్షన్ అన్నది కొన్ని ప్రాంతాలకే పరిమితం. కానీ.. ఈ ఫ్యాక్షన్‌ను రాయలసీమ మొత్తానికి ఆపాదించడం అవివేకమని మానవ హక్కుల వేదిక అభిప్రాయ పడుతోంది.
‘‘రామ్‌గోపాల్ వర్మకు సినిమా, వెబ్ సిరీస్ తీసే హక్కు ఉంది. కాదనం. కానీ ఓ ప్రాంతాన్ని టార్గెట్ చేయకూడదు. ఫ్యాక్షన్ అన్నది కొందరు వ్యక్తుల మధ్య ఏర్పడిన వైరం. ఆ కొందరు వ్యక్తులనే రాయలసీమ ముఖచిత్రంగా మారుస్తున్నారు. రాయలసీమ ప్రజలంతా కత్తులు పట్టుకుని తిరుగుతారన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు.’’ అని మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్.ఎం.భాష అన్నారు.
రాయలసీమలో ప్రస్తుతం ఫ్యాక్షన్ లేదని, దాని స్థానంలో మాఫియా మొదలైందని ఆయన అన్నారు. ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, విజయవాడల్లో ఉన్నట్టుగానే రాయలసీమలో కూడా మాఫియా తయారైందన్నారు.

ఫొటో సోర్స్, S.M.BJASHA
‘‘రాయలసీమలో కన్నా విజయవాడ, గుంటూరు లాంటి సర్కారు ప్రాంతాల్లోనే క్రైం రేటు చాలా ఎక్కువ. కానీ అది చూపించరు. కోస్తా వారు చాలా నాగరికులుగా, రాయలసీమ వాళ్లను అనాగరికులుగా, హంతకులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాంత నేపథ్యాన్ని హార్రర్ సినిమాలాగ చూపిస్తున్నారు. గతంలో తెలంగాణపై కూడా ఇలాంటి దాడి జరిగింది. తెలంగాణ వారు తెలివిలేని వారని ఎన్నో సినిమాల్లో చూపించారు. అలాంటి సాంస్కృతికమైన దాడే మళ్లీ రాయలసీమపై జరుగుతోంది’’ అని ఎస్.ఎం.బాష బీబీసీతో అన్నారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఈ సినీ దిగ్గజాలు సీమవాళ్లు కాదా?
సినిమా ఇండస్ట్రీలో తొలి తరం నిర్మాతలైన బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, చక్రపాణి లాంటి నిర్మాతలు రాయలసీమ వాళ్లేనని, ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసిన ఈ ప్రాంతం గురించి రకరకాలుగా చిత్రించడం సరికాదని రాజ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
‘‘కడప యమద్వారపు గడప కాదు.. కడప దేవుడి గడప! నీళ్లు లేక మేం చస్తుంటే.. మీరేమో మాకు రక్త దాహం ఉందని చూపిస్తున్నారు. చాలా మంది మాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు.. మీ రాయలసీమలో ఇట్లా ఉంటుందా? అని. అసలే మాది కరువు ప్రాంతం. ఆపై మీరు ఇలాంటి సినిమాలు తీసి మామీద ఫ్యాక్షనిస్టులన్న ముద్ర వేస్తే.. ఇక మా ప్రాంతానికి పెట్టుబడులేం వస్తాయి?’’ అంటూ ఫేస్‌బుక్ వీడియోలో ఈ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
రాంగోపాల్ వర్మ రాయలసీమ సంస్కృతిపైనే దాడి చేస్తున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక్కడెవ్వరూ కొడవళ్లు, గొడ్డళ్లు పట్టుకుని తిరగరని, ఈ ప్రాంతలోని చిన్నపిల్లలకు కూడా హత్యలు అలవాటే అన్నట్లు చూపించటం దారుణం అన్నారు.
’’మాపై సాంస్కృతిక దాడి జరుగుతోంది. తాళ్లపాక అన్నమయ్య, యోగి వేమన, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పుట్టిన గడ్డ మా రాయలసీమ!’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, M.V.RAMANA REDDY
సీమలో ఫ్యాక్షనిస్టుల జనాభా ఎంత?
రాయలసీమలో పట్టుమని నాలుగు రోజులు కూడా నివసించని రాంగోపాల్ వర్మకు రాయలసీమ గురించి ఏం తెలుసు? అని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎం.వి.రమణారెడ్డి ప్రశ్నించారు.
కేవలం ఏదో ఒక సెన్సేషన్ కోసమే వర్మ ప్రయత్నిస్తుంటారన్నారు.
రాయలసీమ జనాభాలో ఫ్యాక్షనిస్టులు కనీసం ఒక్క శాతం కూడా ఉండరని, అలాంటి వారి ఇమేజ్‌ను మొత్తం రాయలసీమ సమాజంపై రుద్దడం క్రూరమైన చర్య అని ఎం.వి.రమణా రెడ్డి అభిప్రాయపడ్డారు.
‘‘అమ్మ కడుపులోనుంచే కత్తి పట్టుకుని పుడతారు అంటే.. ఏమి అర్థం? ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. అందర్నీ అవమానించడమే.. మొదట్లో ఈవిషయంపై మాట్లాడాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు మాట్లాడకుండా ఉండలేకపోతున్నా.’’
ఈవిషయంపై చాలా మంది రాయలసీమ రచయితలు, మేధావులు నాతో మాట్లాడారు. ఇలాంటి సందర్భాల్లో నిరసన తెలపాల్సిన అవసరం చాలా ఉంది.’’

ఫొటో సోర్స్, FACEBOOK
సినిమాల్లో రాయలసీమను మరీ అధ్వాన్నంగా చూపిస్తున్నారని రాయలసీమ యునైటెడ్ ఫోరం అభిప్రాయపడింది. రాయలసీమ వాళ్లు రక్తం తాగుతారంటూ ఇప్పటి వరకూ సినిమాలు చెబుతూనే ఉన్నాయని, అయితే.. రాంగోపాల్ వర్మ ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారని ఆర్.యు.ఎఫ్. నేత అశోక్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
రాయలసీమ అంటే ఫ్యాక్షనిస్టులు మాత్రమే కాదని.. అన్నమయ్య, వేమన లాంటి ఎందరో గొప్ప వ్యక్తులు ఈ గడ్డపై జన్మించారని అశోక్ అన్నారు.
‘‘రాయలసీమ అంటే వై.ఎస్. రాజారెడ్డి, పరిటాల రవీంద్ర మాత్రమే కాదు.. ఇద్దరు మహిళలను కాపాడేందుకు బ్రిటీష్ సైనికులతో పోరాడి చనిపోయిన గుత్తి హంపన్న, ఊరి కోసం ప్రాణ త్యాగం చేసిన ముసలమ్మ, తాళ్లపాక అన్నమయ్య, వేమన లాంటి ఎందరో మహానుభావులు ఈ గడ్డపై జన్మించారు.
ఆయన్ను సినిమాలు తీసుకోమనండి.. కానీ ఇక్కడి ప్రజలు కత్తులు పట్టుకుని తిరుగుతారు, రక్తం తాగుతారు.. ఇలాంటి మాటల్ని విరమించుకోవాలి. లేకపోతే న్యాయపరంగా పోరాటం చేస్తాం.’’ అని అశోక్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, YOUTUBE

ఫొటో సోర్స్, FACEBOOK
మరోవైపు, సోషల్ మీడియాలో కొన్ని సరదా పోస్ట్‌లు కూడా కనిపించాయి. సీమవాసులను ఫ్యాక్షనిస్టులుగా చూపించి.. ఇక్కడ హత్యలు సాధారణమన్నట్టు చిత్రీకరిస్తే ఇక పెళ్లికాని వాళ్ల సంగతేంటని ఓ యువకుడు ప్రశ్నించారు.
మరికొందరు అభిమానులు మాత్రం ఈ వెబ్‌సిరీస్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా.. అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ ఫేస్‌బుక్‌లో కామెంట్లు చేశారు.
‘కడప’ వెబ్ సిరీస్‌పై వ్యక్తమవుతున్న ఈ అభిప్రాయాలపై రాంగోపాల్ వర్మ స్పందన ఏవిధంగా ఉంటుందో చూడాలి.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








